లాఫింగ్ 'గ్యాస్'

దేవుడే రక్షించాలి!

మే 2016

కోటీ బస్టాండులో బస్సు దిగిపోయారు విష్ణుమూర్తి దంపతులు.

‘గజేంద్రమోక్షంలో ఆ ఏనుగు పాపం ఆ మడుగులో మొసలితో ఎట్లా పడిందో గానీ వెయ్యేసి పాట్లు.. ఒక్క అరగంట మనమీ బస్సులో ప్రయాణం చేసేసరికే గురుడు గుర్తుకొచ్చాడు దేవీ!’

‘శంఖుచక్రాలు, గదా కిరీటాలు వెంట తెచ్చుకొమ్మంటే వింటిరి కాదు! కమ్మగా గరుడ వాహనం చేతికింద పెట్టుకుని.. ఈ డొక్కు గరుడాలో యాత్రలేంటట! రామావతారంనాటి కష్టాలు గుర్తుకొచ్చాయి స్వామీ! ఆ రావణాసురుడి పుష్పకవిమానమే నయం’

‘భక్తులు ఈ మధ్య ప్రద్దానికీ పెద్ద గగ్గోలు పెట్టేస్తున్నారు! నిజంగానే ఇబ్బందులు అంత భయంకరంగా ఉంటున్నాయా? అసహనం అతిగా పెరిగి మన సహనాన్ని పరీక్షిస్తున్నారా?’ ఆవటా అని పరీక్షించుకోడానిక్కదా మనమీ భూలోక పర్యటన పెట్టుకుంది!శంఖుచక్రాలు, కిరీటాలు గట్రా పటాటోపాలుంటే జనం పట్టించుకుంటారా! పెద్ద పండుగ అయిపోయినా పగటివేషగాళ్ళింకా ఊళ్ళోనే తిరుగుతున్నారని ఎగతాళి చేయరూ! జనం మధ్యలో జనం మనుషులు మాదిరి తిరిగితేనే కదా మనకూ నిజమైన జనం కష్టనష్టాలేవిటో తెలిసొచ్చేది! రామావతారంనాటి ట్రిక్కు. పద..పోదాం! పెళ్ళినడకలొద్దు!’

‘బాగుంది సంబడం! సమయమంతా బస్సు వెయిటింగులోనే గడిచిపోయింది. నన్నంటారేమిటి మధ్యలో? చీకటి పడేలోగా మన లోకానికి వెళ్ళిపోవాలి బాబూ! పొద్దుగూకితే ఇక్కడ ఆడవాళ్లకి బొత్తిగా రక్షణ లేదని బెదరగొట్టాడు నారదుడు!’

ఆదిలక్ష్మి మొత్తుకోళ్ళు పూర్తవనే లేదు ‘పట్టుకోండి! పట్టుకోండి!దొంగవెధవెవడో నా బంగారు గొలుసు ఎత్తుకెళుతున్నాడు! దేవుడా!దేవుడా! ఎక్కడున్నావయ్యా! కాపాడటానికింకా రావేమయ్యా’అంటూ ఆర్తనాదాలు!

‘తమరిహ కార్యరంగంలోగ్గానీ దూక్కపోతే నా చెవులు ఇక్కడేబద్దలయేట్లున్నాయి! ముందా భక్తురాలి మొరేంటో ఆలకించండి మహాప్రభో!’ చెవులు రెండూ గట్టిగా మూసేసుకుంది మహాలక్ష్మి.

దొంగవెంటబడక తప్పలేదు పరంధాముడుకి!

అలనాడు మాయలేడి వెంటబడ్డం కన్నా మహా కష్టంగా ఉందీ తుంటరి వెంట తరుములాట. త్రేతాయుగంనాటి ఆ సంఘటన జరిగింది కాకులు దూరని కారడవుల్లో! చీమలు దూరని ఆచిట్టడవులెక్కడ, చీటికిమాటికి వాహనాలు, గోతులు, గుంతలు,మురిక్కాలవలు, హోర్డింగులు, చిన్న దుకాణాలు, పోస్టర్లను మేసే దున్నపోతులు.. అడుగడుక్కీ అడ్డొచ్చే ఈ సిటీ రోడ్లెక్కడ!

ఎవరో గల్లీ లీడరు తాలూకు ఎన్నికల ర్యాలీ అడ్డు తగలటంతో దొంగ దేవుడికి దొరికిపోయాడు. ‘అన్నా.. అన్నా! నన్నొదిలేయన్నా!కావాలంటే నీ వాటా నీకు తెంపిచ్చేస్తానన్నా!‘ హఠాత్తుగా కాళ్ళు రెండూ పట్టేసుకొన్నాడు దొంగ. బిత్తరపోయాడు భగవంతుడు!

