వ్యాసాలు

అ ‘సహాయ’ శూరులు

అక్టోబర్ 2015

పాత తెలుగు సినిమాలు చూస్తూ బాల్యపు జ్ఞాపకాలని తిరిగి జీవించడం- కృతకంగా ఉన్నా సరే, రకరకాల భావాలు అత్యంత స్పష్టంగా వాళ్ళ గొంతుల్లో పలకడం, ఒకే మనిషి అనేక సినిమాల్లో ముఖాలు రకరకాలుగా మార్చుకోవడం చూస్తూ అచ్చెరువొందడం- సినిమా రంగంలోని సహాయ పాత్రల జగత్తు లోని కొందరు ‘నిస్సహాయ, సన్నకారు జీవుల’ గురించి ఈ చిన్న రైటప్…

సినిమా వాళ్ళతో పరిచయాలు ఉన్న ఇన్సైడర్ వ్రాసింది కాదు ఇది. పాత తెలుగు సినిమాల్లోని భాషని వినాలనీ, ఆనాటి నటుల వాచకాలను తనివితీరా ఆస్వాదించేసెయ్యాలన్న ఆసక్తి ‘మితిమీరిన’ కొన్నిసమయాలలో- కేవలం సినిమాలను చూసిన అనుభవంతో వ్రాసింది. factual errors ఉండవచ్చు. క్షమించేసి, సమగ్రం కాని ఈ చిన్న తునక లో మీరు గమనించిన తప్పులు సరిదిద్దండి.

పాత సినిమాల్లోని టైటిల్స్ ని ఆసక్తిగా చదివే వాళ్ళకి తరచుగా కొన్ని పేర్లు కనపడుతూ ఉంటాయి. ఈ నటులలో చాలా మంది ఎంతో ప్రతిభగలవారైనా ప్రఖ్యాతులు కారు. వాళ్ళకున్న కొద్ది డైలాగులు చెప్పడంలోనే వారి ‘జీనియస్’ ద్యోతకమవుతుంది. వీళ్ళకి క్లోజప్ షాట్లు దాదాపుగా ఉండవు. కొంచెం దూరం నుంచి చూస్తే ఒకే రకంగా ఉండే ఇలాంటి సపోర్టింగ్ యాక్టర్స్ ఎంతో మంది ఉన్నారు పాత సినిమాలలో. వీరిని గుర్తు పట్టడానికి చాలా సార్లు వారి కంఠమే గతి.

వారిలో కొంతమంది గురించి:

1) చదలవాడ కుటుంబరావు: ‘మాయాబజార్’ లో ఘటోత్కచుడి కింకరుడు ‘లంబు’ గా ముఖ్య పాత్ర వేసినా కూడా ఎక్కువ మందికి తెలియని నటుడు. అత్యంత విలక్షణమైన వాచికం, అంతకు మించిన సహజాభినయం. ‘కన్యాశుల్కం’ లో మధురవాణితో సరసమాడటానికి ప్రయత్నిస్తున్న పోలిసెట్టిగా ఆ చిన్న సీన్ లో ఈయన నటనావైదుష్యాన్ని చూస్తే గురజాడ హృదయాన్ని ఆవిష్కరింపజేసాడా అనిపించక మానదు.

చదలవాడ గారు అనేక సినిమాల్లో ఎన్నో చిన్న చిన్న పాత్రలు వేశారు. అయితే తన ప్రతిభ చూపించే అవకాశం ఉన్న పూర్తి నిడివి గల పాత్రలు ఆయనకి ఎక్కువ దొరకలేదు. అలా దొరికిన సందర్భాలలో ఆయన అత్యున్నతమైన టాలెంట్ ని చూడవచ్చు – ‘ఆడపెత్తనం’ లో భార్యకి (కన్నాంబ) భయపడే భర్త పాత్ర వేసారు. ఈ సినిమాలో ఛాయాదేవి, కన్నాంబ, చదలవాడ – ఈ ముగ్గురు మహామహుల సంభాషణల తూకం చెప్పనలవి కాదు. ‘చిట్టి తమ్ముడు’ లో అనాధ శరణాలయానికి వచ్చిన ఇన్సె్పక్టర్ గా సూర్యకాంతం తో కలిసి పండించిన హాస్యం, ‘బాలనాగమ్మ’ (అంజలి, ఎన్టీఆర్) లో పులిని చంపానని గొప్పగా చెప్పే చాకలి తిప్పడుగా రాజు గారి ముందు చెప్పిన డైలాగ్ డెలివరీ విని తీరాల్సిందే.

