కథ

అపార్ట్మెంట్ నంబర్ 101

అక్టోబర్ 2015

“నానా ఆకాశం ఎందుకు బ్లూ కలర్లనే ఉంటది?” ఏడేళ్ళ అమిత్ వాళ్ళ నాన శేఖర్ని అడిగిండు.

“నిజం కావాల్నా, అబద్దం కావాల్నా?” కొడుకుని దగ్గర కూచోబెట్టుకుని అడిగిండు శేఖర్.

“నిజం”

“కాంతి అలల రూపంలో విస్తరిస్తది. దాని విస్తారణ, పౌన: పున్యం మీద ఆధార పడి మనకు రంగులు కనిపిస్తయ్. బ్లూ కలర్కు  తక్కువ దూరం, ఎక్కువ విస్తరించే స్వభావం ఉంటది కాబట్టి మనకు ఆకాశం నీలం రంగుల ఉన్నట్టు కనిపిస్తది. నిజానికి ఆకాశానికి ఏ రంగూ ఉండదు. అర్ధమైందా ఏమన్న?”

“ఏం అర్ధం కాలే. అబద్దం చెప్పు ఇపుడు”

“అప్పట్లో బ్లూ కలర్ చీప్ గ దొరికేదట. ఆకాశం మొత్తం రంగేయాలంటే బాగా ఖర్చు కదా అందుకని కొంచెం చీప్ గ దొరికిందే నయం అని బ్లూ కలర్ వేసిన్లు రా.”

“అబద్దమే మంచిగుంది నానా, ఇంకోటి.. ఏనుగు కు తొండం ఎందుకు ఉంటది?”

“నిజమా, అబద్దమా?”

“నిజం”

“జీవ పరిణామ క్రమంలో అనుకూలనాల దృష్ట్యా అవయవాలు రూపం దిద్దుకున్నై. పెద్ద శరీరానికి నేలమీద ఉన్నదాన్ని అందుకోవాలంటే పొడుగ్గ ఉండే తొండం కావాల్సి వచ్చి అవి అట్లా పరిణామం చెందినయ్, అర్ధమైందా?”

“కాలేదు. అబద్దం చెప్పు”

“మొదట్లో వాటి తొండాలు చిన్నగనే ఉండేటియి. పెద్ద తొండం ఫాషన్ అని ఎవరో చెప్పే సరికి అన్ని పెద్దగ పెంచుకునుడు శురు చేసినై.”

“నానా మరి ఏనుగులు చాక్లెట్ తింటయా?”

“డాక్టర్ డైట్ చేయమని చెప్పిండు రా  ఏనుగులకు, సో వాటికి చాక్లెట్ కట్.”

“అబద్దాలే బాగున్నై నానా.. నిజాలు వద్దు ఇప్పట్నించి.”

“ఓ కే రా”

అట్ల చిన్నప్పట్నుండే అబద్దాల్ల లోకం చూసుడు అలవాటైంది అమిత్ కి. చెప్పి చెప్పి అరటి పండు తిన్నంత తేలిగ్గ అబద్దాలు చెప్పుడు అలవాటైంది శేఖర్కి కూడా. అమిత్ వాళ్ళ అమ్మ, వాని చిన్నపుడే పోయింది. శేఖర్  అమిత్ కి ఏది ఇష్టమైతే అది ఇస్తడు. స్పాయిల్ అయితడు అని ఎవరన్నా అంటే, ‘కానీ పరవాలేదు’ అని సమాధానం ఇస్తడు.

అమిత్ పెద్దయిండు. స్పాయిల్ కాలేదు. ఒక మల్టీ నేషనల్ కంపనీలో ఉద్యోగం చేస్తున్నడు. ఈ మధ్యనే అపార్ట్మెంట్ కూడా కొన్నడు. శేఖర్ రిటైర్ అయిండు. ఇద్దరూ కలిసి అపార్ట్మెంట్ల ఉంటున్నరు.

***

“ఈవెనింగ్ ఫుడ్ ఏమన్న పిక్ అప్ చేస్కోమంటవా అమిత్?” మాధురి అడిగింది.

“వద్దు, నాన కుక్ చేస్తా అన్నడు.”

“నాకు కొంచెం టెన్షన్ గా ఉంది అమిత్”

“ఎందుకు టెన్షన్, డాడ్స్ వెరీ చిల్, డోంట్ థింక్ మచ్. కాక పొతే మా ఇంట్లో పరిస్తితులు కొంచెం డిఫరెంట్ గ ఉంటై. డోంట్ బీ సర్ ప్రయిస్డ్.”

