లాఫింగ్ 'గ్యాస్'

శునక పురాణం

జనవరి 2016


కుక్కలమీద కథలు సరదాగానే ఉంటాయి. కక్కకథే చేదు. ఎనభై నాలుగు లక్షల రకాల జీవజాతులు సృష్టిలో. ఎవరికీ లేని కడగండ్లుకు మా కుక్కజాతికే!కుక్కలంటే విశ్వాసానికి మారుపేరు అంటారు. మంచిమాటే. కానీ మా విశ్వాసానికి వీసమెత్తైనా విలువేదీ?మా జంతుజాలం దృష్టిలో మనుషులంతా పాతసినిమా రాజనాలలు. సూర్యకాంతాలు. కుక్క కంటబడితే చాలు రాళ్లతోనో, కర్రల్తోనో కొట్టాలని మీకు కుతి. ఆత్మరక్షణకోసం మేం కాస్త నోరు చేసుకొన్నామా.. ‘పిచ్చికుక్క’ అని పేరెట్టి మరీ వేపుకుతింటారు. మున్సిపాల్టీ బండ్లకోసం పరుగులు పెడతారు!మా కుక్కలు.. వరాహసోదరులు, నోరు చేసుకోకుంటే మీ స్వచ్చభారతులు ఎంత కంపుకొట్టేవో! ఆ విశ్వాసమైనా లేని కృతఘ్నులు మీ మనుషులు!

కుక్కకష్టాలు ఒక్క మనుషులతోనే కాకపోవచ్చు! కుక్కలకే కుక్కలంటే పడి చావదన్నమాటా నిజమే కావచ్చు కానీ, ఆ దొబ్బుతెగుళ్ళన్నీ మీ పొలిటీషియన్లని, టీవీ సోపుల్ని చూసే మా కుక్కలకి అబ్బుంటాయని నా డౌటు.
‘అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బుబిళ్ల కాదేదీ కవిత కనర్హం’ ఆహాహా! ఎంత గొప్పగా అన్నాడండీ మీ మహాకవి! ఆ మహానుభావుడికేమో మెమొంటోలు, చప్పట్లు! మా మీదకు మాత్రం రాళ్ళు రప్పలు! మీ హిపోక్రసీని చూస్తే ఎంత బుద్ధిగా ఉండే కుక్కకైనా కసిగా కరవ బుద్ధేస్తుంది!

‘మీ గొడవలన్నీ మాకెందుకులే!’ అని ఓ మూల దాలిగుంటలో పడుంటామా! ‘కరిచే కుక్క అరవదు’ అని మీకు మీరే డిసైడై పోయి మావెంటబడతారు.‘చదువులన్ని చదివి చాల వివేకియైకపట చిత్తుడైన బలునిగుణము/ దాలిగుంతనెట్టి దలచిన చందమౌ /విశ్వదాభి రామ వినుర వేమ!’ అంటూ పద్యాలకు తగులుకుంటారు. విని విని పెచ్చెత్తి కరిచేదాకా వదలరు. కరుపుకి, అరుపుకి లింకేం పెటుకోరాదని మా రాజ్యాంగంలో ఏదో రాసున్నట్లు! అరుస్తూ కరుస్తారు. కరుస్తూ అరుస్తారే..మరి మీ మనుషులూ! మీకో నీతి.. మాకో రీతీనా! సిల్లీ! కుక్కై పుట్టే కన్నా అడవిలో పిచ్చిమొక్కై పుట్టడం మేలనిపిస్తుంటుందొక్కోసారి. ‘మొక్కేకదా అనీ పీకేస్తే… పీక తెగ్గోస్తా!’ అన్న అన్నగారి పంచ్ గుర్తుకొచ్చి! పిచ్చిమొక్కకిచ్చేపాటి విలువైనా మా కుక్కజాతికివ్వడం లేదు మనిషి. మరీ టూ మచ్! ‘అందితే తోక.. అందకుంటే మూతి!’ నీతి మనుషులది. ఐ హేట్యూ మ్యాన్!
అమెరికాలో పుట్టే అదృష్టం అన్ని’డాగు’లకూ ఉండదుకదా! అక్కడైతే డెమోక్రటిక్ ఒబామానుంచి రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ దాకా, పార్టీపరంగా ఎన్ని చీలికలు ఏడ్చినా మా పెట్ జంతువులపట్ల ఒకటే పాలసీ! ఇంటిసభ్యులకన్నా ఎక్కువగా చూసుకుంటారు. పెళ్లిళ్ళు, పేరంటాలు, సీమంతాలు, పురుళ్లు… అన్నీ మనుషులకు మల్లేనే జరిపించే గొప్పశునకప్రేమికుల దేశం అమెరికా. బూతలంమీది కుక్కలస్వర్గం. బుద్ధభగవానుడు పుట్టిన ఈ ‘లైట్ ఆఫ్ ఏసియా’నో! శునకాలపాలిటి భూలోక నరకం.

