తమ కవిత్వానికి కావాల్సిన వస్తువుల విషయంలో కొత్త బాటలు పట్టకుండా కవులు తరచుగా బాగా నలిగిన పాత బాటలోనే గుంపుగా నడవడం కద్దు. కవులు తరచుగాను, తరతరాలుగాను వాడతున్న ఆ పాత వస్తువుల్లో మచ్చుకి కొన్ని.
1. బంధాలు-అనుబంధాలు
అమ్మ అన్నా, అన్న అన్నా, నాన్నన్నా ఇంకా ఇతర బంధుత్వాలన్నా పిచ్చి ప్రేమ. అమ్మ పెట్టిన ముద్ద, నాన్న కొట్టిన దెబ్బ, చెల్లితో పంచుకున్న జీడీ, మరదలు పెట్టిన ముద్దు, అన్న కొన్న చొక్కా ఇలాంటివి. జ్ఞాపకాల పుట్టని కదిలిస్తే కాగితం మీద పరుగులు తీసే నల్ల చీమల్లాంటి కవితాక్షరాలు వేలకు వేలు. ఇవికాక కన్నఊరన్నా, పుట్టిన దేశం అన్నా వల్లమాలిన అభిమానం.
సాధారణంగా హైదరాబాదులోనో, అమెరికాలోనో, ఇంకో పట్టణంలోనో, ఇంకో దేశంలోనో నివాసం ఏర్పరుచుకుని తాను పుట్టిన ఊరి విశేషాలు, అప్పటి గుర్తులు కాగితాల మీద వెదజల్లడం.
అప్పుడప్పుడూ తన ఊరు వెళ్ళి వచ్చి ఊరు బాగా మారిపోయిందనీ, వాళ్ళూ తనలాగే పెప్సీలు, కోకులు తాగుతున్నారని, అంబలి, రాగి జావ, నిమ్మ సోడలు వగైరాల జాడ లేదని, అత్మీయత అటకెక్కిందనీ, అందరి చూపు సిటీల వైపే ఉందనీ కడవల కొద్దీ అక్షరాల కన్నీరు కార్చడం.
కన్న తల్లిలాంటి ఊరి చెరువు పాడైపోయినా పట్టించుకునే నాధుడు లేడని అవేదన వ్యక్తం చెయ్యడం,చిన్నప్పటి మేస్టారు,శనక్కాయలు అమ్మే అవ్వ అలాగే ఉన్నారని అంత బాధలోనూ సంతోషం వ్యక్తం చెయ్యడంల్లాంటివి వాటిల్లో కొన్ని.
2. సూక్తి సుధ
సూక్తులంటేనూ అవి వల్లించడం అంటేనూ మహా ఇష్టం. అక్షరాల్లో గుదిగుచ్చిన సూక్తిముక్తావళి.
“అబద్ధానిది అపజయం
సత్యానికే జయం జయం!
ఇది నిజం నిజం!!”
“కళ్ళు తడవకుండా
దాటలేడెవడూ జీవితాన్ని!”
ఇలాంటి వేదాంతాలు.
4. నీతులు
పక్క దోవ పట్టిపోతున్న తన సాటి సోదరసోదరీమణులని తన కవిత్వంతో దోవనబెట్టాలని కంకణం కట్టుకున్న కరుణామయత్వం.
“చూడరా సోదరా! నీతి న్యాయం ఎటు దారితప్పాయో?
కళ్ళు తెరవరా తమ్ముడా!
వెళ్ళి వెతకరా!
కుళ్ళి కంపుకొడుతోన్న సమాజాన్ని చూడరా!
లేవరా సోదరా! కలిసి సాగరా!”
ఇలాంటి నీతి బోధలు.
5. కన్నెర్ర
ఎక్కడ అన్యాయం, అవినీతి, అక్రమం కనిపించినా ఆవేశం, ఆక్రోశం తో పూనకం రావడం. ఆ ఆవేశానికి నిరంతరం ఆజ్యం పోయగలిగేవి దేశ విదేశీ వార్తాకథనాలు. యుద్ధాలనించీ అబద్ధాలదాకా విస్తరించిన వాటి మంటల భుగ భుగల మీద వేడి వేడి బజ్జీల్లాంటి పజ్జాలను వండి తిరిగి ఆ వార్తా పత్రికలలోనే తెల్లవారేసరికల్లా వడ్డించడం.
6. భావుకత
చెట్టుని, గుట్టని, పుట్టని దేన్ని చూసినా తన్మయమైపోవడం. అన్నింటిలోనూ దివ్యత్వాన్ని దర్శించడం. వెన్నెల్లో స్నానాలు. మబ్బుల్లో బబ్బోడాలు. వాన చినుకుల షవర్లు. కొమ్మల్లో తూగడాలు.
