యెల్లో రిబ్బన్...

ఇట్లు మీ… (11)

నవంబర్ 2015

వో నా చిన్నా, చిన్నచలి. రాత్రంతా కురిసిన చిరుమంచుని కప్పుకొన్న పున్నాగల చల్లని సౌగంధం వుదయపు నడకలో నాతోపాటు. యింకా తెల్లవారని రాత్రి. నడిరాత్రి శుభ్ర పరచిన రోడ్స్. తెరచిన టీ స్టాల్స్ లోంచి మరుగుతోన్న టీ వేడి సువాసనలని లెక్కపెట్టగలిగేంతమంది రుచి చూస్తూ. గొలుసుల చేతివాటంవారికి చిక్కకూడదని మెడల్లో యేం లేకుండా జాగ్రత్త పడి యిళ్ళల్లో పనులకి వెళుతున్న స్త్రీలు, పాల పాకెట్స్ , న్యూస్ పేపర్స్ తో నిండిన టూ వీలర్స్, సైకిల్స్. రోడ్ కి అటూయిటూ యిడ్లి, దోస బళ్ళు. పార్క్ ముందు కొన్ని వూదా రంగు పావురాలు గింజలు తింటూ, పోలీస్ వ్యాను పోలీసులతో గన్స్ పట్టుకొని. సిసి కెమేరాలు, తుపాకుల రక్షణ ప్రతి చోట తప్పని పరిస్థితి. సెక్యూరిటి చెక్ అయ్యాక పార్క్ లోపలకి అడుగు పెట్టగానే ఆకుపచ్చని సొగసు, పరాగపు తేమ పలకరిస్తాయి. గేట్ బయట పరిస్థితికి లోపలకి భలే తేడా వుంటుందిలే.రాత్రంతా మంచుపొంగు రంగులని కప్పుకొన్న నెమళ్ళు సోమరిగా కదుల్తుంటే, చిన్నిచిన్ని పిట్టల రాగాలు వింటూ, పచ్చికపై మంచు బిందువులని చూస్తూ, మెల్లగా కదుల్తూ పలకరించే రెల్లుగడ్డిపై చేతివేళ్ళతో చిటికేస్తూ, నీటి చెలమల్లో తామర పువ్వుల లేత మెరుపు కలల రంగుల చిలకరింపు జల్లుకొంటూ యేర్పర్చిచిన దారులని చూస్తుంటే నీ చేతుల్లో చేతులేసి నీ చేతివేళ్ళ వెచ్చదానాన్ని శ్వాసిస్తూ నడుస్తున్నట్టే వుంది.

