లాఫింగ్ 'గ్యాస్'

చదివినోడికన్నా..!

మార్చి 2016

‘సిగ్మా.. సిక్స్’ పేరు విన్నావురా?’

‘నగ్మా పేరు వింటున్నాం.. ఈ సిగ్మా.. నో ఐడియా బాబాయ్!”అనుకున్నాన్లేరా! సిగ్మా అనంగానే కనీసం నీకు సిగ్మండ్ ఫ్రాయిడ్ అయినా గుర్తుకొచ్చుండాల్సింది! ఏం చదువులో ఏంటో!.. ప్చ్ఁ!’విషయం చెప్పు బాబాయ్.. చంపక! ఇంతకూ నీ క్లాసు పీకుడు ఇప్పుడు సిగ్మండు ఫ్రాయిడ్ని గురించా?.. నగ్మా రాజకీయాల్ని గురించా?”రెండూ కాదబ్బీ! చిన్నప్పటి మా ఊరి తిప్పడ్ని గురించి!”తిప్పడ్ని గురించి చెప్పుకోడానికి ఏముంటుందబ్బా! సరే! కానీయ్! లింకుల్లేకుండా నువ్వే డొంకా కదలించవుగా!’

‘ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో మల్టీ నేషనల్ కంపెనీలెన్నో ‘ఎర్రర్ ఫ్రీ’ ఆపరేషన్స్ కోసమని బిలియన్సాఫ్ డాలర్స్ మనీ ధారపోస్తున్నాయ్! అయినా ఎక్కడో కోటికో తప్పయినా దొర్లక తప్పడం లేదు!’

‘కోటికో తప్పంటే గొప్పేకదా బాబాయ్! ఎప్పట్లా నీ దెప్పుళ్లు అక్కర్లేదనుకుంటానే!’

‘కోటికైనా.. పదికోట్లకైనా తప్పంటే తప్పేరా డిప్పకాయ్! ఒక పాయింటులో మిలియన్త్ ఫ్రాక్షన్ మిస్టేకొచ్చినందుకే గదా మొన్నా సూపర్ సానిక్ స్క్రామ్ జెట్టాపరేషన్ అట్లా ‘ఫట్’మనేసింది! మిలియన్సాఫ్ డాలర్సు గాలిలో కలిసి పోయింది! పవర్ గ్రిడ్స్ ఫెయిలయి రాష్ట్రాలకు రాష్ట్రాలు రోజుల్తరబడి అంధకారంలో అల్లాడ్తున్న చరిత్రరా మనది పిచ్చివెధవా! మిస్టేకులనేంటిలే! బ్లండర్సొచ్చి పడ్డా మనవాళ్లకి చీమకుట్టినట్టైనా ఉండదు! పర్ఫెక్షన్ కోసం పడి తపించేవాళ్లకే.. పాయింట్ జీరో జీరో జీరో జీరో ఫోర్ పర్సెంటు పొల్లు దొర్లినా పిచ్చెత్తిపోయేది! ఫరెగ్జాంపుల్.. మన సియమ్ములిద్దరి డబులు ఫింగర్స్ జీడీపీ ఫిగర్సు చూడు..!’

‘విదేశాన్నుంచొచ్చిన ఓ పెద్దమనిషీమధ్య ‘మీకు లాగా ఫిగర్సు మా దేశంలో చూపిస్తే పిచ్చాసుపత్రిలో పారేస్తారు. బెడ్లు ఖాళీలేకపోతే సెంట్రల్ జైల్లో కుమ్మేస్తార’ని స్టేట్మెంటిచ్చేసాడు బాబాయ్ మరీ ఘోరంగా!’

‘విదేశస్తులకిలాంటి విజన్లు బుర్రకెక్కవులేరా! నిజానికా విజన్లు సరైన సూపర్విజన్లో పడితే సూపర్ హిట్లవుతాయని ఇప్పటికీ మన సీయమ్లిద్దరి గాఠ్ఠి నమ్మకం. దానికోసమే పాపం వాళ్ళట్లా నిద్రాహారాలన్నీ మానేసి ఇరవైనాలుఘ్ఘంటలూ పనిచేస్తున్నారు. లెక్కల్లో ఎక్కడో తేడా కొట్టి ఆఖర్లో అన్నీ అట్లా అభాసుపాలవుతుంటే ఆ అభాగ్యులేం చేస్తార్రా పాపాత్ముడా! అధికారులది కదా ఆ జవాబుదారీదనమంతా నిజం మాట్లాడితే!’

‘నిజమే బాబాయ్! జనాభా లెక్కల్నుంచి.. గణాంక వివరాల వరకూ, నీతి ఆయోగు ఫిగర్లు మొదలు.. వార్షికాంత నివేదికల పిల్లి మొగ్గల దాకా.. ఎప్పుడూ ఏవో తప్పులు.. తికమకలు.. తిరకాసులు! జెమినీ సర్కస్ ఆటల్ను మించిపోతున్నాయీ సర్కారీ నౌకర్ల ఫీట్లు!’