శ్రీశ్రీ తను వ్రాసిన సినిమా పాటల్లో తనకిష్టమైనదానిని (‘పంతాలు పట్టింపులు’ సినిమా లో ‘యినుకోరా’ అనే పాట) గురించి వ్రాసిన వ్యాసంలో ఆ పాట తనకిష్టం కావడానికి చదలవాడ కుటుంబరావు గారు కూడా ఒక కారణం అని రాసుకున్నారు. ఈ పాటలో ఒక చోట ‘ఈ బతుకుందే ఎంతో బరువు’ అని ఉంటే ‘ఎంతో బరువు’ ని ‘మాసెడ్డ బరువు’ అని మార్చగలరేమో చూడండి’ అని చదలవాడ సూచించడమూ, శ్రీశ్రీ గారు తక్షణమే ఆ సూచనని స్వీకరించడమూ జరిగాయట. ఆ తర్వాత రోజే చదలవాడ మరణించడం తను మర్చిపోలేని ఒక విషాద సంఘటన అని శ్రీశ్రీ అన్నారు.

కన్యాశుల్కం లింక్ – 1.00.55 దగ్గర చూడండి.
https://www.youtube.com/watch?v=3OOXv5v8Xp8

2) పేకేటి శివరాం : ‘దేవదాసు’ లో ANR కి తాగుడు అలవాటు చేసిన స్నేహితుడిగా ఆ తరం వారిలో ప్రసిద్ధుడు. ‘వద్దంటే డబ్బు’ లో NTR స్నేహితుడిగా (జంధ్యాల తీసిన దీని రీమేక్ – బాబాయ్ అబ్బాయ్ లో సుత్తి వీరభద్రరావు వేసిన పాత్ర) పెద్ద నిడివి ఉన్న పాత్ర వేశారు. ‘మంచి మనసుకు మంచి రోజులు’ లో కాంపౌండర్. ‘కన్యాశుల్కం’ లో చెప్పినవి రెండు మూడు డైలాగ్స్ అయినా ఖంగుమంటాయి. మా ఇన్స్పెక్టర్ గారు నిన్నుపిలకుచ్చుకుని లాక్కు రమ్మన్నారంటూ రావఁప్పంతుల్ని బెదిరించి తర్వాత మధురవాణితో నర్మగర్భంగా ‘నాకు వల్లమాలిన పనుందూళ్ళో’ అంటూ చెప్పే హెడ్ కానిస్టేబుల్.

ఈయన నటుడిగానే కాకుండా ఇతరత్రా కూడా చురుకుగా ఉండేవారుట. ప్రపంచ తెలుగు మహాసభలను డాక్యుమెంటరీ తీశారన్న విషయాన్నిశ్రీశ్రీ తన వ్యాసం లో ప్రస్తావించారు.

దేవదాసు లింక్: 57 నిమిషాల దగ్గర చూడండి.
https://www.youtube.com/watch?v=X8dnjKmmObY

3) రామకోటి : చాలా పాత సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే పేరు. ఓ మాదిరి పొట్టి విగ్రహం. ‘కన్యాశుల్కం’ లో హెడ్ కానిస్టీపు (పేకేటి) రావఁప్పంతుల్ని(సీయస్సార్) బెదిరిస్తూ ‘బయట కనిస్టీపు కామయ్య కాచుక్కూచున్నాడు’ అంటూ ప్రస్తావించిన కనిస్టీపు కామయ్యే ఈ రామకోటి. ‘రూపాయలు వేగిరం ఇవ్వండీ’ అని అరిచి రావఁప్పంతుల్ని హడలేసి, కరటకశాస్త్రి దగ్గర రూపాయలు దఖలు పరిపించుకునేలా చేసిన కీచు కంఠం ఈయనదే.

