కథ

చేదుపూలు

ఫిబ్రవరి 2016

1

పేరుకి మరీ దూరం పోకుండా ప్రసాదు అనుకుందాం. చీకట్లో ఇరుకుమెట్లు అలవాటైన వేగంతో ఎక్కి తన గది ఉన్న అంతస్తుకి చేరుకున్నాడు ప్రసాదు. ఎదురింటి గడప మీద నైటీలో కూర్చుని కూతురికి జడేస్తున్న ఎదురింటావిడ అతడ్ని చూడగానే ముఖం గంటుపెట్టుకుని, విసురుగా లేచి, కూతుర్ని లోపలికి లాక్కువెళ్ళి తలుపు వేసుకుంది. ప్రసాదుకి ఒళ్ళు మండింది: “కొజ్జాది ఈమధ్య ఇలా నంగి నాటకాలెందుకు ఆడుతుందో అర్థం కావటం లేదు.

”చిరుద్యోగులూ, బడ్డీకొట్ల వ్యాపారస్తులూ ఎక్కువగా ఉండే ఈ బిలో మిడిల్‌క్లాసు బస్తీలో, ఒక రంగులుమాసిన పెచ్చులూడిన మూడంతస్తుల బిల్డింగులో, ప్రసాదు పెళ్ళి చేసుకునేంత వయసు వచ్చినా, పెళ్ళాన్ని పోషించేంత జీతం రావటం లేదు కాబట్టి బ్రహ్మచారి జీవితం గడుపుతున్నాడు. నగరం చేరినప్పుడు జవసత్వాలతో ఉన్న ఆశలు తర్వాత వట్టిపోయాయి. ఒక చిన్న డయాగ్నస్టిక్ సెంటరులో లాబ్ టెక్నీషియనుగా పని చేస్తున్నాడు. పగలు రక్తపు ట్యూబులూ, ఉచ్చ బాటిళ్ళు, స్పిరిట్ వాసనలూ, ప్రింటరు చప్పుళ్ళ మధ్య పనివేళల్ని గడుపుతాడు. రాత్రుళ్ళు చాపపై వెల్లకిలా పడుకుని, బీటలు వారిన వ్యక్తిత్వపు పగుళ్ళలోంచి అసమర్థతలు విషప్పురుగుల్లా పెల్లుబుకటాన్ని దృశ్యం ఇంకని కళ్ళతో చూస్తూ, నిద్రలోకి జారుకుంటాడు. ఈ రాత్రీ అంతకుమించి ప్లాన్స్ లేవు. తలుపేయగానే ఎదురింటావిడ సంగతి మర్చిపోయాడు. కర్రీపాయింటు నుంచి తెచ్చిన కూరల పాకెట్లని బల్ల మీద ఉంచి, తడి సిగరెట్టుపీకలూ ఖాళీ క్వార్టరుబాటిళ్ళూ ఉన్న సింకులో బియ్యాన్ని కడిగి, కరెంటు కుక్కర్లో పెట్టాడు. నడుముకి తువ్వాలుతో చాప మీద కూర్చొని పాత ఆదివారం మాగజైన్ తిరగేశాడు.

ఇన్ని గదుల నగరంలో సన్నివేశ వైవిధ్యానికి కొదవేముంది. అందం, మలినం, ఆనందం, దైన్యం గోడలతో వేరైన ఒకే రంగంపై ఏకకాలంలో పరిణమిస్తూ ఉంటాయి. అవతలి జీవితాలు ఫర్నిచర్ జరిపినపుడు మాత్రమే తెలుస్తాయి. మహాఅయితే కొట్లాటలూ, టీవీ పాటలు, పసివాళ్ళ ఏడుపులూ, ప్లంబింగ్ అజీర్తి శబ్దాలు… అసలు లోకమే లీలగా వినిపించే లారీల మోత.

తువ్వాలు పైకి జరిపి మోకాలు గోక్కుంటూ ఎవరో సెలెబ్రిటీ జీవితంలో ఉత్తేజవంతమైన మలుపు గురించి చదువుతోంటే సెల్‌ఫోను మోగింది. “ఎలైజా కరుణ కాలింగ్…” అని రావటం చూశాడు. ఆదివారం మేగజైన్ కప్పిన పరాయి వాస్తవాల పొర చిరిగి, అతని మెదడులో కామపు అర తెరుచుకుంది.

అతనికి ప్రయత్నించి ఆడవాళ్ళని దక్కించుకునే చురుకూ, శ్రద్ధా, ఆత్మవిశ్వాసమూ లేవు. అలాగని నిర్లక్ష్యం చేసేంత నింపాదైన కామమూ కాదు. కొనుక్కునేంత అనైతిక తెగువా లేదు. ప్రయత్నించకపోలేదు. అప్రతిహత కామపు ఈదురు అతడ్ని ఒకసారి రైల్వేస్టేషను వెనుక చీకటి సందుల్లోకి విసిరికొట్టింది. ఒక మైకా మెరుపుల ఆడతనం కనిపిస్తే దాదాపు బేరం తెగేదాకా తీసుకొచ్చాడు. కానీ పని కాకముందే పచ్చనోటు బయటకు తీయటమనే ఎడ్డి పని చేశాడు. బెరుకు వాసన ఇట్టే పసిగట్టే అధోజగత్ వృకోదరుడు ఒకడు ఉన్నట్టుండి నీడల్లోంచి రంగప్రవేశం చేసి నోట్లు లాక్కున్నాడు, వచ్చిన దారిన వెళ్ళమన్నాడు. రొచ్చు పనిలో మళ్ళా ధర్మాగ్రహానికి తావు లేదు కనుక కిమ్మనకుండా వచ్చేశాడు. ఇంకెపుడూ అటు పోలేదు. ఊళ్ళో ఒకసారి నపుంసకత్వానికి బలైన ఒక కొత్తకోడలి ఆరాటానికి పూచిన పువ్వుని ఆమెకు అందుబాటులో ఉన్నాడన్న ఒకేవొక్క అర్హత వల్ల రెండు మూడుసార్లు ఆబగా కోసుకోగలిగాడు (మెట్లకీ, డాబాకీ మధ్యనున్న సన్‌షేడ్ మీద, సన్నజాజి పందిరి మరుగు; కింద కటకటాల గదిలోంచి ఆమె మావగారి దగ్గు వినపడగానే తొట్రుపడి స్ఖలనం). సుఖం తెలిసిన ఆమె ఎపుడో పండగలకి మాత్రమే ఊరొచ్చే ఇంతోసి మగతనం కోసం ఓపిక పట్టలేక అలమటిస్తుంటే, ఈలోపులో తావి తగిలిన మరో తుమ్మెద బలమైన ప్రొబొసిస్ తో ఆమెను తెంపుకుపోయింది.