‘అన్నా ఎవడ్రా నీకు! నన్నెవరనుకున్నావురా చోరాధమా!’

‘మన హెడ్డు పోలీసెంకటసామివే కదన్నా!’

‘పోలీసును కదురా పోకిరి మానవాధమా! భగవంతుణ్ణి!’

‘అంటే దేవుడివా! మరీ మంచిదన్నా! ఎప్పట్లా నీ ముడుపు నీవు పుచ్చేసుకొని నన్ను విడిచి పుచ్చేయరాదే! నాకేం? జైలుకెళ్లైనా జబర్దస్తుగా బతికేయగలను! కరువు రోజులు. నా పెళ్లాంపిల్లలే నీ ఎదాన పడి ఆకలి చావులు చస్తారు! ఆలోచించుకో సామీ!’

‘కష్టాలు ఎవరికైనా ఒక్కటేగా? సంసార పోషణకని ఈ జీవి దొంగతనానికి పూనుకుంటే అది శిక్షించదగ్గ పాపమవుతుందా?’

దేవుడు ధర్మసంకటంలో పడిపోయాడు.

సందు చూసుకొని దొంగ సగం బంగారంతో సహా సందులోకి ఉడాయించాడు!

సగం బంగారమే చూసి ఆడమనిషి వీరంగాలు మొదలపెట్టింది. ‘దొంగలు దొరలు కుమ్మక్కవడమంటే ఇదే! సగం బంగారం నొక్కేసి పెద్ద ఆపద్భాంధవుడిలా ఆ పోజేమిటయ్యా పెద్దమనిషీ!’ అంటూ పెడబొబ్బలు! అంతకంతకూ జనం మూగిపోతున్నారు!

మొగుణ్ణి రక్షించుకోవాల్సిన పతివ్రతా ధర్మం హఠాత్తుగా గుర్తుకొచ్చింది లక్ష్మీదేవికి. వంటిమీది బంగారు గొలుసొకటి ఆడమనిషి మీదకు విసిరి దేవుడి రెక్క పుచ్చుకొని చక్కా ఉడాయించింది.. పక్కనే ఉన్న బస్తీలోకి.

‘ఈ ఆపద్భాందవుల వేషాలు ఇప్పుడంత అవసరమా అనాథరక్షకా? దొరలెవరో దొంగలెవరో పోల్చుకోడమే కష్టంగా ఉంది. దొంగలూ ‘లా’పాయింట్లు లాగేస్తుంటే ఏ నేరానికని తమరు దుశ్టశిక్షణకు పూనుకోగలరు? వచ్చిన దారినే పోదాం పదండి! మన పాలసముద్రం మీద నేను మీ కాళ్లు వత్తుతూ కూర్చుంటాను. మీరు కమ్మగా కళ్లు మూసుకుని పడుకుందురు గాని స్వామీ!’

‘మనమేమీ రాజకీయ నాయకులం కాదు.. అవసరాన్ని బట్టిజెండా, ఎజెండా మార్చుకోడం కుదరదు! భూలోకస్వర్గం సృష్టిస్తామని అభయ హస్తమిచ్చి తీరా ఇప్పుడేవో చిన్న అడ్డంకులొచ్చిపడ్డాయని చేతులెత్తేయడం ధర్మం కాదు. సర్వాంతర్యాములం! దుష్టశిక్షణ, శిష్టరక్షణ మన పర్మనెంటు మ్యానిఫెస్టో! ఇంకో రెండు మూడు కేసులన్నా చూడకుండా వెనక్కి వెళ్ళిపోతే అమరలోకంలో మన పరువేం కాను?’ మొండిగా ముందుకే కదిలాడు ముకుందుడు!

‘నీళ్లకుళాయిల దగ్గర ఆడంగులు జుట్టు జుట్టు పట్టుకుని సినీపరిభాషలో ముచ్చట్లాడుకోవడం దేవుడి కంటబడింది.విడదీసేందుకు అడ్డు వెళ్ళిన ఆదిలక్ష్మికీ నడ్డిమీదా వడ్డింపులు తప్పలేదు. ‘నీళ్లింకారాకముందే ఈ జగడాలెందుకు తల్లుల్లారా?’ జగన్నాథుడి ఆందోళన.

‘అవెప్పుడొచ్చి చచ్చేనయ్యా? పోయినసారిట్లాగే ఎన్నికలప్పడు ఒక్క చెంబెడు పడ్డట్లు గుర్తు. మళ్లీ ఎన్నికలొచ్చాయి కాబట్టి ఇంకో చెంబో అరచెంబో వస్తాయని ఆశ! వాటి కోసమే మా మంతనాలు’ అందో మహాతల్లి చర్చల సందర్భంగా ఊడిన జుట్టుముడి సవరించుకొంటూ!

