వ్యాసాలు

అంతర్వేదం

సెప్టెంబర్ 2015

‘అంతర్వేది’ అనే పేరు తలచుకోగానే అంతర్ వేదం, అంతరంగంలోని వేదం అన్న మాటలతో పాటు – అంతరువు ఏది? (ప్రపంచానికీ నాకూ మధ్య) అన్న భావం కలుగుతుంది. అందుకనే అంతర్వేది అనే పేరులో ఏదో ఆధ్యాత్మిక భావన వినిపిస్తుంది.

చిన్నప్పటి నించీ ఒక నది సముద్రంలో కలవడం ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి, ఆకాంక్ష. ఇంత పెద్ద జీవనది అయిన గోదావరి సముద్రంలో కలిసే చోట కొన్ని మైళ్ళ దూరం పాటు సముద్రంలో కూడా మంచి నీళ్ళే ఉంటాయిట అన్న ఆసక్తికరమైన సంగతి చిన్నప్పట్నించీ వింటూ ఉండటం కూడా ఈ ప్రదేశాన్ని చూడాలన్న కుతూహలాన్ని పెంచింది (ఇది తప్పని – కనీసం వరద లేని వేసవి కాలంలో – అక్కడికి వెళ్ళాక తెలిసింది).

గోదావరి గురించి నాకున్న పరిమితానుభవం గురించి…
చిన్నప్పుడు ఒంగోలు నుంచి విశాఖపట్టణం వైపు రైల్లో వెళ్ళేప్పుడు గోదావరి బ్రిడ్జిని దాటిన అనుభవం ఉంది. గోదావరి రైలు బ్రిడ్జి కి ఇటుప్రక్క పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు, బ్రిడ్జి దాటితే అటుప్రక్క తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి – ఇదీ నాకు తెలిసినది.

కానీ ఇప్పుడు తిరపతి నించి రాజమండ్రికి బస్సులో వచ్చేటప్పుడు, గోదావరిని రెండుసార్లు చూసే అవకాశం కలిగింది. ఎందుకంటే హైవే (స్వర్ణ చతుర్భుజి) లో వేసిన రోడ్డు రాజమండ్రికి కొన్ని కిలోమీటర్లు దక్షిణంగా గోదావరి నదిని దాటుతుంది. అంటే రైలు మార్గం తాడేపల్లి గూడెం, నిడదవోలు, కొవ్వూరుల రూట్ లో వచ్చి గోదావరిని దాటితే – స్వర్ణ చతుర్భుజి రోడ్డు మార్గం మాత్రం తాడేపల్లి గూడెం ప్రాంతాల్లో దక్షిణం వైపుగా మళ్ళి తణుకు మీదుగా వచ్చి గోదావరిని దాటుతుంది. కానీ అప్పటికే గోదావరి రెండు పాయలుగా చీలి ఉంటుంది.
తూర్పు వైపు ఉన్న పాయని ‘గౌతమీ గోదావరి’ అని పశ్చిమం వైపు ఉన్న పాయని ‘వశిష్ట గోదావరి’ అని పిలుస్తారు. గోదావరి జిల్లాలని వేరు చేస్తున్నవి – గోదావరి నదీ(ధవళేశ్వరం దాకా), ఆ తరవాత వశిష్ట పాయలే. అంటే పశ్చిమ గోదావరి జిల్లా నించి తూర్పు గోదావరి జిల్లాలోకి హైవే రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ముందుగా వశిష్ట గోదావరిని దాటాలి. అప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తాం. ఆ తర్వాత గౌతమీ గోదావరి పాయని దాటి కొంచెం ఉత్తరం వైపుగా ప్రయాణిస్తే రాజమండ్రి చేరతాం.

ఈ వశిష్ట, గౌతమి పాయల మధ్య ఉన్న రావులపాలెం మీదుగా హైవే వెళుతుంది. ఈ ఊరుని ‘కోనసీమ ముఖద్వారం’ అని పిలుస్తారు. కాబట్టి రైల్లో అయితే గోదావరిని దాటే అవకాశం ఒకసారే కాని ఈ హైవే మీద రాజమండ్రికి వెళితే వశిష్టని, గౌతమిని కూడా చూడొచ్చు!