ఆ తర్వాత ఎలైజా కరుణ వచ్చేదాకా అతనికి మరో ఆడది తెలియదు. అది కూడా సొంత ప్రజ్ఞ కాదు. ప్రసాదుకి చంఘిజ్ ఖాన్ లాంటి మిత్రుడొకడు ఉన్నాడు. పెద్ద అందగాడు కాకపోయినా, చేసేది కారు మెకానిక్కు పనే అయినా, ఏదో సహజాత అభినివేశంతో, సానబెట్టిన అనాది కిటుకులతో చుట్టూ ఆడతనానికి లోటు లేకుండా చూసుకునేవాడు. అతనికి పరిచయమయ్యే నాటికి జీవితంలో మంద తప్పిన దూడ ఎలైజా. అందంలేని కారణంగా ఏ జాణతనమూ అబ్బని బేల కవిత్వం. భర్త ఉత్తపుణ్యానికి వదిలేశాడు. ఒక కెమికల్ ఫాక్టరీలో పని చేస్తూ, ఇంటరు చదువుతున్న కూతురుతో నెట్టుకొస్తుంది. చంఘిజ్ ఖాన్ ఆమెలో అణగారిన ఆశల్ని చెదరగొట్టి లేపి, మర్చేపోయిన మగ ఆసరాని చవి చూపించాడు. వయస్సూ అనుభవాల డిగ్నిటీ అంతా పణంగా పెట్టి అతడ్ని అల్లుకుపోయింది. కానీ ఛంఘిజ్ ఖాన్ తనకే అర్థం కాని దేన్నో ఆడదానిలో వెతుకుతూ, అది దొరక్కపోతే నిరాశ బదులు రెట్టించిన తహతహతో ఇంకో మనిషి వైపు పోతూ ఉండేవాడు. వాడి బాధ వాడిది. ఒకర్ని దాటి వెళిపోయింతర్వాత, కన్నీటి కోసం జబ్బ అందించటం లాంటి మొహమాటాలు పెట్టుకునేవాడు కాదు. ఎలైజా విషయంలో ఆ బాధ్యత కొన్ని మలుపులు తిరిగి ప్రసాదు మీద వచ్చి పడింది. అప్పటికే పేగు తెగిన గుడ్డిదైన్యంతో అగ్గగ్గలాడుతున్న ఎలైజా, ఆ పతనంలో అట్టడుక్కు చేరి ప్రసాదుని తాకింది. కనీసం ప్రసాదు అలా అనుకున్నాడు. మొదట్లో, పులి మిగిల్చిన కళేబరాన్ని వంగొంగి తోక ముడుచుకు తినే హైనా తట్టేది. అయినా ఆమెని చేరువ కానిచ్చాడు. రణవిధ్వంసానంతర శిథిల వనంలా ఉంది అప్పుడు. ఎన్నాళ్ళో కాలేదు, నెల క్రితం. ఫ్యాక్టరీకి కూడా తిన్నగా వెళ్ళలేకపోయేది, కూతురికి ఏం వండి పెట్టేదో ఆమెకే తెలియాలి. అటు అందమూ, ఇటు భద్రజీవితమూ లేని ఈ మనిషి ఏ కొంచెమూ రాటుదేలకుండా జీవితంలో ఇంత దూరం ఎలా రాగలిగిందా అని ఆశ్చర్యమేసేది. ఆమె వున్న పరిస్థితిలో ఏమాశించి ప్రసాదు వైపు వచ్చిందో తెలియదు కానీ, అతను మాత్రం బాధ్యతలేని ఉత్సుకత తోనూ, తర్వాత ఎటూ దక్కే అవకాశమున్న ఒంటి రాపిడి కోసమూ ఆమెను చేరనిచ్చాడు. అది తప్ప ఇవ్వటానికి ఆమె దగ్గర ఏదీ లేదనిపించేది. వయసులో అందంగా ఉండేదేమో, ఇప్పుడు లేదు. నిలువు సిజేరియన్ కోతల కాలం నాటి ఆడది, చర్మంపై మెలనిన్ నీడలు, యోని ముతక పువ్వు.

ప్రసాదు ఫోను ఎత్తి మాట్లాడుతూ చిన్న బాల్కనీలోకి వచ్చాడు. కింద స్ట్రీట్‌లైటు వెలుతుర్లోంచి లజ్జగా తొలగి నీడల్లో తచ్చాడుతోంది ఎలైజా. “ఎవరూ లేరు పైకి రమ్మ”న్నాడు.

కాసేపటికి ఆమె అరిగిన హవాయి చెప్పుల తపతపలు, పట్టీల ఘలఘలలూ గుమ్మం దాకా వచ్చి నెర్వస్ నిశ్శబ్దంతో ఆగాయి. తలుపు తీశాడు. నవ్వుతూ లోపలికి వచ్చింది. ఈ నెల రోజుల్లోనూ వీళ్ళ బంధం తీరు చాలా మారింది. మొదట్లో ప్రసాదు “ఎందుకొచ్చిన గోలరా భగవంతుడా” అనుకునేదాకా ఏడ్చేది. ఒక్కోసారి అతని కింద ఉన్నప్పుడు కూడా. ఇప్పుడైతే చంఘిజ్ ఖాన్ ప్రసక్తే రావటం లేదు.

