డైరీ

పతాక సన్నివేశం

ఏప్రిల్ 2015

నువ్వందరిలా కాదు తెలుసా ?

తెరలు తెరలుగా నవ్వొస్తోంది . ఈమాటతో మనుషులందరూ పడిపోతుంటారు, నాకు మాత్రం దిగులవుతుంది. ఇంకా ఎంత నటించాలి అందరిలా కావాలంటే అని! అందరూ నాటకాన్ని రక్తి కట్టించే పనిలో ఉంటారు, వాళ్ళ శక్తినంతా ధారపోసి మెరుగులు అద్దాలని చూస్తారు, ఎవరి పాత్రలో వాళ్ళు పక్కన వాళ్ళ పాత్రల్ని మెరుగులు దిద్దుతూ ఉంటారు. దుఖం లేని జీవితం, సంతోషం లేని ప్రేమ అన్నీ ఆనందంగా అనుభవిస్తున్నట్లు కనిపిస్తారు .

ఎప్పుడైనా విసుగు పుట్టి నేను రంగు వేసుకోకుండా రంగస్థలానికి వస్తానా… అంతే అందరూ ఒక్కింత గా వెక్కి వెక్కిఏడ్చేస్తారు. ఈ రంగే నీ జీవితం, నువ్వే రంగువి, అది లేని రోజు ఈ నాటకం సాగదు అని, అది సాగని రోజు మేము నాటకం కొనసాగించలేమని. వాళ్ళఏడుపులకి నాకు అనందం పొంగి సరే అంటాను. ఏదీ చేయడం చేతకాక పక్షవాతం వచ్చి పడుతున్న ఒక్కో భాగాన్ని చూసుకుంటాను. ఇక అప్పుడు రంగ స్థలం నుండి కిందకి నెట్టేస్తారు నిర్దయగా ప్రేమతో నన్ను. నేను కొండ చివరిదాకా పాక్కుంటూ వెళ్లి వెర్రిగా అరుస్తాను. వికృతమైన ధ్వనిలా కొండ మొత్తం మోగుతుంది.

*

ఓహ్ నా తండ్రీ! ఈ అనంతమైన సౌదర్యాన్ని భరింప మనుషులు లేరు. నగ్నమైన అపురూపమైన వెలుగు వాళ్ళని గుడ్డి వాళ్ళను చేస్తుంది. అనాచ్చాదిత అంతరంగం విశ్వమై కమ్మి వేస్తుంది, ఇక చాలు అని. నా లోపల నాడులన్నీ ఒక తరంగమై, అంతరంగమై రంగం సిద్ధం చేస్తాయి.

దేహం మాత్రం నన్ను నిలదీస్తుంది ఎందుకు నేనే త్యాగం చేయాలనీ? ఇక నాదగ్గర అముల్యమైనది, నాది మాత్రమే అన్నది నీవే కదా అంటాను. అది దిగులుగా చెప్తుంది, నువ్వు తొందరపడకు, నిన్ను నన్నూ ఒక్కటిగా చూసే వెలుగొకటి ఉంటుంది అని.

కొన్ని నిమిషాల తరువాత… ఒక నిమిషం నీవు మాత్రం మదిలో మెదుల్తావు.

 **** (*) ****