లాఫింగ్ 'గ్యాస్'

‘రాత’ ముచ్చట్ల

ఆగస్ట్ 2016

చెన్నైనుంచి హైదరాబాదు వస్తున్నాను చెన్నై ఎక్స్ ప్రెస్సులో.

పక్క సీటులో ఒక మోస్తరు పెద్దమనిషి తగిలాడు. పరిచయాలు గట్రా అయిన తరువాత నేను ‘రాతల తాలూకు శాల్తీన’ని ఏ కారణం వల్ల ఊహించాడో! ‘ఇప్పటి వరకూ ఏమేం రాసారు సార్?’ అని తగులుకున్నాడు.

మనం రాసినవి… రాసేవన్నీ అలా బైటికి చెప్పుకుంటూ పోతే ఏం బావుంటుంది?

నెత్తికి నూనె రాస్తాను. స్నానాల గదిలో వంటికి సబ్బు రాస్తాను. కాలు కండరం పట్టినప్పుడు, తలనొప్పితో కణతలు బద్దలవుతున్నప్పుడు ఏ జండూ బామో, ఆయింటుమెంటో రాస్తుంటాను.

బైట ఊళ్ళకు ఇలా పనులమీద వచ్చినప్పుడూ నాకీ ‘రాత’ తలనొప్పులు తప్పవు. తరుచూ కాళ్ల కండరాలు పట్టేస్తుంటాయి. అందుకే ఎక్కడున్నా మా శ్రీమతిగారు సెల్లోనైనా సరే ‘అది రాసారా? ఇది రాసారా?’ అని వేపుకు తింటుంటుంది. ఆమె ప్రేమ ఆమెది. ఇప్పుడు ఆ రాత మీదే పెద్ద రచ్చ అయింది సెల్లో!

‘ఇంటి మనుషుల తోనే కాకుండా బైట కొత్తవాళ్ళ ముందు కూడా… ఆ రాసేవన్నీ వివరంగా చర్చకు పెట్టడమెందుకు!’ అనిపించి నవ్వి ఊరుకున్నాను.

ఆయనగారు పట్టువదలని విక్రమార్కుడికి వేలు విడిచిన మేనమామలాగున్నాడు. వదిలితేనా!

‘రాసేవాళ్ళెవరైనా సరే.. నాకు చాలా ఇష్టమండీ! మీర్రాసినవాటిల్లో కొన్నైనా చెప్పండి! అవన్నీ కొని మా ఆడోళ్ళచేత కూడా చదివిస్తా దొరక్కపోతే బండి దిగేలోపు నాకూ ఏదైనా రాసివ్వండి! ఎప్పుడూ ఏవోవే పిచ్చి పిచ్చివి కొంపమీదకు కొని తెస్తుంటానని ఒహటే దెప్పుతుంటుంది !’ అని ప్రాధేయపడ్డం పెంచేయడంతో పెద్ద చిక్కుల్లో పడిపోయాను.

నిజం చెప్పద్దూ! రాయడమే కాదు.. చదవడంమీదకూడా నాకాట్టే ఆసక్తి లేదు చిన్నప్పట్నుంచీ. ఆ రాతలూ కోతలూ కవులకి, ఆఫీసుల్లో క్లర్కులకీ, దస్తావేజులాఫీసుల్లో డాక్యుమెంటు రైటర్లకీ తప్పని గొడ్డు చాకిరీ అని నా అభిప్రాయం. రిటైరయిన తరువాత పెద్ద పెద్ద అధికారులూ.. రాజకీయాల్లో బాగా నలిగేవాళ్లూ రాస్తారని విన్నాగానీ, వాళ్ళు నిజంగా సొంతంగా రాస్తారా? అన్న ధర్మ సందేహం ఒహటి నన్నెప్పుడూ పీడిస్తుంటుంది. వాళ్ళ వాళ్ల వృత్తుల్లో జీవితమంతా నుజ్జు నుజ్జు చేసుకున్నాక ఇహ ఓపిక లెక్కడేడుస్తాయీ రాస్తూ కూర్చోడానికి?
‘రాసి పెట్టేందుకు మనుషుల్ని పెట్టుకుంటారంటారు. కాబట్టే కామోసు… పనుల్లో ఎంతో బిజీగా ఉన్నా వాళ్ళ పేర్న హఠాత్తుగా అంతంత బౌండ్లు ‘ఆత్మ కథలు’ వెలువడి పోతుంటాయి!’ రాతలను గురించి సరే! వాళ్ళు ‘ఆత్మ’లను గురించి కూడా కథలు రాయడం నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది సుమండీ!’ అంటుంది మా శ్రీమతి.