సరే రాజమండ్రి లో దిగాక – ఇంకేముంది బస్ స్టాండ్ నించి తిన్నగా అంతర్వేది బస్ ఎక్కడమేగా – అని అమాయకంగా, నిర్లక్ష్యంగా వెళ్ళాను పొద్దున్నే ఆరు గంటలకి. ‘అంతర్వేదికి బస్సు ఏ ప్లాట్ ఫారమ్ మీదికి వస్తుంది?’ అని ధాటీగా అడుగుతున్న నన్ను చూసి నీళ్ళు నమిలాడు అక్కడ ఎంక్వయిరీలో కూర్చుని ఉన్న యువకుడు. ఆ ఆవరణలోనే ఒక ప్రక్కగా వేరేగా ఉన్న ఇంకో చిన్న బస్టాండ్ వైపు చూపిస్తూ ‘కాకినాడ బస్సు’ అంటూ ఏదో గొణిగాడు.

సరే అనుకుంటూ ఒక మూలగా ఉన్న ఆ బుల్లి బస్టాండ్ దగ్గరకి వెళ్ళి అడిగితే ఒకాయన ‘మీరు రాజోలు వెళ్ళి అక్కడ నుండి వేరే బస్సులో వెళ్ళాలి’ అన్నాడు. మళ్ళీ వెనక్కొచ్చి ఎంక్వయిరీ కౌంటర్ యువకుడికి విషయం తెలియచేయాలని అతని దగ్గరకి వెళ్ళగానే అతడు హంబుల్ గా “సార్ నాకు తెలియక చెప్పాను, లోపల మా వాళ్ళని కనుక్కున్నాను. మీరు రాజోలు బస్ ఎక్కాలి ఫలానా ప్లాట్ ఫారం మీద” అన్నాడు. ‘మీకు విషయం తెలియచేద్దామనే’ వచ్చాను అని నవ్వి రాజోలు బస్సు ఎక్కాను. బస్ కండక్టర్ “రాజోలు వెళ్ళి అక్కడ నించి సఖినేటిపల్లి వెళ్ళే బస్ పట్టుకుని మధ్యలో మలికిపురంలో దిగి అక్కడ నించి ఆటోలో వెళ్ళాల్సిందే” అని వివరించాడు.

సరే, ఇక రాజమండ్రిలో బయల్దేరిన రాజోలు బస్ బుర్రిలంక, కడియపు లంక, చెముడు లంకలను దాటి దక్షిణంవైపు గా ప్రయాణిస్తూ గౌతమీ గోదావరి పాయని దాటింది. అంటే రావులపాలెం అన్నమాట. రావులపాలెం దాటి పశ్చిమంగా ప్రయాణించి వశిష్ట గోదావరి పాయని చేరడానికి కొంచెం ముందే మళ్ళీ దక్షిణం వైపుకు తిరిగింది బస్సు. ఈ లెఫ్ట్ టర్న్ తీసుకున్న ప్రదేశం పేరు ఈతకోట. ఇహ అక్కడ్నించీ దాదాపు గోదావరికి సమాంతరంగా దక్షిణం వైపుకే ప్రయాణిస్తూ గంటి, గంటిపెదపూడి (జి పెదపూడి), తాటిపాక మీదుగా రాజోలు చేరింది. అన్నీ చిన్న ఊర్లే అని చెప్పొచ్చు. తాటిపాక మాత్రం చిన్న టౌన్. రాజోలు అంతకన్నా కొంచెం పెద్ద టౌన్.