మేకప్ వల్ల సరిగ్గా పోల్చుకోలేకపోయినా బహుశా రామకోటి గారే వేసి ఉంటారు అనుకునే కొన్ని పాత్రలు…
1. కెబి తిలక్ సినిమా ‘ఉయ్యాల జంపాల’ లో ప్రభాకరరెడ్డి చేసే చెడ్డపనులకి సహాయపడే నౌకరు తాతారావు. (నిడివి ఉన్న పాత్రే).
2. ‘చిట్టి తమ్ముడు’ లో (ఇదీ తిలక్ సినిమానే) నౌకరు అయోమయం.
3. ‘ఇంటిగుట్టు’ లో (NTR) నౌకరు పరదేశి.
4. ‘ఆడపెత్తనం’ లో కన్నుకొట్టే పెళ్ళికొడుకుగా చిన్న పాత్ర (?).

కన్యాశుల్కం లింక్: 1.08:38 దగ్గర చూడండి.
https://www.youtube.com/watch?v=3OOXv5v8Xp8

4) బొడ్డపాటి కృష్ణారావు: ఒక్కసారి వింటే జన్మలో మర్చిపోలేని వాయిస్. ‘మాయాబజార్’ సినిమాలో ‘శని ఈ గదిలో ఉండగా…’ అంటు శకుని మామ దగ్గర సాగదీసిన శంఖు తీర్థుల వారు ఈయనే. ‘కన్యాశుల్కం’ లో గయ్యాళి పూటకూళ్ళమ్మని ధాటీగా ఎదుర్కొని ‘ఆఁ.. గుడివీధి మధురవాణి’ అంటూ ఛాయాదేవికి చల్లంగా ఉప్పు అందించిన పొటిగరాపు పంతులు గారు.

బొడ్డపాటి గారు చిన్నాచితకా వేషాలతో అవస్థలు పడుతున్న కాలంలో ఎన్టీఆర్ ఆయన లో ఉన్న విద్వత్తు చూసి తన పిల్లలకి ఆయన చేత తెలుగు ట్యూషన్ చెప్పించారట. చిల్లర పాత్రలు వేస్తూ ఉన్న బొడ్డపాటి గారు ఉన్నట్టుండి ‘నాకు హీరో వేషం దొరికిందోయ్’ అని చెబుతుంటే పాండీబజార్ లో అందరూ ఆశ్చర్యపోయారట. మరి ‘వినాయక చవితి’ సినిమాలో వినాయకుడు హీరోయే కదా!!

అందరూ ‘ముఖం చూపలేని హీరో’ అని నవ్వుతుంటే బొడ్డపాటి గారు వినాయక చవితి నిర్మాత కె. గోపాల్రావు గారి దగ్గరకి వెళ్ళి ఓ చిన్న వేషం అదనంగా ఇప్పించుకున్నారట. యదువీరుడిగా సత్రాజిత్తు దగ్గరకి వెళ్ళి సత్యభామని కృష్ణునికిమ్మని అడగటమూ, ఆయన కాదన్న తర్వాత ఆ విషయాన్ని తిరిగి కృష్ణునికి చెప్పడమూ – ఈ రెండు చిన్న సన్నివేశాలలో నటించారు.

చిన్న చిన్న పాత్రలు అసంఖ్యాకంగా వేసి ఉంటారు. ఎంత చిన్న పాత్ర ఐనా, ఒక చిన్న మాట వినగానే ఈయనను గుర్తు పట్టొచ్చు. కొంచెం పొట్టిగా, లావుగా ఉంటారు కాబట్టి డైలాగులు ఆట్టే లేకపోయినా గుర్తుపట్టవచ్చు – నర్తనశాల లాంటి సినిమాలో కూడా. (వలలుడి దగ్గర సహాయకుడు)

కన్యాశుల్కం లింక్ 29:33 దగ్గర చూడండి.
https://www.youtube.com/watch?v=3OOXv5v8Xp8

5) ముదిగొండ లింగమూర్తి: నాగయ్య గారి ‘త్యాగయ్య’ లో జపేశుడు (త్యాగయ్య అన్న) పాత్రధారిగా ప్రసిద్ధుడు. ‘బాటసారి’ (ANR, భానుమతి) లో దుష్ట మేనేజర్. ఈయన్ని మిడ్ షాటుల్లో చూస్తే సియస్సారేమో అని పొరపాటు పడే అవకాశం ఉంది. గొంతులో మాత్రం ముక్కామల కృష్ణమూర్తి గారికున్న టింబర్ ఉంది.

