యీ వుదయం వూరెళ్ళాలని యెయిర్ పోర్ట్ కి బయలుదేరుతోంటే నువ్వు కాల్ చేసావ్. వొట్టి నీ సెల్ ఫోన్ ముద్దుకే మురిసిపోయాను. పక్కనే నిలబడి ముద్దు పెట్టినంత యెఫెక్ట్ తో యెలా పెట్టగలవ్! యె న్నెన్ని గాలి ముద్దులో కదా… మనం మాటాడుకొంటున్నప్పుడు మన మాటల మధ్యన నిశ్శబ్ధంలో నీ పెదవులపై కనీకనిపించని నీ పసిఅల్లరి నవ్వువి వినడానికి చెవి వొగ్గానా, సరిగ్గా అప్పుడే వినిపించింది కోయిల పలకరింపు. వాకిట్లోని మామిడి చెట్టు మీద నుంచి. యీ వసంతానికి తొలిసారిగా యీ వూరి కో యిల పలకరింపు నీకు వినిపించింది కదా. మనిద్దరం వొకే సారి వినటం తరువాత రికార్డ్ చేసి ఆ ఫైల్ అటాచ్ చేసాను. మళ్ళీ విను.
యిప్పుడే వచ్చిన తనతో అలా కొంచెం సేపు మాత్రమే మాటాడి తనని వదిలి పని మీద వెళుతోన్నందుకు దిగులేసింది. రెండ్రోజుల్లో వచ్చేస్తానుగా అప్పుడు తీరిగ్గా వూసులు చెప్పుకోవచ్చని చెప్పాను.
యీ యేడాదికి తొలిసారిగా కోయిల పాట మంగళూర్ లో నేత్రావతి తీరాన విన్నానని చెప్పానుగా. ప్రతి యేడాది యీ మామిడి చెట్టు మీదకి రావాలని కోయిల యెంత బాగా గుర్తు పెట్టుకొంటుందో కదా. వీధిలోని చెట్ల పైకి వచ్చేసాయి కోయిలలు, దారి పొడుగుతా మార్నింగ్ వాక్ చేస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు. ‘పరువమా చిలిపి పరుగు తీయకు, పరుగులో పంతాలు పోవకు’ … యిప్పటికి మార్నింగ్ వాక్ సిట్యుయేషన్ కి యింతకు మించిన పాట లేదనిపిస్తుంది. వుదయమే గుర్తొచ్చిన పాట … బాప్ రే! యింక యీ రోజంతా యీ పాట ముసురులా నన్ను వదలదుగా!
వచ్చేసాను. వోకే చిన్నా, చెకిన్ చేసాక తిరిగి…
***
వుదయం చెకిన్ చేసినప్పట్నుంచి నీకు రాయటానికే వీలుచిక్క లేదు. సారీ.
హోటల్లో నా గదికి వచ్చాను. కాఫీ కలుపుకొంటూ టీవీ ఆన్ చేసాను. మరి కొన్ని స్వరాలూ గదిలోకి వచ్చాయి. గుడ్. ఫ్లైయింగ్ కిస్ లోని స్పర్శలా యింస్టెంట్ కాఫీలో అరోమా యేముంటుంది కిక్ యివ్వటానికి! కానీ అసలు కిక్ అంతా నా గదికి యెదురుగా వున్న సముద్రం. తెల్లని పల్చని గాజు కిటికీలోంచి చప్పుడు లేకుండా యెగిసే కెరటాలని చూస్తుంటే వొక్కో సారి అద్దాల కిటికీ కూడా సౌందర్యానికి శక్తివంతమైన బ్యాన్లా తోచింది. మెల్లగా తలుపు తీసాను. సముద్రపు సవ్వడితో వెచ్చనిగాలి వొత్తుగా ముఖమంతా కమ్ముకొంటోంది, అప్పుడప్పుడు నీలోని చిలిపితనంలా. నీకు గుర్తుందా… ఆ కేరళా సముద్ర తీరాన నీ వెనగ్గా నిలబడి నీ మెడ చుట్టూ చేతులేసి గాలితో ఆడిన దాగుడుమూతలు. యిప్పుడు నువ్వు నా పక్కన వుంటే నీ వెనగ్గా దాక్కొని నీ భుజాల మీద నా ముఖాన్ని ఆన్చి యీ గాలితో ఆటలాడేద్దునుగా! భలే మక్కువ నాకు నీ సమక్షంలో గాలితో మంచుతో వానతో ఆడుకోవటం.
