కవిత్వం

నేను కాని నేను

డిసెంబర్ 2017

నాది కాని రక్తం తనువంతా నింపుకొని
ఎవరో విడిచిన ఊపిరి పీలుస్తూ
నేను వెలిగించని దీపం వెనుక
సరిపోని పాదాల ముద్రలలో
నన్ను నేను జాగ్రత్తగా జొప్పించుకుంటాను

నువ్వెవరు అని అడిగిన ప్రతీసారీ
అస్తమించని కొన్ని ఉదయాల పేర్లు చెప్పి జారుకుంటాను

అమ్మను
ఆత్మను
నాలో బ్రతకనివ్వను

అద్దాన్ని హృదయాన్ని దాచిపెట్టి
వెలుగును కన్నీటిని పులుముకొని
నాకు నేనుగా ప్రవహించక ప్రసరించక
ప్రపంచాన్ని అంటిపెట్టుకు పోతుంటాను

***

బ్రతకడం తెలీనోళ్లు
నీకోసమో నాకోసమో చచ్చిపోతుంటారు

తెలివిలేని గువ్వలు పువ్వులు
స్వేచ్ఛ స్వాతంత్రమంటూ
రివ్వున ఎగిరి విరబూసిన చోటే రాలిపోతాయి

నేనూ ఈ ప్రపంచమూ
మరో నేను కాని నేనుగా మార్చబడుతూ
బ్రతికే వుంటాము