కథ

చిల్లర నాణేలు

నవంబర్ 2015

రోజు సమ్యక్ రెడ్డి కి తాను కూర్చున్న వేదిక తనకు జన్మ ప్రసాదించిన దేవదూతలతో నిండిన పర లోకంలా ఉంది.

డయాస్ మధ్యలో సమ్యక్ పక్కన విలియం థాంసన్ ఆసీనుడై ఉన్నాడు. తెల్లటి కోటు వేసుకుని , ఎరుపు రంగులో మెరుస్తున్న చర్మం , తెల్లగా కాంతులీనుతున్న వెంట్రుకలతో ప్రత్యేకంగా అగుపిస్తున్నాడు. అతని వెనుక సుమారు 150 మంది తెల్ల కోట్లు వేసుకుని నిమ్మళంగా ఆసీనులై ఉన్నారు. మెడ మీద నుండి వాలుతున్న స్టెతస్కోప్ లు వరుస మొత్తానికి వేసిన ముగ్గు లాంటి డిజైన్ లా ఉంది. డాయస్ మీద పడుతున్న ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆ ప్రదేశమంతా కొత్త కాంతులీనుతుంది.

ఇంటర్నేషనల్ మరియు నేషనల్ మీడియా , ప్రభుత్వ అధికారులు, ప్రజలు, డాక్టర్లతో నిండి ఉంది. థాంసన్ మైకు చప్పుడుతో హాలంతా ‘ పిన్ డ్రాప్ సైలెన్స్ ‘ లోకి మారిపోయింది. ఇంగ్లీష్ లో థాంసన్ ఉపన్యసించడం మొదలు పెట్టాడు.

“ప్రపంచం లో 1950 ల లో మొదటి మానవ అవయవ మార్పిడి జరిగాక, ఆ తర్వాత ఆ తర్వాత ఎనభై సంవత్సరాలు గడిచాక భారత దేశం లో మొదటి సారిగా చరిత్ర లో వినూత్న విప్లవ ఘట్టమొకటి చోటు ఏసుకుంది. అది సమ్యక్ రెడ్డి రెండవ జన్మ ! ”

ఒక్క సారిగా హాలు మారుమోగేలా చప్పట్ల శబ్దం !!

చప్పట్ల శబ్దం సద్దు మణిగాక థాంసన్ మొదలు పెట్టాడు .

“మూడు సంవత్సరాల క్రితం అంటే 2027 లో ప్రపంచం లోనే మొట్ట మొదటి ‘ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ‘ మిడిల్ ఈస్ట్ లో జరిగింది. ఈ టెక్నాలజీ పురోగతి చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. అందుకు … ”

సమ్యక్ రెడ్డి థాంసన్ ను పరిశీలిస్తున్నాడు” ఈ వ్యక్తి నాలా ఎంత మంది మనుష్యులను ఇలా బ్రతికిస్తూ వెల్తాడు ?! ఏభై కోట్ల రుపాయలతో నూటా యాభై మంది డాక్టర్లతో మూడు రోజులు నిరవధికంగా ఆపరేషన్ జరగడం ఎన్ని సార్లు సాధ్యమౌతుంది రాబోయే రోజుల్లో ?!”

ఆడియన్స్ ముందు వరసలో డాడీ, మమ్మీ కూర్చుని ఉన్నారు. ఇద్దరి కళ్ళల్లో అద్భుతమైన ఆనందం డాయస్ పై పడే ఫ్లడ్ లైట్ల కాంతిని ఛాలెంజ్ చేసేలా అనిపించింది.

***

సుఖేందర్ రెడ్డి తెలంగాణా రాష్ట్రం లో అతి పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఎన్నో కష్టాలకోర్చి పైకొచ్చాడని జనాలు చెప్పుకుంటారు. ఒక్కగానొక్క కొడుకు సమ్యక్ రెడ్డి ఎన్నో రోజుల నుండి అరుదైన మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ సిండ్రోం తో బాధ పడుతూ మరణానికి చేరువలో ఉండగా మళ్ళీ ప్రాణం పోసుకున్నాడు . తను సపోర్ట్ చేసిన పార్టీనే కేంద్ర ప్రభుత్వం అధికారం లో ఉండడం తో సుమారు వంద మంది డాక్టర్లను మిడిల్ ఈస్ట్ నుండి , చైనా నుండి , అమెరికా నుండి వీసాలు అరేంజ్ చేసి తెప్పించి ఊహకందని విధంగా ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యేలా పూనుకున్నాడు.