టీవీలో న్యూస్ వినిపిస్తోంది. ఆసక్తిగా అనిపించి చూసాను. వావ్… కంగనాకి నేషనల్ అవార్డు. క్వీన్ కి. అపురూపం కదా. చాలా మంది అడుగుతుంటారు క్వీన్ ఎందుకంత యిష్ట మని. నీతో కాసింత పంచుకోవాలనిపిస్తోంది. చెప్పనా?
నాకేమనిపిస్తుందంటే…
‘యెవరూ కేక విని రాకపోయినా
వొక్కడవే పదవోయి
వొక్కడివే పదవోయి’ అని ఠాగోర్ గారి యీ పాటని అమ్మాయిలు అబ్బాయిలు అందరం చాలా యిష్టంగా పాడుకొంటాం. ఆ పాట అమ్మాయిలకి సంబంధించిందా, అబ్బాయిలకి సంబంధించిందా అంటే మనుష్యులకి సంబంధించిన పాట అది. కాని అందులో ‘వొక్కడివే’ అని వుంటుంది. ‘వొక్కర్తివే’ అని వుండదు. కాని ఆ పాటని మనదే అనుకుంటాం అందరం.
అమ్మాయి వొక్కతి ప్రయాణం చెయ్యటం అదీ గమ్యం తెలీకుండా చెయ్యటం అన్న వూహే రాదు యెవ్వరికి. అలా ప్రయాణం చెయ్యటం అబ్బాయిలకి మాత్రమే చెల్లుబాటు అనుకుంటారు. సహజం అని కూడా అనుకుంటారు.
అమ్మాయిలు చేసే ప్రయాణాలు అంటే పుట్టింటికి ,అత్తింటికి వెళ్ళటం. గత కొన్నాళ్ళుగా యింటర్వ్యు కో , చదువుకోడానికో యిలా వొక ఆమోదిత చట్రంలో ప్రయాణాలు వుండాలి. కచ్చితమైన పని, గమ్యం వున్న ప్రయాణమై వుండాలి.
అమ్మాయిలు చేసే ప్రయాణాలకి రోజువారి జీవితంలో, భాషలో, వూహా ప్రపంచంలో కట్టుబాట్లు వుంటాయి. వొక సిద్ధార్దుడిలా మనం యిల్లు విడిచి వెళ్ళటం అన్నది వూహలో కూడా పుట్టదు. నా కథల్లో అమ్మాయిలు గమ్యం లేకుండా కొన్ని సార్లు, కొన్ని సార్లు అడివిని, దీవులని యిలా ప్రపంచాన్ని చూడాలని బయలుదేరి వెళతారు.
మన రోజువారి జీవితంలో కారణం లేకుండా మనం బయటకి వెళ్ళటం అన్నది అన్ని రకాల ఆధిపత్యాలని ఛాలెంజ్ చేస్తుంది కదా. క్వీన్ సినిమా ఆ అన్ని రకాల ఆధిపత్యాలని పటాపంచలు చేసింది.
కంగనాని అనుపమాచోప్రా చేసిన యింటర్వ్యూ చూస్తే వొక నటి లేదా నటునికి యిన్నర్ జర్ని అన్నది వుంటే, పాత్ర యేదైనా సరే యెంత బిలీవబుల్ గా అందులో వొదిగిపోతారో మనకి మరొక్క సారి తెలుస్తుంది. క్వీన్ లో పెళ్ళి కాన్సిల్ అని తెలిసిన ఆ వొక్క సన్నివేశంలో కంగనా నటనకి వొక అవార్డ్ , మిగిలిన చిత్రమంతా ఆమె అభినయానికి వొక అవార్డ్ యివ్వవచ్చు. అంత అద్భుతం ఆ క్వీన్.
మన జీవితంలో మనం అనేకానేక ప్రయాణాలు చేస్తాం. అనేక పాత్రల్లో ప్రయాణిస్తాం. కాని మన అంతరంగంలోని ప్రయాణం అదే యిన్నర్ జర్ని యెవరికి వాళ్ళం చేస్తాం. నువ్వూ నేను వొకరికివొకరం అత్యంత చేరువ. అయినా సరే మన అంతరంగిక ప్రపంచపు ప్రయాణం యెంత చేరువో అంతే యిండిపెండెంట్. ఆఫ్కోర్స్ అప్పుడప్పుడు క్లోజ్అప్ టూత్ పేస్ట్ మమేకాలుంటాయనుకో.