చక్కటి కథ, సంవిధానం, మాటలు ఉన్న ‘జమిందార్’ (ముళ్ళపూడి, ANR) సినిమాలో నాగభూషణం చేత ఏడిపించబడే పాత్రని అత్యంత ప్రతిభావంతంగా నిర్వహించారు లింగమూర్తి గారు.

‘పాండవ వనవాసం’ లో శకుని పాత్రని ఎంత బాగా అభినయించినా దానికి ఎనిమిదేళ్ళ క్రితమే వచ్చిన ‘మాయాబజార్’ లోని సీయస్సార్ గారి కంఠవైలక్షణ్యం ముందు లింగమూర్తి గారు వీగిపోయినట్లే అనిపిస్తుంది.

నర్తనశాల లో శకుని వేషానికి ఈయనని అడుగుతూ డిమాండ్ తగ్గింది కాబట్టి పారితోషికం తగ్గించుకోమంటే ‘మీరు ఇచ్చేది నా టాలెంట్ కి కదా? అది ఏమాత్రం తగ్గలేదే!?’ అని అన్నారట. చివరకు ఆ పాత్ర మల్లాది సత్యనారాయణ గారికి దక్కింది.

లింగమూర్తి గారు కన్విన్స్ అవకుండా గుడ్డిగా డైలాగ్ చెప్పేవారు కాదుట. దీని కోసం బిఎన్ రెడ్డి లాంటి సీనియర్ డైరెక్టర్ తోనే తగాదా పడ్డారట. స్వర్గసీమలో హీరో (నాగయ్య) ని సెడ్యూస్ చేయమని తన కూతురు (భానుమతి) తో తను వేసిన తండ్రి పాత్ర చెప్పే సన్నివేశంలో డైలాగ్ ని ఎలా మార్చారో రావికొండలరావు గారు తన బ్లాక్ అండ్ వైట్ పుస్తకంలో వివరంగా రాశారు. మార్చి చెప్పిన డైలాగ్ – “వాడేం పులా సింగమా? ఊఁ” – ని ఇప్పుడు ఇంటర్నెట్ లో చూస్తే లింగమూర్తి గారి జీనియస్ తెలుస్తుంది.

స్వర్గసీమ లింక్: 34:16 దగ్గర చూడండి.
https://www.youtube.com/watch?v=UoqF-KPGcyk

6) పెరుమాళ్ళు : కండువా నలుపుకుంటూ వినయంగా మాట్లాడే నౌకరుగా, గుండెపోటుతో చనిపోయే ముసలి తండ్రిగా అసంఖ్యాకమైన పాత్రలు వేసి వేలాది చేరుమాళ్ళు సెంటిమెంటుతో తడిపేసిన వారీయన. పద్మనాభం గారు తీసిన ‘దేవత’ లో మొదటి సావిత్రి తండ్రి. సారధి వారి ‘రోజులు మారాయి’ లో హీరో నాన్న కోటయ్యగా నిడివి గల పాత్రలో నటించారు. ‘మనోరమ’ లో హీరోయిన్ కృష్ణకుమారి తండ్రి.

1955 లో వచ్చిన ‘రోజులు మారాయి’ లో ANR తండ్రిగా ముఖ్యపాత్ర వేసిన పెరుమాళ్ళుగారు డెబ్భైల్లో వచ్చిన ‘ప్రేమనగర్’ లో ANR దగ్గర నౌకరుగా అతి చిన్న పాత్ర వేయడం విచిత్రమైన విషాదం. పెరుమాళ్ళు గారి విగ్రహం సాధారణం. ఆట్టే ప్రత్యేకత లేని వాచికం. అందువల్ల ఈయన్ని చప్పున గుర్తించడం కష్టం.

