యెవ్వరు చూడకుండా అప్పుడప్పుడు నీ బుగ్గపై ముద్దుపెట్టుకొన్నట్టు రాత్రంతా కోనసీమ గాలి నన్ను అలా ముద్దుపెట్టుకొంటూనే వుంది. భలే అల్లరి గిలిగింత. నీకు అలానే వుంటుందా నా ముద్దు. చూడు యిలా అడగాలి నిన్ను… నువ్వపుడు చెప్పావ్ కదా. అఫ్ కోర్స్ నీ కళ్ళు చెపుతాయనుకో. యీ గాలిలోని వొక మోహ పారవశ్యపు పచ్చి సుగంధంలా వొళ్ళంతా కమ్ముకొంటుంటే నువ్వు నాతో యిక్కడకి వచ్చి వుంటే ఆ గాఢత మరింత రెట్టింపు అయేది కదా. కాని నువ్వు Thames నది జీవన సౌందర్యాన్ని డాక్యు మెంట్ చెయ్యడానికి వెళ్ళావు. భలే కదా మనిద్దరం రెండు నదుల జీవనాన్ని చూస్తున్నాం.
వుదయమే పెసరట్టు వుప్మా పెట్టారు. అల్లం పచ్చడితో. యిక్కడ రోడ్ పక్కన పెసరట్టులని వేస్తారు. చిన్నిచిన్ని ముక్కలుగా తరిగిన అల్లం, వుల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర ఆ అట్టు మీద జల్లుతారు. యేమి రుచిగా వుంటాయో. జీడిపప్పు, క్యారెట్ యిలా కనిపించినవన్నీ వేస్తారు కొన్ని సిటీస్ లోని హోటల్స్ లో. జీడిపప్పు, క్యారెట్ లాంటివి పెసరట్టుకి సూట్ కావనిపిస్తుంది నా టేస్ట్ బడ్స్ కి. కాంబినేషన్స్ రుచిని పెంచాలి. జీవనపుతోడైనా జీవితపు ఆరోగ్యమైనా. పెసరట్టు వుప్మా కలిపి తిన్నాక యింక లంచ్ కూడా వద్దనిపిస్తుంది. అంత హెవీగా వుంటుంది. లేజీగా హాయిగా ఆ గోదావరి ప్రవాహాన్ని కళ్ళంతా నింపుకోవాలనుంది.
యీ వూరొచ్చి రెండు రోజులు అయింది. షూటింగ్. అన్నాచెల్లెళ్ళ అనుబంధంపై పాట. యీ మధ్య యిలాంటి సందర్భాలపై పాటలు లేవు. యీ అన్నా చెల్లెళ్ళ గట్టు దగ్గర బాగుంటుందంటే వచ్చాం. గుడిలో, తోటల్లో యిలా సాగుతుంది. యెక్కడినుండో తాటి పండు గారెలు వండుతోన్న తీపి వాసన. అంతే మా యూనిట్ వాళ్ళంతా ఆ సువాసనకి వశమైపోయి అవి తింటే తప్పా పని చెయ్యలేం అంటూ తీయని పని విరామం ప్రకటించేసారు. యీసారి యీ షూటింగ్ అంతా మూడు పెసరెట్లు, ఆరు గారెల్లా వుందనుకో.
మాకు యిక్కడ ఆతిధ్యం యిస్తున్న వాళ్ళ యింటి కోడలు ఆషాడంలో వొకే గడపలో వుండకూడదని పుట్టింటికి వెళ్ళిన ఆ కొత్తకోడలు తిరిగి అత్తగారింటికి వచ్చింది. యెడమ చెయ్యంతా పండిన గోరింటాకు. కాళ్ళకి పసుపు. తలస్నానం చేసిన ఆ తడి జుట్టుని చిక్కు తీసుకొంటూ పలకరింపుగా నవ్వింది. జుట్టు చిక్కుతీసుకోవటమంటే భలే సరదా నాకు. కాని నా జుట్టు చిక్కుపడదు నీకు తెలుసుకదా. చిక్కుతీసుకొంటుంటే ఆలోచనల చిక్కుముడులేవో విప్పుకొంటున్నట్టుంటుంది.
