కరచాలనం

నన్ను కదిలించిన మనుషులే నా కథలు!

ఫిబ్రవరి 2013

సామాన్య… .చాలా అరుదైన పేరు. అంతకన్నా అరుదైనవి ఆమె రచనలు.ఆదునిక తెలుగు కథానిక సరికొత్త మలుపు తిరగటం కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో సామాన్య తనదైన స్వంత శైలి తో సాహిత్య రంగం మీదికి అడుగు పెట్టారు.జీవితంలో కనిపించకుండా మిగిలి పోయిన ఖాళీలను   సామాన్య  తన   కథానికల ద్వారా పూరిస్తూ వస్తున్నారు.ఈమె రాస్తున్న కథలు కొత్తవి.కథనాలు కొత్తవి.శిల్ప సంవిధానం కొత్తది. మారుతున్న కాలంలో మారుతున్న మనవ సంబందాలు ఈమె కథా  వస్తువులు సామన్యమైనవిగా కనిపించే అసామాన్యమైన అంశాలు ఈమె కథలకు ముడి సరుకులు. పాత్రల ద్వారా ఆకారాలను సంతరించుకొన్న అనుభవ విశేషాలే ఈమె కథలు. నిరాడంబరమైన శైలిలో నిశ్చలమైన సాంద్రత.సరళమైన శైలిలో విశాదాశ్రు తుశారాల తేమ నిండిన అక్షరాలూ.   బావోద్విగ్న సందర్బాలలో సైతం సంయమనాన్ని పాటించే పరిపక్వ మనస్తత్వం. విలువల తాజాదనాన్ని బాషగా అనువదించగల ప్రతిభా సామర్ద్యం. బాష మర్మం ఎరిగిన కథా శిల్పి. సాహితీ ప్రక్రియల సరిహద్దులు చెరిగి పోతున్న దశలో తెలుగు కథకు తనదైన ఒక సాంద్రతను సమకూర్చ గలగటం ఈమె ప్రత్యేకత. ఎంతటి క్లిష్టతరమైన వస్తువునైనా మైనం ముద్దగా మార్చి అతి సులభ గ్రాహ్యమైన రీతిలో కథానికా శిల్పంగా మలచ గలగటం ఈమె స్వంతం చేసుకొన్న  విశిష్టత. ఉత్తర ఆధునిక పరి బాషలో చెప్పాలంటే తెలుగు కథానికా సాహిత్యం లో ప్రస్పుటం కానున్న ఒక పారడిం షిఫ్ట్ (paradigm shift) కుసామాన్య ఒక ప్రతీక.

(సామాన్యకి స్మైల్ అవార్డు కమిటీ ఇచ్చిన యోగ్యతా పత్రం నించి…)

ఇది సామాన్య నేపధ్యం!