బల్ల మీద ఉన్న కూరల పాకెట్లు చూసి, “అయ్యో, కూరలు తీసుకునేముందు నాకు చెప్పద్దాయ్యా?” అంటూ చెంగు చాటు నుంచి గిన్నె తీసి ఇచ్చింది. టమటాపులుసు మధ్యలో గోంగూర పచ్చడిముద్ద ఒత్తి ఉంది. ఇద్దరూ గోడకి జారగిలబడి కూర్చున్నారు. ప్రసాదు కడుపు లోనీ, కడుపు కిందా ఆకలితో కాలుతున్నాడు. ఆమె గోమునీ, బెట్టునీ, నప్పని కన్నె హొయళ్ళనీ పట్టించుకునేంత సహనం లేదు.

కొంతసేపటి తర్వాత, లోపలికి వెళ్ళి అన్నం కంచంలో పెట్టి తెచ్చుకుని, చాప మీద కూర్చుని తింటున్నాడు. ఆమె నామకహా ఆచ్ఛాదనలతో బోర్లా పడుకుని తలగడ మీంచి అతను తినటాన్ని చూస్తోంది. చూపులో మురిపెం, మాటలో అల్లరి ఉన్నాయి. అతనికి మాత్రం స్ఖలనానంతర వైరాగ్యంతో అదంతా చిరాకుగా ఉంది.

ఇప్పుడు కాదు, ఆమెకు మరో గాయాన్ని బహుమతిగా ఇచ్చి సాగనంపినపుడూ కాదు, ఆమెను మర్చిపోతున్న కాలానికి “ఆమెను మర్చిపోవడం” అనేంత పెద్ద పేరు కూడా పెట్టకుండా మర్చిపోయినపుడు కూడా కాదు–ఎప్పుడో ఈ కాలాన్ని వెనక్కి తిరిగి చూసేంత దూరానికి చేరుకున్నాకా, జీవితం ఇవ్వగల బహుమతుల్లోని అరిపేదతనం పూర్తిగా తెలిసొచ్చాకా, అప్పుడు మాత్రమే ఆమె పూర్ణ స్వభావంతో గోచరమైంది. వ్యక్తిత్వ మొక్కటే కాదు. అందం కూడా. ముఖ్యంగా ఆమె ముఖం. పక్క మీద ఆత్రం తీరిన తర్వాత ఇద్దరూ ఎదురుబొదురు ఒత్తిగిలి పడుకుని కాసేపు కబుర్లు చెప్పుకునేవారు. ఆ భంగిమలో దేహంపై భూమ్యాకర్షణ ఎప్పటిలా కింద నుంచి కాక పక్కల నుంచి పనిచేయటం వల్ల, ఆమె చెంపలకీ, వాటి మధ్య పొదిగున్న చెమ్మ కళ్ళకీ అపూర్వమైన పసి మెరుగు వచ్చి చేరేది. నవ్వు సాంద్రతరమయ్యేది. వయసు మాయమైపోయేది. ఆమెతో పాటు ఒత్తిగిలి పడుకున్నవాళ్ళకి తప్పితే ఇంకెవరికీ కనిపించని అందమది. ఈ బహుమతి విషయంలో జీవితం అతనితో ఉదారంగానే వ్యవహరించింది. పంపకాలు సమంగా జరగని స్తనాలతో, పొట్టతో, పీలకాళ్ళతో కాక, ఆమె స్వభావానికి అమిరే పసితనంతోనే ఆమెను జ్ఞాపకంలో దాచుకోగలిగాడు.

గోంగూర పచ్చడి ప్రత్యేకమైన శ్రద్ధతో తయారైందని తెలుస్తోంది. తింటూండగా తలుపు చప్పుడైంది. అతను కంగారుపడి ఆమెను కంగారు పెట్టాడు. ఆమె దొరికినవన్నీ చుట్టబెట్టుకుని వంటగదిలోకి పరిగెత్తింది. అతను దేవుడే వచ్చినా ఏదోటి చెప్పి పంపేయాలన్న నిశ్చయంతో తలుపు దగ్గరకు నడిచాడు. చిన్న సందులా దాన్ని తెరిచాడు. ఎదురింటావిడ కూతురు.

“పెన్సిలుందా అంకుల్?” అని అడుగుతూనే, అతని వెనక నుంచి ఏమైనా కనిపిస్తుందేమో అన్నట్టు చూస్తోంది.

లేదని తలుపు వేసేశాడు.

మాలోకంగా బుర్ర గోక్కుంటూ ఇటు తిరిగాడు.

లోపల్నుంచి ఎలైజా అతని పిరికి కంగారును వెక్కిరిస్తూ ఆపుకోలేని లేని నవ్వుతో బయటకు వచ్చి, అరకొరగా వేలాడుతున్న చవక సిల్కుచీర ఆమె వేగానికి ఎన్నో చెంగులై ఎగురుతుంటే, వాస్తవమూ స్వప్నమూ స్మృతీ ఇవన్నీ గడప చేరువే అన్నట్టు అధిగమించి, బతికిన ఎడారి విస్తారంలో అతను ఏరుకున్న చక్కందనపు పేలికల దొంతరలో ఆ క్షణపు తానో మనోజ్ఞ చిత్తరువువై నిలుస్తూ, పిల్లాడ్ని చేసి అక్కున చేర్చుకుంది.