డేవిడ్ రాజు తల్లి తండ్రులు కూడా ఊహించలేదు – తమ బిడ్డ ఇంకో ప్రాణాన్ని నిలబెట్టగలడని, అది చరిత్రలో నిలిచిపోయేలా చేయగలుగుతాడని.

తమ కొడుకు డేవిడ్ రాజు ఒక యాక్సిడెంట్ లో మెడ వెనుక నరాలు చిదగడం తో కోమాలోకి వెళ్ళడం వలన డాక్టర్ లు ‘క్లినికలీ డెడ్’ అని డిక్లేర్ చేసారు.’యుథెనెషియా’ లీగలైజ్ చేసాక ఎన్నో ప్రాణాలకు శాంత విముక్తి కలిగింది. అయితే మొదటి సారిగా అది ఇంకో ప్రాణం నిలబెట్టాడానికి వాడాలని తమ ‘యుథెనెషియా’ అప్లికేషన్ చూసి తమను కలిసి అభ్యర్థించాడు సుఖేందర్ రెడ్డి. ధన సహాయాన్ని కాదని తన కొడుకు దేహాన్ని ఏదోలా ఇంకా చూసుకునే ఆనందం మిగులుతుందనే ఉద్దేశ్యం తో ఒప్పుకున్నారు డేవిడ్ రాజు తల్లి తండ్రులు.

డేవిడ్ రాజు తల్లి తండ్రులు మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు. ఆంధ్ర విడిపోయాక ఇక్కడే ఇల్లు కట్టుకుని హైదరాబాదులోనే సెటిలయిపోయారు. వాళ్ళ వంశం లో నగరం వాసన చూసిన మొదటి తరం వాళ్ళది.

***

“సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ థాట్స్ ను మనం ఇప్పుడే ఆపలేము. కొన్ని న్యూరాన్స్ ను బాడీ తో పాటు ఇంపోర్ట్ చేయడం వల్ల ఇది జరుగుతుంది. ఇది దైనందిన చర్యల్లో కొంత మేరకు ‘ నాయిస్ ‘ కలుగ జేస్తుంది. బ్రెయిన్ లో తరంగాలు తాకినట్టు గా ఉంటుంది ఈ నాయిస్. ఇందుకోసం స్పెషల్ టేబ్లెట్, అవసరం అయినప్పుడు వాడితే కొంత సమయం లోపు నెమ్మది కలుగుతుంది. ఇంకా అటువంటి సమయాల్లో కాసేపు పాత వాతావరణం లోకి వెళ్ళి వస్తే ఈ తరంగాలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టి ప్రశాంతతదొరుకుతుంది.’ పాత ‘ వాతావరణం అంటే డేవిడ్ రాజు కుటుంబ సభ్యులతో అహ్లాదంగా ఐదు నిమిషాలు మాట్లాడినా చాలు! ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడ్డం లేదా అతనికి సంబంధించిన వీడియోలు చూసినా సరిపోతుంది. ఈ చిన్న ‘సూపర్ ఇంపోజిషన్’ అలజడి ఒక రెండు మూడు నెలలలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండి తర్వాత పూర్తిగా మాసిపోతుంది. ఆఫ్టర్ ఆల్! Human life itself is not perfect!’ అని కాసేపు ఆగి థాంసన్ సమ్యక్ రెడ్డి వేపు చూసి “Is it not my dear young reddy?’ అని చిరుదరహాసం తో అడిగాడు.

సమ్యక్ రెడ్డి అదే నవ్వు మొహంతో ‘యస్ డాక్’ అనడం తో మరో సారి చప్పట్లు వెల్లి విరిసాయి ఆ హాల్లో.

***

టై కట్టుకుని “డాడీ! యాం లీవింగ్!” అని చక చక మెట్లు దిగుతున్న సమ్యక్, డేడీ చేతిలో కొత్త కార్ తాళాలు చూసి సంభ్రమం తో మెత్తగా హత్తుకున్నాడు. వాళ్ళిద్దరి స్పర్శలో మౌనం ఏదో కొత్త భాష నేర్చుకున్నట్టుంది.