సాయంత్రం పేరంటం వుందంటా. రమ్మని పిలిచిందా అమ్మాయి. అంతా కొత్తగా వుండే ఆ కొత్త కోడలికి తన యిరుగుపొరుగు పరిచయం అవ్వటం, వాళ్ళ ల్లోంచే కొత్త స్నేహితులు యేర్పడతారు ఆమెకి. సోషల్ మీడియా లేని రోజుల్లో యిలాంటి పేరంటాలే కదా స్నేహవారధులు. యిప్పుడు ఆ పూజలు, పేరంటాలు పేస్ బుక్ నిండా కనిపిస్తుంటాయి. రాఖీపౌర్ణమి రోజు అన్నాచెల్లెళ్ళ పిక్చర్స్ యిలా యెప్పుడూ వొక పండగ జరుపుకొంటున్న సంతోషపు పిక్చర్స్ చూస్తుంటాం.
రుతువు యేదైనా సోషలైజ్ అవ్వటానికి మనకున్నన్ని పండగలు మరెక్కడా లేవు కదా ప్రపంచంలో. ప్రధానంగా మనది వ్యవసాయక దేశం కాబట్టి మబ్బు కమ్ముకున్నా, తేలిపోయినా, సూరీడు వెలిగినా మసకేసినా మనకి పండగే. వొక్కో పండగకి రకరకాల తీయని వంటకాలు.
కానీ శ్రావణ శుక్రవారాలంటే తిరగమోత పెట్టిన శెనగలు యెప్పుడెప్పుడిస్తారనే యెదురుచూపు పిల్లలందరిలో. నానపెట్టిన కొమ్ముశెనగలని వొక తెల్లనినూలు బట్టలో చుట్టి వుంచితే అవి మొలకలెయ్యటం చిన్ననాటి లేత ఆశ్చర్యం. అసలు శ్రావణం అంటేనే కోలాహలం. కురవాలా వద్దా అనే కరిమబ్బుల వూరింపు. అంతలోనే తెల్లని తేమ నిండిన ఆకాశం. పనిలో వున్న అమ్మకళ్ళు కప్పి తొట్టెలోని నీళ్ళని నేల మీదకి చిలకరించే పాపాయిలా నాలుగు జల్లులు జల్లుతుంది శ్రావణ మేఘం. ఆ జల్లు చూసి హడావిడిగా ఆరేసిన బట్టల కోసం బయటకి పరిగెత్తారో లేదో అమ్మ పాదాల అలికిడి వింటూనే నవ్వుని పిడత నోటిలోనే నొక్కేసుకొంటూ పారిపోయే పాపాయిలా మేఘమాలికలు తమ జల్లుల చిలకరింత ఆపేసి యెక్కడ దొంగలు అక్కడే గప్ చిప్ లా నవ్వుని వెండిఅంచుల చూపుల్లో దాచేసుకుంటాయి. మనందరికీ రోజువారి జీవితంలో యెదురయ్యే చిన్నిచిన్ని చికాకులు మనస్పర్ధలు, నిరాశలు అచ్చు యీ శ్రావణ మేఘాల్లాంటివే. మనిషికెంత భరోసానో కదా, యివన్నీ తాత్కాలికమే అనే వో లలితమైన ఆనవాలుండటం.