2

మరుసటి రోజు ప్రసాదు ఆలస్యంగా నిద్ర లేచాడు. పక్క మీద కొన్ని వడలిన కనకాంబరాలు తప్పితే ఎలైజాతోసహా రాత్రి జాడలేం లేవు. స్నానానికి సిద్ధమవుతుంటే తలుపు చప్పుడైంది. చొక్కా వేసుకు వెళ్ళి తీశాడు. పక్కింటావిడ. అరవయ్యేళ్ళుంటాయి, పొలుసుల చర్మం, పెదవుల మూలల్లో తెల్లగా ఏదో వికారం, స్నానం చేసినా పాచి కడగనట్టుండే ముఖం. ప్రసాదు ఏమిటని అడక్కముందే మొదలుపెట్టింది. పొద్దున్న ఎదురింటావిడ ప్రసాదుని ఎన్నెన్ని మాటలందో ఏకరువుపెట్టింది. ఇదంతా ఎదురింటి తలుపుకున్న తాళంకప్పకు వినపడినా ప్రమాదమే అన్నట్టు గుసగుసగా మాట్లాడింది. “పడుకున్నావామ్మా! అదే అనుకున్నాను బైటికి రాడేంటా అని. రాత్తిళ్ళు నీ గదికి ఎవరెవరో వస్తున్నారంట. ఇవాళ ఏదోటి తేల్చేస్తా అంటా పోయింది ఆఫీసుకి. అదేదో తేల్చుకున్నాక కదా నోరు పారేసుకోవాలి… అయ్యదాని నోరు అదేం నోరు బాబోయ్! మేము పడతానే ఉన్నాం చూస్తున్నావు కదా. ఆమె నోట్లో పడొద్దు నాయనా, మా బాబువి, జాగ్రత్త” అంటూ, బహుశా తనకున్న సందేహాల్నీ భయాల్నీ కూడా ఎదురింటావిడ మీదకి నెట్టేస్తూ మాట్లాడింది. తెచ్చిపెట్టుకున్న అక్కరతో పెదాలు ముందుకు చాచి, ఏదో నిలకడ లేని మృగాన్ని బెరుగ్గా సవరదీస్తున్నట్టు ఆమె మాట్లాడుతున్న తీరు చూస్తే ప్రసాదుకి ముఖం పగలగొట్టాలనిపించింది. ఆమె చెప్పిన విషయం లోపల్లోపల ఆందోళన కలిగిస్తున్నా, పైకి మాత్రం అదేమంత లెక్కపెట్టతగింది కాదన్నట్టు ప్రవర్తించి, ముక్తసరి జవాబులతో తలుపు మూశాడు.

కానీ ఆ రోజు లాబ్‌లో పని చేస్తున్నప్పుడు ఈ విషయం గుర్తొస్తూనే ఉంది. పరధ్యాసగా ఒక డబ్బాకి స్టిక్కర్ అతికించకుండానే యూరిన్ శాంపిల్ కి ఇచ్చేయబోయాడు. ఫ్రంటాఫీసులో పన్చేసే పిట్టవాటం రిసెప్షనిస్టు కపటంతెలీని చనువుతో తను కొత్తగా వేసుకున్న గోళ్ళ రంగు ఎలా ఉందో చెప్పమని చేతులాడించినపుడు, ఆమె తెల్లటి వేళ్ళకు మట్టిరంగు ఏమాత్రం నప్పకపోయినా బానేవుందన్నట్టు అనాలోచితంగా తలాడించాడు. ఊహల్లో ఎదురింటావిడని రకరకాలుగా ఎదుర్కుంటూనే ఉన్నాడు.

ఆమెతో ఇంట్లో దిగిన కొత్తలోనే ఒకసారి పేచీ అయింది. అన్నీ ఫ్యామిలీసే ఉన్న ఆ అంతస్తులో ప్రసాదు ఒక్కడే బ్యాచిలరుగా దిగాడు. చెరోవైపూ రెండేసి చొప్పున నాలుగువాటాలు ఉంటాయి. మధ్యన ఓ రెండుఅంగల వెడల్పుతో చిన్న ఉమ్మడి నడవా. మిగిలిన మూడిళ్ళ ఆడవాళ్ళూ రోజుకొకరి చొప్పున వంతులు వేసుకుని ఆ నడవాని శుభ్రం చేస్తారు. ఇంట్లో దిగిన కొన్నాళ్ళ దాకా అసలు ఇలాంటి ఒప్పందమొకటి నడుస్తోందన్న సంగతే ప్రసాదు గమనించలేదు. ఒక రోజు ఉదయం లేచేసరికి, బయట ఊడ్చే చప్పుడుతో పాటు గట్టిగా మాటలు కూడా వినిపిస్తున్నాయి. కాసేపటికి తన గురించేనా అన్న అనుమానం కలిగి తలుపు తీశాడు. “ఎవరు పడితే వాళ్ళు స్టయిలుగా తొక్కుకుంటూ పోతున్నారు పైకీ కిందకీ. కడగరూ పెట్టరు. మాకే పట్టిందా ఖర్మ?” అంటూ, ఏ మొక్కుబడి మర్యాదా లేకుండా మొదటి పరిచయంలోనే అతడ్ని బద్ధవిరోధిగా నిలబెట్టేసింది. అంత జోరెందుకో ప్రసాదుకి అప్పుడైతే అర్థం కాలేదు గానీ, సంసారంలో ఇరుక్కుపోయిన ఆమెకి బాదరబందీల్లేని తన బ్రహ్మచారి మనుగడే ఒక వెక్కిరింతలా చిర్రెత్తిస్తుందేమోనని తర్వాత అనిపించింది. ఆ నడవా కడగటంలో పెద్ద అభ్యంతరం ఏమీ లేదు గానీ, “ఈ బండది ఇంత దురుసుగా చెప్తే తను చేయాలా” అన్న మనస్తాపంతో ఏదో తిక్కగా మాట్లాడి తలుపు వేసేశాడు. అలా ఇద్దరి మధ్యా శత్రుత్వానికి శంకుస్థాపన జరిగిపోయింది. ఆమె అంతటితో ఊరుకోలేదు. ఆ మరుసటి రోజు నుంచి ప్రసాదు నిద్ర చెదిరేలా కొబ్బరీను చీపురుతో తలుపు మీద చప్పుడు చేస్తూ ఊడ్చటం, తలుపు సందుల్లోంచి నీళ్ళు లోపలికి చిమ్మేలా కడగటం చేసేది. ఇక భరించలేక, పక్కింటావిడ ఇచ్చిన సలహాతో ఒక పనిమనిషిని పెట్టుకున్నాడు. దొరక్క దొరికిన ఆ అర్భకపు పనిమనిషి అస్తమానూ నాగాలు పెట్టడం వల్ల చాలాసార్లు ప్రసాదే లేచి ఊడ్చాల్సి వచ్చేది. పని నుంచి వచ్చాకా విశ్రాంతిగా గడపాల్సిన గది దగ్గర లేనిపోని తంపులెందుకని ప్రసాదు ఎంత వెనక్కి తగ్గినా, ఎదురింటావిడ మాత్రం జన్మాంతర కక్షలున్నట్టే ప్రవర్తించేది.

