ప్రత్యేకం

ఆత్రమే ఆనందం

ఫిబ్రవరి 2015

“ఏనుగమ్మా ఏనుగు
మా ఊరొచ్చిందేనుగు
మంచినీళ్ళు తాగిందేనుగూ…”

వీథిలో కొత్త వింత కానీ, ఇష్టమైన జంతువు కానీ, అపురూపమైనదేదైనా కానీ, లేక గొప్ప వ్యక్తి కానీ కనబడబోతుందంటే చాలు – పట్టరాని ఆత్రుత మనకు. ఈ ఆత్రుత విషయంలో పిల్లలకూ పెద్దలకూ తేడాయే కనబడదు. ఆ ఆత్రుత వల్ల ఒక్కోసారి ఒళ్ళు కూడా తెలీదు.

80 వ దశకంలో బాల్యాన్ని గడిపిన వారికి తెలిసి ఉంటుంది. సినిమా బండి వస్తే చాలు. ఆ బండి వెనక పరిగెత్తటం, ఆ బండి వాడు ఇచ్చే సినిమా ప్రచారకరపత్రాన్ని ఎలాగైనా తీసుకోవటం ఎంత సంబరంగా ఉండేదో!

ఈ ఆత్రుత పసిపిల్లల విషయంలో ముద్దు.

ఐసుక్రీము బండి
సినిమా ఏక్టరూ
సర్కస్ జంతువూ
ఉట్లమానూ (రామనవమి రోజు నాటే కంబం)
పీర్లపండగా

కాదేదీ ఆత్రుతకనర్హం. వీథిలో ఏ మాత్రం సందడి వినబడాలే కానీ చెప్పులు అటు ఇటు వేసుకుని, చేస్తున్న పనిని వదిలిపెట్టి, ఎలాగోలా మనసుకు నచ్చిన వ్యవహారాన్ని అంతు తేల్చనిదే ఊరుకోనివ్వని ఆత్రం మనిషికి సహజంగా అబ్బిన గుణం.

ఒక పెళ్ళికాని రైతు తన పొలంలో పనిచేసుకుంటున్నాడు. ఎంచేతో తలపైకెత్తి చూస్తే పక్కన జొన్న చేల్లో ఓ అందమైన అమ్మాయి కనిపించింది. అంతే అమాంతం విరహంలో పడ్డాడా అబ్బాయి.

ఆ.వె||
జొన్న చేనిలోన సొగసుకత్తెను జూచి
నిన్నటేళ నుండి నిద్రరాదు.
దాని నన్నుఁ గూర్చి దయజూపు మాధవా!
పొన్న పూలు దెచ్చి పూజసేతు.

అని పాడుకున్నాడు. ఇది ’జాణ’ తెనుగు!

ఆత్రుత – యౌవనవంతుడైన పురుషుల విషయంలో ’అలా’ పరిణమిస్తుంది, అందుకే, అమ్మాయిల వంక కూడా చూడని ప్రవరుడు కూడా అనుకోకుండా వరూధినిని చూడగానే – శతపత్రేక్షణ, చంచరీకచికుర, చంద్రాస్య, చక్రస్తని, నతనాభిని, నవనవలామణి – ఇన్ని ఉపమానాలు గుప్పించేశాడు.

ఆత్రుత – పురుషుడి విషయంలో ఉద్వేగం. ఇక జవ్వని విషయంలో అయితే ఆహ్లాదం,

అందమైన వాడు, మనసైనవాడు ఇంటి ముందు దారిన రాబోతున్నాడని తెలిసీ ఆతణ్ణి చూడ్డంలో ఆతురత అయితే – ఆహ్వానం మనసులో దాగిన ఆహ్లాదం.

కవులు చాలా సులభంగా, అలవోకగా స్వభావసిద్ధంగా, పైకి సాధారణంగా లోకం దృష్టిలో కనబడే ఈ అమ్మాయిల అత్రుత విషయాన్ని అందంగా ఉద్యోతించారు.