నడక పూర్తి చేసి బయటకి రాగానే, గోరువెచ్చని నీటిలో తేనే, తులసి, కొద్దిగా అల్లం కలిపిన జ్యూస్. నిమ్మకాయ రసంతో బాగుంటుందంటారు. కాని నాకు సిట్రస్ యేలర్జీ కదా. ఆ పేమెంట్ మీద అటునుంచియిటు బోలెడన్ని కాయకూరలు, పళ్ళు, పువ్వులు, మొలకెత్తిన గింజలు, న్యూస్ పేపర్స్ తో భలే సందడిగా వుంటుంది. వొక్కర్తినే ఆ పేమెంట్ మీద నడుస్తు యింటి దారి పట్టాను. మంచుతెరలని సుతారంగా దాటుకొంటూ మళ్ళీమళ్ళీ పలకరించే నారింజరంగు పరిమళపు రశ్మిని దోసిలి నిండుగా నింపుకొంటూ యింటికి నే వచ్చేసరికి నువ్వుంటే ఆ రశ్మిని నీ పెదవులకి అద్దేదాన్ని. దాదాపు ప్రతి రోజు యిలానే వుదయాలు యింత అందంగా నాజుగ్గా మొదలవుతాయి. ప్రతి రోజు ఆశ్చర్యపు యెదురు చూపు యేమిటంటే యే రోజు యే పూలపరిమళాన్ని చల్లని గాలిని వేకువ కానుగ్గా యిస్తుందాని.యింటికి వెళ్ళీవెళ్ళగానే మనిద్దరికి యిష్టమైన వరండా చిన్నిగట్టుమీద కూర్చుని ఆరెంజ్ కలర్ పెద్ద మగ్గు నిండా చిక్కని సౌత్ యిండియన్ ఫిల్టర్ కాఫీ తాగటానికి కూర్చుంటే నువ్వు యిలా కూర్చున్న ప్రతిసారి నా కప్ లో కాఫీని మధ్యమధ్య రుచి చూస్తూ నా బుగ్గలపై పెట్టే చిన్నిచిన్ని దొంగ ముద్దులు వచ్చి వాలాయి. విచ్చుకొన్నయెర్రని మందారాలని చూస్తుంటే. యింతలో నల్లని రెక్కల పై యింకు బ్లూ, లేవెండర్ చుక్కల సీతాకోక చిలుక తులసి పువ్వుల చుట్టూ తిరుగుతూ కనిపించింది. భలే కాంబినేషన్. కుంచేతో రంగులు చిలకరించాలనే ఆసక్తి వున్నవాళ్ళకి యెంబ్రైడ్రి చెయ్యాలనే యిష్టం వున్న వారికి సీతకోకచిలుకలు యెన్నెన్ని రంగుల కలయకని యిస్తాయో కదా. అవును లేవండర్ చుక్కలు అంటే గుర్తొచ్చింది. నీకు బట్టల సెలక్షన్ తెలీదంటావు… నువ్వు పంపిన గులాబీ లేవండర్ కాంబినేషన్ తో వున్న చీర యెంత అందంగా వుందో. షాపింగ్ అంటే బద్ధకం కదా నీకు… దొంగా షాపింగ్ తప్పించుకోటానికి కదా. :) సరే డియర్… కాఫీ అయింది. యిక హడావడి చుట్టుకుంటుంది. రెడీ కావాలి ఆఫీసుకి.

బయలుదేరాను. యీ టైములో రోడ్స్ అన్నీ రకరకాల వాహనాలతో నిండుగా వుంటాయి. వాహనాల్లో వున్న వాళ్ళు, డ్రైవింగ్ చేస్తున్న వారితో సహా అందరి పెదవుల పై మాటలు తేల్తుంతుంటాయి. కళ్ళల్లో నవ్వు, సీరియస్నెస్, కోపం, ఆదుర్ధా యిలా అన్ని భావాలు కనిపిస్తుంటాయి. సెల్ ఫోన్ రోడ్లని మాటలమయం చేసేసిందనుకో. నడుస్తున్నా, డ్రైవ్ చేస్తున్నా, టివీ చూస్తున్న , ధియటర్ ల్లలో, గుడిలో, మార్కెట్లో వొక్క చోటని కాదు ప్రతిచోట చూపులు నిరంతరం ఫోన్ కే అతుక్కుపోతే వేరే విషయాలు ఆలోచించడానికి తీరిక యెక్కడుంటుందో. అందుకే యోగ, మెడిటేషన్ చేస్తున్నప్పుడు మాత్రం పూర్తిగా ఆ సమయం తనది అంటుంది నా కొలీగ్. మొత్తానికి దేశం మాటల వరదలో వుందనుకో. :)

యీ ట్రాఫిక్ వొక పట్టాన కదలదు. రోడ్ మధ్యలో మెట్రో పనులు. యీ రోడ్ పై నడవటానికి తమ రెండు పాదాలు మోపే చోటు కోసం వెతుక్కొంటున్నారు నడిచేవాళ్ళు. యెన్నో సార్లు రోడ్స్ ని వెడల్పు చేస్తుంటారు కాని నడిచేవారి కోసం ఫుట్ పాత్ లుండవ్. పొరపాటున యెక్కడైనా వున్నా వాటి మీదా టూ వీలర్స్ ని నడిపెస్తుంటారు. యేం చేస్తారు… జీవితం అంత తొందరగా పరిగెత్తమంటుంది. నగరంలో నడిచేవారికి చోటివ్వాలి కదా.
ఆఫీస్ కి వచ్చాక అది వొక రంగురంగుల లోకం. సినిమాలు తీసేవారు, తీయ్యాలనుకొనేవారు, తీసిన వాటికి మార్కెట్ కోసం వెతుక్కునేవారు, కలక్షన్స్ బాగున్నవారి సంతోషం, హీరో కి కథ వినడానికి టైం యిచ్చినందుకు పార్టీ మూడ్ తో వొకరో యిద్దరో – వొక ఆకాంక్ష అనేక భావోద్వేగాల నిలయం మా వర్క్ ప్లేస్.