అడపాదడపా అటునుంచి అతని ఉనికి అంచుల్ని తాకుతూనే ఉన్న పరుషమైన సెగల వల్ల, ఆమె గురించి కొంతైనా ఆలోచన ఖర్చుచేయక తప్పలేదు. పనిగట్టుకుని అంచనా వేసిందెన్నడూ లేదు గానీ, అంతరంగంపై ఆమె దౌర్జన్యపు చొరబాట్లు వదిలిన ముద్రల్ని బట్టి ఆమె కథ ఒకటి అతని దగ్గర పోగుపడింది. అతన్నే చెప్పమంటే అది పెన్నులో విషం నింపి రాసిన కథే అవుతుంది మరి: ఆమె చూట్టానికి చామనచాయలో బరువైన బంతిలా ఉంటుంది. ఏదో ఉద్యోగం చేస్తుంది; ఇస్త్రీ చీర, హ్యాండుబాగూ, పువ్వుల గొడుగుతో బయల్దేరటాన్ని బట్టి ఏదో ప్రైవేటు గుమాస్తా ఉద్యోగం అనిపిస్తుంది. ఇరుగుపొరుగుతో ఆమె మాటల్లో, తెచ్చిపెట్టుకున్న నాజూకు వినిపించేది; ఆ నాజూకుతనం ఎక్కడ అమరుతుందో ఆ వర్గాన్ని చేరాలన్న ఆశ–గుమ్మం వారనున్న ప్లాస్టిక్ క్రోటన్స్ నుంచి కూతురితో మాట్లాడే కొన్ని ఇంగ్లీషు ముక్కల దాకా–వ్యక్తమయ్యేది. ఇలాంటి పైపై సూచనల్ని బట్టి ప్రసాదు కసిగా ఆమెకో గతాన్ని కూడా ఊహించాడు: బహుశా నాన్న గారాబం కింద మగతోబుట్టువులతో సమానంగా పెరిగి, ఎన్నో ఆశలతో యవ్వనం దాటి, పెళ్ళయిన తర్వాత చుట్టూ ఎటు చూసినా ఇరుకు సరిహద్దులు నిట్రాటల్లా మొలుస్తుంటే, చివరికి ఈ పేద బస్తీలోకి వచ్చి పడి, వేసవిలో బండరాయిలాగా అసంతృప్తితో కాలుతున్నదేమో. ఈ క్రమంలో మృదుత్వం పోగొట్టుకుంది. ఆమె పిలకజడలో పువ్వులుంటాయి, బుగ్గలపై పౌడరుంటుంది, మనిషి కాస్త సౌమ్యురాలై ఉంటే ముఖంలో ఇప్పటికీ కనిపించే ఆడతనపు అవశేషాలు ఎంతోకొంత ప్రభావాన్ని కలిగించేవే; అదేం లేకపోవటంతో, ప్రసాదు ఎపుడైనా తన ఏకాకి ఒగుర్పుళ్ళలో ఊహలకి మరీ కరువాసిపోయి ఆమెకు మానసికంగా బట్టలిప్పినా, సుమో యోధుడు పొజిషన్లోకొచ్చి నిల్చున్నట్టే కనిపించి, అతని గుప్పిట్లోని వేడి బలుపు కాస్తా చల్లగా ముడుచుకుపోయేది. ఆమె భర్త మొదట్లో ఏమన్నా పైచేయికి ప్రయత్నించాడో లేదో తెలియదు కానీ, ఇప్పడు మాత్రం చేతులెత్తేసినట్టే కనిపిస్తాడు. బహుశా అతని ఉద్యోగం కుటుంబానికి ఏమీ ఒనగూర్చేది కాదేమో, లేదా పక్క మీద ఆమెని ద్రవింపజేసే చేవ లేదేమో, లేదా ఆమెని చాచి కొట్టింతర్వాత చివుక్కుమని తిరిగొచ్చే పశ్చాత్తాపాన్ని ఎక్కువకాలం ఎడంగా ఉంచటం చేత కాలేదేమో. మొత్తానికి ఏదో ఒక పాయింటు దగ్గర అతని చేతకానితనాన్ని మారుమాటలేకుండా ఖాయం చేసి, కుటుంబానికి ఆమె పురుషాంగమైంది. ప్రస్తుతం దద్దరిల్లే ఆమె వ్యక్తిత్వ ప్రదర్శనల వెనుక నీడలా నిశ్శబ్దంగా తచ్చాడుతూ ఉంటాడు భర్త.

ప్రసాదుకి బ్రహ్మచారి కొంపలు అలవాటే, బ్రహ్మచారుల గాలే పాతివ్రత్య భంగమన్నట్టు తొలగిపోయే కొందరి చిత్రమైన నకరాలూ కొత్త కాదు. కానీ తానే లక్ష్యంగా కురుస్తున్న ఇంత ధారాళమైన ద్వేషం కొత్త. ఆ ద్వేషం తనకు అందుతోందని ఆమెకు సరిగా తెలిసేలా చేయకపోవటం వల్లనేమో, పదే పదే ప్రదర్శించటానికి తయారయ్యేది. ఈమధ్య మరీ ఎక్కువైంది. దానికి కారణం ఎలైజానే అని తట్టినా తట్టనట్టే ఉన్నాడు. అతను కనపడినపుడు తలుపు వేసుకోవడం, అతని గదికి ఫ్రెండ్ ఎవరైనా వస్తే చాలు లోపల బారు ఓపెన్ కాబోతున్నట్టు ముఖం చిట్లించి జడ్జ్ చేయటం, కూతూహలంగా చూస్తున్న కూతుర్ని ఏదో చెడు ప్రభావాన్నించి కాచుకోవటానికన్నట్టు రెక్కపట్టుకుని లోపలికి లాగేయటం లాంటివి చేస్తోంది. ఆమెలో అంతకంతకూ వికృతంగా ప్రతిఫలిస్తున్న తన రూపం చూసుకున్నప్పుడల్లా అతనికి అసహ్యం వేసేది. ఇద్దరికీ పడ్డ ఈ లంకె వల్ల బయటవున్నప్పుడు కూడా ఆమె గుర్తు రావడం మొదలైంది. అతని ఆలోచనలు లలితంగా సాగుతున్నప్పుడు వాటిపై ఉమ్మేసి వెక్కిరించేందుకు ఆమె మనస్సాక్షి వేషంలో లోపలికి చొరబడేది. అతనిలో పెరిగిన కసికి నిదర్శనం ఒకానొక పగటివూహ: ఆమె ఉద్యోగానికి వీధిలో నడిచి వెళ్తున్నప్పుడు వెనక నుంచి హెల్మెట్ ముసుగులో బైకు మీద వెళ్ళి తల మీద మొట్టడం.