“లేకుంటే మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుందాం అమిత్”

“అరే, అనవసరంగ టెన్షన్ తీస్కోకు. ఇట్స్ బీన్ ౩ ఇయర్స్ ఆల్రెడీ. ఇట్స్ అబౌట్ టైం యు మీట్ మై ఫాదర్. ఆల్రెడీ మన గురించి చెప్పిన. హీస్ కూల్ అబౌట్ అస్.”

“సరే అమిత్”

క్లుప్తంగా- మధురి, అమిత్ మూడు సంవత్సరాలుగ రిలేషన్ లో ఉన్నరు. ఇపుడు పెళ్లి చేస్కోవాలని అనుకుంటున్నరు. అమిత్ ఇంటికి డిన్నర్కి పోతుంది మధురి ఇవాళ.

***

టైం ఏడు అయింది. అపార్ట్మెంట్ నంబర్ నూటా ఒకటి ముందుకి వచ్చి ఆగిపోయింది మధురి. పాకెట్ మిర్రర్ తీస్కోని, ఒక సారి మొహం బాగుందో లేదో చూస్కుంది. జుట్టు కొద్దిగ సరి చేస్కొని గట్టిగ ఊపిరి పీల్చుకొని డోర్ బెల్ కొట్టింది.

“కం ఇన్”… “నానా, మాధురి.. .. మాధురీ, నాన” ఆహ్వానం, పరిచయం అయిపోయినై.

“హలో అంకుల్, హౌ ఆర్ యూ.” నవ్వుతూ పలకరించింది.

“హాయ్ మాధురీ, అదర్ దాన్ దిస్ బ్యాక్ పెయిన్ ఐయాం డూయింగ్ గుడ్”

“ఏమైంది అంకుల్ ఎందుకు పెయిన్?

“నిన్ననే పారాశూట్ లేకుండ స్కై డైవింగ్ చేసిన మాధురి. పైనుండి కింద పడేసరికి, కొంచెం నడుము నొప్పి పట్టుకుంది. అది తప్పిస్తే మిగతా అంత ఒకే.” మొహం లో ఏ భావం లేకుండ, తడుముకోకుండ, అప్పటిదప్పుడు ఒక కుళ్ళిపోయిన అబద్దం ఒకటి చెప్పిండు శేఖర్.

అమిత్ ఆల్రెడీ తమ అబద్దాల ప్రపంచాన్ని మాధురికి అలవాటు చేసిండు. కాబట్టి మాధురి పెద్దగా కంగారు పల్లేదు.

“ఔను అంకుల్, నేను కూడా చేసిన ఒక సారి, నాకైతే నొప్పి పోడానికి వారం రోజులు పట్టింది.” తనేం తక్కువ తినలేదన్నట్టు దీటుగా అబద్దపు సమాధానం నవ్వుకుంటనే చెప్పింది మాధురి.

“రండి, డిన్నర్ చేసుకుంట మాట్లాడదం. నాకు ఫుల్ ఆకలి” అన్నడు అమిత్.

“కాంట్ వెయిట్”

అందరూ డైనింగ్ టేబుల్ మీద కూచొని తినడం స్టార్ట్ చేసిన్లు.

“మాధురి, మా నాన అమేజింగ్ కుక్ తెల్సా? చికెన్ వేస్కో. సూపర్ ఉంటుంది.”

“మ్మ్మ్మ్, వాసనకే నోరూరిపోతుంది. మీరే నేర్పాలంకుల్ నాన్ వెజ్ వంట”

“స్యూర్. వై నాట్” అన్నడు శేఖర్.

“సో హౌ వాస్ యువర్ డే అంకుల్?”

“ఇట్ వాసంట్ బాడ్ ఆక్చువల్లీ. బట్ యూ ప్రాబబ్లీ గెట్ బోర్డ్ ఇఫ్ ఐ టెల్ యూ ద హోల్ థింగ్”

“ప్లీస్ చెప్పండంకుల్”

శేఖర్  చెప్పుడు స్టార్ట్ చేసిండు..

“పొద్దునే లేచే అలవాటు లేదు నాకు. బహుశా పదిన్నర అయితుండచ్చు. ఇంట్లో నుండి ఎదో క్రీచ్ మనే సౌండ్ వినిపించింది. పట్టించుకోకుండ అట్లనే పడుకున్న. కొంచెం సేపటికి ఇంకా ఎక్కువైంది సౌండ్. తరవాత అడుగుల చప్పుడు. నిద్రంత ఒక్క సారిగ ఎగిరి పోయింది. క్రికెట్ బాట్ తీస్కోని హాల్ కి వచ్చి చూసే సరికి హాల్లో డైనింగ్ టేబుల్ సెట్, టీ వీ కనిపించినై. నాకు నోటమాట రాలేదు. నేనింకా నమ్మలేకుండా ఉన్న.”