వానలు కురవనప్పుడే కప్పలు ఇక్కడ గుర్తుకొచ్చేది. పోకిరీల ఊరేగింపులకే గాడిదలు అవసరం పడేది! పెట్రోలు, డీజెలు గట్రా రేట్లు తగ్గించాలన్న డిమాండ్లు పుట్టినప్పుడే బండ్లీడ్చే బుల్సు పిక్చర్లో కొచ్చేది! ‘అక్కరకు రాని చుట్టము… మొక్కిన వరమీని వేల్పు, మోహరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయున’ని మళ్లీ నీతిశతకాలు! సెంటిమీటరుకో సుమతి మహాశయుడితో కిక్కిరిసున్న సమాజంరా బాబూ మీ మనుష్యలది! ఒక్క కుక్కలకనేముందిలే! అన్ని జంతుజాలాలకూ మతులు పోతున్నాయీ పుణ్యభూమిలో!

దొంగల్ని పట్టే దివ్యమైన కళ మా దగ్గర ఉందని చేరదీస్తారా! దానికీ రాణింపు రానివ్వని కుళ్ళు మనుషులది! పోలీసుపటాల్లోకి పెద్ద పటాటోపంగా రిక్రూటు చేసుకున్నట్లు లెక్కలుంటాయి! కుక్కలకు వాసన పసిగట్టడంలో శిక్షణిచ్చే వంకతో లక్షల కోట్లు కొట్టేస్తారు! అదృష్టం కొద్దీ అవకాశమొచ్చి మేం ఏ దొంగవెధవనో పట్టుకొన్నా ఫలితం సున్నా, మేం పసిగట్టిన ఏ దొంగవెధవైనా మినిమమ్ మూడ్రోజులైనా పోలీసు లాకప్పులో ఉన్న దాఖాల్లేవు. ఎఫ్ఫైఆర్ల దగ్గర్నుంచే యవ్వారాలు మొదలు పోలీసులకు.. దొంగలకు మధ్య! రొట్టెముక్కలు విసిరి తోకలు ఊపించుకోడానికి, పక్కింటివాళ్ల ముందు గొప్పలు చూపించుకోడానికే మా కుక్కలు మీ మనుషులకు! షేమ్… షేమ్!
బేసికల్ గా భైరవజాతి అంటేనే ఎందుకో మనుషులకు మొడట్నుంచీ చీదర. అన్నం కరడింత పారేస్తే జన్మంతా తోకూపుకొంటూ తిరుగుతుందన్న చులకనా!