ఆ సాయంత్రం క్లినిక్ నుంచి వస్తున్నప్పుడు ప్రసాదు మనసు తుఫాను సూచనలతో గుబులుగా ఉన్న తీరంలా ఉంది. పెళుసు ధైర్యాన్ని కవచంగా ధరించి ఇంటికి వచ్చాడు. మెట్ల ఎత్తు పెరిగినట్టు బరువుగా ఎక్కాడు.

నడవాలో ఇదివరకూ లేని బల్బు ఒకటి పసుపుగా వెలుగుతూ ఆ చోటుకి కొత్తగా రాత్రి వ్యక్తిత్వాన్నిస్తోంది. ఎదురింటావిడ గడప మీద నైటీలో, జడలో దువ్వెనతో కూర్చుంది, అతడ్ని చూసి కదలబోయిన కూతురి భుజం మీద చేత్తో నొక్కింది. ఆ పిల్ల పెద్దాళ్ళ కోసమన్నట్టు లేని కలవరాన్ని నటించబోయింది కానీ, బాల్యపు దిలాసా వల్ల అది అణిచిపెట్టిన చిరునవ్వుగా మాత్రమే వ్యక్తమైంది. పక్కింటి ముసలావిడ కర్టెన్ పట్టుకుని ఏదో మాట్లాడుతున్నదల్లా పొయ్యి మీద పాలు గుర్తు చేసుకుని వెనుదిరిగి వెళ్ళిపోయింది. వెన్ను మీద దృష్టి బరువు మోస్తూ ప్రసాదు తాళం ఎలాగో తీసి లోపలికి చేరి తలుపు వేశాడు. లైటు వేసి, కూరలు బల్ల మీద పెట్టాడు. రాగానే బట్టలు మార్చుకునే అలవాటు మర్చిపోయి, ఇంకా నడవాలోనే తచ్చాడుతున్న మనసుని మోసుకుంటూ, అలికిడి కాకుండా పచార్లు చేస్తున్నాడు. పక్కింటావిడ పాలు కట్టేసి గుమ్మం దగ్గరికి వచ్చినట్టుంది; ఎదురింటావిడ గొంతు మళ్ళీ మొదలైంది. ఆమె మాటల్లో కొన్ని మూసిన తలుపు దాటి వచ్చి అతని చెవుల్ని కటువుగా తాకాయి: “సిగ్గూశరం”, “సంసారులకొంప”, “మర్యాదగా బతుకుతున్నాం”… ఇలాంటివి. ప్రసాదు లోంచి అప్పటికే ఒకడు బయటికొచ్చి, తలుపు తీసివెళ్ళి, దెబ్బలాడేస్తున్నాడు, ప్రసాదుని కూడా రమ్మని గుంజుతున్నాడు. అతని లోపలి దిటవుతో నిమిత్తం లేకుండా కాళ్ళు వణుకుతుంటే, అదేదో ఆకలి వల్ల అయినట్టు, కుర్చీలో కూలబడి, కూరల పాకెట్టు ఒకటి విప్పి, ఉత్తి బంగాళదుంప వేపుడు తింటున్నాడు. ఆమె ఊదరగొట్టడం ఆపలేదు. కాసేపటికి, ఊపిరి తీసుకోవాల్సి వచ్చిందో, అనదల్చుకున్నదంతా అనేసిందో మరి, నెమ్మదించింది. ప్రసాదు ఊరటగా నిట్టూర్చేంతలోనే, మరి పక్కింటావిడ ఏమని ఎగదోసిందో కానీ, ఉన్నట్టుండి గొంతు పెంచి ఒక మాటంది. అది ప్రసాదు చెవులు రిక్కించకుండానే వినపడింది:

“ఆ… ఊరుకోండాంటీగారూ మీరు! ఎవత్తి పద్ధతైన ఆడదో, ఎవత్తి బోకు లంజో నాకు తెలీదా. ముఖం చూసి చెప్తా.”

అస్తిత్వ కేంద్రంలో గుచ్చుకున్న ఈ అవమానంతో అతని ఛాతీ లోంచి మొదలైన వేడి ప్రకంపన ఒళ్ళంతా రోమాంచితం చేస్తూ కళ్ళల్లో ఎరుపు చారల తడిగా ఉబికింది. అతడ్ని అదుపు చేయాలని అన్ని నరాలూ కలవరంగా మూగుతుండగానే, విచక్షణ వడివడిగా చేరి భుజాన చేయి వేసి ఆపేలోగానే, విసురుగా లేచి, తలుపు తీసి, వాళ్ళ ముందుకొచ్చి నిలబడ్డాడు.

“ఏంటి?” అన్నాడు.

ఆమె గడప మీంచే కళ్ళు చిన్నవి చేసి అంది, “ఏంటేంటి?”

“ఎవరి గురించి మాట్లాడుతున్నారు?”

ఆమె పక్కింటావిడ వైపు తలతిప్పి, “ఏంటాంటీ ఈయన ఆడోళ్ళ మధ్య కొచ్చి దూరుతున్నాడు?” అంది.