ప్రేమనగర్ లింక్: 9:57 దగ్గర చూడండి.
https://www.youtube.com/watch?v=pEgL6370kzc

7) డబ్బింగ్ జానకి: ‘శంకరాభరణం’ సినిమాలో శంకరశాస్త్రులు తులసిని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడని అతన్ని బాయ్ కాట్ చేస్తూ పని మానేసిన వంటలక్క. ‘సాగరసంగమం’ లో కమలహాసన్ తల్లి. చాలా సినిమాల్లో ముఖ్యంగా జంథ్యాల, కె విశ్వనాథ్ ల సినిమాల్లో నడి వయసున్న మధ్య తరగతి మహిళగా అనేక వేషాలు వేశారు.

ఈ సినిమాలన్నింటికన్నా ఆమె యొక్క టాలెంట్ పూర్తిగా చూడగల అవకాశం అక్కినేని కుటుంబరావు, ఓల్గా గార్లు నిర్మించిన ‘అమూల్యం’ అనే సినిమాలో దొరుకుతుంది. ఆ సినిమాలో ఆమె నటన చూస్తుంటే ఎంతమంది గొప్ప కళాకారులు తెలుగు సినిమా రంగంలో ఉన్నారో అనిపిస్తుంది.
67 లో ANR హీరోగా వచ్చిన ‘పూలరంగడు’ సినిమా ప్రారంభంలో ANR ని “ఆమె తెచ్చే గడ్డి అంత రుచా!?” అని ఎకసెక్కమాడుతుంది. ఈ సినిమాలో ఆమెకి ఇదొక్కటే డైలాగు అయినా ఆమె పేరుని టైటిల్స్ లో వేశారు. బహుశా ఆమె అప్పటికే డబ్బింగ్ కళాకారిణిగా ప్రసిద్ధురాలు అయి ఉంటారు. అసంఖ్యాకమైన సినిమాల్లో డబ్బింగ్ జానకి గారిని వయసు మళ్ళిన పాత్రల్లో చూసి ‘పూలరంగడు’ సినిమాలో నవయవ్వనంలో ఉన్న యువతిగా చూస్తుంటే ‘ఎంత చక్కగా ఉన్నారీవిడ!?’ అని అనుకోకుండా ఉండలేం.

1975 లో వచ్చిన ‘అనురాగాలు’ అనే సినిమాలో కూడా హీరోయిన్ (శ్రీదేవి) ఉన్న బ్లైండ్ స్కూల్ వార్డెన్ పాత్రకి డబ్బింగ్ చెప్పింది జానకి గారే. ఇదే సినిమాలో ఆమె ఒక టీచర్ పాత్ర కూడా పోషించింది.

శంకరాభరణంలింక్: 46:39 దగ్గర చూడండి.
https://www.youtube.com/watch?v=nOQiVyJuj7M

8) వల్లభజోస్యుల శివరాం: చాలా పాత సినిమాల్లో వి. శివరాం అనే పేరు చూడవచ్చు. నాగయ్య గారి ‘భక్త పోతన’ లో పోతనకి కొడుగ్గా వేశారట. ఈయన కంఠం చాలా ప్రత్యేకంగా పట్టించేస్తుంది. క్లోజప్ షాట్లు లేకపోవడం వల్ల ఈయనని గుర్తుపట్టాలంటే వాచికమే ఆధారం.

విప్రనారాయణ సినిమాలోని సంభాషణలని సంక్షిప్తశబ్దచిత్రంగా వి.ఎ.కె. రంగారావు గారు మలచిన ఆడియో క్యాసెట్ కవరు మీద ఇచ్చిన పేర్ల ఆధారంగా ఆ సినిమాలో ఈయనది రాజు పాత్ర అని తెలుసుకోవచ్చు. ‘విప్రనారాయణ’ లో శివరాం గారు చెప్పిన కొద్ది డైలాగులు వింటే చాలు, దాని ఆధారంగా ఈయన కంఠాన్ని ఎన్నో సినిమాల్లో గుర్తుపట్టవచ్చు – రకరకాల మేకప్ ల వల్ల ముఖాన్ని గుర్తుపట్టలేకపోయినా… ఉదాహరణకి గులేబకావళి కథ’ (NTR) సినిమాలో శిశువుని కాపాడిన ముని గొంతు ఈయనదే. అలాగే సారధి వారి ‘రోజులు మారాయి’ లో రమణారెడ్డి రైతులకి కలెక్టర్ గారి మీటింగ్ కి వెళ్ళవద్దని చెప్పే సీనులో వల్లభజోస్యులవారి కంఠం వినపడుతుంది.