రాజకీయాల్లో తిరిగే వాళ్ళెవరికీ ఆత్మలులాంటివి ఉండవని ఆవిడ దృఢ విశ్వాసం. ఆమెగారి ఉద్దేశంలో రాసేవాళ్లంతా ఏ యండమూరిలాగానో, మల్లాది లాగానో, యద్దనపూడి సులోచనారాణి మాదిరో మంచి ఆలోచనా పరులో, మేధావులో అయి ఉంటారని… ఉండాలని.

ఆ మాటకొస్తే ఆలోచించ గలిగే మేధావులందరికీ రాయలనే బుద్ది మాత్రమే పుట్టాలని రూలెక్కడుంది? జ్ఞానులు తమ ఆలోచనలను మరింత నిరపాయకరమైన మార్గంలోకి కూడా ఎందుకు మళ్ళించాలనుకోకూడదు? న్యూటను మహాశయుడు మంచి ఆలోచనాపరుడే కదా! ఆయన ఆపిల్ చెట్టుకింద కూర్చున్నప్పుడే పండు పడింది. అదృష్టం. అదృష్టం పండు పడ్డందుక్కాదు. ఆ పండు ఆయన తలపండుమీద పడనందుకు. ఎదురుగా ఆపిల్ పడ్డప్పుడు ‘ఆఁ!… ఏదో పడిందిలేఁ!’ అని పట్టించుకోకుండా.. ఏరుకొని కోసుకుతిని మర్చిపోకుండా ‘ఎందుకు పడిందబ్బా?!’ అని బుర్ర తెగ బద్దలు కొట్టుకోవాలనే బుద్ధి పుట్టడం కూడా మన అదృష్టమే కదా! ఆయనగారికి అలా బుర్ర బాదుకోవాలన్న ఆలోచన తట్టక పోయుంటే?! ఇవాళ్టికీ ఇంకా ‘E=mc2′ సూత్రం వెలుగులోకే వచ్చుండేది కాదు కదా! ఇవన్నీ మా ఆవిడ పెద్దబుద్ధికి తోచని చిన్నవిషయాలు.. అలా వదిలేద్దాం. ఇప్పటి ఆలోచనంతా పెద్దలు రాయించే ‘ఆత్మ కథల’ ను గురించి కదా!

రాయాలనే ఆలోచన రాజకీయ నాయకుల బుర్రల్ని తొలవడం మొదలైందంటే దానిక్కారణం… ఆ నేతాశ్రీలకి ఆలోచించే తీరిక పుష్కలంగా దొరికిందనేగా! నిత్యం ప్రజల జీవితాలతో ఆటలాడ్డానికే ఎక్కడి సమయం చాలని పెద్దమనుషుల మనసులను అలా మాటలమీదకూ మళ్ళించేందుకు కారణాలు ఏమై ఉంటాయో? ఎన్నికల్లో ఎదురైన ఓటమి ఒక్కటే అంటే నమ్మలేం. కట్టిన డిపాజిట్లు పూర్తిగా గంగలో కొట్టుకుపోయినా రాజకీయాలమీదే ప్రాణం కొట్టుకులాడే బుద్ధి కదా ఆ పెద్దలది?… ఏదైనా బైటికి రావడం కుదరని పెద్ద నేరాల్లో ఇరుక్కొని బొక్కలో నాల్రోజులు గడపక తప్పని ఖర్మ తటస్థపడ్డప్పుడు మాత్రమే ఇలా రాతలమీదా కోతలమీదా మనసులు మళ్ళుతాయనుకుంటా.

గాంధీజీ ‘సత్యం తో నా ప్రయోగాలు’ కారాగారంలో ఉన్నప్పుడు ప్రారంభించిందే!. ఆయన అప్పట్లో చేసిన నేరం అప్పటి తెల్లదొరల చెత్త పెత్తనాన్ని నిర్ద్వంద్వంగా ధిక్కరించడం. ఇప్పటి నాయకుల నిర్వాకాలతో ఆ ధీరత్వాన్ని పోల్చేందుకు లేదులేండి. జవహర్ లాల్ నెహ్రూజీ కూడా జైలుగోడల మధ్య ఉన్నప్పుడే కన్నకూతురికోసం ఉత్తరాలు.. జాతి విజ్ఞానంకోసం ‘భారత దర్శిని’ రాశారు. నేతల కారాగార జీవిత పుస్తకాల జాబితా ఏకరువు పెట్టడం మొదలు పెడితే ఆ చిట్టాకు ఆఖరు పేజీ ఉండదు. అట్లాంటి జాబితా ఒకటి తయారు చేసినా పాలిటిక్సులో పనిచేసే నేతల చేత గిలికించాలంటే ఏదైనా బెయిలు దొరకని నేరంలో గట్టిగా ఇరికించెయ్యాల్సిందేనన్న అపోహా ఏర్పడే ప్రమాదం కద్దు. అందుచేత అటువైపు మనం వెళ్ళొద్దు.