ఆడించేందుకు కోతులు, కొండముచ్చులు, పాడించేందుకు కోకిలలు, చిలుకలు, తలాడించేందుకు గంగిరెద్దులు, గొర్రెపోతులు, కొట్టుకొని చచ్చేందుకు కోళ్ళు, కొక్కిరాయిలు, ఢీడిక్కీలు కొట్టుకొనేందుకు పొట్టేళ్ళు, దున్నపోతులు! ఒక్కో దురదకి ఒక్కో జంతువు మనిషికి! మా కుక్కలతో మాత్రం ఏ అక్కరా లేదు.చీ.. ఎంత కుక్కబతుకయిపోయింది మా జాగిలాలది!
అహాఁ! తెలీక అడుగుతున్నానూ! కుక్కలకి, కుక్కులకి ఏమంత పెద్ద తేడా ఉందిట! కుక్కలం మీరు తిన్న ఎంగిళ్ళు నాకితే.. కుక్కులు తిన్న ఎంగిళ్లు మీరు నాకుతారు! దొంగచాటుగా మెక్కే అ కుక్కేశ్వర్లకేమో వేలకు వేలు జీతభత్యాలు! దొరబాబుల్లా ఎంగిళ్లకు ఎగబడే మాకు మాత్రం దుడ్డుకర్రలతో ఘనసత్కారాలు!

దాలిగుంటలో నిద్రోయే సమయంలో రాయేసే రాలుగాయిని రక్తాలొచ్చేట్లు కరవాలా? ‘రా.. రమ్మ’ని పిలిచి ముద్దులు పెట్టుకోవాలా? ఏ కుక్కయినా బేడ్ మూడ్ లో ఉండి కసిబట్టలేక కాస్త కండ ఊడేటట్లు కరించిందే అనుకోండి! ఇక కుక్క జాతికి మొత్తం ఆయువు మూడిందే! పత్రికలనిండా.. టీవీలనిండా మా గురించిన వార్తలే వార్తలు! లోకమంతా మా కుక్కల దాడితోనే అల్లకల్లోలమైపోతున్నట్లు బిల్డప్పులు ప్రసార మాధ్యమాల్లో! మాకూ ప్రత్యేకంగా పత్రికలు.. టీవీలుగాని ఉండుంటేనా! మీ మనుషులు చట్టసభల్లో చేరి చేసే నానాయాగీని నిప్పులతో కడిగి మరీ చెరిగేసేవాళ్లం! చూస్తున్నాంగా రోజూ టీవీల్లో మీ గౌరవనీయులు సభలు నడుపుకొనే తీరు! మా బజారు కుక్కలుకూడా సిగ్గుతో తలలు దించుకొంటున్నాయి. ప్రజాస్వామ్యం జోలికి పోనందుకు సంతోషపడుతున్నాం మేమంతా!

ఆ మాటంటే మామీదా సభాహక్కుల తీర్మానాలు బనాయిస్తారు కాబోలు! ఫర్వానై! న్యాయస్థానాల్లోనే తేల్చేసుకుందాం తేరే..మేరే బీచ్ కీ యే ఖిచ్,, ఖిచ్!

కుటుంబ నియంత్రణ చికిత్సలకోసం కుక్కల్ని బలవంతంగా మున్సిపాల్టీ బల్లల మీదకెక్కించడం కుక్కల హక్కులకు భంగకరం. బొద్దింకలమీద బయోలజీ విద్యార్థులు ప్రయోగాలు, ఎలుకలమీద జీవశాస్త్రవేత్తల నెవరెండింగ్ పరిశోధనలు, కోతులకు, కొండముచ్చులకు బలవంతంగా కత్తికోతలూ! మనుషులమీదా మా జంతువులు ఇదే మాదిరి బలవంతంగా పరిశోధనలకు తెగపడితే! హక్కుల ఉల్లంఘనలనేవి అన్ని ప్రాణుల్నూ సమానంగానే హింసిస్తాయి బ్రోస్!

ఎవర్ననుకొని ఏం లాభంలే! ఆ దయామయుడికే మామీద కనికరం కరువైనప్పుడు! ఆ పెద్దాయనకూ మాకూ పెద్దతేడా ఏముందని? జి.. ఓ.. డి అయితే గాడ్! డి.. ఓ.. జి గా రివర్సు చేస్తే డాగ్! కష్టం వస్తే ‘ఓ మై గాడ్’ అంటారే గానీ.. ‘ఓ మై డాగ్’ అనరెవరూ! సరికదా ‘గాడ్’గారి ముందు పడీ పడీ పొర్లుదండాలు పెట్టే మూడీ మనుషులు డాగ్ పేరు వింటే మాత్రం డండా పుచ్చుకు వెంటబడతారు! మ్యాడ్.. మ్యాడ్.. మ్యాడ్ హ్యూమన్ వరల్డ్!