ఇక్కడ అగ్రతాంబూలం పోతన గారికి.

నల్లనివాడు, పద్మనయనంబులవాడు, సింహం వంటి నడుము వాడు, గోపికాజనచిత్తచోరుడు అయిన యువకుడు పల్లెటూరి నుండి మొట్టమొదటిసారి మథుర పట్టణానికి వచ్చాడు. అప్పటికే ఆ వన్నెకాడి గురించి ఎన్నెన్నో కథలు విన్న నగర యువతులు ఆతణ్ణి చూడ్డానికి పోటీలు పడ్డారు. అందులో కొందరు యువతులు గుంపుగా ఉడ్డ చేరి రత్నాలు తాపడం చేసిన తమ బంగారు మేడలపైకి ఎక్కి క్రింద రహదారిని వెళుతున్న ఆ యువకుణ్ణి చూశారు.

సీ||
వీఁడటే రక్కసి విగతజీఁవఁగ జన్నుఁ
బాలు ద్రావిన మేటిబాలకుండు |
వీఁడటే నందుని వెలఁదికి జగతిని
ముఖమందుఁ జూపిన ముద్దులాఁడు !
వీఁడటే మందలో వెన్నలు దొంగిలి
దర్పించి మెక్కిన దాఁపరీఁడు!
వీఁడటే యలయించి వ్రేతల మానంబు
సూఱలాడిన లోకసుందరుండు!

గీ ||
వీఁడు లేకున్న పురమటవీ స్థలంబు
వీనిఁ బొందని జన్మంబు విగతఫలము
వీనిఁ బలుకని వచనంబు విహగరుతము
వీనిఁ జూడని చూడ్కులు వృథలు వృథలు!

వీడేనేంటే పూతన చనుబాలు త్రాగి ప్రాణం తోడినవాడు! వీడేనా యశోదకు నోట్లో ముల్లోకాలనూ చూపించినవాడు! వీడేనటే గొల్లపిల్లలతో చేరి వెన్నలు దొంగతనం చేసి మెక్కినవాడు! వీడేనేంటే గోపభామల మనసుదోచిన సుందరాకారుడు! వీడు లేని వూరుకన్నా అడవి మేలు. వీణ్ణి పొందకపోతే జన్మకు నిరుపయోగం. ఇతనితో మాట్లాడకపోతే మాటలు అనవసరం. వీడిని చూడకపోతే కన్నులెందుకు!

ఇలా మాట్లాడుకున్నారట. సంస్కృతంలో వ్యాసభగవానుడు క్లుప్తంగా వ్రాసిన రెండు శ్లోకాలను కమనీయమైన దృశ్యంగా మార్చి, మన పోతయ్య అందమైన అమ్మాయిల ఆత్రుత తాలూకు ఆహ్లాదంతో పాఠకుల మనస్సులో గిలిగింత పెట్టించిన తీరు ఇది! ఓ మారు ఓణీ పరికిణీ వేసుకున్న అమ్మాయిలు తమ బుల్లిగడ్డాలపై, ముక్కులపై వేలు వేసుకుని, కళ్ళు పత్తికాయల్లా మార్చి, బుగ్గలు ఎరుపెక్కుతుండగా, మాట్లాడుతున్నట్టు ….ఆహా ఏం ఊహ!

ఇక్కడ గమనించవలసింది ఏమంటే – అమ్మాయిల మనసుల్లో మాధవుణ్ణి చూడాలన్న ఆతురత ఉన్నది. అయితే వాళ్ళకు ఆతణ్ణి కళ్ళారా చూడ్డానికి సమయమూ ఉంది. వాళ్ళు నింపాదిగా పనులు ముగించుకుని మేడలపైకెక్కి చక్కటి “వ్యూ” చూసుకుని అందగాణ్ణి చూసి బుగ్గలు నొక్కుకున్నారు.