పక్కింటావిడ కళ్ళలో ఎదురుచూసిన దొమ్మరాట మొదలైందన్న సంతోషం దొరికేస్తున్నా, మాటలో మాత్రం దయనీ పెద్దరికాన్నీ పలికింపజేస్తూ, నచ్చచెప్తున్నట్టు మూతి ముందుకు తెచ్చి అంది, “అయ్యో చెడ్డగా ఏం అనలేదు బాబూ, అక్కయ్య బాధపడుతుంది, చిన్న కుర్రాడివీ, పెళ్ళదీ అవ్వాల్సినవాడివీ, ఏంటిలా పాడైపోతున్నాడు పాపం అంటూను. ఆమెదంతా ముక్కుసూటి కదా, చెప్పటం చేతకాక–”

ఆమె మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ పైకి లేచింది ఎదురింటావిడ, “ఓ ఆంటీ! ఏంటి అక్కయ్యంటున్నారా! నా తమ్ముడే ఇట్లాంటి వేషాలేస్తే చెప్పుదీసుక్కొట్టి దార్లోకి తెస్తా. ఇది ఫ్యామిలీలుండే చోటు, ఉంటే పద్ధతిగా ఉండమనండి, లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపొమ్మనండి. అంతేగాని, లంజలకొంపలో బిహేవ్ చేసినట్టు చేస్తా అంటే ఊరుకునేది లేదు,” అతను అక్కడ లేనేలేనట్టు, పక్కింటావిడతో గట్టిగా పట్టిపట్టి మాట్లాడింది.

“ఊరుకోక ఏం జేస్తావ్. నా ఇంట్లో ఏం జరిగితే నీకెందుకు, ఎవరొస్తే నీకెందుకు. నీ ఇంటికి ఎవరొస్తున్నారో నేను చూస్తున్నానా?” అన్నాడు ప్రసాదు.

“ఇదిగో నువ్వు మాటలు తిన్నగా రానీ,” అతని వైపు తిరిగి చూపుడు వేలు ఆడిస్తూ అంది.

ప్రసాదు అప్పటికే జ్వరప్రలాప దశకు వచ్చేశాడు. “ఏం చేస్తావ్ లేకపోతే?” అంటూ, ఏ క్షణమైనా పట్టు విడిచేట్టున్న కాళ్ళతో, ఒక అడుగు ముందుకు వేశాడు.

పక్కింటావిడ ఇక తన సరదా తీరిపోయినందుకో, లేక పోషించటానికి కొత్త పాత్ర దొరికినందుకో తెలియదు గానీ, ఆ క్షణం ప్రసాదు పాలిట దేవతే అయ్యి మధ్యలోకి వచ్చి కలగజేసుకుంది, “ఓయ్… ఏందల్లా మీరిద్దరూ. ఓయమ్మో నువ్వు లోపలికి పో ముందు,” అంటూ ఎదురింటావిడ భుజం మీద బహుశా అంతకుముందెన్నడూ లేని చొరవతో చేయేసింది. ఆమెని మెత్తగా గుమ్మం వైపు తోస్తోంది.

ఆమె కూతుర్ని నడుముకు చేరవేసుకుని గుమ్మం వైపు కదుల్తూ, యింకా చూపుడువేలు ప్రసాదు కేసి ఆడిస్తూనే, “ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. పోలీసు కంప్లయింటు ఇస్తా ఏమనుకున్నావో,” అంది. “మీరుండండాంటీ,” అంటూ పక్కింటావిడని విదుల్చుకుని లోపలికి వెళ్ళింది.

పక్కింటావిడ ఈసారి అభాసుపాలైన ప్రసాదు వైపు వచ్చి, అతని వీపును తాకుతూ, అవసరం లేనంత మెల్లగా, “పో నాయనా లోపలికి పో! నేను మాట్లాడతాలే,” అంటూ గుమ్మం వైపు తోస్తోంది.

ప్రసాదు వెనక్కి తగ్గనివాడిలా–తనలాగే ఎదురింటావిడ కూడా తలుపు వెనక నక్కి వింటుందని ఊహించుకుంటూ–గట్టిగా అన్నాడు, “కాదండీ ఎక్కువ చేస్తుందామె. నేను ఎపుడైనా ఆమె జోలికి వెళ్లానా. ఏదో రిక్షావోడితో మాట్లాడినట్టు మాట్లాడుద్దేంటీ?” అనటం అన్నాడే కానీ, మళ్ళీ ఈ మాట మీద రెచ్చిపోయి ఎదురింటావిడ ఎక్కడ తలుపు తీసుకు వస్తుందో అన్న జంకు కలిగింది, “ఉండండి, నేను బయటకు వెళ్తున్నాను,” అంటూ పక్కింటావిడ చేయి తీసేసి మెట్లు దిగి చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఆవిడ కాసేపలాగే నిలబడి, అపనమ్మకం నవ్వుతో తల అడ్డంగా ఆడిస్తూ, ఇంట్లోకి వెళ్ళిపోయింది, నడవాలో లైటు ఆరిపోయింది.

ప్రసాదు ఆ రాత్రి టిక్కెట్లు దొరికిన ఏదో థియేటర్లోకి దూరి, సభ్య సమూహం మధ్య వెచ్చగా కూర్చుని, ఎలైజా కరుణ చేసిన పన్నెండు కాల్సూ ఎత్తకుండా కసిగా నొక్కిపారేస్తూ, ఆమెతో సంబంధానికున్న విలువ ఇంకో అద్దెయిల్లు వెతుక్కునే కష్టం పాటి చేస్తుందా అని తర్కించుకుంటూ, తెర మీది దృశ్యాల్నే తప్ప కథ గ్రహించకుండా సినిమా చూడ్డం పూర్తి చేశాడు; రాత్రెప్పుడో మున్సిపాలిటీ వర్కర్లు చలిలో కాఫీలు ఊదుకుంటూ తాగుతున్న వేళకి, ఇక ఆలోచనల దారంచుట్టల్ని విప్పలేక అలసిన బుర్రతో గది చేరి నిద్రపోయాడు.