రాజోలు నించి అంతర్వేదికి బస్‌ సౌకర్యం లేదు. బహుశా రోజుకొకటి లేదా రెండు బస్సులు ఉన్నాయేమో! ఎవర్నడిగినా సఖినేటిపల్లి వెళ్ళే బస్సు ఎక్కి మధ్యలో మలికిపురం అనే ఊళ్ళో దిగి అక్కణ్ణించి ఆటోలో వెళ్ళమన్నారు. సరే, అలాగే వెళ్ళి మలికిపురం చేరాను. అక్కడ షేర్ ఆటో ఎక్కాను. (మామూలుగా ఆంధ్రాలో అన్ని ఊళ్ళల్లో కుక్కినట్లే ఇక్కడ కూడా – 20 కి.మీ ప్రయాణం కాబట్టి ఛార్జి 20 రూపాయలు. జనం నిండిందాకా ఆటో కదలదు కాబట్టి వేళ కాని వేళలో మలికిపురం చేరామంటే ఇరుక్కుపోతాం)

అదృష్టవశాత్తూ నేను అరగంట కన్నా ఎక్కువ వేచి ఉండనక్కరలేకుండానే పదకొండు గంటలకంతా అంతర్వేదికి చేరిపోయాను – అరటి, కొబ్బరి ఇంకా ఎన్నో పచ్చపచ్చని ఫల పుష్ప వృక్ష జాతులు దారికిరుప్రక్కలా కన్నుల పండువ చేస్తుండగా చాలా చిన్నచిన్నగోదారిపల్లెల గుండా ప్రయాణం. దారి పొడుగూతా గోదారి కాల్వ – కాటన్ మహాశయుణ్ణి గుర్తు చేస్తూ.

***

అంతర్వేది. చిన్న పల్లెటూరు. గాలిలో ఏదో ప్రత్యేకత ఉన్నట్లే తోచింది – బహుశా నా మనసులో ఉన్న భావనే అయిఉండవచ్చు ! బస్టాండ్ ఉండేంత పెద్ద ఊరు కాదు. లక్ష్మీనరసింహస్వామి గుడి బయట పందిళ్ళు వేసి ఉన్న స్థలంలో ఆటో ఆగింది. ప్రాకారం దాటి గుడి లోపలకి వెళ్ళీ వెళ్ళగానే చుట్టూ తిరిగాను. నలువైపులా నాలుగు ద్వారాలు. దక్షిణం, పశ్చిమం ద్వారాల నుంచి బయటికి చూస్తే విశాలమైన ప్రదేశం – దూరంగా నదీ పరివాహిక ప్రాంతం. రక్తకుల్య అనే నది కూడా ఇక్కడ ఉంది. ఈ నదికి స్థల పురాణంలో ఒక ప్రత్యేక పాత్ర ఉందిట. లక్ష్మీనరసింహస్వామి గుడికి ఐదారు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. కృష్ణమ్మ అనే జమిందారు దీనిని పునరుద్ధరించాడు.

ఈ గుడి కన్నా పురాతనమైన నీలకంఠేశ్వరస్వామి గుడి (చాలా చిన్నది) దీనికి కొంచెం దూరంలోనే ఉంది. క్షేత్ర పాలకుడైన ఈ నీలకంఠేశ్వరస్వామి గర్భగుడి ముఖద్వారం పశ్చిమం వైపుకు ఉండటం ఒక ప్రత్యేకతట.

అన్ని గుళ్ళ మాదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడిలో కూడా స్పెషల్ దర్శనం టిక్కెట్టంటూ వేరేగా ఉంది. (ఇది కొన్న వాళ్ళకే లక్ష్మీ నరసింహస్వామిని దగ్గరగా చూసే అవకాశం – మిగతా వారిని కొన్ని అడుగుల ముందుగా ఆపేస్తారు) కానీ జనం చాలా తక్కువగా ఉండటం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది – వాతావరణంలో కమర్షియల్ గోల లేదు. గుడి లోపల నలువైపులా చక్కని దారి, చెట్లు. ఈశాన్య మూలలో ఒక చిన్న బావి. దానిలో ఒక పెద్ద తాబేలు, కొన్ని చిన్న తాబేళ్ళు.