ఆ సౌలభ్యం లేకపోతే, ఆ మాధవుడూ, శిఖిపింఛమౌళీ వస్తున్న విషయం అప్పటికప్పుడే తెలుస్తే….?

అలాంటి ఘట్టం సంస్కృతసాహిత్యంలో ఒకచోట ఉన్నది.

శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థ పుర వీథిని వస్తున్నాడు. “శ్రీ శ్రీ శ్రీ మాధవ్ జీ పరారహే హో” అని అప్పటికప్పుడు ఆయన వెళ్ళే మార్గంలో టముకు వేయిస్తూ ఉన్నారు. అప్పుడు మాధవుని చూడ్డానికి యువతులు పడే ఆతురత ఎలా ఉంటుంది? ఈ ఘట్టాన్ని సంస్కృత కవి చాలా వివరంగా వర్ణిస్తాడు. ఆ యువతుల్లో ఒకానొక యువతి -

వ్యతనోపదాస్య చరణం ప్రసాధికా కరపల్లవాత్ రసవశేన కాచన |
ద్రుతయావకైకపదచిత్రితావనీం పదవీగతేన గిరిజా హరార్ధతామ్ ||

ఇంట్లో ఆమె తీరుబడిగా కూర్చుని రెండు పాదాలకు లత్తుక (పారాణి) పూసుకుని కూర్చుంది. ఆ లత్తుక తాలూకు తడి ఇంకా ఆరలేదు. సరిగ్గా అప్పుడు వీథిలో అనౌన్స్ మెంటు వినిపించింది. అప్పుడా రమణీమణి ’రసవశం’ తో -

ఒక్క ఉదుటున లేచి తన కుడికాలిని వెనక్కు మడుచుకుని కుడి చేతితో పట్టుకుంది – కరారవిందేన పదారవిందం అన్నట్టుగా. వాకిలి వైపుకు ఎడమ కాలితో వేగంగా కుంటుతూ, తన పాదముద్రల్ని భూమిపై చిత్రిస్తూ ద్వారం వైపు వెళ్ళింది.

అలా ఆ ధన్యురాలు శ్రీకృష్ణుని దర్శనభాగ్యం దక్కించుకుంది.
ఈ ఆత్రుతకు అర్థం ఉంది. ఆ మహానుభావుడు, అందగాడు, యాదవకులపతి తమ ఊరికి (ఇంద్రప్రస్థం) రావడమూ, అదీ తమ ఇంటి ముందు మార్గంలో రావడమూ జీవితానికి ఒక్కసారి దక్కే భాగ్యం. ఆ భాగ్యం పోనివ్వరాదని ఆమె ఆత్రం.

ఒకకాలి పారాణి ముద్రలు పడేలా వెళ్ళిన ఆ యువతిని – కవి “గౌరి” కి ప్రతిరూపుగా వర్ణిస్తాడు. ఎందుకంటే ఎడమకాలికి మాత్రమే పారాణి అద్దుకునే సౌభాగ్యం అమ్మవారు పార్వతికే ఉంది. ఆవిడ కుడి అర్ధభాగమూ, ఆ భాగంలో ఉన్న కుడి పాదమూ అయ్యవారిది కాబట్టి. ఆ కుడి పాదానికి బూడిదే తప్ప పారాణి వంటి ఆడంబరాల్లేవు కాబట్టి, ఒంటి కాలి పారాణి భాగ్యం గల పైని యువతిని ఉమాదేవితో పోల్చి కవి చమత్కరించాడన్నమాట !

మరొక ఇంట్లో ఇదే సందర్భంలో -

ఈ ఘట్టంలో శ్లోకమూ గొంతెత్తి చదువుకోవాలి.

