కవిత్వం

కొత్త ఆశ

డిసెంబర్ 2016

మొన్న పాత దారిన కలగన్న
మనది కాని రంగుపూల మొక్కని
ఒళ్ళంతా కళ్లతో తడిమీ, తాగీ…
ఆశని చంపుకోలేక చివరికి అడిగి
ఓ అంకురాన్నో, అంశాన్నో
భద్రంగా పాత ఇంటికి ఆరాధనగా తెచ్చుకుంటాం

లోపలి లోతుల్లోకి నాటుకునీ,
ప్రతి తెల్లవారీ రంగుల మొగ్గల్ని కలగంటూ
కాసింత నమ్మకంతో కొత్తదారుల వైపుగా వెదుకుతూ వెళతాం,
ఏ వాకిలికీ ఈ తీగ గురుతుల్లేవని గమనించీ
లోపలి మొహంలోకి చూసి
పసివాడిలా నవ్వుకుంటాం

కొమ్మల కొసన పూసే
ఆ రంగు రెక్కల్ని ఊహిస్తూ,
దారాలకు వాటిని మెలిపెట్టే
కలల క్షణాల్ని ప్రేమిస్తూ
వాకిలి తలుపు బయట మారిపోయే
ఋతువుల గురించి ఆనందంలో అలవాటుగా మర్చిపోతాం

ఇవ్వడం, తిరిగివ్వడం తీగ లక్షణమనే
సహజ నిజం మరిచిపోయీ,
పూలకోసం ఎదురుచూస్తూ
చివరికి కొత్త ఋతువు రాగానే
పాతగది ఖాళీ చేసి వెళ్ళిపోతాం