భగవానుడు చిరునవ్వుతో కుళాయి మీద ఇలా తట్టాడో లేదో.. బొళ బొళా ఇనుపగొట్టం గుండా గంగ ప్రవాహంగా కిందకురికింది. ఆడంగులెవరి మొహాల్లోనూ ఇసుమంతైనాఆశ్చర్యం లేదు. ఒక నడివయసు సుందరి మాత్రం అతితెలివి ప్రదర్శించింది. ‘బాగుంది బాబూ మేజిక్కు! ఏ పార్టీ తరఫున తమ్ముడూ తమరి ఈ గమ్మత్తు ప్రచారం?’

‘ఏ పార్టీ అయితేనేం లేవే అక్కా! వీళ్ల త్తు భారం ట్రిక్కులు ఎవరికి తెలీవనీ? పోయినసారిట్లాగే ఎన్నికలప్పుడే రోజుకో పగటేషం ఏసుకొచ్చి మాయచేసి చచ్చారు! ఏవయంది చివరికి? గెలిచి గద్దెనెక్కేక దేవుళ్లల్లే నీలుక్కుపోయారు! ప్రతీసారీ మోసపోయేందుకు మేమంత ఎతిమతంగా కనపడుతున్నామా ఏందయ్యా! అందుకోయే అప్పా.. ఆ బిందెతో ఒక్కటిచ్చుకుంటే ముఖం లొత్త పడిపోవాల!’ కొంగు బిగించిన కోమలాంగికి కోరస్ అందిస్తూ మిగతా ఆడంగులూ పూర్తిగా కార్యాచరణకు పూనుకోకముందే భర్త పరువు కాపాడుకోవాల్సిన బాధ్యత మరోసారి మహాలక్ష్మి నెత్తిన పడింది.

స్వామిచెయ్యి పుచ్చుకొని రైతుబజారులోకి పరుగెత్తింది.

రైతుబజారులో కూరగాయలేమీ రాశులు రాశులుగా పోసి లేవు.రకానికి ఒక్కటి.. సంక్రాంతి బొమ్మలకొలువులో మాదిరి.. ఏ దుకాణంలో చూసినా ఒహటే దృశ్యం! నోరెళ్లబెట్టి చూస్తున్నారు విష్ణుదంపతులిద్దరూ! ఓ బక్కపల్చటి జీవి భుజంమీది బస్తాలోనుంచి కరెన్సీ కట్టొకటి తీసి దుకాణం మనిషి మీదకు విసిరేసాడు. కొత్తిమిర కట్టొకటి అందుకొని ముక్కుదగ్గర పెట్టుకొని.. ఓహో.. ఒహటే మురిసిపోవడం!

మూడు నిమిషాలైనా కాలేదు.. కట్టను క్రూరంగా వెనక్కు లాగేసుకుని ‘బోడి వెయ్యి రూపాయలకెంత సేపయ్యా వాసన్లు చూసేది? ఇట్లాగయితే ఇహ మేం వ్యాపారం చేసి తట్టుకొన్నట్లే. నడు.. నడు..పక్కకు’ అంటూ డబ్బుకట్ట పట్టుకు నిలబడ్డ మరో ఆడమనిషితో బేరంలో పడిపోయాడు దుకాణం మనిషి.

‘భగవంతుడి బుర్ర గిర్రున తిరిగింది. బక్కభక్తుణ్ణి పట్టుకుని విషయం కక్కిస్తేగాని కష్టం గట్టెక్కించే తోవ తోచే అవకాశం లేదు.

‘కాయగూరలు పండించే భూములన్నీ కాంక్రీటు అడవుల్లా మారి యుగాలయ్యాయయ్యా అమాయక దేవుడా! కొత్తగా కూరలు పండించే అవకాశం బొత్తిగా లేదెక్కడా ఇప్పుడు! సింథటిక్ టైప్ కాయగూరలు స్వామీ ఇవన్నీ! మీ సృష్టి కర్తలకేమీ అర్థం కావులే ఇవి! రకానికొకటి చొప్పున చైనానుంచి బోలెడంత పోసి తెప్పిస్తారీ దుకాణదారులు. మొదటి తారీఖుకదా ఇవాళ! జీతాలు వచ్చే నా బోటి అదృష్టవంతులం కొందరం ఉన్నంతలో ఇట్లా డబ్బుపోసి కాస్సేపు వాసన్లు చూసి తరించి పోతుంటాం! సుష్టుగా భోజనం చేసినట్లు అదో తుత్తి!’ బక్కజీవి వివరణ. లక్ష్మమ్మకు తిక్క రేగింది. ’నువ్వొక్కడివే వచ్చి ఇట్లా వాసన్లు చూసుకొని మురిసిపోతే సరిపోతుందా పెద్దమనిషీ? ఇంట్లో పెళ్లాం బిడ్డల సంగతేమీ ఆలోచించద్దా?’