అన్నిటా అంతటా సౌందర్యమే. బైర్లు కమ్మే అందమే.
7. మోహాలు, వ్యామోహాలు, ప్రేమలు, విఫల ప్రేమలు
స్త్రీ పురుషుల మధ్య అజరామర ప్రేమలు, ఆరాధనలు, విరహాలు, ఆరాటాలు, విఫల ప్రేమలు, సఫల ప్రేమలు, సక్రమ ప్రేమలు, అక్రమ ప్రేమలు. పేజీల కొద్దీ కవితల మాలలల్లి తన ప్రేయసి/ప్రియుడికే గాక చదివే పాఠకుడి హృదయం మీదకు కవితాబాకులు విసరడం.
8. పీడిత వర్గం-తిట్లు-శాపనార్ధాలు
ఏదో ఒక వర్గం తరతరాలుగా అన్యాయానికి గురి అవుతోన్న బాధిత వర్గం. దోచేవాడు. దోచుకోబడేవాడు. అత్మ గౌరవం కోసం పోరాటం. అందుకోసం ఆధిపత్య వర్గం మీద తిట్ల దాడి, శాపనార్ధాల జడివాన.
9. దేశ భక్తి-ప్రాచీన వైభవం
గతమంతా ఘనకీర్తి.
మన దేశం. మన గొప్పదనం. మన సంస్కృతి, మన పండుగలు, మన కళలు.
అంతా పారవశ్యం.
ఇవీ క్లుప్తంగా కొన్ని ముఖ్యమైన పాత సామాన్లు.
అయితే కొంతమంది అలవాటుగా పాత సామాన్లకి ఉల్లిపాయలు సంపాదించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. ప్రతి రోజూ కాసిని సామాన్లైనా వెతికి తీసి పక్కన పెట్టందే నిద్రపట్టని వారుంటారు. మీరోసారి పాత సామాన్లు వెయ్యగానే వారు మీ జాడ పసిగట్టి తమ సంఘంలో కలుపుకుంటారు. అప్పటినించీ ఎక్కడ కనబడినా ఈమధ్య ఉల్లిపాయలేవీ సంపాదిస్తున్నట్టు లేదు, పాత సామాన్లు పోగు చెయ్యడం లేదూ? అని నిష్టూరంగా ప్రశ్నిస్తారు. వారి మాయలో పడకండి. ఉల్లిపాయల కోసమే పాత సామాన్లు పోగుచేయడం హాస్యాస్పదం అన్న విషయం గుర్తించండి.
కవితాసామాగ్రి పాతదే అయినప్పుడు తెలిసిన విషయమే కాబట్టి క్లుప్తంగా చెప్పండి. క్లుప్తంగా అంటే తుప్పు పట్టిన హైకూ బాకులు పట్టుకు బయలుదేరమని కాదు.నానీ గాడి తోడూ అవసరం లేదు.ఏ రెక్కలూ కట్టుకు ఎగరబోవక్కర లేదు. సాధ్యమైనంత తక్కువ పదాల్లో భావం వ్యక్తం చేయగలిగితే చాలు.
వస్తువు పాతదైనప్పుడు కొత్తగా చెప్పండి.
కొత్త పనిముట్లు వాడి కొత్త కోణంలో చూపండి.
పాత వస్తువులతో ఎప్పుడూ విసిగించకుండా కొత్త వస్తువులు కూడా సంపాదిస్తూ ఉండండి.
కొత్తదైనా చెప్పండి.
కొత్తగానైనా చెప్పండి.
ఏది చెప్పినా మితంగా సూటిగా చెప్పండి.
ముఖ్యంగా పాత సామాన్లకి ఉల్లిపాయలు! అన్న కేక విని పరుగెత్తిపోకండి.
**** (*) ****
కాదేది కవితనర్హం అని శ్రీ శ్రీ ప్రకటించిన దాన్నే అందరూ అదే పాటించారు రాను రాను అదే ఒక వెగటైపొయింది , మీరన్నట్టూ చెప్పదలుచుకుంది కొత్తగా చెప్పాలి సూటిగా సుత్తి లేకుండా
‘కొత్తదైనా చెప్పండి.
కొత్తగానైనా చెప్పండి…’
ఈ కాలపు కవిత్వానికున్న బలహీనతలను చెప్పే సారూ.
ఇంద్రాణి గారూ, పాత సామాన్ల లిస్టులో మూడోది తప్పించుకుంది. బహుశా: ఉగాది వగైరా పండుగ కవి సమ్మేళనాలా! మరో మాట..మారకంలో ఉల్లిపాయలనే ఎందుకు వాడతారో! ఇంతకీ కొత్తదనం కోసం కవులు ఆడే వెదుకులాట పాతదే…కాదా?
If you want to use a recipe to write Telugu poetry, you can follow this:Link