బి.ఎన్. రెడ్డిగారి ‘రంగుల రాట్నం’ సినిమాలో విజయనిర్మల (అప్పటికి ‘నీరజ’ గా వ్యవహరించుకుంటున్నారు) పాత్రకి మామగారు. ‘మంచి మనసుకి మంచి రోజులు’ సినిమాలో హీరోయిన్ రాజసులోచనకి పని ఇప్పించిన ప్రెసిడెంట్ పాత్ర.

రంగుల రాట్నం లింక్: 1:37:51 దగ్గర చూడండి.
https://www.youtube.com/watch?v=ExLNSE8uAG8

9) కాకరాల (వీర వెంకట సత్యనారాయణ మూర్తి): బి.ఎన్. రెడ్డిగారి ‘రంగుల రాట్నం’ సినిమాలో తూర్పు యాస మాట్లాడే పాత్ర వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ పాత్ర పేరు సుబ్బారాయుడు – హీరోయిన్ ని పెళ్ళాడదామని ప్రయత్నించి విఫలుడైన పాత్ర. ANR ‘ప్రేమనగర్’ సినిమాలో వాణిశ్రీకి దురాశాపరుడైన అన్న. ఒక కోణం నించి తీసిన షాట్స్ లో రాజబాబుగారి పోలికలు కొన్ని కనిపిస్తాయి.

‘రంగుల రాట్నం’ లో ఈయన నిలువెత్తు విగ్రహం, ఆకట్టుకునే వాచికం చూసింతరవాత బాపుగారి ‘తూర్పు వెళ్ళే రైలు’ సినిమాలో హీరో తండ్రి పాత్ర వేసింది ఈయనే అంటే నమ్మలేం – ‘కన్యాశుల్కం’ సినిమాలో ఠీవైన విగ్రహం, ఖంగుమనే కంఠంతో అగ్నిహోత్రావధానులుగా అదరగొట్టేసిన విన్నకోట రామన్నపంతులు గారు జంధ్యాల మొదటిసారిగా దర్శకత్వం వహించిన ‘ముద్దమందారం’ సినిమాలో ముఖమంతా పీక్కుపోయిన తాగుబోతు పాత్రలో నటించారని ప్రత్యక్షంగా చూస్తున్నా నమ్మశక్యం కానట్టు! ఎంతో ప్రతిభావంతులైన వీళ్ళ శరీరాలని సినిమా రంగం తినేసిందని సరిపెట్టుకోవాల్సిందే.

రంగుల రాట్నం లింక్: 1:37:15 దగ్గర చూడండి.
https://www.youtube.com/watch?v=ExLNSE8uAG8

10) K.V.S. శర్మ: (పూర్తి పేరు తెలియదు) చాలా పాత సినిమాల్లో కనిపిస్తారు. ఈయన వాయిస్ లో కూడా ఏదో ప్రత్యేకత ఉంది – అయితే చాలా డైలాగులు విన్న తర్వాత కాని అది మనసుకి పట్టదు. కెబి తిలక్ గారి ‘చిట్టి తమ్ముడు’ సినిమాలో చిన్నపిల్లల మాఫియా తాత, ‘నిత్య కల్యాణం పచ్చతోరణం’ సినిమాలో కూడా ఇలాంటి గెటప్ తోనే ఒక ‘దాదా’ వేషం వేశారు. ‘ఉయ్యాల జంపాల’ లో మునసబు. భాగ్యరేఖలో NTR కి తండ్రి. ‘అన్న-తమ్ముడు’ లో క్రిష్టియన్ ఫాదర్. NTR ‘గులేబకావళి కథ’ లో రాజనాలకి సహాయం చేసే దుష్టబుద్ధి పాత్ర.

ఈయన విగ్రహంలో గొల్లపూడి మారుతీరావు గారి పోలికలు, వాచికంలో విన్నకోట రామన్నపంతులు గారి ‘రాపు’ ఉన్నాయి.

