కవిత్వం

నీ ఇల్లు

జనవరి 2016

ప్రయాసపడి ఒక్కో ఇటుక పేరుస్తూ
కట్టుకున్న నాలుగు గోడలు
మధ్యన ఇంకా పూర్తికాని నువ్వు.

నీ లోపల…

గాలిపటాలను తెంచుకున్న దారాలు
కుప్పగా పోయబడిన పాత బట్టలు

తడిఆరని పడకగది
శూన్యం నింపుకున్న బీరువా
ఉప్పు నీటి మరకలతో వంటగది

నిన్ను మోసుకు తిరిగే ఆమె
నువ్వు పూరించాల్సిన పిల్లలు

***

ఉన్నపాటున అన్నీ వదిలేసి
నీ ఇంటిని ఖాళీ చేయాల్సివస్తుంది

ఇన్నేళ్లుగా దాచిన మాటలు
ఆమెకు చెందాల్సిన క్షణాలు
తిరిగివ్వాల్సిన ముద్దులు
ఎప్పుటికీ అప్పగించలేవు

వాళ్ళు మాత్రం
ఎదపై దాటివెళ్ళిన నీ పాదాల గుర్తులను
పదే పదే తడుముకుంటుంటారు.