“అందులో నమ్మలేకపోవడానికి ఏముంది అంకుల్?”

“ఎందుకంటే మాకసలు టీవీ గానీ, డైనింగ్ సెట్ గానీ లేనే లేవు”

“హహహ బాగుందంకుల్. సో ఎదో దయ్యం వచ్చి ఉంటదంటరా?”

“లేదు, ‘అ-దొంగతనం’ జరిగి ఉంటుంది అని నా నమ్మకం.”

“అంటే?”

“ఎత్తుకపోతే ‘దొంగతనం’. తీస్కొచ్చి పెడితే ‘అదొంగతనం’.” మొహంల ఏ భావం లేకుండ చెప్పిండు శేఖర్ .

“హహహ.. తరవాత?”

శేఖర్  మళ్ళీ స్టార్ట్ చేసిండు.

“సర్లే పోనిమ్మని, నేను మళ్ళీ వచ్చి పడుకున్న, ఇంతలో మంచం కింద నుండి సౌండ్, అదొంగతనం చేసిన వాడే మంచం కింద దాక్కుని ఉంటడ్లె, ఎలాగూ వాడు మంచి వాడు కదా అని నా నిద్ర నేను పోయిన. కాసేపటికి సౌండ్ ఆగిపోయింది. వెళ్లి పోయి ఉంటడు అనుకున్న. ఇవాళ నువ్వస్తున్నవ్ కోడి కూర చేద్దాం అనుకున్న కదా, సో మార్కెట్ పోయి చికెన్ తీస్క వద్దామని మెల్లగా లేచి చికెన్ షాప్ కు పోయిన”

“సో మంచం కింద ఏముందో చూళ్ళేదు అసలు.?”

“లేదు”

“ఓకే”

“సో, చికెన్ షాప్ కు పోయిన. తలకాయల్లేని కోళ్ళు, మేకలు కనిపించినై.

రెండు కేజీల చికెన్ ఇయ్యవయ్యా అన్న.

ఇంతలో లోపల నుండి ఎదో టపటప మన్న సౌండ్ వినిపించింది. తల తెగి పడిన కోడి ఎదో లోపల ఎగురుతున్నట్టు ఉంది అనుకున్న.

ఇప్పుడే కోసిన ఆ కొత్త కోడి ఇయ్యవయ్యా అన్న షాపు వాడితో.

ఎం కోడి సార్ ఇదే ఫ్రెష్ కోడి అన్నాడు వాడు..

అరె, టపటప సౌండ్ వినిపిస్తలేదా? అని అడిగిన

ఎం సౌండ్ సార్. నాకేం వినిపిస్తలేదు అన్నడు వాడు. మళ్ళీ పైకి చూద్దును కదా, అక్కడ వేలాడ దీసిన కోళ్ళు మేకలన్నీటికీ తలకాయలు వచ్చినై. ఒక్క సారిగ వెన్నులో దడ పుట్టింది నాకు. వరుసగా పోద్దట్నుంచీ ఏవేవో జరుగుతున్నయ్ అనిపించింది.

ఇంతకు ముందు వీటికి తలలు లేకుండె కదా అన్న.

మీకు వడ దెబ్బ తాకి ఉంటది సార్. ఎం మాట్లాడుతున్నరు అసలు అన్నడు వాడు. నాకు తల తిరిగి పోయింది.”

శ్రద్ధగా చెవులు నిక్కబెట్టి మరీ వింటుంది మాధురి. పక్కకు అమిత్ లేడు. చెయ్ కడుక్కోడానికి పోయి ఉంటడేమో అనుకున్నది.

“సర్లే అని వాడిచ్చిందేదో తీస్కొచ్చి ఇంట్లో వంట మొదలు పెట్టిన. ఎండలో బయటకు పోయిన కదా, కొద్దిగ కళ్ళు తిరిగినట్టు అనిపిచ్చి, అట్ల తల వాలుద్దాం అని మంచం మీద ఒరిగిన. అంతే, మళ్ళీ మెలకువ పడే సరికి మూడున్నర అయింది. అప్పుడు వచ్చింది వాసన. ఆ వాసనకు నాకు ఒక్క సారి నిద్ర మొత్తం ఎగిరిపోయింది.”