అమ్మ కూడా తానటే వస్తానని తను కూడా కార్ ఎక్కి కూర్చుంది.

రోడ్డు మిద ప్రయాణిస్తున్నాడో, నీళ్ళ మిద ప్రయాణిస్తున్నాడో తెలీనంత స్మూత్ గా ఉంది కొత్త కారులో ప్రయాణం. మంద్రంగా వినిపించే సంగీతం చెవి పక్కనే ఎవరో తన కోసమే పాడుతున్నట్టు ఉంది. అమ్మ వేసుకున్న పర్ ఫ్యూం సుతారంగా నాసికలకు తగులుతుండగా ఏ సీ చల్ల దనం మనసుకు స్వాంతన కలిగించేలా ఉంది. అమ్మ అప్యాయంగా సమ్యక్ చేతి మీద చేయి వేసి కూర్చుని అద్దం లో బయట చూస్తుంది. బయట ఎండ విరగ కాస్తున్నా కార్ లో వెన్నెల వెలుగులో నైట్ క్వీన్ పరిమళాల మధ్యలో సేద తీరుతున్నట్టు ఉంది. కార్ గచ్చి బౌలి లో ఉన్న ఆఫీసు వేపుగా వెల్తుంది. మాధాపూర్ జంక్షన్ లో రెడ్ లైట్ పడ్డం తో డ్రైవర్ కార్ ఆపేసాడు.

ఎటు నుండి వచ్చిందో తెలీదు. ఒక పిల్ల వచ్చి కొత్త కారు అద్దాల పైన కొట్టి బాల్ పెన్నులు చూపిస్తూ కొనమని అడుగుతుంది.

సమ్యక్ ఆ పిల్లను గమనించాడు.12-13 ఏళ్ళుంటాయేమో. జాకెట్ మొత్తం గుండ్రటి అద్దాలు కుట్టుకుని ఉంది. నడుము కింద నుండి లంగా వేసుకుని ఉంది. చెవులకు పెద్ద పెద్దగా వేలాడే గమ్మత్తైన కమ్మలు పెట్టుకుని ఉంది. వెంట్రుకలు సరి అయిన పోషణ లేక ఎర్రగా పీలగా ఉన్నాయి. అద్దం తలుపు తడుతూ దీనమైన ఎక్స్ప్రెషన్ పెట్టి కొనుక్కోమని అడుగుతుంది.

సమ్యక్ నెమ్మదిగా అద్దం దించాడు. సమ్యక్ అమ్మ వెంటనే ” బాబూ ! వద్దు బాబూ !” అని వారించింది.

“ఏం మమ్మీ ? ” అడిగాడు.

” ఈ కార్ అద్దాలు తెరిసి దాన ధర్మాలు చేయడం ఎవరన్నా చూస్తే బాగోదు నాన్నా ! ”

” అబ్బా ! మమ్మీ ! నీది ఛాదస్తం ”

మౌనంగా ఉండిపోయింది సమ్యక్ వాళ్ళ అమ్మ.

అద్దం దించి ” పాపా ! ఎంతమ్మా !” అని అడిగాడు.తెలంగాణా యాసలో ” ఇర్పై రుపాయ్ల్కొక్టి ” అంది.

20 రుపాయలు చేతిలో పెట్టి పెన్నులు తీసుకోకుండానే అద్దం పైకి వేసాడు.

” మమ్మీ !” కారు కదలడం మొదలుపెడుతుంటే అన్నాడు.” నాకు తెలుసు మమ్మీ అలా నీవెందుకు జాగర్త పడుతున్నావో. బట్….ఆ పిల్ల ఎండలో పెన్నులమ్ముతుంది. నేనిచ్చే చిల్లర నాణేలకు అంత ఆలోచన దేనికి ? మనమేస్తున్నాం అని తెలిసి , దానికి వేసే వాళ్ళెవరుంటారు ? వేయకూడదనుకునే వాళ్ళెవరుంటారు ? అయినా మనమేసే ఈ చిల్లర నాణేలు మనక్కూడా ఉపయోగమే. మనలో ఒక మానసిక భారాన్ని తగ్గిస్తాయి కదా ! ”

