కవిత్వం

‘అరాత్తు’ కవితలు

డిసెంబర్ 2017

టెకీలా

సరితకి ఉన్న
లెక్కలేనన్ని ప్రేమలను చూసి
అయోమయంతో శాంతి
పన్నెండు చిన్న గ్లాసుల్లో
టెకీలాను నింపింది
ఒక్కో గ్లాసుని
ఒక్కో ప్రేమగా ఊహించుకుంది
పన్నెండేనా?
మరోసారి లెక్క పెట్టుకుంది
ఏ గ్లాసు తాగేప్పుడు
ఎక్కువ మత్తెక్కుతుందో
అదే గొప్ప ప్రేమ అని
నవ్వుతూ తల ఊపింది
చేతిలో టాటా ఉప్పూ
ఇంతవరకు బ్రాండ్ లేని
నిమ్మపండూ ఉన్నాయి
ఏడు గ్లాసులు తాగేశాక
ఎనిమిదో గ్లాసులోని ద్రవాన్ని
మూడో గ్లాసులోకి ఒంపి
మత్తెక్కి పడిపోయింది

మూలం: https://www.facebook.com/araathu.officialpage/posts/1565800576812489

***

కవిత

ఒక కవిత చదివి
తలదించుకుని
పొగిలి పొగిలి
ఏడుస్తోంది
ఆమెకు దుఃఖం
ఎలాగూ అనివార్యం
ఈ రోజుకీకారణంగా
ఈ కవిత దొరికింది

మూలం: https://www.facebook.com/araathu.officialpage/posts/1428776287181586

***

బీచ్

చేతిలో బీర్ సీసాతో
కూర్చుని ఉన్నాను
చూస్తూ ఉన్నాను
సముద్రంలో ఎవరో
కొట్టుకుపోవడాన్ని
అది నేనే కాకూడదా
అన్న ఆశతో
కాపాడే ప్రయత్నాలు
ఏం చెయ్యలేదు
తర్వాతి వంతు నాదే
అలల్లో కలిసిపోయే నన్ను
చూడటానికి కూడా
ఎవరూ ఉండరు.

మూలం: https://www.facebook.com/araathu.officialpage/posts/1469945089731372

అనువాదం: అవినేని భాస్కర్శ్రీనివాసన్ రామ్ ‘అరాత్తు’ పేరుతో గత ఐదారేళ్ళుగా ఫేస్‌బుక్‌లోనూ, ట్విట్టర్‌లోనూ నేటితరం జీవితానికి అద్దం పట్టే విషయాలను తీసుకుని ప్రయోగాత్మకమైన కథలు, కవితలు రాస్తున్నారు. ప్రసిద్ధ రచయితలు చారునివేదితా, జయమోహన్, మనుష్య పుత్రన్‌ల మెప్పుపొందారు. ఇప్పటివరకు ఒక నవల, మూడు కథల సంపుటాలు, ఒక ట్రావెలాగ్, ఒక బాలల వ్యాససంపుటి ప్రచురించారు.

సైనైడు కుఱుంగదైగళ్ అన్న సంపుటంలో ఉన్న మైక్రో కథలు తమిళ సాహితీలోకంలో పలురకాల విమర్శలకు లోనయ్యాయి. ఇతని కథలన్ని ఆధునిక యువత జీవితవిధానం చుట్టూనే తిరుగుతాయి.

కొన్ని తమిళ సినిమాలకు కథా చర్చల్లో భాగస్వామ్యం వహించారు. విజయ్ టీవీలో ప్రసారమయ్యే “నీయా నానా” ప్రోగ్రాంలో న్యాయనిర్ణేతగా పాల్గొన్నారు.