మాధురి పూర్తిగా శేఖర్ మాటల్లో మునిగిపోయింది. చెయ్యి చెంపమీద పెట్టుకుని శ్రద్ధగా శేఖర్ చెప్పేది వింటుంది.

“ఎం వాసన?”

“కూర వాసన”

“కూర వాసనల అంత కంగారు పడే విషయం ఏముంది?”

“నేనసలు కూర వండనే లేదు కదా.”

“ఆ దొంగే… సారీ, ఆ అదొంగే వచ్చి వంట చేసి పెట్టి పోయి ఉంటాడు అంకుల్” అన్నది మాధురి.

“నేనూ అదే అనుకున్న. కానీ ఇంతలో మంచం కింద నుండి మళ్ళీ సౌండ్ వినిపించింది.”

మాధురి చెవులు నిక్కబెట్టి మరీ వింటుంది.

“కిందికి వంగి చూసిన.. “

“ఏముంది మంచం కింద?”

“మంచం కింద ఏడేళ్ళ నా కొడుకు కనిపించిండు..” ఎదో అబద్దం చెప్పినట్టు లేదు శేఖర్ మొహం. ముఖ కవళికల్లో మార్పు, ఉద్వేగం స్పష్టంగా కనిపిస్తున్నై. మాధురికి ఎం జరుగుతుందో ఈ సంభాషణ ఎటు పోతుందో అర్ధం అయితలేదు.

“.. ఏమన్నడు?” అని మాత్రం అడిగింది.

“నానా ఆకాశం ఎందుకు బ్లూ కలర్ ల ఉంటుంది అని అడిగిండు. నిజం చెప్పాల్నా, అబద్దం చెప్పాల్నా అని అడిగిన.” ఉద్వేగంలో చెప్తూ ఉన్నడు శేఖర్. శేఖర్ కళ్ళల్లో సన్నని నీటి పోర కనిపించింది మాధురికి. ఎదో అబద్దం చెప్తున్నట్టు కూడా లేదు. శేఖర్ మాటలు ఈ దశకు చేరుకున్నాక తనలో కొంచెం భయం కూడా మొదలైంది.

శేఖర్ చెప్తూ ఉన్నడు..

“నానా నాకు చికెన్ కావాలి, తినిపిస్తూ అబద్దం చెప్పు” అన్నడు.

“సరే అని కిచన్లోకి పోయి చికెన్ ప్లేట్ లో పెట్టుకొచ్చి మంచం దగ్గరికి వచ్చిన.. చూస్తె వాడు లేడు.”

“స్కై డైవింగ్ పోయి ఉంటడు అంకుల్” లోపల టెన్షన్ కప్పి పెట్టి పైకి నవ్వుకుంట చెప్పింది మాధురి.

“ఔను మాధురీ, వానికి స్కై డైవింగ్ చేయాలని బాగా కోరిక ఉండే. వాడు బతికుంటే నేను ఏదీ కాదనక పోయే వాణ్ని. చివరికి కోరిక తీరకుండానే వానికి భూమ్మీద నూకలు చెల్లిపోయినై.” కళ్ళల్లో కారుతున్న నీళ్ళని తుడుచుకుంటూ చెప్పిండు శేఖర్ .

మాధురి మోహంలో నవ్వు మాయమైంది.

“నిక్షేపంగా ఉన్న కొడుకుని పెట్టుకుని ఎం మాటలంకుల్ అవీ.. ? మరీ ఇట్లాంటి ఊహలా?”

“ఎం మాట్లాడుతున్నవ్ మాధురీ”

“అదే మీ అబ్బాయ్… అమిత్, మీ డాడీ చూడుఎట్ల మాట్లాడుతున్నడో..” చేతులు కడుక్కోడానికి పోయిన అమిత్ ని ఉద్దేశించి బాత్ రూమ్ దిక్కుగ చూస్తూ చెప్పింది మాధురి.

“అమిత్ బాత్ రూమ్ లో ఉండడం ఎందమ్మా, వాడు పోయి ఇరవై ఐదు యేల్లవుతుంది ఇప్పటికి.”

“ఆపండంకుల్.. ఇట్లాంటి విషయాల్లోనా అబద్దాలు చెప్పేది…” మాధురికి నవ్వు మొహం పోయింది. చెమటలు పడుతున్నై.

బాత్రూం దగ్గరికి పోయింది. తలుపు తీసే ఉంది. లోపల అమిత్ లేడు.

“అమిత్.. అమిత్…” గట్టిగా అరుస్తూ, కంగారుగ ఇల్లంత వెతుకుతుంది మాధురి.

అమిత్ ఎక్కడా కనిపించలేదు.