క్వీన్ సినిమా ముంబాయి లో చూసిన వొక మిత్రుడు ‘ నువ్వూ, నీ కథలో అమ్మాయిలు గుర్తొచ్చారు’ అని ఫోన్లో చెప్పారు. యేదైనా వూరు వెళ్ళటం అంటే చిన్నప్పటి నుంచి భలే సరదా . యెవరు వూరు బయలుదేరినా వాళ్ళ వెంట వెళుతుండేదాన్ని. నీకూ తెలుసుగా కథలంటే యిష్టమని. చందమామ కధల్లో రామయ్యో పుల్లయో పొరుగూరికి వెళ్ళటం అని వుంటే ఆ కథలని మళ్ళిమళ్ళి చదివేదాన్ని. ఆ యా కథల్లోని పాత్రలని అమ్మాయిల్లా మార్చి తిరిగి కథలు చెపుతోండేదాన్ని.ఆ వూర్లు వెళ్ళిపోతుండేదానిని వూహల్లో. పేదరాసి పెద్దమ్మ , పూటకూళ్ళమ్మ కధల్లో యెప్పుడూ ఆమె యింట్లో రాజులు, షావుకార్లు , వివిధ పనులపై తిరిగే బాటసారులు బస చేస్తారు కదా. అమ్మాయిలు యెందుకు బస చెయ్యరోననిపించేది. ఆ కథల్లో అమ్మాయిలు బస చెయ్యక పొతే నన్ను నేను ఆ పాత్రల్లో యెలా వూహించుకోవటం అనేది నా చిన్ని బుర్రలో తేలక, చివరికి వొక రాణి, తప్పిపోయిన తన జింక పిల్లని వెతుకుతూ బయలుదేరుతుంది. చీకటి పడే వేళకి వో పూటకూళ్ళామె యింట్లో బస చేస్తుంది. అక్కడ కనిపించిన వో రుషికి ఆమె నమస్కరించి విషయం చెపుతుంది. అతను తూర్పు దిక్కుగా వెళితే వొక నది వస్తుంది. ఆ నదికి దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తే యాలకుల తోట కనిపిస్తుంది. ఆ తోటలో జింక వుందని చెపుతారు. ఆమె ఆ దిక్కుగా బయలుదేరుతుంది. ఆ కథ అలా సాగుతుంది.
అయితే ఆ కథ విన్న మా తాతగారు జింక కోసం రాజు గారు వెళ్ళారని, జింకని తీసుకొచ్చి రాణి గారికి యిచ్చారని చెప్పమన్నారు. యెందుకు అని అడిగితే రాణులు అలా వెతుక్కుంటూ వెళ్ళరు అన్నారు. అమ్మాయిలు బస చెయ్యటం లేదని తెలిసేది కాని యెందుకు వెళ్లరని ప్రశ్నలు వెయ్యాలని తెలియని వయస్సు కదా . కాని నేను నా కథని మార్చకుండా అలానే చెపుతోండేదాన్ని.
చిన్నప్పచిన్నప్పట్నుంచే ప్రయాణాలపై ఆసక్తి వుండే నాకు కొద్దికొద్దిగా పెద్ద అవుతోన్న కొద్ది వొంటరి ప్రయాణాలపై కుతూహలం పెరిగింది. ముంబాయిని వొంటరిగా చూడాలని వెళ్ళాను. ఆ మహానగరంలో చర్చి గేట్ దగ్గర వో సాయంకాలం నిలబడినప్పుడు కెరటాల్లా వచ్చే ఆ జనప్రవాహాన్ని చూస్తుంటే రెండు సముద్రాలు వున్నాయనిపించింది. ఆ ప్రయాణం నాకు మరొక యెరుకని కూడా యిచ్చింది. వొంటరి ప్రయాణం అన్నది వొట్టి మిత్. మనకి తెలిసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్థుల నుంచి కాస్త ముందుకు వెళితే యెక్కడికక్కడే ఆత్మీయులు, స్నేహితులు దొరుకుతారు. వాళ్ళు ఆ వొక్క ఆ ప్రయాణంలో ఆ వొక్క ప్రదేశానికి పరిమితం కావొచ్చు లేదా కొద్ది సేపే కావొచ్చు. లేదా మన జీవితంలో ప్రవహించే స్నేహంగాను వుండిపోవచ్చు. ప్రకృతితో అమితంగా మమేకమయ్యే నాకు మనుష్యులు లేని ప్రదేశం యేమంత అందంగా కనిపించదు. అత్యంత ఆసక్తి మనుష్యులని కలుసుకోవటం. అప్పటి నుంచి మనుష్యులని ,పువ్వులని, మంచుని, వానని చూడటానికి చేసే నా ప్రయాణాలన్నిటా ఆ యెరుక నాకెంతో ధైర్యాన్ని యిచ్చింది. చేసిన, చేస్తున్న ప్రయాణాలు మనసులని భలే శుభ్ర పరుస్తున్నాయి. విశాలం చేస్తుంటాయి.