భాగ్యరేఖ లింక్ 1:21:30 దగ్గర చూడండి.
https://www.youtube.com/watch?v=8u82s8YUec0

11) ‘సాక్షి రంగారావు’: అసలు పేరు రంగావజ్ఝల రంగారావు కానీ 1967 లో విడుదలైన బాపు-రమణ ల ‘సాక్షి’ సినిమా నించీ ఈ పేరుతో ప్రసిద్ధుడు. ‘మట్టిలో మాణిక్యం’ లో భానుమతి తో కలసి నటించిన సన్నివేశం లో అవిడ డైలాగ్ కి ఈయన రియాక్షన్ చూస్తే ఈయన టాలెంట్ అర్థమవుతుంది. అలానే కొన్ని విశ్వనాథ్, జంథ్యాల సినిమాలలో ఈయన నటనావైదుష్యం చూడవచ్చు. కానీ ఎక్కువగా సాదా, సాధారణ, పేలవమైన పాత్రలకే ఈయన టాలెంట్ అంతా వృధా అయిపోయిందేమో అనిపిస్తుంది – మరీ ‘రాజా’ (శోభన్ బాబు, రాఘవేంద్రరావు) సినిమా లో విగ్గు పెట్టుకుని వేసిన తాగుబోతు పాత్ర లాంటివాటిని చూస్తే.

స్వర్ణకమలం లింక్ 13:45 దగ్గర చూడండి.
https://www.youtube.com/watch?v=RboT-EhyqY0

 

ఇంకా :
‘మాయాబజార్’ లో ‘జంబు’ గా, ‘చెల్లెలి కాపురం’ (కె విశ్వనాథ్, బాలయ్య) లో చాకలి గా, ‘మంచి మనసుకి మంచి రోజులు’ లో ‘హుఁ హుఁ’ అని దగ్గుతూ హాస్యం పోషించడానికి ప్రయత్నించిన ‘మాలోకం’ గా నటించిన నల్ల రామ్మూర్తి గారు;

సామాన్యమైన విగ్రహం ఉన్నా ఒక్క వాక్యం వింటేనే పట్టించేసే కంఠం ఉన్న దొరైస్వామి గారు (మల్లీశ్వరిలో భానుమతి నాన్న) ;

‘మాయాబజార్’ లో మాయతాత గా ‘అటు నేనే ఇటు నేనే’ అంటూ ఘటోత్కచుడినే హడలేసిన కంచి నరసింహారావు గారు;

‘కృష్ణార్జున యుద్ధం’ లో అల్లురామలింగయ్య ప్రక్కన ‘అంచెలంచెలు… పాటలో నటించిన సురభి బాలసరస్వతి గారు;

‘విప్రనారాయణ’ లో ‘కట్టండి, చేతులు విరిచి కట్టండి’ అన్న దండనాయకుడుగా, ‘మల్లీశ్వరి’ లో పువ్వులు కోసుకుంటున్న టిజి కమలతో మాట్లాడిన సైనికాధికారిగా, ‘బాలరాజు’ లో ‘నీ కూతుర్ని నా కొడుకుకివ్వు’ అంటూ తగాదా వేసుకున్న వెంకన్నాయుడుగా వేసిన, గద్దించే కంఠం ఉన్నKV సుబ్బారావు గారు -;

ప్రధానపాత్రలు వేసే ‘అగస్త్యులకు’ వీళ్ళు భ్రాతలని సరిపెట్టుకుందామంటే – అసలు వీళ్ళే అగస్త్యులేమో అని అనిపించకమానదు.

అవే పాత్రలను ఎన్నో సినిమాలలో జీవించి, మళ్ళీ మళ్ళీ అవే అవే సన్నివేశాలలో పాల్గొని, ఎన్నో జన్మలెత్తిన అనుభవాలు సంపాదించుకున్నారేమో అనిపిస్తుంది – చివర్లో నిజంగానే సన్యాసం పుచ్చుకున్న ‘ముదిగొండ లింగమూర్తి’, సంసారంలో ఉన్నా మానసికంగా సన్యాసి లాగా జీవించారని అందరూ చెప్పుకునే ‘సాక్షి రంగారావు’ లాంటి వాళ్ళను చూస్తే.

**** (*) ****