కథ

బతుకు తునకలు

మార్చి 2016

ప్పుడు మా ఇంటి పక్కల్నే మార్తమ్మ ఆంటి ఉంటుండె.వరండనానుకొని గింత రూముంటుండె. దాన్ల టాబ్లెట్లు, డెటాల్, సూదులు అన్ని ఉంటుండె. ఇంగ ఆ రూం ఎనకాలె ఒక పెద్ద రూం, వంట రూము పెట్కోని, మార్తమ్మ ఆంటి, ఆంటి కొడుకు ప్రసాదు ఉంటుండ్రి.’ ప్రాథమిక చికిత్స కేంద్రం ‘ అని ఎర్రగ రాసుండే ముందు వరండాల. వరండ గోడ ముందర పాపిట్ దీసుకుని రెండు జల్లేసుకున్న ఒక పిల్ల నవ్వుతుండే పోటో, ఇంగో పిల్లోని పోటో మద్దెల ‘ ఇద్దరు పిల్లలు ఇంటికి ముద్దు ‘ అని రాసుండె. ఎర్రది ప్లస్ గుర్తు ఇంకో గోడ మీదుండె. వరండా ఎప్పుడు జూసిన కాలిగుంటుండె. బెంచీ మాత్రం అట్లనే ఉంటుండె. యాదో, యెప్పుడో కూలిగి బోయెతోల్లు, ఒగ ముక్క ఆగి జరముంటే టాబ్లెట్లు తీస్కొని పొయ్యెతొల్లు.

ఇంగ మేం పిల్లలం ఆడుకుంట, మోకాల్లు గీస్కుంటే, మార్తమ్మ ఆంటీ దగ్గర పర్గెత్తుకుంట బోతే , ‘ సుర్రు ‘ మనే టట్ల టించర్ ఏస్తుండె. దూది పెడ్తుండె.

ప్రసాదు నాకు మంచి ఫ్రెండుండె. డివెండల్, కుంటాట ఫుల్లు ఆడుకుంటుంటిమి. ఇంగెప్పుడన్నా, మార్తమ్మ ఆంటి ఇంట్ల ఉండి వంట అట్ల జేసుకుంట ఉంటే, సప్పుల్లేకుండ పోయ్, నిరోద్ బుడగలెత్తుకొని వచ్చి ఊదుకుంట చేతుల్తో గాల్లోనే కొట్టుకుంట ఆడుకుంటుంటిమి.

నాకు నాపకం వచ్చినప్పడ్నుండి ప్రసాద్ వాల్ల నాయన్ను జూల్ల్య ఎప్పుడు. ఉండాడొ లేదో గూడా తెల్దు నాకి. ప్రసాద్ చెప్పల్య. ఆంటీ చెప్పల్య.

ఆ రోజు , ఎన్నెల్ల మార్తమ్మ ఆంటీ పరిగెత్తుకుంట మా ఇంటికొచ్చ. కండ్ల నిండ నీల్లు పెట్టుకుని ఉండె. మార్తమ్మ ఆంటి తెల్లగుంటుండె. ముక్కు కి ఒగ పక్కన , బియ్యం గింజంత పులిపురి లెక్క నల్లగున్టుండె. ఆంటికి బలే ఒప్పుతుండె. ఆంటి పన మింద , బొట్టు లక్క , పచ్చ బోసుకొని తెల్ల చర్మం కింద యాన్నో, ఆకుపచ్చ బొట్టు దాంకోని ఉన్నట్ల ఉంటుండె.

ఏడుస్తా ఉంది సప్పుడు రాకుండా. మా అమ్మ బాదగా చూస్తా ఉండె. మా ఊరు మొత్తం కరెంట్ పోయిండె అప్పుడు. ఇంట్ల కిర్స్నాయిల్ దీపం పెట్టింటిమి. మార్తమ్మ ఆంటి, కండ్లల నీల్లు మెరుస్తుండె. మా అమ్మ ఉండి ‘ మార్తమ్మ ! ఊర్కో …యేం ఏడ్స్తావ్ లె…ఇంగ ఊర్కో ‘ అని సందాయిచ్చ.

ఆంటీ ఉండి ” వొదినా , వాడు నన్నొదిలి పెట్టి పది సమ్మచ్చరాలాయ. యేం తింటున్నా, యేం చస్తున్నా, ఒక్క లెటర్ గూడా లేదు. ఉలుకు లేదు. ఆడెవతినో పెట్టుకుని , నా మొగం కూడా జూడకుండ పాయ. ప్రసాదు ను ఎట్ల పెంచిన, చూసినావ్ కద ఒదిన ! ” అని కొంగు దగ్గర్ పెట్టుకుని కుల్లి కుల్లి ఏడ్సె.

మా నాయన అప్పుడే లోపల్నుండి, లుంగి కట్టుకుని ” ఏమ్మా , మార్తమ్మా, ఇప్పుడేం నీ బర్త ఏమంటాడు ” అనుకుంటా వచ్చ. మా నాయ్న మార్తమ్మ ఆంటీ జెప్పింది ఇన్నట్టున్నాళ్ళె !

