‘ చాంద్ ’ రచనలు

నేను కాని నేను

డిసెంబర్ 2017


నాది కాని రక్తం తనువంతా నింపుకొని
ఎవరో విడిచిన ఊపిరి పీలుస్తూ
నేను వెలిగించని దీపం వెనుక
సరిపోని పాదాల ముద్రలలో
నన్ను నేను జాగ్రత్తగా జొప్పించుకుంటాను

నువ్వెవరు అని అడిగిన ప్రతీసారీ
అస్తమించని కొన్ని ఉదయాల పేర్లు చెప్పి జారుకుంటాను

అమ్మను
ఆత్మను
నాలో బ్రతకనివ్వను

అద్దాన్ని హృదయాన్ని దాచిపెట్టి
వెలుగును కన్నీటిని పులుముకొని
నాకు నేనుగా ప్రవహించక ప్రసరించక
ప్రపంచాన్ని అంటిపెట్టుకు పోతుంటాను

***

బ్రతకడం తెలీనోళ్లు
నీకోసమో నాకోసమో చచ్చిపోతుంటారు

తెలివిలేని గువ్వలు పువ్వులు
స్వేచ్ఛ స్వాతంత్రమంటూ
రివ్వున ఎగిరి విరబూసిన చోటే…
పూర్తిగా »

స్వేచ్ఛ

జూన్ 2016


ఆకాశం కావాలని తను ఎగిరిపోయాక
నేను, తను విడిచిన కొమ్మ
రాత్రులను చేరదీసి వెలిగిస్తున్నాం

లోపలి నుండి ఒక నీటి వాగు
లేపనమై తోటంతా ప్రవహిస్తూ ఉంటే
పూర్తిగా »

నీ ఇల్లు

జనవరి 2016


ప్రయాసపడి ఒక్కో ఇటుక పేరుస్తూ
కట్టుకున్న నాలుగు గోడలు
మధ్యన ఇంకా పూర్తికాని నువ్వు.

నీ లోపల…

గాలిపటాలను తెంచుకున్న దారాలు
కుప్పగా పోయబడిన పాత బట్టలు

తడిఆరని పడకగది
శూన్యం నింపుకున్న బీరువా
ఉప్పు నీటి మరకలతో వంటగది

నిన్ను మోసుకు తిరిగే ఆమె
నువ్వు పూరించాల్సిన పిల్లలు

***

ఉన్నపాటున అన్నీ వదిలేసి
నీ ఇంటిని ఖాళీ చేయాల్సివస్తుంది

ఇన్నేళ్లుగా దాచిన మాటలు
ఆమెకు చెందాల్సిన క్షణాలు
తిరిగివ్వాల్సిన ముద్దులు
ఎప్పుటికీ అప్పగించలేవు

వాళ్ళు మాత్రం
ఎదపై దాటివెళ్ళిన నీ పాదాల గుర్తులను
పదే పదే…
పూర్తిగా »

ఆ పాట

డిసెంబర్ 2015


తడిసిన రాత్రి గడిచిపోయింది

నేను అదే తోటలో మరో కొమ్మకు వ్రేలాడుతున్నాను

నిన్నటి రంగులనే ఆకాశం మరలా పులుముకుంది

లోలోపలికి
వెలుతురు చొచ్చుకుపోతున్న నొప్పి

రహస్యంలో దాచినవేవో
కన్నులు దాటి జారిపోతున్నాయి

నేను తప్ప అన్నీ పుష్పించాయి

ఆ పాట వినబడుతూవుంది…

***

పదే పదే మనసును తడుతున్న చప్పుడు
తెరిచే ఓపిక లేక కూలబడిపోయాను

పువ్వులన్నీ వాడిపోయాక
ఏవరో ఈ తోటను కాల్చివేసారు

నడిచిన పాదాల గుర్తులు మాత్రం
ఆ మసిలో వెలుగుతున్నాయి

అదే పాట వినబడుతూవుంది…

***

మరో తోటలో
ఆ పాట వినబడుతూనేవుంది…


పూర్తిగా »

మాటల్లేవు

మే 2015


నువ్వు తడిమి తడిమి వెళ్ళిపోయావు
రమ్మనడానికి నా వద్ద మాటల్లేవు

మాటలన్నీ ఆరిపోయాక
పెదాలు ప్రేమలేక ఎండిపోతాయి

***

ఇసుక దేహాన్ని
కూలకుండా హత్తుకోవడం కష్టం

మరిచిపోవడాలొద్దు
మారలేకపోవడమే ప్రేమించడం మరి

***

హేతువులేమీ అడుగకు
దాచుకునేటంత గొప్ప మాటలివ్వలేకే ఈ మౌనం

నిజాలను దాచుకుంది కనుకే
రాత్రి పెదవిప్పదు

***

నువ్వు నేను మాటలు
ఇవి మూడూ కలువవెప్పటికీ


పూర్తిగా »

సెలయేరు

ఏప్రిల్ 2015


నువ్విలాగే పారుతూ ఉండు
నీ వద్దకు వచ్చి దోసిళ్ళతో పలకరిస్తాను

ఈ ఎదపై నువ్వు దాటిన గుర్తులు
లోపలి పొరల్లోనికి ఇంకిన చెమ్మ
గలగల లాడే పాటలాంటి నీ మాటలు

ఇంకేం కావాలి నేను చిగురించడానికి.