అయినా ఈ- కాలంలో ఎంత సెల్లుల్లో కుక్కించినా నేతాశ్రీలకంత రాసేంత తీరికలు ఎక్కడేడ్చాయీ? ‘సెల్లు’ల సంపర్కం వల్ల సెల్లు సంబంధాల్లో కూడా బోల్డన్ని మార్పులొచ్చేసాయి. అంచేత నేతల జైలురాతల గొడవనలా వదిలేసేద్దాం.

నేతాగణాలకు అధికార వియోగాలు, అధికారులకు పదవీ విరమణ అనంతరం వేధించే సంపూర్ణ విరామాలు, పుస్తకాలు రాసేందుకు పురిగొల్పే మరో కొన్ని ప్రేరణలు. నానా గడ్డి కరిచి గట్టి జీవితం ఏర్పరుచుకున్న పెద్దమనుషులకు చివర్లో అలా వట్టి మనిషులుగా మిగిలి పోవడం సుతరామూ ఇష్టముండదు. కాబట్టె వివాదమేదైనా రాజేసే అంశాన్ని ఎన్నుకొని ఏ ‘ఆత్మ’నో అడ్డం పెట్టుకొని పుస్తకం తీయించి పారేస్తే.. మళ్లీ వచ్చే ఎన్నికల వరకు పేరు నలుగురి నోళ్లలో నలిపించుకునేందుకు వీలుగా ఉంటుందన్నది అసలు పథకం అయుండవచ్చు.
పదవుల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ గుర్తుకురాని ఆత్మలు, అంతరాత్మలు పదవీ వియోగాల తరువాతే ఎందుకు వెంటాడి వేధిస్తుంటాయనే కదూ ఆశ్చర్యం!

పని పడనప్పుడు పట్టించుకోక పోవడం… అవసరం పడ్డప్పుడు అమాంతం వచ్చి వాటేసుకొనే కళను సానబెట్టబట్టే కదా నాయకాగణమంతా ఇంతింతి ఎత్తులకు ఎగబాకుతున్నదీ! ఇహ ఇందులో ఆశ్చర్యపడ్డానికి ఏముంది?

అమెరికాలో కూడా ఈ మధ్య ఈ ‘అంతరాత్మ’ నాటకమే కదా నడిచిందీ! ప్రైమరీ అభ్యర్థుల వత్తాసుతో దేశాధ్యక్ష పదవి అభ్యర్థిత్వంకోసం పార్టీ తరుఫున జరిగే పోటీలో చివరి దశకు చేరుకున్నాడా ‘ట్రంప్’ మహాశయుడు! ఆ మహానేతకూ సొంత పార్టీ అంతరాత్మలనుంచి అసమ్మతి సెగలు తప్పలేదు! ఇప్పటికిప్పుడైతే ఆ నిప్పేమీ రాజుకోలేదు గానీ… విచిత్రం ఏదైనా జరిగి ప్రత్యక్ష ఎన్నికల తదనంతర దశలో ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాల్సిన దుర్భర పరిస్థితులు కనక దాపురిస్తే ట్రంపుగారు మాత్రం గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటారా? కథలు రాయడానికి తన అంతరాత్మను నిద్రనుంచి లేపకుండా ఉంటారా? ‘లేప’డని గ్యారంటీ ఏంటీ?

అమెరికా ట్రంపుల.. దువ్వూరి సుబ్బారావువంటి మాజీ ఆర్ బి ఐ పెద్దల ‘అంతరాత్మ’లు చేయాల్సిన పెద్దపనులు అతి సామాన్యుణ్ణి నేను చేయడానికి పూనుకొంటే ఏం బావుటుంది?

ఆ మాటే పక్కసీటు అభిమానికి ‘నచ్చ చెప్పడమెలాగురా దేవుడా?’ అని తన్నుకులాడుతున్నానా.. ఉరుములేని పిడుగులాగా వచ్చిపడ్డ టిక్కెట్ కలెక్టరుగారే నన్నా ఆపదనుంచి గట్టెక్కించేసారు!

పక్కసీటు పెద్దాయన పేర్న భారీ చలానా రాసి ఇచ్చి ఆ మహానుభావుడి ‘రాత’ ముచ్చట ఇంచక్కా తీర్చేసి కథ సుఖాంతం చేసేశారు
రిజర్వేషను కానీ, ఫస్టు క్లాసు గానీ, బోగీ ఏదైనా… జనరల్ కంపార్టుమెంటు రేటుకి మించి కానీ అదనంగా పెట్టి టిక్కెట్టు కొనే అలవాటు లేదుట ఆ పెద్దమనిషికి ఎంత పెద్ద దూరప్ప్రయాణాలు పెట్టుకొన్నప్పుడైనా!

అదీ మేటరు!

**** (*) ****