మా అమ్మా వాళ్ళు అయిదుగురు అక్కా చెల్లెళ్ళు .అందరూ అవీ ఇవీ పుస్తకాలు చదివే వారనుకుంటాను ,మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉండేవి .అట్లా నా ఏడో  తరగతిలోనే  నేను శరత్ ”శ్రీకాంత్ ”ని చదివాను .శ్రీకాంత్ ని ఇప్పటికీ పూర్తిగా అందుకోలేదు .అది వేరే విషయం .అట్లా శరత్ ,టాగోర్ ,చండీ దాస్,కొ . కు  వంటి  గొప్ప రచయితల రాతల్ని నా పదో తరగతి లోపున చదివేసాను .స్కూల్ రోజుల్లో నాకో స్నేహితురాలుండేది శారద అని తను,నేనూ చిత్తూరు’ ప్రేమళ’  టాకీస్ సందులో వున్న పుస్తకాల బంకుల్లో పాకెట్ పుస్తకాలు కొనే వాళ్ళం .అట్లా సింద్బాద్ ,గలివర్ యాత్రలు వంటివి చదివాను .చదవడం అంటే ఏ స్థాయి పిచ్చి అంటే దారిలో దొరికిన పిచ్చి కాగితాన్ని కూడా వదలకుండా కళ్ళ దారుల నుండీ ,మెదడు లోకీ ,అక్కడ నుండీ వడ పోసి హృదయానికీ భట్వాడా చేసేసేవాళ్ళం నేనూ నా తమ్ముడు ఉదయ చైతన్య .అవును ఈ చదువు ప్రయాణం లో నాకు నా తమ్ముడు తోడు,ఏది చదివినా జంటగా చదివే వాళ్ళం  . ఎక్కడెక్కడి లైబ్రరీలు కనిపెట్టేవాళ్ళం .రంగ నాయకమ్మ రచనలని విపరీతంగా ఇష్టపడే వాళ్ళం .రామాయణ   విష వృక్షాన్ని చదివి ఇద్దరం దొల్లి దొల్లి నవ్వుకోవడం గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది.”మ్రుచ్చ కటికం” నేను నా హై స్కూల్ లోపే చదివాను .మా పెద్ద పెదమ్మ భర్త బాగా పుస్తకాలు చదివే వారు .చలం ని నేను ఆయన వద్దే చదివాను .నాకు గుర్తున్నంత వరకూ నేను చదివిన చలం గారి మొదటి రచన ”విడాకులు” నాటకం .అర్థం  కావడం, కాక పోవడం తో మాకు సంబంధం వుండేది కాదు.మా చదువుని చూసి మా అమ్మమ్మ  తిడుతుండేది అట్లా చదివితే  పెద్దయ్యేసరికి కళ్ళు పనికి రాకుండా పోతాయని .కానీ నన్ను పెంచిన  మా నాన పుస్తకం చేతిలో లేకుండా కనిపిస్తే కోప్పడే వారు.

ఇంటర్ మీడియట్ కి  వచ్చేసరికి నా తమ్ముడు నాగార్జున సాగర్ ఎపీఆర్ జేసీ కి వెళిపోయాడు. పుస్తకాల చర్చలు కాస్తా కుంటు పడ్డాయి.అప్పుడే బైపీసీ తో ఇంటర్ పూర్తి చేసి  ఎంసెట్ లో చేరాను .మా అమ్మా వాళ్లకి నన్ను డాక్టర్ ని చేయాలని కోరిక .నా చెడ్డ కలల్లో కూడా నన్ను నేను రోగుల మధ్య ఊహించుకోలేక పోయేదాన్ని .ఒకటే కల యవ్వనం తో మిల మిలమనే సీతా కోకల్లాంటి పిల్లలకి తెలుగు సాహిత్యం భోధించాలని .ఇంట్లో చెప్పే ధైర్యం లేదు.చివరికి ఎలాగయితేనేం అదృష్టం అనుకూలించి డిగ్రీలో చేరాను . కాకపోతే అక్కడ పొలిటికల్ సైన్స్ వంటివి చదవాల్సి వచ్చింది .అప్పుడు గ్రాడ్యుయేషన్ లో జాషువా గారి మనవరాలు శ్రీ .శోభా దేవి గారు మాకు తెలుగు లెక్చరర్ గా వచ్చారు .ఆ ఏడాది ప్రీ ఫైనల్ లో నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను .సామాన్య అంటే ఎవరూ అని వారు అడగటం, నేను లేచి నిలబడటం …అట్లా వారితో నా పరిచయం మొదలయింది .వారు నాకు  ఆధునిక తెలుగు సాహిత్యాన్ని  పరిచయం చేసారు .మేడం వాళ్లకి  పెద్ద లైబ్రరీ వుండేది.నాకు రక రకాల పుస్తకాలు కాలేజ్ కి తెచ్చి ఇచ్చేవారు మేడం  .స్టాఫ్ రూం ముందు నిలబడి సుదీర్గంగా చర్చించే వారు .వారి పరిచయం నిజంగా నా అదృష్టం .అట్లా స్త్రీ వాద ,దళిత సాహిత్యాలని వచ్చింది వచ్చినట్లు నమిలి నీళ్ళు తాగేదాన్ని .  అప్పట్లో  అదొక పిచ్చి .అప్పుడే   త్రిపురనేని శ్రీనివాస్ చనిపోయారు.ఎంత బాధ పడ్డానో ,అప్పుడో కవిత రాసుకున్నాను కూడా .వారి మరణానంతరపు  ”హో” ని మేడం నాకు ఇచ్చ్చారు.”హో” లోని కొన్నివాక్యాలు ఇప్పటికీ నా నిత్య జీవితంలో కోట్ చేసి  వాడేస్తూ వుంటాను.కవిత్వం నాకు అట్లా డిగ్రీలో పరిచయమైంది. మద్దూరి ,అఫ్సర్,ఎండ్లూరి ,దాము ,విమల ,జయ ప్రభ ,రజని,నిర్మల ,అటు వేపు ఓల్గా , పి .సత్యవతి….. – వీళ్ళందరూ అప్పటి నా భగవద్గీతలు .