శేఖర్  మాధురి దిక్కే చూస్తున్నడు.

“అమిత్…అమిత్.. ”

మాధురి పానిక్ అయితుంది.

అరి కాళ్ళు చల్ల బడినై. ఒళ్ళంత చమటలు పట్టినై. గుండె గబా గబా కొట్టుకుంటుంది.

మూడు సంవత్సరాలు.. తమ రిలేషన్..

“అమిత్..”

అసలు.. మాధురికి ఎం అర్ధం అయితలేదు. ఇల్లంతా మళ్ళీ మళ్ళీ వెతుకుతుంది. మంచం కింద పోయి చూసింది. ఇంట్లో అమిత్ కి సంబంధించిన ఒక్క వస్తువు కూడా లేదు. తనకు పరిచయం ఉన్న అమిత్ బట్టలు, లాప్ టాప్, ఎవీ లేవు.

“అమిత్ .. అమిత్ …”

చికెన్, కిచెన్, మంచం, డైనింగ్ టేబుల్, టీవీ, కోళ్ళు, మేకలు, తలలు ఉన్నవీ, తలలు లేనివీ.. మాధురి మస్తిష్కం పదిహేను దిక్కులుగా తిరుగుతుంది. ఆ ఇల్లంతా ఎదో భూత గృహం లాగ కనిపిస్తుంది.

శేఖర్  ఎం అర్ధం కానట్టు మాధురి దిక్కే అయోమయంగ చూస్తున్నడు.

“అమిత్ …” మాధురి కళ్ళు తిరిగి కింద పడ్డది.

***

మసక మసక గా ఉన్నది. అప్పుడే మెలకువ వస్తున్నది. కళ్ళ ఎదురుగ అమిత్.

“అమిత్”

“థాంక్ గాడ్, యూ ఆర్ ఎవేక్.”

“ఏమైంది నాకు ..” మాధురి అడిగింది.

“తలుపు తెరిచి లోపలికి వచ్చి చూసే సరికి ఇంట్లో స్పృహ లేకుండ పడి ఉన్నవ్. ఏమైంది మాధురి, ఇంటి లోపలకి ఎట్ల వచ్చినవ్. ఎం జరిగింది”

“మీ నాన.. చికెన్.. కిచెన్.. మంచం..”

“ఎం మాట్లాడుతున్నవ్ మాధురి.. మా నాన ఎక్కన్నించి వచ్చిండు? ఆయన పోయి ఫైవ్ ఇయర్స్ అయితే… చికెన్ కిచెన్ ఏంటిది” ఎం అర్ధం కానట్టు అడిగిండు అమిత్.

బాత్ రూమ్, ఇల్లంతా కలదిరిగిన జ్ఞాపకం … అమాయక మస్తిష్కం తట్టుకోలేక పోయింది..

మళ్ళీ కళ్ళు దిరిగి స్పృహ కోల్పోయింది మాధురి.

***

మసక మసక ..

కళ్ళు తెరిచి చూస్తె తనకు కుడి దిక్కు అమిత్, ఎడమ దిక్కు శేఖర్  కనిపించిన్లు.. మాధురి కి ఎం అర్ధం అయితలేదు. అటూ, ఇటూ ఇద్దరినీ మార్చి మార్చి చూసింది.

“ఆర్ యూ ఓకే, మాధురి?” అమిత్ అడిగిండు.

“ఇంతకూ నేనెక్కడున్న?” మాధురి అడిగింది.

“మా ఇంట్లో మాధురి..” శేఖర్  చెప్పిండు.

“వన్ ఓ వన్ ఎ కదా?” మాధురి అడిగింది.

“వన్ ఓ వన్ ఎక్కడిది మాధురి. మా ఇల్లు వన్ ఓ టూ కదా?” అమిత్ చెప్పిండు.

“రేయ్ ఆపురా.. పాపం పిల్ల మళ్ళీ మూర్చపోతుంది. సారీ మాధురి, పార్ట్ వన్ వరకే, నా ప్లాన్. పార్ట్ టూ నీ బాయ్ ఫ్రెండ్ నిర్వాకం. వద్దు వద్దు అన్నా వినకుండా, నా పాత్రకి ట్విస్ట్ పెట్టిండు. ఇది వన్ ఓ వనే” నవ్వుకుంట చెప్పిండు శేఖర్ .

నవ్వాల్నో, ఏడవాల్నో అర్ధం అయితలేదు మాధురికి.

అటూ, ఇటూ ఇద్దరినీ మార్చి మార్చి చూసింది.

**** (*) ****