” కాదు నాన్న. ఈ టైం లో నీవు నీ ప్రశాంతతకు భంగం కలిగే విషయాలకు దూరముంటే మంచిది”

” ఇండియా…. మమ్మీ !” అని నవ్వాడు. కంటిన్యూ చేస్తూ ” పాపం…ట్రైబల్ అమ్మాయి కూడానూ ” అన్నాడు. “ మమ్మీ ! ఇమేజిన్ చెయ్. ఆ పాప తర తరాలు అడవుల్లోనో కొండల్లోనో బతికారు. వాళ్ళ బాబాయి, వాళ్ళ మేనత్త, వాళ్ళ బావ..ఎవరైతేనేం అందరూ అడవుల్లో పుట్టి పెరిగిన వాళ్ళే. ఈ పిల్ల సాహసం చేసి నగరం లో బతుకు తెరువుకు వచ్చింది. అడవుల్లో ఏం మిగుల్తుంది మమ్మీ ఈ రొజుల్లో ? కనీసం నగరం, వాళ్ళకు అడుక్కు తిని అయినా అందరిలో బతకచ్చు అనే ఈ భరోసా కూడా ఇవ్వకపోతే అది మన మధ్య బతకాలనే ఒక అవకాశం కూడా కోల్పోతుంది. పేదరికం సమస్యగా ఉండదు. ఇక బతికే ఆశ కలిగించే అవకాశాలు మూసుకుపోవడం సమస్య అవుతుంది. ఇక ఆ పిల్ల మనుష్యుల మధ్య బతికే కారణం లేపొతే మళ్ళీ అడవినే నమ్ముకోవాలి. ”

” పేదరికానికి ట్రైబల్ అయితేనేం అర్బన్ అయితేనేం రా…తేడా లేదు ”

” ఉంది ! ” చటుక్కున అన్నాడు.

వెంటనే అమ్మ ” సరే ! ” అని టాపిక్ మార్చడం తో ఆలోచనల స్రవంతి తెగిపోయింది.

***

సుఖేందర్ రెడ్డి ఫోన్ చేయడం తో తన కేబిన్ ముందు ఉన్న విజిటర్స్ ను వెయిట్ చేయమని చెప్పమని పీ యే కు చెపి వాళ్ళ నాన్న కేబిన్ లోకి ప్రవేశించాడు.

” వచ్చిన బిడ్స్ చూసావా ? ” వస్తూనే అడిగాడు సుఖేందర్ రెడ్డి.

” ఆ చూసా ” కుర్చీ లాక్కొని కూర్చుంటు సమాధానం ఇచ్చాడు సమ్యక్.

” ఎన్ని వచ్చాయి బిడ్స్ ? ”

” మొత్తం ఐదు వచ్చాయి. అందులో శివగంగ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ డాక్యుమెంట్ లో క్లారిటీ లేదు either on their technical experience or their ability to execute …”

“మ్మ్మ్… లెట్ మి కాల్ చంద్ర రాజు టూ…” అని ఫోనెత్తాడు.

ఫోన్ లో చంద్ర రాజు ను రమ్మని పిలిచాక రిమోట్ తో యే సీ పెంచాడు.

” నీకు యే సీ లో ఉండడం మంచిదని థాంసన్ అడ్వైజ్ …అందుకే ” అని చిన్న నవ్వు తో చంద్ర రాజు రావడం తో ” కం … కం ” అని అన్నాడు.