 

పీజీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేరాను . శ్రీ కె.కె.రంగానాథా  చార్యులు గారు క్లాస్ ని పరిచయం చేసుకుంటూ ఎవరెవరు ఏమేం పుస్తకాలు చదివారో చెప్పమని అడిగారు .లాస్ట్ బెంచ్ నుండీ అడుగుతూ ఫస్ట్ బెంచ్  లో వున్న నా దగ్గరికి వచ్చేసరికి  నిన్ను అడగక్కర లేదులే అనేసారు.అంతే కాదు ఎం . ఏ అయిన దాదాపు ఆరేళ్ళ  తరువాత ఒక రిఫ్రేషర్  కోర్సులో నన్ను చూసి అప్పుడు అక్కడ వున్న ఒంద  మంది ఎదుట ఈ అమ్మాయి ఆధునిక తెలుగు సాహిత్యం మొత్తం చదువుకుని తెలుగు ఎం . ఏ చదవడానికి వచ్చిందని అన్నారు .ఆ మాటని నేను  పదిలంగా ఒక బంగారు పెట్టెలో దాచుకున్నాను. ఇవాల్టి ఏమీ చదవలేని నైరాశ్యంలో నన్ను నేను పునరుత్తేజ పరుచుకునెందుకు  ఆ మాటని జ్ఞాపకం చేసుకుంటూ వుంటాను .యూనివర్సిటీలో తెలుగు అధ్యయనం వల్ల  నేనేం నేర్చుకున్నానో తెలీదు కానీ ఆ లైబ్రరీలో మార్క్సిజానికి సంబంధించిన బోలెడు పుస్తకాలు చదివాను .అంకుల్ టామ్స్ కేబిన్,రూట్స్,వార్ అండ్ పీస్ ,గోర్కీ అమ్మ వంటివి కూడా అక్కడ చదివినవే .

ఎం . ఏ లో వుండగా నాకు నా సహచరుడు కిరణ్ పరిచయమయ్యాడు .తను స్త్రీ వాదినని చెప్పడమే కాదు ,మనిషిగా మాత్రమె అతను నాకు కనిపించడం,తనకున్న మరో ప్రపంచపు కలలు   మా సహజీవనానికి పునాది ..మా ఇద్దరి పరిచయం పెరియార్,బీ ఎస్ రాములు పుస్తకాలు ఇచ్చి పుచ్చుక్కోవడం తో ప్రారంభమయింది.కిరణ్ బాగా చదివే వాడు .అప్పట్లో మేమిద్దరం సమంగా ప్రేమించి ,చదివి,ఆశ్చర్య పడ్డ పుస్తకం ”హో” మా ఇద్దరి మధ్య అప్పటి నుండీ ఇప్పటి వరకూ వచ్చే అన్ని ఘర్షణలూ పుస్తకాలకి సంబంధించినవే .కులం పునాదనో  ,కాదనో ,అలాటిదే మరో చర్చతోనో మేమిద్దరం   ఘర్షించు కుంటూనే వుంటాం .మా ఇంట్లో ఆధునికత అత్యాదునికతల మధ్య నిరంతర యుద్ధం జరుగుతూ వుంటుంది .