‘హుఁ! పెళ్లామూ.. పిల్లలూ కూడానా తల్లీ ఈ కరువు రోజుల్లో!’ నుదురు బాదుకుంటున్న బక్కజీవిని చూసి భగవంతుడి కడుపు నిజంగానే తరుక్కుపోయింది.

నిజమైన కష్టనష్టాలు ఎలా ఉంటాయో కళ్లక్కట్టినట్లు కనపడుతున్నాయిప్పుడు.

‘ఇన్నేసి సొంట్లు పడుతూ ఈ భూలోకాన్నే అంటిపెట్టుకుని ఉండకపోతే కమ్మగా మోక్షం ప్రసాదిస్తాను. స్వర్గం వచ్చెయ్యరాదా బక్కభక్తా?’

‘అదీ సంగతి! ఇప్పుడర్థమయిందయ్యా మీ ఇద్దరి కత! ఏ పార్టీ తరఫున అంకుల్ ఈ నయా ప్రచారం? ఎన్నికలదాకానేగా ఈ అమిత ఔదార్యం? ఎన్ని ఎన్నికల సిరాచుక్కలు చూసింది స్వామీ ఈ చూపుడువేలు! పదివేలు పోస్తేనన్నా ముక్కు దగ్గరకు కొత్తిమిర కట్టొస్తోందిప్పుడు. మీ హామీలన్నీ నిజమేనని నమ్మి మా ఓట్లన్నీ మీకేసేస్తే! మీది ఏ మాయదారి పార్టీనో నాకు తెలియదుగానీ.. మోక్షం వంకతో మీ కాపుసారా అమృతమని చెప్పి అమ్ముకుందామనేగా మెగా ప్రణాళిక? మీ పుణ్యముంటుంది.. బాబ్బాబూ! నన్నిలా వదిలేయండి’ అంటూ మరో కూరగాయల దుకాణంలోకి దూరిపోయాడా బక్కమనిషి.. ఏ ఉల్లిపొరకనో వాసన చూసేందుకు!

***

పొద్దున కోఠీలో దిగింది మీరిద్దరేనా మహాశయా? దేవుళ్లకైతే మాత్రం ఎన్నికల కోడ్లు ఉండవా? పరమ అమాయకులయ్యా మా ఓటరు ప్రజానీకం! మోక్షం సాకుతో ఎవరివైపు తిప్పాలని మీ పథకాలు? కోడ్ ఉల్లంఘన కేసు బుక్కయితే బెయిలు కూడా దొరకదు కలియుగం గడిచినా.. తెలుసా?’ చిందులు తొక్కుతున్నాడు ఎదురుగా నిలబడ్డ పెద్దమనిషి.

‘రాంగ్ టైంలో వచ్చినట్లున్నాం బాబూ మేమీ భూలోకానికి! ఎంత దుష్టశిక్షణ శిష్టరక్షణకయినా ఓ సమయం సందర్భం ఉంటుందన్న ఇంగితం ఇప్పుడే మాకు వంటబట్టింది! ఏ కోడూ.. ఓడూ అడ్డులేనప్పుడే వచ్చి కాపాడుకొంటాంలే మా భక్తజనావళిని! మమ్మొదిలేయండి మొదటిసారి తప్పుకి!’ శ్రీవారి చెయ్యిపట్టుకొని ముందుకు కదలబోయింది శ్రీలక్ష్మీదేవి.

‘వచ్చినవాళ్లు ఎలాగూ వచ్చారు. మా పార్టీ అభ్యర్థికో పది ఓట్లు తరుగు పడేట్లున్నాయి. ఇద్దరూ కలిసి ఎనిమిది చేతుల్తో ముద్దర్లు గుద్దేసి పోండి స్వాములూ! మీ కష్టం ఊరికే ఉంచుకోనులే! మీ కొండ చిరునామా ఏదో చెబితే గెలిచినాక వచ్చే నిధుల్లో సగం మీ హుండీలోనే సమర్పించుకుంటా!’ అన్నాడు ఎన్నికల్లో నిలబడ్డ ఆ అభ్యర్థి!

దేవుళ్ళిద్దరూ శిలాప్రతిమల్లా చూస్తుండిపోయారు!

హా! ప్రజాస్వామ్యమా! దేవుడే ఇహ నిన్నురక్షించాలి సుమా!

**** (*) ****