కవిత్వం

ప్రయాణం

మే 2014

రెండు శ్వాసల మద్య వంతెనలా
అడుగులను పేర్చుకుంటూ సాగిపోవాలి
తెలియని దూరాన్ని
ఆలోచనకు అందినంత కొలుచుకొని
అలిసిపోతే వెనుక పోగేసుకున్న
జ్ఞాపకాలతో మనసు తడుపుకొని
చుట్టూ చీకటిలో నీలో దీపాన్ని
ఆరిపోకుండా జాగ్రత్తపడాలి

***

వద్దనుకున్నా పులుముకున్న రంగులను
అప్పుడప్పుడూ కన్నీటితో కడుక్కుంటూ
నిన్ను నిన్నుగా చూసుకునేందుకు
గుండెల్లో ఒక అద్దాన్ని దాచుకోవాలి
తీపో, కారమో ఏ రుచీ నీ దారిలో
కడదాకా కొనసాగాదని సర్దిచెప్పుకుంటూ
ఎడారిలో నీళ్ళ కోసం కాదు
దప్పికను ఒర్చుకోవడం నేర్చుకోవాలి

***

ఎన్నో అడుగులు నీతో జత కలిసి
ముందో వెనుకో ఆగిపోయినా
ఒంటిరిగానే ముగించాల్సిన పరుగును
నిన్ను కట్టుకుంటూ ఇలాగే పూర్తిచేయాలి
ఎన్నో సార్లు నువ్వు కరిగిపోయిన చోటే
తిరిగి చెక్కబడుతున్న శిలగా ఘనీభవించాలి
వీలైతే నీ గుర్తులను పదిల పరుస్తూ వెళ్ళు
ఏదో ఒక పాదాలకు అవి సరిపోవచ్చు