కంగనా అత్యంత అద్భుతంగా నటించిన క్వీన్ కి అవార్డ్ రావటమంటే మనందరికీ రావటమే కదా. యేర్పరచిన, నడిచిన దారుల్లోంచే కాకుండా మనకై మనం ఆవిష్కరించే దారుల్లో రాణుల్లా మనం మరింత శక్తివంతంగా మెరుస్తుంటామనిపిస్తుంది. అదబ్బాయి విషయం. యేమంటావ్… వో… చాల రాసేసాను.
***
అప్పుడే పన్నెండయింది. నువ్వు బజ్జునే టైం. బజ్జోవాలి అనిపించగానే మనసంతా నీ ముద్దుల జోలపాట గుసగుస. పో! అలా నిద్ర కళ్ళతో నవ్వకు. నిద్రకి వశమవుతోన్న నీ కనురెప్పల పై నేనిప్పుడు ముద్దు పెడితే, సీతాకోక చిలుకల రెక్కల్లా అనేకానేక రంగులజల్లులై పూర్తిగా విప్పారతాయిగా! నాకు తెలుసు అప్పుడిక నేనీ అవనిపై యింద్రధనస్సునే!
**** (*) ****
డియర్ పద్మ గారు
చాలా సున్నితమైన మనసును మృదువుగా హత్తుకోగల రచన మీ సొంతం. అనుభవించగల మనసులకు జీవితంలో మధుర భావనలు ఎన్నో కదా! అభినందనలు.
Dr. విజయ బాబు కోగంటి గారు, కృతజ్ఞతలు. సున్నితమైన మనసున్న మీలాంటి స్నేహమయి పాఠకులు యీ యెల్లో రిబ్బన్ కి వుండటం సంతోషాన్ని యిస్తోంది.
కుప్పిలి పద్మ గారు మీ కథల్లోలాగానే మీరు రాసే ఈ “యెల్లో రిబ్బన్” ప్రేమలేఖ కూడా ఎంత బాగుందో.భావాలను స్వచ్ఛoగా కుమ్మరిస్తారు.చదివిన కొద్దీ మనసులో ఏదో నిండిన ప్రేమభావం ఒకటి కలగక మానదు. “తెల్లని పల్చని గాజు కిటికీలోంచి చప్పుడు లేకుండా యెగిసే కెరటాలని చూస్తుంటే వొక్కో సారి అద్దాల కిటికీ కూడా సౌందర్యానికి శక్తివంతమైన బ్యాన్లా తోచింది”ఇలా రాయడం చాలా అందంగా ఉంది.చక్కని ఆర్టికల్.అభినందనలు మీకు.
తిలక్ గారు, మీది కవి హృదయం కదా ఆ భావనని పట్టుకొంది. Thank you. మీరు రెగ్యులర్ గా మీ అభిప్రాయం చెపుతున్నందుకు చాల ఆనందంగా వుంది. మరో సారి కృతజ్ఞతలు .
” చందమామ కధల్లో రామయ్యో పుల్లయో పొరుగూరికి వెళ్ళటం అని వుంటే ఆ కథలని మళ్ళిమళ్ళి చదివేదాన్ని. ఆ యా కథల్లోని పాత్రలని అమ్మాయిల్లా మార్చి తిరిగి కథలు చెపుతోండేదాన్ని.ఆ వూర్లు వెళ్ళిపోతుండేదానిని వూహల్లో. పేదరాసి పెద్దమ్మ , పూటకూళ్ళమ్మ కధల్లో యెప్పుడూ ఆమె యింట్లో రాజులు, షావుకార్లు , వివిధ పనులపై తిరిగే బాటసారులు బస చేస్తారు కదా. అమ్మాయిలు యెందుకు బస చెయ్యరోననిపించేది. ” భలే చెప్పారు….ఆ wanderlust నిజంగా మోహమే…
మైథిలి అబ్బరాజు గారు మనం వొకే గూటి పక్షులం. వండర్ ల్యాండ్ మనందరిది పసితనంలో చాలా మందికి అలాంటి వూహలుంటాయి.( నాకు యిప్పటికి అలాంటి వూహించుకొంటుంటా ) మీకు కూడా వుండుంటాయి కదండీ. మీరు కూడా మాతో పంచుకోండి వీలైనప్పుడు. యెల్లో రిబ్బన్ ప్రచురించిన ప్రతి సారి కామెంట్స్ కోసం చూస్తాను అచ్చు చిన్నప్పుడు నోట్ బుక్ లో టీచర్ గుడ్ ఆర్ వెరి గుడ్ అని పెట్టారా లేదాని నోట్ బుక్ వోపెన్ చేసి చూసుకున్నట్టు… అలా చూసినప్పుడు క్రమం తప్పకుండా ప్రేమగా మీరు మీ స్పందనని పంచుకోవటం చూసి నా మనసు భలే గెంతులేస్తుంది. మీ అభిప్రాయం చదువుకొని హమ్మయ నచ్చింది యెల్లో రిబ్బన్ అనుకుంటాను సంతోషంగా… Thank You very much మైధిలి గారు.