మధ్యాహ్నపు ఎండ బయట కారం దంచుతున్నట్లుంది – అగ్నివర్షంట – ఆరోజు (మే 23, 2015) ఉష్ణోగ్రత నలభై ఎనిమిది దాటిందేమో తూ.గో లో బహుశా. కానీ లోపల గుడిలో భరించలేనంత వేడిగా ఏం లేదు. గుడి వెనక ఉన్న ఒక హాలులో నిత్యాన్నదాన పథకం క్రింద భోజనం పెడుతున్నారు. ఇది రోజూ జరిగే కార్యక్రమమేనట. తిన్న వాళ్ళందరూ కంట్రిబ్యూట్ చేసే నిధుల నించే ఈ కార్యక్రమం నడుస్తుందట. ఎవరైనా ఒక్కోరోజు పూర్తిగా స్పాన్సర్ చేసేవాళ్ళు కూడా ఉంటారట. ఆ రోజు ఎవరో స్పాన్సర్ చేసినట్లున్నారు – బ్రహ్మాండమైన గోదావరి జిల్లా భోజనాన్ని కొసరి కొసరి మరీ వడ్డిస్తున్నారు.

తీవ్రమైన వేసవి కాబట్టి జనం ఎవరూ కనపడుతున్నట్లు లేరు. ఆలయోద్యోగులు తప్ప. భోజనమయ్యాక బావిలో తాబేళ్ళని కాసేపు చూసి గుడి ఆవరణలో కూర్చున్నాను. అప్పుడప్పుడూ చల్లని గాలి వీచి బయటి ఎండని మరిపిస్తోంది. ఆలయంలో దాదాపుగా జనం లేనట్లే.

ఇంతలో ఒక హరికథా కళాకారిణి – మంధా నాగమణి గారట యానాం నించి వచ్చారు – ఆ మిట్ట మధ్యాహ్నం పూట “కృష్ణ రాయబారం” కథ చెప్పడం ఆరంభించారు.

లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఆస్థాన కళాకారుడు మృదంగంతోనూ, బయట నుంచి వచ్చిన వేరొకరు హార్మోనియంతోనూ నాగమణి గారికి సహకారం అందించారు. మైక్ సెటప్ చేయడానికి ముందు ఆవిడ కొన్ని కీర్తనలు చక్కగా ఆలపిస్తుంటే (పన్నెండున్నరనించి ఒంటి గంట దాకా) ‘ఎవరో గాయని అయిన భక్తురాలు పాటలు పాడుతున్నారేమో’ అనుకున్నాను. తర్వాత సంప్రదాయానుసారం చిరతలు, పూలమాల ధరించి ఒంటి గంట నించీ దాదాపు రెండున్నరదాకా ఖంగుమనే కంఠంతో హరికథ చెప్పారు – ఎక్కడా ‘గొంతు’ దాచుకున్నట్లు అనిపించకుండా.
‘ఇదేమిటి ఇంత మండు వేసవి మధ్యాహ్నంలో హరికథా?’ అని అక్కడున్న ఆలయ ఉద్యోగిని అడిగితే ఆయన నవ్వి ‘అవునండీ ఇక్కడ ప్రతి శనివారం మధ్యాహ్నం ఉంటుంది – వేసవికేం ఎక్సెప్షన్ లేదు’ అన్నారు. బహుశా సాయంత్రం ఏర్పాటు చేస్తే జనం తిరిగి వెళ్ళడానికి ఇబ్బంది పడతారని మధ్యాహ్నం ఏర్పాటు చేశారేమో ! (అంతర్వేది చాలా మారుమూల పల్లెటూరు, రాకపోకలకి రోడ్లు ఇరుకుగా ఉంటాయి) మొత్తానికి మధ్యలో ‘గోవిందోహారి’ చెప్పేవాళ్ళు, చివర్లో చప్పట్లు కొట్టేవాళ్ళు లేకపోయినా నాగమణి గారు నిరుత్సాహపడినట్లు కనిపించకుండా మధ్యమధ్యలో చక్కని జోక్స్ చెప్తూ హరికథాకాలక్షేపం చేశారు.

రాయబారం వెళ్ళేముందు కృష్ణుడితో ద్రౌపది చెప్పిన తిక్కన గారి పద్యం “ఇవి దుస్ససేను వ్రేళ్ళందవిలి” – ఆ రోజుల్లోనే క్లోజప్ షాట్ ని ఈ పద్యం ద్వారా తిక్కన స్ఫురింపచేశాడు అని శ్రీశ్రీ పొగిడినది – పాడతారేమోనని ఆశగా ఎదురు చూశాను. కాని పాడలేదు. రాయబార ఘట్టంలో ప్రసిద్ధమైన పాండవోద్యోగ నాటక పద్యాలు (జండాపై కపిరాజు, చెల్లియో చెల్లకో) అన్నీ పాడారు.