శునకానికి కనకంతో రైమింగులో పోలికున్నందుకైనా పోనీలే అనిపించదా ఈ పెద్దమనుషులుకి! ‘కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన వెనకటి గుణమేల మాను’ అంటూ వెటకారాలు తగునా! ఇప్పుడేదో ఆ సింహాసనాలని కరుచుక్కూర్చున్న పెద్దమనుషులంతా పెద్ద సుపరిపాలన సాగిస్తున్నట్లు! మా జాతికి కనీసం విశ్వాసమనే అర్హతైనా అదనంగా ఉంది. మీ పాలకులకు అది ఎన్నికల్లో ఓట్లు పడేవరకు మాత్రమే పనికొచ్చే సరుకయిపోయింది!

మా కుక్కల కాలిగోటికి సరితూగుతారా లెక్కలు తీస్తే మీ మనుషులు! ‘ప్రతి కుక్కకూ ఓ రోజొస్తుంద’ని సామెత. ఆ అచ్చేదిన్ మీదే మా ఆశంతా. ‘నీచ్.. కమీనే..కుత్తే’ అంటూ మీలో మీరు కాట్లాడుకొనే సందర్బాల్లో దయచేసి మా ప్రస్తావనలు తీసుకురావద్దు! ‘నీచు.. ఆహారంగా తీసుకోవాలా వద్దా!’ అన్న వ్యక్తిగత వ్యవహారం దగ్గరా పరమనీచంగా వాదులాడుకొనే మీరా కమీనేలు? మేమా?

అంతా జగద్గురువుగా ఆరాధించే ఆదిశాంకరులకే ఓ హరిజనుడు జ్ఞానబోధ చేసిన కథ మీదాకా వచ్చిందో లేదో! ‘బ్రాహ్మణులు వస్తున్నారు. పక్కకు తప్పుకో!’ మని శ్రీవారు హెచ్చరించినప్పుడు కుక్కతో వెళ్ళే ఆ అట్టడుగు బడుగు ‘అందరిలో వున్న ఆత్మ ఒకటే గదా!’ అన్న ప్రశ్నతో కడిగేశాడు. శంకరుడంతటి మేధావులకే అద్వైత పాఠాలు చెప్పాడే.. అతగాడయ్యా అసలు సిసలు మొనగాడు! కుల, మత, లింగ, జాతి భేదాలేవీ పాటించకూడదని నీతులు వల్లిస్తూనే ఒకళ్ల వెనకాల ఒకళ్ళు గోతులు తీసుకొంటారు మనుషులు! మీరా కుక్కల కాట్లాటల్ని గూర్చి ఎకసెక్కాలకు దిగేది!

జనమేజయుడి యజ్ఞవాటికలో మా దేవశునకం సరమ బిడ్డ సారమేయుడు ఆడుకుంటున్నాట్ట ఒకప్పుడు. ఆ రాజు తమ్ములు మా శునకబుడతణ్ని అకారణంగా బాదినందుకు సరమతల్లికి కోపం కట్టలు తెగింది. శునకమాత శాంతికి జనమేజయుడు పెద్దయాగమే పెట్టుకోవాల్సొచ్చింది మిత్రులారా.. తెలుసా! సత్యయుగం కాబట్టి యాగాలతో సర్దుకొంది. ఇప్పుడూ ఆ పొరపాటే రిపీటయితే ఎన్ని హోమగుండాలు నేతిధారలతో నిండినా ఫలితం గుండుసున్నా! ఎందుకు చెబుతున్నానో కాస్త బుర్రలకు ఎక్కించుకోండి తుంటరి మనుషుల్లారా!