అటు సముద్రం. యిటు గోదావరి. వేటి నీళ్ళ రంగు వాటిదే. అసలా సంగమమే అపురూపం. అద్భుతాల్లోకెల్లా అద్భుతం. యెక్కడెక్కడ నుంచో ప్రవహించే యీ గోదావరి ప్రవాహం యెన్నెన్ని ప్రేమ కథలని విందో. యిక్కడ గాలిలో ఆ ప్రేమసుగంధం తేలుతోంది. ప్రేమని యెలాగైనా సొంతం చేసుకోవాలనుకొనే వాళ్ళని యిక్కడకి తీసుకొస్తే, యీ గాలిని పీల్చితే సొంతమనే భావనని వూఫ్ మని వూదేస్తుంది. విముక్త హృదయపు కవాటాలు వొక సుప్రేమని శ్వాసించటం మొదలుపెట్టొచ్చు.
వానకాలపు తూనీగల్లా అనేకానేక జ్ఞాపకాలు, ఆలోచనలు రివ్వురివ్వు మంటున్నాయి. గోదావరిసాగర సంగమం పొడుగునా మిలమిలలాడుతోంది శ్రావణపౌర్ణమి. దోసిట్లోకి తీసుకొన్నసంగమనీటిలో వెన్నెల తళుకు పువ్వులుపువ్వులుగా. అద్దుడు కాగితం యింకుని పీల్చుకొన్నట్టుగా యీ వెన్నెల నన్ను లాక్కుంటుంది… మనసంతా నువ్వే ప్రేమోద్వేగంతో.
**** (*) ****
అబ్బా మళ్లీ మా గోదావరి ఒడ్డున తీరిగ్గా , హాయిగా కూర్చుని ఆ ప్రేమ సుగంధాన్ని పీలుస్తున్న అనుభూతి కలుగుతోంది. అన్నాచెల్లెళ్ళ గట్టు అంటూ మీరలా ఊరిస్తుంటే అంతర్వేది గుర్తొస్తోంది. కాసేపలా మనసుని కోనసీమలో తిప్పినందుకు మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పుకోవాలి?
Prasuna Ravindran garu, అవునండి గోదావరి అలానే వుంటుంది వెళ్లి అంతా మరొక్కసారి తిరిగి గోదావరి వూసులు మాతో
పంచుకోండి. Thank you.
ఇంక లేట్ చేయను. గోదావరికి ఇప్పటికైనా ఓసారి అలా వెళ్ళి రావాలి..
Yellow Ribbon.. Beautiful.. As usual..
V. Mallikarjun garu, బయలుదేరారా Thank you.
అందమైన ప్రేమలేఖ! అడుగడుగునా భావుకత నింపి రాశారు.
ప్రతిపదంలోనూ కవిత్వం. కారణం ప్రేమేనంటారా?
“నీకు అలానే వుంటుందా నా ముద్దు. చూడు యిలా అడగాలి నిన్ను… నువ్వపుడు చెప్పవ్ కదా. అఫ్ కోర్స్ నీ కళ్ళు చెపుతాయనుకో”
“యెడమ చెయ్యంతా పండిన గోరింటాకు. కాళ్ళకి పసుపు.” – ఇవి బాగా నచ్చాయి నాకు.
అవినేని భాస్కర్ గారు, కారణం యేమో ప్రేమేనేమో… మీకు నచ్చినవి పంచుకున్నందుకు Thank you.
మీ ఆర్టికల్ చదివినంతసేపు వొక ప్రేమ భావన మనసంతా నిండిపోతుంది,వానాకాలంలో రివ్వున ఎగిరే తూనీగల్ని భావవ్యకీకరణ చేయడం చాలా నచ్చింది కుప్పిలి పద్మ గారు.
తిలక్ బొమ్మరాజు గారు. తూనీగలు నచ్చాయా… Thank you .
“చిన్ననాటి లేత ఆశ్చర్యం” – భలే పద్మా
మమత భలే
మమత భలే
;
మీ వర్ణన, పద ప్రయోగం అద్భుతం. మీరు చూసే ప్రాంతాల్లోకి, భావ ప్రపంచం లోకి అక్షరాలతో పాటు మమ్మల్ని కుడా తీసుకెళ్ళడం మీకే సాధ్యం. థాంక్స్ పద్మ గారు.