ఈ చిల్లుల సంచిలో నిన్ను దాచలేక
ఉండిపొమ్మని అడగలేను

ఎండిన ఆకులనో కొమ్మలనో ఇచ్చి వెళ్తావు
అవి ఇప్పటికీ నాతో మాట్లాడుతుంటాయి

చల్లగా ముద్దాడి పోతూ
ఈ రాళ్ళ కుప్పను తిరిగి ఏమీ అడగవు.

నిశ్చలమైన తీరాన్నై
నిన్ను పారనివ్వడం తప్ప ఏమీ చేయలేను


పూర్తిగా »

సశేషం

మార్చి 2015


ఇచ్చిపుచ్చుకోవడానికి మాటలేమీ లేనప్పుడు
ఒకరిలో ఒకరు నింపబడటం ప్రారంభమవుతుంది

ఇనుప స్తంభాలకు హృదయాలను అతికించడం
బోర్లించిన పాత్రను దాహాన్ని తీర్చమనడం ఒక్కటే

మనసు ఒక చుక్కగా ఆగాల్సినపుడు
కామా పెడుతూ కొత్త అక్షరాలు నేర్వాల్సిందే

హేతువులేమీ దొరకని పరిశోధనను
ఒక ప్రశ్నను పాతిపెట్టి మరలా మొదలు పెట్టాలి

***

మంచు శిల్పాలు అరచేతులలో నిర్దయగా కరిగిపోయినా
అకస్మాత్తుగా పడిన వర్షానికి గొడుగులా తడుస్తున్నా
ఒక వికసించిన ఉదయంలోకి నెట్టబడక తప్పదు

చించేసిన కాగితాలతో మాటలు ఎగిరిపోవడం
లోపటి అరలలో బాల్యాన్ని పదే పదే తడుముకోవడం
నవ్వడం, ఏడ్వడం అన్నీ జీవించడానికి వెతుక్కునే కారణాలు

***


పూర్తిగా »

నేను, ఆమె, అక్షరాలు…

ఫిబ్రవరి 2015


నేను, ఆమె, అక్షరాలు…

మాట్లాడటానికి ఏమీలేక,  పుష్పించడానికి అవకాశం లేక, శూన్యంలా కుప్పగా పోయబడటాన్ని రాయడానికి అనుకూలమైన స్థితి అనుకుంటాను. నాలో మొత్తం దహించబడిన తర్వాత మసిబారిన మనస్సును కాగితం మీద గీస్తూవుంటాను. చితికిన గాయాలు స్రవిస్తుంటే జీవిస్తున్న అనుభూతిని అక్షరాలలో నింపుతుంటాను.రెప్పల మధ్యన ప్రశ్నలు జారిపోతుంటే పదాలుగా పేర్చి దాచుకుంటాను.వ్రాయడానికి వేదనకంటే గొప్ప ప్రేరేపణమేది?

ఆమె గురించి తప్ప నేనేదీ వ్రాయలేదు. ఆమెను చంపిన ప్రతీసారీ నా నుండి పుడుతూనే ఉంటుంది. పువ్వులు నలిగిపోయిన చోట, గాజు గది పగిలిపోయిన చోట ఆమె కోసం కవిత్వాన్ని లేపనంగా పూస్తూ ఉంటాను. ఇచ్చిపుచ్చుకోవడానికి ఏమీలేక గాయాలను ముద్దాడటమే ప్రేమించడం మాకు.రాత్రిని నింపుకున్న ఆమెపై నేను మాటనై చల్లగా కురుస్తుంటే…
పూర్తిగా »

సంవత్సరాంతమున

జనవరి 2015


సంవత్సరాంతమున

సంద్రంలాంటి కాలంల
నేను, సంవత్సరాలు
చస్తూ పుడుతూ ఉన్నాం

రోజులను దులిపినప్పుడు
గుణించిన క్షణాలు
దుమ్ములో రాలిపోతున్నాయి

తరగని దూరాలకి
పెరుగుతున్న గీతల్ని
చెరుపుకొని పరిగెడుతున్నా

***

నిన్నగా మిగిలే ప్రతీ రోజులో
నన్ను కొంత కోల్పోకా తప్పదు

చిరిగిన జేబులో దాచిన ఆశలు
జారిపోతే ఎవరిని నిందించాలి

గతమే నిజం కనుక
గడవనిదే నేనీక్షణాన్ని నమ్మలేను

***

సంవత్సరాకి నాదొక విన్నపం

నువ్విలాగే ప్రవహిస్తూ ఉండు
నేను జీవించడానికి సరిపడే వేదన తోడుకుంటాను
నువ్వు మరలా వచ్చినపుడు
చచ్చిన దేహానికి క్రొత్త బట్టలు తీసుకురా

నీతోపాటుగా నేనూ…
పూర్తిగా »

ఒక పలకరింత

డిసెంబర్ 2014


ఒక పలకరింత

నిన్ను పలకరించాలని ఆశగా వచ్చాను

ఇక్కడ నువ్వు లేవు

అలసిన దేహమొకటి తగిలించి వెళ్లావు
తొంగి చూస్తే లోపల నలిగిన మనసు

ఒకొక్క మడత విప్పుతుంటే
గాజు గది ఒకటి పగులుతున్న చప్పుడు

పారుతున్న నేను తప్ప
నా దగ్గర లేపనమేమీ లేదు పూయడానికి

***

ప్రేమగా ఆ గాయాలను తడమనివ్వు
నీతో కలిసి వర్షించడం తప్ప ఏమిచేయగలను

హృదయాలను ఇచ్చి పుచ్చుకోవడానికి
వేదన కంటే మధురమైన హేతువేది


పూర్తిగా »