నీరెండ మెరుపు

పుష్పవిలాపము: నేను చదివానా? నన్ను చదివిందా?

08-ఫిబ్రవరి-2013

చిన్ననాటి భావాలు చివరిదాకా ఉంటాయి. అన్నీ కాకపోయిన కొన్నైనా.

ఇప్పటికీ ఒక కాలు చెప్పులో ఉంచి మరో కాలు తీయను. తాడిపత్రిలో ఐదో తరగతి చదువుతున్న రోజుల్లో ఓ కాలికే చెప్పు వేసుకుని నేను గెంతుతుంటే మా పిల్లలదండుకు నాయకురాలైన వాణి “ఒంటికాలికి చెప్పు వేసుకున్నవారిని తేలు కుడుతుం”దని ప్రకటించి భయపెట్టింది. అప్పట్నుంచి గత ముప్పైయేళ్ళుగా అలా వేసుకోకుండా ఉండడం అలవాటైపోయింది.

బాల్యమన్నది అద్భుతమైన భయాలకే కాకుండా అతార్కికాలు, నిర్హేతుకాలైన ఆనందాలకు కూడా ఆటపట్టు.

కాంతారావు నటించిన జానపదచిత్రం చూసివచ్చాక కనబడ్డ ప్రతి చెట్టు తొర్రలోనూ మాంత్రికుని ప్రాణమైన రామచిలుక ఉంటుందేమోనన్న ఊహ గిలిగింతలు పెట్టేది. వేసవి సెలవులప్పుడు ఆదోనిలో ఉండే పెదనాన్న ఇంటికి వెళ్తే, తుంటరివాడైన నా అన్న దూరంగా కనబడే కొండని చూపి “రేయ్! ఆ కొండనెక్కితే నేరుగా చంద్రమండలానికే వెళ్ళిపోవచ్చు. నేను మొన్ననే వెళ్ళొచ్చా. దాహమేసి నీళ్ళు తాగుదామని వాటర్ బాటిల్ తీసి నోట్లోకి వేసుకుంటే నీళ్ళ చుక్కలు గాల్లోనే వేళ్ళాడాయి తెలుసా!” అని కొయ్యడమూ, నేను రాత్రంతా వేళ్ళాడే నీటి చుక్కల్ని ఊహించుకుంటూ గడిపేయడమూ జరిగిపోయేది. సూక్ష్మబుద్ధియైన నా చెల్లెలు మాత్రం వాటిల్ని కొట్టిపారేస్తూ “అదంతా అబద్ధం. నమ్మకు!” అని హెచ్చరించేది. కానీ నాకెందుకో ఆ ఊహల్లోని విచిత్రాకర్షణకు ఒళ్ళు ఝల్లుమనిపించుకోవడం బాగా ఇష్టం. పోసుకోగానే నోట్లోకి జారిపోయే నీటి కన్నా గాల్లో వేళ్ళాడుతూ కనిపించే నీటి చుక్కల్ని చూడాలన్న ఉత్సుకతలోని మజా….”అది అనుభవించితే తెలియునులే” అనబడే ఓ భలేఛాన్సులాంటిది.

పసితనం వేసే ముద్రల్ని చెరిపేయడం చాల కష్టం.

అల్యూమినియం ఫ్యాక్టరీలో పనిజేస్తూ ఓటీలు చేసి కూడబెట్టిన డబ్బుల్తో పానాసోనిక్ వారి మోనో టేప్‍రికార్డను కొనుక్కొచ్చిన నా చిన్నమేనమామ (బుక్కపట్నం కృష్ణమూర్తి) అంటే నాకు హీరో వర్షిప్ ఉండేది. 1982 వేసవి సెలవుల ప్రత్యేక ఆకర్షణ అదే. ఆయన రోజుకో ఆడియో క్యాసెట్టు ఖరీదు చేసి ఇంట్లో ఎక్కడంటే అక్కడ పడేస్తుంటే, నేను చెల్లి కలిసి ఓ పధ్ధతిలో పెట్టేవాళ్ళం. ప్రతి క్యాసెట్టు పైనా వరుస సంఖ్య వేసి, ఆ సంఖ్యల్ని ఓ కాగితం పైకి దించి, సంఖ్యలకెదురుగా క్యాసెట్టు పేరు వ్రాసి షోకేసు బైట అతికించడం ఓ ఘనకార్యం. వేరేవాళ్లనెవ్వర్నీ రికార్డర్ పైన చెయ్యి వెయ్యనివ్వని మామయ్యకు నేను, చెల్లీ దానికి పెట్టని రక్షకుల్లా కనబడేవాళ్ళం. కాబట్టి డ్యూటీకి పోతూపోతూ మా చేతుల్లో పెట్టివెళ్ళేవారు. అలా ఓరోజు క్యాసెట్టునొక్కింటిని పెట్టగా…

నే నొక పూల మొక్కకడ నిల్చి, చివాలున కొమ్మ వంచి గో

రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి “మా

ప్రాణము తీతువా” యనుచు బావురుమన్నవి – క్రుంగిపోతి – నా

మానసమం దెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై!

అన్న ఘంటసాల గొంతు వినవచ్చింది. వెంటనే అమ్మ దగ్గరకు పరుగెత్తుకెళ్ళి అర్థంకాని పదాలకు అర్థాల్ని తెలుసుకొచ్చి పునరావృత్తే వృత్తిగా నాన్నగారు నెత్తిన నాలుగు మొట్టిక్కాయల అక్షింతల్ని వర్షించేదాకా ఆ పద్యాల్నే వెనక్కు ముందుకు తిప్పాను.