కురుక్షేత్రం ముగిసింతరువాత పరీక్షిత్తుకు పట్టంగట్టి అన్నదమ్ములతో మహాప్రస్థానికని బైలుదేరారు ధర్మరాజులుంగారు. కనీసం ఆకథైనా గుర్తుందా తమరికి? పాంచాలితో సహా సోదరులంతా నిరాడంబరంగా పెద్దాయనను అనుసరించారయ్యా సరే.. వాళ్ల వెనకాలే మా జాతి శునకంకూడా ఒకటి వెళ్ళిందని తెలుసా మీకు? దప్పికతో మీ సుకుమారి పాంచాలి… ఆనక రకరకాల కారణాలతో సోదరులంతా దారిలో కూలిపోయినా.. చివరి వరకు ధర్మజుడికి తోడుగా మిగిలింది మా శునకరాజమే! దాన్నీ వదిలేసి స్వర్గానికి వెళ్లే రథమెక్కమని యమధర్మరాజుగారి రొద. ‘ససేమిరా’ అన్నాడు బ్రదర్స్ పాండవాగ్రజుడు! అతగాడయ్యా అసలు సిసలు నీతివంతుడు. ‘నమ్ముకొన్నవాణ్ణి నట్టేటముంచి సొంతలాభంకోసం వెంపర్లాడ్డంకన్నా మహాపాతకం మరోటి లేదన్నది అతగాడి పాలసీ! రక్తం పంచుకుపుట్టిన సోదరులెవరూ చేరని చివరి అంచెక్కూడా తోడొచ్చింది జాగిలం. స్వర్గసుఖాలకోసం విశ్వాసం చూపించే జీవుల్ని ఉపేక్షించడం తుఛ్చం. స్వచ్చమైన ప్రాణులతో కలసి నరకంలోనైనా సరే కాలక్షేపం చేయడమే సరదా నాకు’ ఆవటా అని గొప్ప సూక్తులెన్నో చెప్పుకొచ్చిన పురుషోత్తముడయ్యా దర్మరాజయ్య. ఆ పుణ్యాత్ముడి వారసులేనా ఇప్పుడిలా మా శునకాల వెనకాల యమదూతలకుమల్లే పడి ప్రాణాలు కొరుక్కుతింటున్నది!

‘.. కృష్ణేన సంరోపితమ్‌/ శ్రుతిశిరోబీజం ప్రబోధాంకురమ్‌ – శ్రీకృష్ణుడిచే నాటబడి, శ్రీ వేదవ్యాస మునీంద్రుడిచే వృద్ధిపొంది, ఉపనిషత్తులే విత్తనంగా, ప్రబోధమనే అంకురంతో ఒప్పే ‘గీత’లో సైతం మా ప్రస్తావన ప్రదర్శితమేగాని ఏం ప్రయోజనం? మా రాతలో మాత్రం రవ్వంత మార్పైనా ద్యోతకం కావడంలేదు. ‘విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని | శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః – విద్యావినయాలు కలిగిన బ్రాహ్మణుణ్ని, గోవును, ఏనుగును, కుక్కను, చండాలుణ్నికూడా ఆత్మజ్ఞానులు సమదృష్టితో చూస్తార’ని.. చూడాలని ఘంటసాల ఐదో అధ్యాయం- కర్మసన్యాసయోగం సి.డి.లో గంట కొట్టి మరీ చెప్పాడు . టెంకాయలు నడిమికి రెండు చెక్కలయేట్లు పగలగొట్టడంలోగల శ్రద్ధ.. ఆ గీత పలుకులు బుర్రకు ఎక్కించుకోడంలో కనిపించడం లేదు మీ మనుషుల దగ్గర!

‘కుక్కగా పుడితే తప్ప కుక్కకష్టాలు తెలీవు. మా బాదలు తెలుసుకొనేటందుకైనా భగవంతుడా! ఈ మనుషులంతా వచ్చే జన్మల్లోనైనా ఇక్కడే ఇండియాలో కుక్కలై పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా!’
మనుష్య స్దరులారా! శెలవు. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

బౌ.. బౌ.. శునక రాజ్యం! బౌ.. బౌ.. బౌ భైరవ రాజ్యం!

**** (*) ****