” అన్న! మా యమ్మ వచ్చ. వాడు వస్తానంటాడని చెప్పంపినాడంట. మా యన్న గూడా , మా యమ్మతో , వానితో ఉండమని పోరు పెట్టినాడంట. ఎట్ల జేయల్ల నేను ? పది సమ్మచ్చరాల్నుండి మీరు జూస్తుండారు. నేనెట్ల సంసారం లాక్కొచ్చిన ?! మాయమ్మ కేం తెల్సు. మాయన్న వాల్ల పిల్లల్ని, పెల్లాన్ని సూస్కొనడం తప్ప. ఇప్పుడొచ్చి ‘మార్తమ్మా, నీ మొగున్ని నీ దగ్గర్నే పెట్టుకోవే ‘ అని అన్న చెప్పినాడని ఏడుస్తాది. ”

ఆంటీ ముక్కు తుడ్సుకునె. కండ్లు మళ్ళొ పారి తుడ్సుకొని ” వాడొస్తే , ఏముందింగ. రోజు పెద్ద మాంసం కావాలంటాడు. గౌడ్ వైన్ షాప్ వదిల్రాడు. ఇంతనే కదా ?! పిల్లోడు ప్రసాదుని పట్టించుకుంటడా ? నన్నేమన్నా పట్టించుకుంటడా ? ఎట్లనో ఇన్రోజులు లాగినా గదా ! నాకేంది ఈ బాధ ?! యాసిరికొస్తాది !! ” అని బుక్క బట్టి ఏడ్స్య.

మా యమ్మ ” ఏం చేస్తం, మార్తమ్మ. ఎట్ల గాకున్నా మొగుడు గద ?! పిల్లోడు పెద్దగయ్యాల. ఎన్రోజులుంటావ్ ఇట్ల ?! ” బుజం మీద చెయ్యేసనె.

” యే…. ఊర్క! …నీవ్! వానికి తినిపిచ్చుకుంట తాగిపిచ్చుకుంట, ఈమె ఏం మిగిలిచ్చుకుంటాది ? వాడు ఉద్దోగం సరిగ్గ జేసుకునకుండా, సస్పెండ్ కూడా అయిపాయె. గవర్ణమెంటు ఎప్పుడిస్తాదో మల్ల ఏమో తెల్దు . నీవూర్కొనుండు..” అని మా నాయ్న కొంచెం అరిసినట్లనె మా యమ్మని.

మా యమ్మ కూడా గట్టిగరుస్తాదిలె. మా నాయ్నని ” యే…నీకేం తెల్సు మొగుడు లేకబోతే, ఎట్లుంటది ?! ఊర్కె పీరు సాయిబులెక్క ఊగుతావ్ అంతనే ! కొంచెం లోక నానం ఉండల్ల. లౌక్కెంగా పోవల్ల కద ! మార్తమ్మ మనూరి ఎల్త్ సెంటర్లనే ఉంటదా , జీవి తాంతం ? రేపు నందికొట్కూరు దగ్గర యాదన్నా పల్లెకి ట్రాన్స్ఫర్ జేస్తే ఏం జేస్తవ్ ? ఎట్లుండల్లా ఈమె జెప్పు ? ” గట్టిగడిగ మా యమ్మ.

నేను , కిర్సనాయిల్ దీపం దగ్గర్నే, ‘ రెండొకట్ల రెండు ‘ అని రాసుకుంటుంటి.

మార్తమ్మ ఆంటి ఇంగట్లనే కొంగు చేతిల బెట్ట్కుని, ముకం కప్పుకుని దుక్క పడ్తా ఉండె. కొంచెం సేపు ఆపి, ఇంగ ఇంటికి పాయ. నేనేమో ‘ ఏమప్ప ఇంత బాగుండె ఆంటీ, ఇట్ల ఏడుస్తది ‘ అనుకుంటి

పరుపులేసుకున్నంక , మాయమ్మ, మా నాయ్న మద్దెలో ఎగిరి పండుకుంటి. కరెంట్ రాల్య గాని, సలికాలం టెబుల్ ఫేన్ లేకున్న గని సల్లగుండె.

మా నాయ్న అర్దం బనియనేసుకుని వచ్చి పండుకుని నన్ని గట్టింగ లాక్కునె. నేను మా నాయ్న పొట్ట మింద, కాలేసుకుంటి. మా నాయ్న బలే ఎచ్చగుంటుండె లే !

మాయమ్మ పండుకుని అనె ” ఏందో మార్తమ్మ, బతుకు అట్లైపాయ. మాదేవమ్మ ఈయమ్మ బాద్దెత తీస్కో లేదు. వాల్లన్న మాదేవమ్మతోనే యాదో యట్లనో మార్తమ్మనొప్పిద్దాం ల్య అని పోరు పెట్టింటడు, పెండ్లాము మాటిని, మార్తమ్మని దగ్గర్కి తీలేడు. ” అని ఉసూరు మనె.

మా నాయ్న” వాడొస్తే, మార్తమ్మ పొద్దు బూకుల పెద్ద మాంసం వండడం , వానికి మందు కొనిపిచ్చడం తోనే పోతాది ” అని నా పక్కకి కొంచం జర్గి ఊపిరి గట్టిగిడిసి అనె ” వాడొస్తె, మార్తమ్మ బతుకు తునకలు తునకలై పోతది ఇంగ ! ”

నేను వాల్ల మాటలినుకుంటనే నిద్దర్లోకి పోతి !

* * *

మల్లా రెండ్రోజులయినంక నేను, ప్రసాదు స్కూలు నుండి వస్తా ఉంటే ప్రసాదు ” అమ్మా ! ” అనుకుంటా పరిగేత్తుకొని పాయ. ‘ యాడుందిరా మార్తమ్మా ఆంటి ఈడ ‘ అన్కొని సుట్టు జూస్తి. ఆడ , రమాన్ సాయిబు బంకు కాడ ఆంటి పెద్ద మాంసం కొట్టిచ్చుకుంటా కనిపిచ్చ.

నాకు అది చూసి కసిబిసాయె.

మార్తమ్మ ఆంటి బతుకు తునకలు తునకాలాయనే గద ఇంగ ?!

**** (*) ****