సాగర సంగమంకి ఎలా వెళ్ళాలి అని గుళ్ళో ఇద్దరు ముగ్గుర్నడిగితే దారి కన్నా జాగ్రత్తలు ఎక్కువగా చెప్పారు. చాలా లోతు ఉంటుంది, ప్రమాదాలు జరిగాయి వగైరా..
నాలుగున్నరకి బయల్దేరి ఊళ్లోకి వచ్చి ‘సాగరసంగమం ఎక్కడండీ?’ అని ఒకాయన్ని అడిగితే ‘అలా శివాలయం ప్రక్కనుండి తిన్నగా వెళ్ళిపోండి’ అంటూ ‘కాళ్ళు కూడా కడుక్కోవద్దండీ దయచేసి – ఎక్కడ ఎంత లోతుంటుందో ఎవరికీ తెలియదు’ అని భయపెట్టారు. ఆయన చెప్పిన శివాలయం అక్కడకి చాలా దగ్గరే – ఇదే క్షేత్రపాలకుడైన నీలకంఠేశ్వర స్వామి ఆలయం. అక్కడకి వెళ్ళాక ‘సాగరమునకు దారి’ అన్న బోర్డు చూసి మలుపులేమీ తిరక్కుండా బోర్డులో సూచించిన దారి వైపు వెళ్ళాను. ఒక కిలోమీటరుకి పైగానే నడక. తాటి చెట్లూ, మధ్యలో చిన్న చిన్న చెరువుల లాంటి గుంటలూ, ఓయన్జీసి వాళ్ల పెట్రోల్ బావుల వాసనలు, దూరంగా వినిపిస్తూ క్రమంగా దగ్గరవుతున్న సముద్రపు హోరు. సముద్రం చాలా ఉద్ధృతంగానే ఉన్నట్లనిపించింది. కొద్దిమంది స్నానాలు చేస్తున్నారు. ‘మరీ కాళ్ళు కూడా తడపనంత ప్రమాదం ఏముందబ్బా ఇక్కడ’ అని అనుకున్నాను.

‘ఇంతకీ గోదావరి ఎటున్నట్లు? ఎక్కడ కలుస్తోంది సముద్రంలో?’ అని ఆలోచించుకుంటూ ‘పోనీ అలా తీరం వెంబడే నడుచుకుంటూ పోదామా’ అనుకున్నాను. ఉత్తరం వైపు (ఇది ఈశాన్యం – సముద్రం దగ్గిర దిక్కులు తెలీక చాలా గందరగోళం గా ఉంటుంది) చూస్తే అనంతమైన సముద్రం. మరో వైపు మాత్రం తీరం వంపు తిరిగి ఉంది. కాబట్టి బహుశా గోదారి అటువైపు ఉండవచ్చు అనిపించింది. కొంచెం సేపటికి ఈ ఆలోచనలన్నీ కట్టిపెట్టి అక్కడే చాలాసేపు గడిపాను. చిరుచీకట్లు పడేటప్పుడు మళ్ళీ నడుస్తూ బయలుదేరి గుడికి వెళ్ళకుండా మలికిపురం వెళ్ళే రోడ్డు లోకి తిరిగేసి అలా రెండు కిలోమీటర్లు నడుస్తూ పోయాను ఆటో దొరికిందాకా.

ఆటోలో ఒక రైతు సోదరుడితో పరిచయం. ఆయన పేరు ప్రభోజీ! ‘ఇలాంటి పేరు ఎక్కడా వినలేదండీ’ అంటే ‘విశాఖపట్టణం జిల్లాలో కసింకోట అనే ఊళ్ళో ఉన్న ఒక ముస్లిం గురూజీని కొలిచే వారు ఇలాంటి పేర్లు పెట్టుకుంటారని చెప్పాడు. గోదావరి జిల్లాల్లో చాలా మంది హిందువులు (ప్రసిద్ధ పుణ్యక్షేత్ర ఆలయ పూజారులతో సహా) ఈయనని ఆరాధిస్తారట – హిందూ మతాన్ని పాటిస్తూనే.