” చంద్ర ! ఎవరిని ఫైనలైజ్ చేయొచ్చు ? ఇండికేషన్స్ ఎలా ఉన్నాయ్ ? ”

” సర్…..సీ ఎం ఆర్ కన్స్ట్రక్షన్స్ వినోద్ రెడ్డి గారిని ప్రిఫర్ చేయొచ్చు”

సమ్యక్ కంఫ్యూజింగ్ గా మొహం పెట్టి అడిగాడు ” చంద్ర గారు ! మోజస్ కన్ స్ట్రక్షన్స్ ఎల్ వన్ (ఫస్ట్ లోయెస్ట్ ) బిడ్డర్ అన్నారు ?! ”

” అవునండి !…వినోద్ రెడ్డి గారు మేచ్ చేస్తానన్నారు ”

” మరెందుకు ముందే లోయెస్ట్ వేయలేదు ? ” అని కాస్త ఆగి “మోజస్ ను ఇంకాస్త తగ్గించమని చెప్పండి ..I am sure he must be ready to consider ”

” సర్ బిజినెస్ లో ఏవన్నా ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ ఉండడం నార్మలే కదండి. but if we give a chance to reconsider price by Vinod Reddy…he is in ”

చంద్ర రాజు 20 సంవత్సరాల నుండి కంపెనీలో పని చేస్తున్నాడు. అమ్మ కు స్వంత అక్క అయిన మాదేవి పెద్దమ్మ, రాజు లకు చెందిన పెదనాన్నను ప్రేమ వివాహం చేసుకుంది. పెదనాన్నకు వాళ్ళ దూరపు బంధువు అవ్వడం వల్ల, ఆయన సిఫారసు మీద, కంపనీలో అకౌంట్స్ మేనేజర్ గా చేరి బిజినెస్ తో పాటు అంచెలంచెలుగా ఎదిగాడు.

” టెక్నికల్ ఎక్స్పీరియన్స్ క్రైటీరియా ఏం పెట్టారు ? ”

” టెక్నికల్ క్రైటీరియా ప్రకారం వినోద్ రెడ్డి గారు పన్నెండు ప్రాజెక్ట్స్ చేసారండి of similar size and complexity మోజస్ గారు పది ప్రాజెక్ట్స్ మాత్రమే చేసారండి ”

సమ్యక్ రెడ్డికి చికాకు కలిగింది. ” పదికి పన్నెండుకు తేడా ఎంతండి చంద్ర గారు ? ”

చంద్ర రాజు నోరు విప్పే లోపు సుఖేందర్ రెడ్డి ” ఒక్క నిమిషం ” అని తన మొబైల్ లో ఎస్ ఎం ఎస్ టైప్ చేసి పంపాక చెప్పాడు ” వినోద్ రెడ్డి నాతో మాట్లాడాడు ” అంటూ మొబైల్ టేబుల్ మీద పెట్టాడు. చేతిలో రిమోట్ నొక్కి యే సీ రీసెట్ చేసి ” ఇది ఓకేనా ? ” అన్నాడు.

” ఓకే ఎలా డేడీ ? Please convince me. వినోద్ రెడ్డికి మీ యాక్సెస్ ఉంది. మోజస్ కు తగినంత యాక్సెస్ లేదు. మోజస్ కు కూడా ఛాన్స్ ఇవ్వాలి అనిపిస్తుంది నాకు ”

సుఖేందర్ రెడ్డి టేబుల్ మీదకు కొద్దిగా వంగి చెప్పాడు ” మనకు మోజస్ అన్నా వినోద్ రెడ్డి అన్నా స్పెషల్ ప్రేమ లేదు. మన బిడ్డింగ్ క్రైటీరియా లో బ్రహ్మాండమైన మెరిట్ ఏమీ లేదు. మోజస్ ఇంకో రెండు ప్రాజెక్ట్ లు తక్కువ చేసినా వినోద్ ఇంకో రెండు ప్రాజెక్ట్ లు ఎక్కువ చేసినా ఫరక్ లేదు. We are not planning to build a space craft here” ఓ వేపు తల విదిలిస్తూ అన్నాడు ” వినోద్ రెడ్డి వచ్చే ఎలక్షన్స్ లో ఎం పీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయ్ . మనకు ఆయనతో రిలేషన్ మన అభివృద్ధికే ఉపయోగ పడ్తుంది రానున్న రోజుల్లో ”

సమ్యక్ టేబుల్ కు ఆనుకున్నాడు ” డేడీ ! got you and…. thats fine!.. బట్ నాకు వేరే perspective ఉంది ”

” చెప్పు ” అన్నాడు సుఖేందర్ రెడ్డి.