‘ఈ కంప్యూటర్లొచ్చినప్పట్నుంచీ మేటర్ మరీ కాంప్లికేటెడ్ అయిపోయిందిరా అబ్బీ! ఎమ్ సెట్ పేపర్లు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, మార్కుల షీట్లు, మార్కెట్ రేట్లు.. గెజిట్లో డేటాఫ్ బర్తుల్లాంటి ఇంపార్టెంట్ మేటర్లో కూడా.. ఎప్పుడూ ఏవో పొరపాట్లు! జనాలకు అలవాటయింది కాబట్టి పట్టించుకొనే నాధుడెవ్వడూ కనిపించడం లేదుగానీ.. సూపర్ స్టార్స్ సినిమా రిలీజ్ డేట్లూ.. క్రికెట్ హీరోల ట్రాక్ రికార్డులూ.. లాంటివాటిల్లో గానీ తేడాలొస్తే చూడూ! పేడముద్దల్తో చాలా గొడవలయిపోతాయిరా బాబూ రోడ్లు! ‘

‘గెజిట్లో డేటాఫ్ బర్తంటే గుర్తుకొచ్చింది బాబాయ్! మొన్నామధ్య మన సిటీలో పేద్ధ పేరున్న గవర్నమెంటు డాక్టరొకాయన మర్చిపోయి మూడేళ్ళు ముందు పుట్టేసాట్ట! రిటైర్మెంటు ముందుగానీ పాపం ఆ పొరపాటు గుర్తుపట్టలేక పోయాట్ట! పట్టుబట్టి గెజిట్లో ఇప్పుటికైనా ఆ తప్పు సరిచేయించేసుకున్నాడు గదా!అయినా మెప్పేదీ! సిన్సియారిటీకీ లోకంలో చోటేదీ! చేసిన తప్పును యాభై ఏళ్లకయితేనేం.. సరిచేసుకోడానికి ఎంత గొప్పమనసు కావాలి! డాక్టరుగారిని అభినందించాల్సింది పోయి.. అభిశంసిస్తున్నారంతా! కొంతమందైతే మరీ కన్నీరు మున్నీరయిపోతున్నారని కూడా వార్తలొస్తున్నాయి’

‘నిజమయితే కావచ్చు గానీ.. నువ్వు మాత్రం మాటి మాటికీ నా మాటలు ట్రాకుమార్చాలని చూస్తున్నావు! నన్నెందుకలా ఏమర్చాలని చూస్తున్నావురా?’

‘సారీ బాబాయ్! సావాస దోషం! సరే! తిప్పణ్ని గురించి కదా నువ్వేదో చెప్పుకొస్తున్నావూ! చెప్పు.. చెప్పు!’

‘అక్కడికే వస్తున్నా! డైరెక్టుగా పాయింట్ కెళితే నీ బోటివాడికి మేటరు సూటిగా బోధపడదని తెలుసు. కనకనే ఇన్నేసి ఎక్జాంపుల్సు ! ఇంకొక్క ముఖ్యమైన ముక్కా చెప్పి మన తిప్పడి కథ దగ్గరికొచ్చేస్తా!’

‘అలాగే!.. కానీయ్ బాబాయ్!’

‘పేపర్లో చూసాన్రా! ముంబయిలో డబ్బావాలాలు ఎర్ర ఏగానీ ఖర్చు లేకుండా ‘సిగ్మా.. సిక్స్’ స్టాండర్డ్స్ సాధించేసార్ట!

‘సిగ్నా సిక్సా? అంటే?’

‘పది లక్షల పనులు చెస్తే అందులో కేవలం మూడుకి మించి మిస్టేకులు దొర్లకపోవడం! డబ్బావాళ్లు చేసే కోటిన్నర పన్లలో కేవలం ఒక్క పొరపాటే దొర్లుతున్నదని ఆ మధ్య ఇంటర్నేషనల్ మేగ్జైనేదో ఒకటి సర్వే చేసి మరీ సర్టిఫికేటిచ్చింది. చదువూ సంధ్యా లేనోళ్లు ఒక గుంపుగా తయారై కంప్యూర్లకన్నా కరెక్టుగా లక్షలాది భోజనం కారియర్లను వందల కిలోమీటర్ల దూరానున్న శివార్లనుండి సిటీలోకి టయానికి ఠంచనుగా చేరేస్తుంటారని విని అవాక్కయ్యాన్రా! ‘నిజంగా మనం ఇండియాలోనే ఉన్నామా!’ అంటూ ఒకటికి రెండుసార్లు గిల్లుకొనిగానీ నిర్ధారణకు రాలేకపోయానురా చిన్నా!’