మలికిపురంలో ఆటో దిగి మళ్ళీ ఇంకో షేర్ ఆటోలో రాజోలు వచ్చేసి రాత్రికి రాజమండ్రి చేరాను. తర్వాత రోజంతా అంతర్వేదిలో నిర్జనంగా ఉన్న ఆలయ ప్రాంగణం, తాబేళ్ళ బావి, హరికథ, సముద్రం – వీటన్నిటినీ రెలిష్ చేసినా అసలు గోదావరి సముద్రంలో కలిసే చోటు చూడలేకపోయానే అని మనసంతా పీకుతూనే ఉంది. దీన్ని గురించి ఇంకొంచెం తెలుసుకుందామని గూగులించితే నరసాపురం నించి అంతర్వేది లోని సాగరసంగమానికి లాంచి సర్వీసు ఉందని ఏదో వెబ్సైట్ లో కనపడింది.

***

మర్నాడు బండలు పగిలే ఎండలో, వడగాడ్పులో పదిన్నరకి రాజమండ్రిలో నరసాపురం బస్ ఎక్కాను.

మునుపు తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది వెంబడే దక్షిణం వైపు గా ప్రయాణిస్తూ అంతర్వేది చేరుకుంటే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించి గోదావరి నదికి దాదాపు సమాంతరంగా అంతర్వేదికి వెళ్తున్నాననమాట. ఎందుకంటే వశిష్ట గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతానికి రాజోలు తూర్పు వైపున ఉంటే నరసాపురం పశ్చిమం వైపు ఉంది.
ఈ రకంగా పశ్చిమ గోదావరి వైపున్న ఊళ్ళు కూడా చూడవచ్చు అనుకుంటూ రాజమండ్రిలో బస్ ఎక్కాను. ఆంధ్రదేశంలో అగ్నిమండలం విస్ఫోటనం చెందిందా అన్నట్లుంది వాతావరణం.
బస్సు రాజమండ్రి నుంచి దక్షిణంగా గౌతమీ గోదావరికి సమాంతరంగా ప్రయాణించి గౌతమీ పాయనీ, రావులపాలెం నూ దాటి, వశిష్ట గోదావరిని కూడా దాటింది. అంటే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించిందన్నమాట. దొంగరావిపాడు అనే ప్రాంతం దగ్గర బస్సు ఎడమ వైపు తిరిగి వశిష్ట గోదావరికి సమాంతరంగా దక్షిణం వైపుకి ప్రయాణించింది. సిద్ధాంతం, వడలి (ఈ ఊరు చూడగానే సుప్రసిద్ధ సాహిత్య విమర్శకులైన వడలి మందేశ్వరరావు గారు గుర్తొచ్చారు), చెరుకువాడ, పెనుగొండ, మార్టేరు, కవిటం, వేడంగి (రేలంగి లాగా కనపడుతూ ఎన్నో పాత సినిమాల్లో వేళంగి అనే పేరుతో హాస్య పాత్రలు వేసిన యక్కల కోటేశ్వరరావు అనే నటుడిదీ ఊరేనా), పాలకొల్లుల మీదుగా నరసాపురం చేరుకుంది.

మిట్టమధ్యాహ్నపు రోడ్డుపై మండుటెండ నోటికొచ్చినట్లు పేలుతూనే ఉంది. నరసాపురం బస్టాండ్ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చి ఒకాయన్ని లాంచి సర్వీసు గురించి అడిగాను. ఆయన ‘సాగరసంగమానికి లాంచి సర్వీసు తీసేసి చాలా రోజులయిందనీ, కొద్ది దూరంలోనే వశిష్ట గోదావరి పాయ ఉందనీ, దాన్ని పంటు మీద ఐదు నిమిషాల్లో దాటుకుని అటువైపు గట్టునించి ఆటో తీసుకుని మలికిపురంలో దిగి వెళ్ళమని అన్నాడు.