” మోజస్ లో ప్రాజెక్ట్ ఎగ్జుక్యూట్ చేయడానికి కావాల్సిన సిన్సియారిటీ ఉంది అనే నమ్మకం మెరుగ్గా ఉంది. మోజస్ వ్యాపారం ఎదుగుతుంది.అందుకే పాలిటిక్స్ లోకి వెళ్ళాలని కోరుకోవడం లేదు ”

” మోజస్ ను ఎవరూ తీసుకోరు కూడా ” అన్నాడు సుఖెందర్ రెడ్డి వెంటనే ” మన ఎదుగుదలకు వినోద్ రెడ్డి ఎక్కువ అవసరం. అదొక్కటే ఇక్కడ క్రైటీరియా ఇక ”

” కాదనటం లేదు. Infact వినోద్ రెడ్డి కూడా ఎదగడానికి మనం ఉపయోగపడ్తున్నాం. ఐతే మోజస్ కు ఉపయోగ పడితే ఒక నమ్మకమైన వెండర్ ను లాంగ్ టర్మ్ దృక్పథం తో తయారు చేసిన వాళ్ళౌతాము. మోజస్ కు చిన్న పుష్ అవసరం. అది మనమిస్తామంటే ఇక మనల్ని ఎప్పటికీ వదలడు. వినోద్ రెడ్డి వద్ద ఆ అష్యూరెన్స్ లేదు ”

చంద్ర రాజుకు ఇది తాను కన్విన్స్ చేసే విషయం కాదని అర్థమయ్యింది. ఏదో ఫోన్ వస్తున్నట్టు కేబిన్ పక్కకెళ్ళాడు. సమ్యక్ చెప్ప దల్చుకున్న కోణం లో సుఖేందర్ రెడ్డి ఆలోచించక కాదు.

కొడుకునే చూస్తున్నాడు. తను వేసుకున్న కోటులో ఏదో అనీజీ ని అడ్జస్ట్ చేసుకున్నాడు.

” సమ్యక్….” పిలుస్తున్నట్టు అన్నాడు.

సమ్యక్ ” ఆ డేడీ…” బదులిచ్చాడు. సుఖేందర్ రెడ్డి కేబిన్ లో గోడ మొత్తం అద్దం తో చేసి ఉంటుంది. దాని స్క్రీన్ కర్టన్ అడ్జస్ట్ చేస్తూ చెప్ప సాగాడు.

” Moses is definitley a good business man. He grew up with not much support. కాపోతే మన గ్రోత్ పాత్ లో ఫిట్ అవ్వడు. మనతో పాటు అభివృద్ధి చెందుతాడు మనతో పాటు లాంగ్ టర్మ్ లో నిలబడతాడు అన్న అంశానికి నేను కూడా సబ్ స్క్రైబ్ చేస్తున్నా. మోజస్ సర్వీసెస్ మనమీ ప్రాజెక్టులో ఉపయోగించుకుంటే…ఈ క్షణం లో మనకు బెటర్ ఆ కాదా అన్నదే ప్రశ్న.”

వచ్చి తన రివాల్వింగ్ చెయిర్ లో కూర్చుంటూ సమ్యక్ వేపు ఓ సారి చూసి మళ్ళీ దృష్టిని అద్దం ఆవల ఉన్న ట్రాఫిక్ చూస్తూ కంటిన్యూ చేసాడు . చూపుడు వేలు , మధ్య వేలుకు మధ్యలో పెన్ను చాక చక్యంగా అటూ ఇటూ తిప్పుతూ అన్నాడు -

” మోజస్ తన మోడల్ కూడా మెరుగు పర్చుకునే దిశలో పని చేస్తుంటాడు. చేయనీ…. సరి అయిన సమయం లో మనం అతని సర్వీసులను ఉపయోగించుకుందాము. వినోద్ రెడ్డి కి ఈ ప్రాజెక్ట్ చూపితే బేంకు లోన్ పెరిగే అవకాశం కూడా ఉంది. ఏదోలా పవర్ లో కొస్తాడు. ఒక వేళ ఈ ప్రాజెక్ట్ మధ్యలో వదిలేసినా మనకు మోజస్ లాంటి వాళ్ళు ఉండనే ఉన్నారు. ఎదగాలనుకున్న మోజస్ మళ్ళీ ఇదే ప్రాజెక్ట్ ను కళ్ళకద్దుకుని తీసుకుంటాడు…. we are playing perfectly a safe and sustainable business ”

సమ్యక్ సాలోచనగా చూసాడు. వెంట్రుకల్లో రెండు చేతులు పెట్టి విలాసంగా ఓ సారి దువ్వి నవ్వాడు.