పార్టీ అంటే గుర్తొచ్చింది. నువ్వు నాకు పార్టీ బాకీ. యెప్పుడిస్తావ్. యెక్కడిస్తావ్. యీ నగరపు దీపాలన్నీ మిలమిల మెరుస్తూ కనిపించే వో యెత్తైన ప్రదేశంలో వెన్నెల కాంతి నీపై నుంచి నా చూపులని మరల్చే చోటకి డిన్నర్ కి తీసుకు వెళ్ళతావా.

భలే, అసలు యీ నగరం చుట్టూ కొండ భలే ఆకర్షణీయంగా వుంటుంది. యీ నగరం బోలెడన్ని గుట్టలపై వుంటుంది. యింటికి యెవరొచ్చిన గుట్టలని యెక్కిస్తుంటాను సరదాగా. అక్కడ నుంచి చూస్తే సిటీ ఆ సమయంలో యెలా వుందో తెలుస్తుంది. కాని అన్ని వేళలా యెలా కనిపిస్తుందో తెలీదు. కొంతమందికి కొన్ని సమయాల్లో నగరం యెలా వుందో కనపడుతుంటుంది. మార్నింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు నాకు యెలా కనిపిస్తుందో చెప్పానుగా. అలానే కొంతమందికి మిట్టమధ్యానం యెలా వుంటుందో తెలుస్తుంటుంది. అయితే నాకు లేదా మరొకరికి కనిపించినట్టే నగరంలో మిగిలిన ప్రదేశాలు వుండకపోవచ్చు. కొన్నివిషయాలు కనపడినప్పుడు కొంతమంది సిటీ యెలా వుండాలి, యెలా మార్చుకోవాలి అన్నదాని గురించి చెప్పగలుగుతారు. నేను పేవ్మెంట్స్ విషయం చెప్పినట్టు. మరొకరు బస్సులు యే రూట్ లో లేవో చెప్పొచ్చు. అలా చెప్పేవాళ్ళు అసలు సిటీ అంతా యేం జరుగుతుందో తెలుసుకోలేక వోవర్ వ్యూ వుంటే బాగుందనుకొంటారు. వోవర్ వ్యూ కావాలనుకొన్నప్పుడు అసలు రోడ్ మీద జరుగుతుందేమిటో, అసలు యేమైనా జరుగుతుందో లేదో తెలీదు. యిక్కడ రోజువారి జీవితం వురకల పరుగులతో వుంటుంది. అసలు యింత గందరగోళం యెందుకంటే రోజువారి అనుభవానికి వోవర్ వ్యూకి మధ్యన అనుసంధానం చేసుకొనే శక్తి, జ్ఞాపకశక్తి కూడా పోయింది. పరిస్థితి యెలా వుందంటే నరహరిని చెట్టుచిటారుకొమ్మకి యెక్కమన్న చెంచులక్ష్మి చెట్టు యెక్కదు కాబట్టి చుట్టూ యేం వుందో చెంచులక్ష్మికి తెలీదు. కాని అడుగు తీసి అడుగు వేస్తే యేం జరుగుతుందో చెంచులక్ష్మికి తెలుస్తుంటుంది. యీ యిద్దరూ కలిస్తే కానీ ప్రయాణం చెయ్యలేరు.

అదబ్బాయీ, అసలు విషయం…:) చిక్కని గులాబి రంగు లేవేండర్ చీర నీతో వచ్చే పార్టీ కోసం యెదురు చూస్తుంది.

**** (*) ****