( ప్రపంచంతో మనసుకున్న బంధాలు తెగ్గొట్టుకుని గాఢనిద్రా కడలిలో మునిగిపోయి, ఆ లోతుల్లోకి తనువును జార్చుకునే నడిజాముల్లో ఒక్కోసారి నా ఫోను మ్రోగుతుంది. తీస్తే, “నేను కెనడానుండి మాట్లాడుతున్నాను” అని ఒక ఆడ గొంతు పలుకుతుంది. ఆ శ్రీలంక సోదరి నన్ను మాటిమాటికీ అడిగే ప్రశ్న : “ఎప్పుడెప్పుడు కవిత రాస్తారు? కవితకి ఏది ఇంధనం?” అన్నదే. నిద్ర మత్తులో ఒక సారైనా సరిగ్గా జవాబు చెప్పలేదు. కవిత్వంలో చెప్పగలనేమో చూస్తాను)
ఎప్పుడెప్పుడు మనసులో
ఆకారం తెలియని మంచుపొర కమ్ముకుని
చెదిరిపోతుందో
ఎప్పుడెప్పుడు పాషాణ హృదయం
మెత్తబడి మెత్తబడి
నీరవుతుందో
వెంటనే కరిగి ప్రవహించందే
ప్రాణం గడ్డకట్టిపోయే ప్రమాదముందని
ఎప్పుడెప్పుడు మనసు హెచ్చరిస్తుందో
కన్నీరు ఓ వంక పూర్తిగా ఆవిరవకుండానే
మరోసారి కన్నీటికి
మనసు ఎప్పుడెప్పుడు సిద్ధపడుతుందో
నిద్ర మెలకువల మధ్య
మనసనే సీతాకోకచిలుక
ఎప్పుడెప్పుడు ఎగురుతుందో
కోపంలోనూ దుఖఃంలోనూ
మనసు ఎప్పుడెప్పుడు
గూడు కట్టుకు దాగిపోతుందో
అటువంటప్పుడు
రాయాలనిపిస్తుంది
*
మొగ్గ వికసించే
శబ్దాన్నివినడానికి
ఎప్పుడు భూమి నిశబ్దం వహిస్తుందో
పక్షుల గుంపుల తొలిపాట
వేకువజాము చీకటిని
ఎప్పుడు తొలిచేస్తుందో
ఎప్పుడెప్పుడు
నా కిటికీ పక్కన
వర్షం కురుస్తుందో
ఏటిఒడ్డునెవరో బట్టలుతికే శ్రుతిలో
కలిసీ కలియకుండా కోయిల
ఎప్పుడెప్పుడు పాడుతుందో
కూతవేటు దూరంలో వెన్నెల వెంటొస్తుంటే
గతకాలపు గురుతులను దాచుకున్న దారిలో
ఎప్పుడెప్పుడు ప్రయాణం కలిసొస్తుందో
అప్పుడు, అలాంటప్పుడు,
రాయాలనిపిస్తుంది
*
ఈ లోకపు కదలికలలో
ఏదో ఒక కదలిక
ఎప్పుడు నన్ను స్పందింపజేస్తుందో
పసితనంలో మనసులోతుల్లో
ముద్రించుకున్న మసక చిత్తరువు
ఎప్పుడు మెలమెల్లగా మెరుగుపడి
స్పష్టమైన ఆకారంలా అగుపిస్తుందో
హృదయాన్ని ప్రకాశింపజేసే పుస్తకాలు
మస్తిష్కంలో ఎప్పుడు
జ్యోతులై జ్వలిస్తాయో
ప్రకృతి సహజచర్యో
మానవుని అసహజచర్యో
మరొక ప్రాణాన్ని ఎప్పుడు హింసిస్తుందో
ప్రాణంలో పడిన చిక్కుముడులను
సంగీత స్వరాలనే మాయవేళ్ళు
ఎప్పుడెప్పుడు విప్పుతాయో
ఎప్పుడెప్పుడు
నేను మరణించలేదనేందుకు
సాక్ష్యం అవసరమవుతుందో
అప్పుడు, అలాంటప్పుడు
రాయాలనిపిస్తుంది.
*
దాటిపోయే ఆడవారిలో
ఉరికే సిగ్గు
స్మశానంలో కలిగే
అశాశ్వత శోకం
కల్మషమెరుగని పసిపిల్లల
బోసినవ్వుల సంబరం
ధాత్రి దొన్నెలో రాలుతూన్న
కాలపుచుక్కల సవ్వడి
నేలలో పూడే దుఃఖం
ఆకసాన్నంటే ఉత్సాహం
ఇలాంటివే ఇంకొన్ని,
చెప్తాయి నాకు, కవితనల్లమని..!
***
అనువాదం : అవినేని భాస్కర్
మూల కవిత : “నదిమూలం”
సంపుటి : పెయ్యెన పెయ్యుం మళై (కురవమనగా కురిసే వర్షం), 1998.
అద్భుతంగా ఉంది సార్. అనువాద కవితలా అనిపించటం లేదు. సహజంగా, ఒక ధారలా సాగింది. మంచి కవితను అందించినందుకు ధన్యవాదాలు భాస్కర్ గారు.
ధన్యవాదాలు బొల్లోజు బాబా గారూ!
ఈ కవితను ఎప్పుడో 2002 లో చదివిన గుర్తు. మూలమైన తమిళంలో కూడా చాలా బావుంటుంది. చాలా బావుంది భాస్కర్ గారు మీ అనువాదం.
మూలం చదివిన వాళ్ళే మేకేసుకుంటుంటే అనువాదం బాగానే వక్యిందన్నమాట!
థేంక్యు
అనువాదం లా లేదు ..చాలా సహజంగా ఉంది
ధన్యవాదాలు వెంకట నారాయణ గారూ!