వ్యచలన్ విశంకట కటీరకస్థలీ శిఖరస్ఖలన్ ముఖర మేఖలాకులాః |
భవనాని తుంగ తపనీయ సంక్రమక్రమణ క్వణత్ కనక నూపురాః స్త్రియః ||

అది ఒక భాగ్యవంతుని ఇల్లు. ఆ ఇంట్లో అందమైన అమ్మాయిలున్నారు. వాళ్ళు తమ ఘనమైన కటిభాగంపై బంగరు మొలనూళ్ళు కిణకిణమంటుండగా, బంగరు గజ్జెలు ఘల్లు ఘల్లు మనిపిస్తూ, తన ఇంటి మేడ చేరుకోవటానికి బంగరు మెట్లపైకి ఎక్కుతున్నారు. ఎందుకూ? అందగాణ్ణి చూచే ఆత్రుతతో!

ఒక్కోసారి – కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగును!

ఇప్పుడు భావార్థాన్ని కలుపుకుని శ్లోకాన్ని మరోసారి చదువుకోండి. బంగారానికి తావి అబ్బినట్టు శబ్దసౌందర్యం భావసౌందర్యాన్ని ఉద్యోతించటం లేదూ?

ఈ కవి పేరు చెప్పడేమని విసుక్కుంటున్నారా? ఈ కవి పేరు, ఈ మాసంపేరు ఒక్కటేనండి.

మాఘుడు.

ఈ మాఘకవి కాళిదాసులా ఉపమ చెప్పగలడు.
భారవిలా అర్థగౌరవం గల కవిత్వం చెప్పగలడు.
దండిలాగా పదలాలిత్యమూ ఈయన సొంతం.

ఇందుకు దృష్టాంతంగా ఇందాకటి అమ్మవారి ఉపమనమూ, అక్కడే ’రసవశం’ అన్న శబ్దప్రయోగమూ, రెండవ శ్లోకంలో శబ్దసౌరభమూ కలిపి సరి చూసుకోవచ్చు.

మాఘకవి రచించిన సంస్కృతకావ్యం పేరు శిశుపాలవధమ్. ఈ కావ్యంలో పదమూడవ సర్గలో ఘట్టం ఇది. శ్రీకృష్ణుడు ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగానికై ఇంద్రప్రస్థానికి వచ్చాడు. ఆయనకు పూర్ణకుంభాలతో పాండవులు స్వాగతం పలికి, స్వయంగా ధర్మజుడు రథసారథియై మిగిలిన సహోదరులతో కలిసి నగరవీథుల గుండా శ్రీవారిని తోడుకుని వస్తున్నాడు. ఈ ఘట్టంలో ఆ నగరం లో అమ్మాయిల హడావుడి తాలూకు వర్ణనలు ఇవి.

ఈ పద్దెనిమిది శ్లోకాలలో మొదట ముగ్ధలైన అమ్మాయిలతో మొదలుపెట్టి ప్రౌఢలు, వాళ్ళు శ్రీకృష్ణున్ని ఆకర్షించడానికై చేసే విలాసాల వరకూ కవి వర్ణిస్తాడు. రాను రాను శ్రుతి మించి పాకాన పడినట్టు, చివరి శ్లోకాలలో ఘాటైన శృంగారమూ దట్టించాడాయన.

ఇందాక వర్ణించిన రెండూ అమ్మాయిల ఆత్రుతను తెలిపేవి. మిగిలిన వర్ణనలూ స్థాలీపులీకంగా కాస్త చవిచూడండి.

మాధవుడు వస్తున్నాడని ముందే తెలిసిన కొందరమ్మాయిలు అతగాణ్ణి చూడ్డానికి పై అంతస్థుకెక్కారు. అక్కడ కిటికీలద్వారా బయటికి చూస్తున్న వాళ్ళ ముఖారవిందాలు – ఉదయాచలంపై గుహల లోపలి చంద్రబింబాల్లా ఉన్నవి.

ఓ అమ్మాయి మేడపైకి ఎక్కింది. పిట్టగోడపైనుండి మధుసూదనుణ్ణి చూస్తోంది. గాలికి ఆమె పై వస్త్రం ఎగురుతోంది. అలా ఎగిరిన ఆమె అంశుకం శ్రీధరుని రాకకై ఏర్పాటు చేసిన నగరకీర్తిపతాకలా ఉన్నది.