‘ చదువూ సంధ్యా లేనోళ్లు.. లెక్కా డొక్కా రానోళ్లు తప్పులెలా చేస్తార్లే బాబాయ్! పోనీ.. పొరుగురాష్ట్రమేగా ఆ డబ్బావాలాలది! అలాంటి వాళ్లను కొద్దిమంది బుద్ధిమంతుల్నైనా పోగేసి తెచ్చుకొని పని నడిపించుకోవచ్చుగా! ముఖ్యమంత్రులిద్దరికో సలహా పారేయచ్చుగా!’

‘మన రాష్ట్రాల్లోకూడా అలాంటి టేలెంటు వున్నవాళ్ళు ఊరికి మినిమమ్ పదిమందుంటార్రా బాబూ! ఉదాహరణకి మా ఊరి తిప్పణ్నే తీసుకో! ఊరు మొత్తానికి వాడిదొక్కటే మైలబట్టలు ఉతికే కుటుంబం. వాడికి ఉన్నదీ ఒక్కటే గాడిద. రెండొందల గడప.. గడప గడపకీ పది శాల్తీలు! సగం గడపల్లో సగం మందైనా రోజుకొక్క జత ఉతుక్కి విసిరేసినా.. సుమారు వెయ్యిబట్టల తుక్కు తేలుతుందిరా చివరికి చిన్నోడా! వీటిలో మళ్లీ ఎన్ని వెరైటీలు! చీరలు.. ధోవతులు.. జాకెట్లు.. ప్యాంట్లు.. అంగీలు.. లుంగీలు! లోపలివి.. బైటివి! లోపాయకారీగా వాడుకొనేవి! చిరిగినవీ.. రంగులు పోయేవీ.. గుండేసి పేల్చినా డాగులు పోనివి! అన్నింటినీ ఇంటిటికీ తిరిగి మూటలు కట్టుకొని రేవులో ఉతికి .. ఆరేసి.. సాయంకాలానికల్లా మల్లెపువ్వులకు మల్లే మార్చేసి.. మళ్లీ ఎవరి తొడుగులు వాళ్లకి ఏ తేడా పాడా రాకుండా.. తడబడకుండా చేరవేస్తున్నాడు తిప్పడు! ఏళ్ల తరబడి ఏ తప్పులు లేకుండా సేవ చేస్తున్నాడు! వాస్తవానికి మా తిప్పడులాంటి వాళ్ల ‘ఆపరేషన్ వాషింగ్’ ముందర ఈ ‘సిగ్మా సిక్స్’ లెక్కలెన్నైనా బలాదూర్!’

‘నిజమే బాబాయ్! మీ తిప్పడి ‘సక్సెస్ గ్రాఫు’ వెనకున్న సీక్రెట్ ఫార్ములా ఏదో పసిగట్టి మన ముఖ్యమంత్రుల చెవుల్లో ఊదేయచ్చు కదా! రెండు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రులూ కాకిలెక్క బాపతుల్తో కుస్తీలు పడుతున్నారు పాపం!’

‘ఆ ఉద్దేశంతోనే మొన్న పెద్దపండక్కి మా ఊరెళ్లినప్పుడు తిప్పణ్ని పట్టుకున్నాన్రా గట్టిగా ఎట్లాగైనా ‘ట్రేడ్ సీక్రెట్’ కక్కించాలనీ!’

‘కక్కాడా మరి?’

‘ఆహాఁ! ‘ఇందులో నా గొప్పతనమేం లేదు బాబయ్యా! అంతా మా గాడిదగాడి గడుసుదనమే! గుడ్డలమూట వాసన చూస్తే చాలు.. గడప గుట్టంతా ఓండ్ర పెట్టేస్తుంది ముండాఖాన్! దాని తోక పట్టుకొని నెట్టుకురావడమే ఇన్నాళ్ళు మేం చేస్తున్న ఘనకార్యం’ అనేశాడ్రా!’

‘ఈ లెక్కన మన రాష్టాల్లోని గాడిదలన్నీ సర్కారోళ్లకన్నా..!’

‘ష్ష్! గట్టిగా అనబోకబ్బీ! గొడవలయిపోతాయి! రోజులసలే బావో లేవు! గవర్నమెంటు పన్లు బోలెడు గందరగోళంగా నడుస్తున్నాయి కదా ఈ మధ్య మరీను! స్పెషల్ రిక్రూట్ మెంటు స్కీంలాంటిదేదైనా లాంచ్ చేయించి తిప్పడిగాడి గాడిదల్లాంటివాటికైనా అప్పచెప్పేస్తే కొన్నైనా పన్లు సక్రమంగా సత్వరమే పూర్తవుతాయేమో.. చూడాలి! సందు చూసుకొని పెద్దోళ్ళిద్దరి చెవుల్లో వెయ్యాలి!’

**** (*) ****