అయ్యో, మొన్నటి రూటే పట్టుకోవలసి వచ్చిందే! అనుకున్నాను. కాని పంటు ఎక్కడం కొత్త అనుభవమే కదా అనుకుంటూ ఆయన్ని దారి అడిగాను. తన బండి మీదే ఎక్కించుకుని పంటు బయల్దేరే చోట నన్ను దింపాడు. పది రూపాయలకి టిక్కెట్టు కొనుక్కుని పంటులో కూర్చున్నాను. ఎక్కినప్పుడు ఖాళీగానే ఉంది కాని పది నిమిషాల్లోనే ఎన్నో సైకిళ్ళు, కొన్ని మోటారు సైకిళ్ళు, ఒక కారు వచ్చి పంటు ఎక్కాయి. బయట ఎండ భయంకరంగా ఉన్నా గోదావరి నీళ్ళని చూస్తే మనస్సులో చల్లగా ఉన్నట్లనిపించింది.

ఈ గట్టు నించి అవతలి గట్టుకి చేరడానికి ఐదు నిమిషాలు కూడా పట్టలేదేమో! అవతలి గట్టున (తూ.గో. జిల్లాలో) ఉన్న ఊరు సఖినేటిపల్లి లంక. అక్కడ సిద్ధంగా ఉన్న ఆటో ఎక్కాను. మధ్యాహ్నపు అగ్నిహోత్రుడి మీద మంత్రాల్లా పైనుంచి రాలుతున్న నిప్పుల్లోంచి గోలగోలగా పరిగెత్తుతూ ఆటో మలికిపురం చేరేప్పటికి రెండు గంటలయింది.

ముందురోజు రాజోలు నుంచి సఖినేటిపల్లి వెళ్ళే బస్సు ఎక్కి మధ్యలో మలికిపురం దిగాను. ఈరోజేమో సఖినేటిపల్లి లంక నుంచి రాజోలు వెళ్ళే రూటులో ప్రయాణించి మధ్యలో ఉన్న మలికిపురంలో దిగాను.

ఆ సమయంలో ఆటోలు ఏమీ లేవు. మూడు మజ్జిగలూ, ఒక నిమ్మకాయ షోడా తాగేసి మూడున్నరకి బయల్దేరిన ఒక ఆటోలో ఎక్కి అంతర్వేదికి చేరేటప్పటికి నాలుగయింది. వదలకుండా ఎండ ఇంకా తీవ్రంగా ఉపన్యసిస్తూనే ఉంది. కొంచెం సేపు లక్ష్మీనరసింహస్వామి గుడిలోనే కూర్చుని అక్కడి వాళ్ళని సాగరసంగమం గురించి ఈసారి కొంచెం వివరంగా అడిగాను. అందరూ సముద్రం దగ్గరకి వెళ్ళే దారి గురించే చెప్తున్నారు (జాగ్రత్త లతో సహా) కానీ నదీ సాగర సంగమం గురించి అడుగుతూంటే సరిగా బదులివ్వడం లేదు. ఈ మధ్యనే ఏవో సంఘటనలు జరిగిఉంటాయి అనుకున్నాను వాళ్ల ధోరణి చూసి.

గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తే ఒకాయన “ఆ ప్రదేశం చాలా దూరం అండి. మీరు అంతదూరం నడవలేరు. ఒకవేళ ఇప్పుడు బయలుదేరినా అక్కడికి వెళ్ళేటప్పటికి చీకటి పడొచ్చు” అంటున్నాడు. (అప్పుటికి సాయంకాలం అయిదు అవుతూ ఉంది). ‘ఫర్వాలేదండి. చూసి ఒచ్చేస్తాను” అని కొంచెం మాటలు కలిపినాక ‘నీలకంఠేశ్వర స్వామి గుడి దాటాక కుడి ప్రక్కకి వెళ్ళే సందులోకి తిరిగి తిన్నగా వెళ్ళిపోండి” అని అన్నాడు.

‘ఈ మలుపు తిరగకకుండా తిన్నగా వెళ్ళడం వల్లే నదీ సాగరసంగమానికి బదులు బీచ్ కి వెళ్ళిపోయాను నిన్న’ అనుకుంటూ ఆ మలుపు తిరిగి త్వరత్వరగా నడవడం ప్రారంభించాను. కనీసం చూసి వచ్చేద్దాం అనుకుంటూ.

