కవిత్వం

ప్రబోధం

ఏప్రిల్ 2016

‘…నిశ్శబ్దం’ గుండె చప్పుడు వినాలని నీకెప్పుడైనా అనిపించిందా నేస్తం!…
ఓ నవ్వు నీ నుంచి తెరలు తెరలుగా
దూరం జరుగుతుందని గమనించడం మొదలుపెట్టగానే,
అనుభవాల పుటల్నుంచి నచ్చినదాన్ని ఎంచుకుని
‘ఆశ’ నీ రెప్పల ముందుకు విసిరే స్లైడ్ షో కి
నువ్వో తప్పనిసరి ప్రేక్షకుడిలా నిలబడతావు.
అడుగునెక్కడో మిగిలిపోయిన అతి చిన్న అనుభవం కూడా
అపురూప నిధిలా నెమరేసుకోవడం మొదలెట్టగానే ,
ఇదెలా జరిగిందనే అంతుబట్టని ఆలోచన.
నిన్ను నువ్ పోల్చుకోగలిగే అద్దం
చీకటిలో తప్ప మరెక్కడా దొరక్క
పిచ్చి కలలకి ఫిదా అవ్వడం
నచ్చిన మైకంలాగా తెలుస్తుంటోంది.

మెల్లగా కలలన్నీ కారణాలకి అవతల నిలబడుంటాయని తెలీగానే
అప్పటిదాకా గుప్పెట్లో బిగించి పట్టుకున్నాననుకున్న కాలం చేతిని,
అనాలోచితంగా మధ్యలో వొదిలేశాననే అసలు నిజం
ఈ కథ ఆఖరుకి ఓ ప్రబోధంలా అనుభవమౌతుంది.