ఇట్లా పుస్తకాల ప్రయాణం లోనే  పాపాయి పుట్టింది .పాపాయి నా సమస్త ప్రపంచాన్ని చెత్త పుస్తకం లా నలిపి  మూలకి  పడేసి తనోక్కటే నా ప్రపంచమై పోయింది .అప్పటి నుండీ ఇవాల్టి వరకూ పోస్ట్ నాటల్ కి సంబంధించిన పుస్తకాల్లూ ,చైల్డ్ సైకాలజీ ,నీల్ ,రమణ మహర్షి,జిడ్డు కృష్ణ మూర్తీ ఓషో వంటి వారిని తప్ప   నేను సీరియస్ గా చదివిన ఒక్క సాహిత్య పుస్తకమూ లేదు.ఏం చదివావని నను ఎవరైనా వివరము అడిగితే సమాధానం నా తెల్ల ముఖమే .ఈ అజ్ఞాత వాసం వయసు ఏడేళ్ళ ఐదు నెలలు .

నా రాత సంగతి కి వస్తే ,ఇన్నేళ్ళ నా జీవితం లో అత్యంత అయిష్టంగా నేను చేస్తున్న పని   రాయడమే .స్కూల్లో ,కాలేజ్ లో చదివేప్పుడు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వ్యాస సరచనలో ప్రధమ ద్వితీయ బహుమతులు పొందినా అది నేను రాయగలననటానికి సూచన అని నాకు తెలీదు .నాకు రాయాలనే ఆసక్తి ఎప్పుడూ లేదు .కానీ చిన్నప్పటి నుండీ ఏదైనా బాధ కలిగితే కవిత్వం రాసే దాన్ని .2005 లో ఎండ్లూరి గారి ప్రోత్సాహంతో ఒక కవిత ఆంద్ర జ్యోతి కి పంపాను కూడా .అట్లా  ఏడాదికో ,రెండేళ్ళకో  ఒక సారి   ఒకటో ఆరో కవితలు రాసాను కానీ ,అవి రాయడం కోసం రాసినవి కాదు.అనుకోకుండా అక్షరాలయిన నా అంతర్ స్పందనలు మాత్రమె .

కథల విషయానికి వస్తే అదొక ఏక్సిడెంట్ .నేను కోరుకున్నట్టు లెక్చరర్ ని అయినా ఆ పనిని నా కూతురు  కారణం గా కొనసాగించలేక పోయాను.కిరణ్ వెస్ట్ బెంగాల్ లో ,నేను ఆంద్ర ప్రదేశ్ లో వుండి  వుద్యోగం చేయడం ఎలాగో నెట్టు కు రాగలిగినా పాపాయి చదువు ,పాపాయి కి అమ్మా నాన్న ఇద్దరూ అవసరం కావడం వంటి విషయాలు నన్ను ఉద్యోగాన్ని వదిలేట్టు చేసాయి .అది నా జీవితం లో పెద్ద దుక్కం .పున్నమి సంద్శ్రం లాటి సామాన్య నాలుగు గోడల మధ్య అనైచ్చిక బందీగా మారింది .ఏం ఏ గోల్డ్ మెడలూ ,ఇతరేతర ప్రతిభలూ  పెట్టెల్లో బజ్జున్నాయి .ఎంత బాదేసేదో .అప్పుడే ,సుదీర్గంగా ఎనిమిదేళ్ళు పాటూ చేసిన పీ హెచ్ డీ సబ్మిషన్ కి యూనివర్సిటీ కి వెళ్ళినపుడు, రూం మేట్ గా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ’కల్పన ”పరిచయమయింది.నా విషయం లో  అంతా అర్థమవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయుత  కిరణ్ ది  .కల్పనాదింకొ బాధ .ఎంత చదువుకున్నా మగవాడి అణిచివేతకి కల్పన బాధితురాలు తను ఎదురుకుంటున్న ఆణిచివేతని అందంగా నవ్వుతూ హాస్యం చేసి చెప్పేది కల్పన.నాకేమో దిగులేసి పోయేది .మనదేమో  పురుషులకోసమే సృస్తించిన సమాజం .స్త్రీ సునిసితత్వం మన రాజ్యాంగానికి ,ప్రభుత్వాలకీ ,చట్టాలకీ దేనికీ లేదు .తనతో మాట్లాడినపుడల్లా ఇవంతా ఆలోచనకొచ్చి నిస్సహాయంగా అనిపించేది .ఆ బాధ నుండి నేను రాసుకున్న కథ ”కల్పన”