ప్రతి నెల.. మనసును హత్తుకునే భావుకత్వంతో మీ ఎల్లో రిబ్బన్ అలరిస్తోంది. అభినందనలు.
Lalitha Chitte గారు ప్రతి నెలా మీకు నచ్చుతున్నందుకు చాలా కృతజ్ఞతలు. మీ అభిప్రాయం పంచుకున్నందుకు చాల సంతోషపడ్డాను.
చాలా బావుంది పద్మగారు . ఎద ఎదని తడిమే మీ వ్రాతలన్నీ ఎప్పుడూ చదువుకోవడానికి తోడుగా తీసుకుని వెళ్ళవచ్చు . ” చేస్తున్న ప్రయాణాలు మనసులని భలే శుభ్ర పరుస్తున్నాయి. విశాలం చేస్తుంటాయి.” ఈ వాక్యం నాకు బాగా నచ్చింది .
వనజ గారు, మీకు తోడు తీసుకొని వెళ్ళాలనంత నచ్చినందుకు, యెప్పుడు మీరు మీ
స్పందనని పంచుకొంటున్నందుకు మీకు కృతజ్ఞతలు.
పద్మ గారూ,
ఒక రచయితని తన రచన ఆవిష్కరిస్తుంది … అన్న దానికి నాకు ఇది చిన్న ఉదాహరణగా కనిపించింది.
అభివాదములు
మూర్తి గారికి, మీరు మీ స్పందనని యెంతో సహృదయం తో పంచుకొన్నారు. మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. నమస్సులు.
బాటసారికి స్త్రీ లింగం ఏమై వుంటుంది? బాటసారిని అనేద్దామా ఎన్ని ప్రయాణాలు చెయ్యాలో కదూ, మన చుట్టూ వున్నా ప్రపంచాన్ని ఇంతేసి కనులేసుకుని చూడాలి, మనలోనికి లోలోనికి వెళ్లి అబ్బురంగా చూసుకోవాలి.
బాటసారిని అనేద్దామా – బాగుంది ప్రవీణా గారు. మనం మన పదాలని మనమే సృస్టించుకోవాలి. Thank You. మీరు మీ ప్రయాణాలని పంచోకావాలి… ‘ఇంతేసి కనులేసుకుని ‘ యెదురు చూస్తాం.
.
“చేస్తున్న ప్రయాణాలు మనసులని భలే శుభ్ర పరుస్తున్నాయి. విశాలం చేస్తుంటాయి”….మనసుకి అనుభవమే అయినా..సరికొత్తగా చెప్పారు మీరు.
మనకై మనం ఆవిష్కరించే దారుల్లో రాణుల్లా మనం మరింత శక్తివంతంగా మెరుస్తుంటామనిపిస్తుంది…”ఎంతగా హత్తుకుందో!
” చందమామ కధల్లో రామయ్యో పుల్లయో పొరుగూరికి వెళ్ళటం..పేదరాసి పెద్దమ్మ , పూటకూళ్ళమ్మ కధల్లో యెప్పుడూ ఆమె యింట్లో రాజులు, షావుకార్లు , వివిధ పనులపై తిరిగే బాటసారులు బస చేస్తారు కదా. అమ్మాయిలు యెందుకు బస చెయ్యరోననిపించేది”ఈ భావం నచ్చి ఎన్నిమార్లో చదివాను.
చందమామ చేతిలో ఉన్న ఫీలింగ్ తో బాటు, మీ చిట్టి సందేహం ఇప్పటి మీరుగా తీర్చిదిద్దటం..చాలా సంతృప్తినిస్తోంది.