మరుసటి రోజు పొద్దున్న జరిగిన సన్నివేశాన్ని మాత్రం ఊహించలేదు. తలుపు చప్పుడైతే బిక్కుబిక్కుమంటూనే తీశాడు. బయట ఒక బురఖా ఆవిడ తనని ఇంటి ఓనరుగా పరిచయం చేసుకుంది. ప్రతి నెలా అద్దె ఆమె అకౌంటులో జమ చేసినపుడు ఫోన్లో బొంగురు గొంతు వినడమే తప్ప, మనిషిని ఎప్పుడూ చూడలేదు. బాంకు రశీదులో రాసే పేరుని బట్టి “ఫాతిమా”గా పరిచయం. ఆ బొంగురు గొంతుకీ, ఎందుకో ఆమె పేరుకీ నప్పేట్టే తెల్లగా, బొద్దుగా ఉంది. ఆమె వెంట ఎవరో పన్నెండేళ్ళ పిల్ల ఉంది. తర్వాత ఫాతిమా ప్రవర్తనని బట్టి, తనలాంటి వాడితో మాట్లాడుతోంది కాబట్టి ఆ పిల్లని తోడు తెచ్చుకుందేమో అనిపించింది ప్రసాదుకి. మర్యాదగానే మాట్లాడింది, కానీ చెప్పదల్చుకుంది చెప్పేసింది. ఎదురింటావిడ ఈమధ్య రోజూ ఫోన్లు చేసి ప్రసాదు గదికి ఆడాళ్ళని తెచ్చుకుంటున్నాడనీ, ఫ్రెండ్స్ తో కలిసి తాగుతున్నాడనీ చెప్తోందట. ఆమె పోరు భరించలేకపోతున్నాననీ, నిన్నటికి నిన్న పోలీస్ కంప్లయింటు ఇస్తానని రాద్ధాంతం చేసిందనీ, కాబట్టి ప్రసాదు ఖాళీ చేస్తే ఎవరన్నా ఫ్యామిలీకి ఇచ్చుకుంటాననీ చెప్పింది. చెప్పి వెళ్ళిపోయింది.

ప్రసాదు రోషపు ఊపిర్ల మధ్య చాలాసేపు కదలకుండా కూర్చున్నాడు.

3

కాసేపటికి గట్టిగా నిశ్వసించి కుర్చీ లోంచి లేచాడు, తలుపు తీసి, నడవా దాటి, ఎదురింటావిడ తలుపు తట్టాడు. తలంటిన జుట్టు తువ్వాల్లో చుట్టుకుంది, బొట్టులేని బోసి నుదుటికి అటూయిటూ కనుబొమ్మలు తడిగా అతుక్కుపోయి వున్నాయి. ఆమె వెనకాల ఎవరూ కనపడలేదు. “ఏంటి,” అంది. అతను ఆమెను వెనక్కు నెడుతూ లోపలికి వచ్చి, తలుపు బోల్టు వేసి, “అసలు నేనంటే నీకెందుకే అంత కసీ?” అంటూ ఆమెని అమాంతం మంచం మీదకు తోసి–

–లేదు, అలాంటిదేం జరగలేదు. కొన్నాళ్ళకే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు.

చాలాకాలం తర్వాత, ఒక ఉక్కపోస్తున్న వేసవి సాయంత్రం రన్నింగ్ బస్సు ఎక్కి చోటు లేక నిలబడితే, ఒకావిడ కూర్చోమన్నట్టు పక్కకు జరిగింది. సీటు దొరికిందన్న తొందరలో కూర్చున్నాకా గుర్తుపట్టాడు ఎదురింటావిడని. ఆమె గుర్తుపట్టాకనే కూర్చోమందో, కూర్చున్నాక గుర్తుపట్టిందో తెలీదు గానీ, “ఎక్కడుంటున్నావ్” అని బానే అడిగింది. ప్రసాదు చెప్పాడు. అంతటితో ఆగలేదు. పెళ్ళయిందాని అడిగి, పెళ్ళాంతో మంచిగా ఉంటున్నావా లేక… అని పరాచికమాడి, అప్పటి గొడవల్ని మళ్ళీ గుర్తుకు తెచ్చి, “నాకు నిజంగానే ఓ తమ్ముడు ఉన్నాడు. నువ్వలా చేస్తుంటే నాకు వాడే గుర్తొచ్చి బాధగా ఉండేది” అంటూ–

–లేదు, అలాక్కూడా ఏమీ జరగలేదు. అతను మళ్ళీ ఎదురింటావిడ్ని ఎప్పుడూ చూడలేదు. ఇవి అతనిలోని జెకిల్ అండ్ హైడ్‌లు మూడ్‍ని బట్టి సరఫరా చేసే కొన్ని ఊహలంతే. ఆమె మీద ద్వేషం అలానే ఉంది. ఇప్పటికీ ఆమె ఎపుడైనా జ్ఞాపకం వస్తే, దాంతోపాటే బైకు మీద వెళ్ళి మొట్టినట్టు ఊహ కూడా వస్తుంది. ఎంత స్పష్టంగా అంటే, ఇపుడది ఊహగా కాక జ్ఞాపకంగా మారిపోయింది.

ఆ ఇల్లు మారాకా ఎలైజా కరుణని పూర్తిగా పక్కన పెట్టేశాడు. సిమ్ మార్చినంత సులభంగా మర్చిపోయాడు. కానీ కాలం గడిచిన కొద్దీ ఆమె ప్రభావం నెమ్మదైన వరద మట్టంలా అతని చుట్టూ పెరిగింది. నకళ్ళ వంటి రోజుల్ని అలవాటు మత్తులో నెట్టుకొస్తున్నప్పుడు, కొన్ని క్షణాలు మాత్రం ఆమె చెలికత్తెలై చుట్టుముట్టేవి, గడియారపు పెత్తనం నుంచి అతడ్ని లాఘవంగా తప్పించి తలపులవనంలోని ఆమె చెంతకు చేర్చి మాయమయ్యేవి. తలచుకునేవాడు: “ఎలా ఉంది, ఇప్పటికైనా రాటుదేలిందా, ఒత్తిగిలి పడుకున్న ఆమె అందాన్ని ఇంకెవరైనా కనిపెట్టగలిగారా, కూతుర్ని చక్కగా పెంచిందా, ఆమెకో కొడుకు కూడా ఉంటే ఎంత బాగుండేదీ…” ఇలా అని.

**** (*) ****

కథ Pdf link: https://www.scribd.com/doc/296927884/Chedupoolu-PDF

Illustration: Anwar