సుఖేందర్ రెడ్డి కూడా నవ్వేసి సెక్రటరీకి ఫోన్ చేసి బిడ్ విన్నర్ కు లెటర్ దిక్టేట్ చేయ సాగాడు.

సమ్యక్ నెమ్మదిగా నడుచుకుంటూ తన కేబిన్ వేపు అడుగులు వేసాడు. కేబిన్ లో ఎంటర్ అవుతుంటే సెక్రటరీ అడిగాడు ” సర్….ఆర్ యూ ఓకే ? ” అని

” ఏం ?…. Am I not looking good ? ” సందేహిస్తున్నట్టు అడిగాడు.

” అలా కాదు సర్….ఏమో మిమ్మల్ని చూస్తే అలా అనిపించింది ”

అతని వెన్ను తడుతూ తలుపు తెర్చుకుని తన కేబిన్ లోకెళ్ళాడు.

“ వ్యాపారం లో ఒక్కో ప్రాజెక్ట్ , ఒక్కో చిల్లర నాణేం మోజస్ కు. అలాంటి ఎన్ని చిల్లర నాణేలు కూడాగట్టుకోవాలి ఎదగాలంటే ! నాన్న ప్రాజెక్ట్ ఇచ్చాడని ఇంకొకరు కూడా ఆవేశ పడి ఇవ్వరు. కానీ ఇవ్వలేదని తెలిస్తే మాత్రం ఎవరూ ముందుకు రాడానికి ఇష్టపడరు. కంపనీ ఒక నమ్మకమైన కాంట్రాక్టర్ ను కోల్పోయింది. కోల్పోక తప్ప లేదు. అతన్ని కోల్పోవడమే వ్యాపారానికి ముఖ్యమిప్పుడు. పతి ఒక్కరికీ ఒక జీవితపు ఎదుగుదల కో ఫార్ములా ఉంటుంది. అందులో మోజస్ ఖచ్చితంగా ఫిట్ అవుతాడు అన్న గ్యారంటీ లేదు. “ తన ప్రమేయం లేకుండా ఆలోచిస్తున్నాడు సమ్యక్ రెడ్డి.

కుర్చీలోసాగిలపడి కాసేపు విశ్రాంతిగా తల వాల్చాడు. లేచి ఫ్రిజ్ లోకెళ్ళి కూల్ డ్రింక్ కేన్ ఓపన్ చేసి తాగాడు. ఏదో హాయిగా అనిపించింది.
కానీ తెలీని ఇన్ కన్వీనియన్స్!

సెక్రటరీ లోపలైకొచ్చి ” సర్ , మీరు స్పెషల్ టేబ్లెట్ వేసుకోవాల్సిన టైం అన్నారు. ఎం డీ గారు నాకు రిమైండ్ చేసారు ” ఒక చేతిలో గ్లాసు నీళ్ళు ఇంకో చేతిలో టేబ్లెట్ తో నిల్చోని ఉన్నాడు.

మళ్ళీ కూల్ డ్రింక్ పెద్ద సిప్ చేస్తూ తాగాడు. సోడా ఘాటుతో, చల్లగా గొంతు దిగుతుంటే , హాయిగా తోస్తుంది. ఇంకా చల్ల దనం కావాలి అని మనసు కోరుకుంటుంది. మేఘాలను మింగేయాలనే ఆత్రం ఉంది. సమ్యక్ ఎగాదిగా చూసాడు ” నాకు ఆ టేబ్లెట్ వద్దు. వద్దు గాని…, ఒక పని చేస్తారా ? Can you please get David Raju’s parents online once ? I want to talk to them for a while ! ”

” ఓకే సర్…” అని సెక్రెటరీ గబ గబా తన కేబిన్ కు వెల్తూ ఉంటే , ఆశగా అతను వెల్తున్న వేపే చూస్తున్నాడు సమ్యక్ రెడ్డి.

**** (*) ****