కిరణ్ ,నేనూ ఇద్దరం చదువు లో ఒకే లాటి ప్రయాణాన్ని చేసినా వివాహం ,సంతానం నా చదువుని కుంటు  పరిచాయి .నేను పీ హెచ్ డీ చేయలేక సతమవుతున్న సందర్భంలో తను ఐ ఏ ఎస్ లాటి అత్యున్నత సర్వీస్ లోకి వెళ్లి పోయాడు .పాపని చూసేందుకు మనుషులు వున్నా బిడ్డని వదిలి తను వుండగలిగినట్లు నేనెందుకు ఉండలేక పోతున్నానో అర్థమయ్యేది కాదు .ఆ ఉక్రోషం లో నుండి ఒక కథ రాసాను .కిరణ్ వసంత లక్ష్మి గారికి పంపాడు  .వసంత గారు ఆ కథను  తిప్పి పంపడమే కాదు ఆ భావజాలం తో తీవ్రంగా విభేదించారు కూడా .ఆరేళ్ళ క్రితం ఆ కథలో ఏం రాసానో ఇప్పుడు జ్ఞాపకం లేదు .ఆ తరువాత రాసిన కల్పన ని కూడా కిరణే  ”ఇది ఇవాళ అత్యవసరమైన కథ ”అంటూ వసంత గారికి పంపాడు.వారు అది చదివి కిరణ్ అభిప్రాయం తో ఏకీభవించారు .అది అచ్చయింది .ఆ కథకి విపరీతమయిన స్పందన వచ్చింది .ఆ కథతో నేనో ఆరు నెలలు కౌన్సిలర్ గా మారాలసి  .ఎన్ని ఫోన్ కాల్ లో చెప్పలేను .అందులో ఒక అమ్మాయి ఏడుస్తో ,తన భర్త నిరాదరణని మేల్ ఛావనిసాన్ని చెప్తూ అన్న మాట నా హృదయానికి బాగా హత్తుకుంది.”ఇవాళ  నా చదువు నాకు మాత్రమె గొప్ప .కాకుంటే నా చెల్లికి ,మా అమ్మకి మాత్రమె గొప్ప ఇంకెవరికీ గొప్ప కాదు ”అని .సాహిత్యం మనుషులపై అంత ప్రభావాన్ని కలిగిస్తుందా అని నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిన కథ అది .

దాని తరువాత నేను అత్యంతగా  స్పందించి ,పరిశోదించీ రాసిన కథ ”దొంగల సంత” .ఈ కథ మటుకూ నేను ,రాయాలి అని రాసాను .నా భాద్యత అనుకుని రాసాను .అటువంటి విషయాలయితే నా సమస్త శక్తులూ వెచ్చించి తప్పనిసరిగా రాస్తాను.ఆ కథ తరువాత రాయాలి కదా అని నేను ఏ కథా  రాయలేదు .రాయడం మీద నాకు ఇష్టం కూడా లేదు .నన్ను నేను ఒక మంచి ప్రొఫెసర్ గానో ,సక్సెస్ ఫుల్ బిజినెస్ వుమన్ గానో చూసుకోడానికి ఇష్టపడతాను .ఒక రైటర్ గా మాత్రం కాదు .దాని పట్ల నాకే మాత్రం ఆకర్షణ  లేదు.రచయితల పట్ల విపరీతమైన గౌరవం,ఆకర్షణ వున్నా నన్ను నేను అట్లా చూసుకోవడాన్ని ఇష్టపడను .అది ఎందుకో ,ఆ వైరుధ్యమేమిటో నాక్కూడా తెలీదు .కాకపోతే ప్రస్తుతం వేరే పనేమీ లేదు కనుక నన్ను కదిలించిన మనుషుల గురించీ ,సంఘటనల గురించీ  రాస్తున్నాను.ఈ రాయడమనే ఆసక్తి ఎన్నాళ్ళు నాలో వుంటుందో కూడా తెలీదు .కానీ చదువుతూ మాత్రం వుంటాను జీవిత చివరి క్షణం వరకూ …