ఓ అయిదు నిముషాలు నడవగానే ఎవరో ఒక యువకుడు బండి మీద వెళుతూ “ఎక్కడికి వెళుతున్నారండీ?” అని నన్ను పలకరించి “నాతో రండి” అంటూ తన బండి మీద ఎక్కించుకున్నాడు. కొంత దూరం తిన్నగా ప్రయాణించి తర్వాత రోడ్డు దిగి ఒక పేటలోకి ప్రవేశించి చాలా మలుపులు తిరిగి ఒకచోట ఆపి “ఇక్కడ నుంచి తిన్నగా వెళితే లైట్ హౌస్ వస్తుంది. దాని పక్క నుంచి వెళితే సాగరసంగమం వస్తుంది” అని నన్నుదించి వెళ్ళిపోయాడు.

ఓ పది నిమిషాలు నడిచి సాగరసంగమం చేరుకున్నాను. కుడివైపు చూస్తే అఖండ గోదావరి. ఎడమవైపు కొద్ది దూరంలోనే మహోధృతంగా వినిపిస్తున్న సముద్రఘోష. మేట మీదుగా నడుచుకుంటూ నది దగ్గరకి వెళ్ళాను. నలుగురైదుగురు తప్పితే అక్కడ ఎవరూ లేరు. ఒకరిద్దరు జాలర్లు మాత్రం తీరం వెంబడే కర్రలు పాతుతూ వాటికి వలలు చుట్టుకుంటున్నారు. నదిలో దిగి స్నానం చేయాలని ఇచ్ఛ. అక్కడే దిగితే అక్కడున్న నలుగురైదుగురూ వద్దని వారిస్తారేమోనని భయం వేసి మేట మీద ఏటవాలుగా కుడివైపు తీరం వెంబడే ఒక అరకిలోమీటరు నడుస్తూ కొన్ని చెట్లు, పొదలు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాను. అక్కడ నది కొద్దిగా వంపు తిరిగి ఉండటం వల్ల ఆ ప్రదేశం ఎవరికీ కనిపించదు. అక్కడ నదిలోకి దిగడానికి తయారవుతుండగా ఒక జాలరి ఉన్నట్లుండి ప్రత్యక్షమై ‘జాగ్రత్తండోయ్’ అంటూ కొద్ది దూరంలోనే తన వలను అల్లుకుంటూ కూర్చున్నాడు.

గోదావరిలోకి దిగాను. పైన విశాలమైన ఆకాశంలో అస్తమించడానికి ఉద్యుక్తుడవుతున్న సూర్యుడూ, చుట్టూ అఖండ గోదావరి, దూరంగా సముద్రపుఘోష. మనసంతా మౌనం.
ఏదైనా నది – వంపు తిరిగి వెనక్కి రావడం (కాశీ దగ్గర గంగ, ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు దగ్గర గోదావరి), సాగరంలో లీనమై తన ఐడెంటిటీ కోల్పోవడం – నీ మూలస్థానంలో కలిసిపోవడం, నిన్ను నువ్వు కోల్పోవడం, అంతర్ముఖుడవడం – ఇలాంటి వాటికీ నదీ సాగర సంగమానికీ ఏదైనా సంబంధం ఉందేమో!

ఒక గంట సేపు నీళ్ళల్లో గడిపి బయటకి వచ్చాక ముందురోజు చూసిన బీచ్ మీదుగా వెళ్ళవచ్చుకదా అని అనిపించింది. గోదావరి గలగలలు వింటూ సముద్రం వైపుకి నడిచాను. సాగరసంగమాన్ని దర్శించి ఎడమ ప్రక్కకు తిరిగి మరో అరకిలోమీటర్ నడిచి బీచ్ పాయింట్ కి చేరుకున్నాను.

కొంతసేపు అక్కడ గడిపి నదీ సాగరసంగమాన్ని చూడగలిగానన్న తృప్తితో వెనక్కి మళ్ళాను.

**** (*) ****