తన భార్య పార్వతి తిడుతుందేమోనన్న భయంతో ఈశ్వరుడు ఈ ఊరి అమ్మాయిలను చూడ్డం మానేశాడు. కాబట్టి మన్మథుడికి ఈశ్వరుడు తనను కాల్చేస్తాడనే భయం పోయింది. ఆ మదనుడు విశృంఖలంగా ఈ అమ్మాయిలను ఆవహించాడు. అలా అగుపిస్తోన్న అమ్మాయిలను శ్రీకృష్ణుడు క్షణమాత్రం…జస్ట్..అలా..ఓ చూపు చూశాడుట!

మొత్తానికి అమ్మాయిల ఆత్రుత వెనుక, అదీ అందమైన వాడు, వరసైన వాడూ అనుకోకుండా కనిపిస్తే అది పైకి కనిపించని ఆహ్వానం అనే లెక్క. పైకి “వనిత తనంతట తా వలచి వచ్చిన చుల్కన కాదె ఏలికిన్….” అన్నా కూడా – “అవునంటే కాదనిలే” అని అన్వయించుకోవాలి.

ఆత్రుత – అన్న సాకు పట్టుకుని ఏవేవో ముచ్చట్లు చెప్పుకుంటూ చాలా దూరం వచ్చేశాం. ’ఫల’ శ్రుతి కింద రెండు రొమాంటిక్ శ్లోకాలతో ముగించేద్దాం.

***

అనుకోకుండా అపురూపసుందరి (వసంతసేన) వర్షంలో తడుస్తూ ప్రియుని (చారుదత్తుని) ఇంటికి వచ్చింది. గాఢమైన కౌగిలినిచ్చింది. ఆతడన్నాడూ -

ధన్యాని ఖలు తేషాం జీవితాని యే కామినీనాం గృహమాగతానామ్ |
ఆర్ద్రాణి మేఘోదకశీతలాని గాత్రాణి గాత్రేషు పరిష్వజన్తి || (మృచ్ఛకటికమ్ – 5-49)

ఇంటికి తమంతట తాముగా వర్షపుజల్లులో తడిచి వచ్చిన వలపుకత్తెల తనువుల తాలూకు కౌగిలింతలు ఏ మగవాడికి దొరకుతాయో అతడు చరితార్థుడు కదా!

ఆహా – వనిత తనంతట తా వలచి వచ్చిన “ధన్యత” గాదే ఏలికిన్! – అల్లసాని పెద్దన్నా! ఈ సరికి క్షమించయ్యా!

***

ప్రియమైన వాడు వీథిని వెళుతుంటే చూసిన చూపులు, పడిన ఆత్రుతా ఇదివరకటిలా ఉంటే, ఆ ప్రియమైన వాడు తన వాడే అయితే?

అతిథి, గొప్పవాడు ఇంటికి వస్తే దారిని పూలు పరిచి, పూర్ణకుంభంతో స్వాగతించడం మర్యాద. ఒక ఇంతి తనకు ప్రియమైన వాడికి ఎలా స్వాగతం చెబుతుందో గాథాసప్తశతిలోని ఈ గాథలో చూడండి.

రథ్యాప్రకీర్ణనయనోత్పలా త్వాం సా ప్రతీక్షతే ఆయాంతమ్ |
ద్వారనిహితాభ్యాం ద్వాభ్యామపి మంగళకలశాభ్యామివ స్తనాభ్యామ్ ||

నీవు ( ప్రియుడు) ఇంటికి వస్తే తన చూపులే విరులుగా, తన పయోధరాలే పూర్ణకుంభాలుగా స్వాగతం పలుకడానికై ఆ రమణి నిరీక్షిస్తోందోయి!

ఇక్కడా అమ్మడికి తీరుబడి కావలసినంత! ఆత్రుతంతా మనసులోనే.

**** (*) ****