మొదటిసారిగా పుష్పవిలాపాన్ని విన్నరోజున ఏమీ మార్పులేదు. మరుసటిరోజున మళ్ళీ అవే పద్యాల్ని బజాయిస్తున్నప్పుడు మా అమ్మగారు యథాలాపంగా “రఘూ! మాలతీ అక్క ఈ పద్యాల్ని విని పూలు పెట్టుకోవడం మానేసింది తెలుసా! అంత గొప్ప పద్యాలివి” అన్నారు. పద్యాల్ని వినేసి ఎవరైనా అలా చేసేస్తారా ఏమిటి?వంటి తర్కాలు కండలు పెంచుకోని వయసు కాబట్టి ఆశ్చర్యం కలగలేదు సరికదా సబబే అనిపించింది. పూలను చంపడం ఇష్టంలేక పెట్టుకోవడం మానేసిన మాలతి అక్కపై (మా నాన్నగారి రెండో అన్నయ్య కూతురు) పుట్టుకొచ్చిన గౌరవం ఇప్పటికీ అలానే ఉంది, ఆవిడ పెళ్ళయ్యాక పూలు పెట్టుకుంటున్నా కూడా.

తిరుపతిలో ఇంటర్మీడియేట్ చదువుతున్నరోజుల్లో మిత్రుడైన సతీశ్ కుమార్ చక్కగా పాటలు పాడేవాడు, పోటీల్లో పాల్గొనేవాడు. సతీశ్ వెళ్ళే ప్రతి పోటీకి తోడుగా నేనూ వెళ్ళేవాడిని. 1988లో ఘంటసాల వర్ధంతి సందర్భంగా  శ్రీవేంకటేశ్వరా సంగీత కళాశాలలో జరిగిన పాటల పోటీకి వెళ్ళి అక్కడ పుష్పవిలాపాన్ని పాడాడు.

ఊలుదారాలతో గొంతు కురి బిగించి

గుండెలోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి

ముడుచుకొందురు ముచ్చటముడుల మమ్ము

అకట! దయలేనివారు మీ యాడవారు.

సతీశ్ పాడుతూవుంటే ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అతను ఘంటసాలకంటే గొప్పగా భావ వ్యక్తీకరణ చేసాడని కాదు. ’గుండెలోనుండి సూదులు గ్రుచ్చి’ అన్న చోట సూది నా గుండెలో నుండి దూసుకెళ్ళినట్టుగా అనిపించి ఒళ్ళు గగుర్పొరచడము, కళ్ళలో నీళ్ళు దుమకడమూ జరిగిపోయాయి. కలాన్ని, కాగితాన్ని ఖరాబు చేస్తున్న తొలిరోజులవి. “విశ్వమంతయు చుట్టిరాగా – ఏడు ఆశ్వములనెక్కలేను” అంటూ అనుప్రాస, అంత్యప్రాసల్లోనే తచ్చాడుతున్న ఆరోజుల్లో సాదాసీద పదాల్లోని ’కదిలేది, కదిలించేది, పెనునిద్దరనొదిలిం’చ గలిగే శక్తిని మొదటిసారిగా చవిచూసాను. ఆపై తొంభైల్లో తిలక్ సంపూర్ణమైన ఆక్రమణ చేసేంతవరకూ శ్రీశ్రీ, కరుణశ్రీలే నాపై పెత్తనం చెలాయించారు.

డిగ్రీ ఫైనలియర్లో తిరుపతిలోనే ఇల్లు కట్టారు నాన్నగారు. పన్నెండువందల చదరపుటడుగుల స్థలంలో సగం ఇల్లు కట్టి మిగతా సగాన్ని ఖాళీ ఉంచారు. ఆ ఖాళీజాగాను తోటగా మార్చాం. మందారం, మల్లె, రోజా చెట్లతో బాటు బెండ, బీర, దోస పాదులు వేసాం. సీతాఫలం చెట్టు అదనపు ఆకర్షణ. పూజ కోసమని పువ్వుల్ని కోసేటప్పుడు “తల్లికి బిడ్డను వేరుసేతువే?” అని చెట్టు గద్దించినట్టుగా ఊహించుకుని “కరవీరైర్జాజి కుసుమైః చంపకరైబకులై శుభైః శతపత్రశ్చ కల్హారై అర్చయేత్ పురుషోత్తమమ్” అన్న శ్లోకాన్ని జపించేసి పాపవిముక్తుణ్ణైనట్టుగా నిట్టూర్చేవాణ్ణి. మాలో ఎవరు కోసినా కొన్ని పూలను మాత్రం అలానే వదిలేసేవాళ్ళం – “ఆయువు దీరినంతనే హాయిగ కన్నుమూసెదము ఆయమ చల్లని కాలివ్రేళ్ళపై”.

అమ్మగారు ఏరోజూ పూలను చీపురుతో చిమ్మలేదు. ఇప్పటికి కూడా వాడినపూలను చేత్తోనే తీసి కవర్‍లోవేసి ఎవరూ తొక్కని జాగాలో ఉంచుతారు. “మా యవ్వన మెల్ల కొల్లగొని ఆపయి చీపురితోడ చిమ్మి మ – మ్మావల పారవోతురు గదా! నరజాతికి నీతి యున్నదా?”.

ఈనాడు “పుష్యతీతి పుష్పం” అని, “పుష్య వికసనే” అనిన్నీ, “పూష్ణాతి జ్ఞానమితి పుష్ప”మని ధాతువ్యుత్పత్యాదుల్ని తెలుసుకున్నాను. పూలతోనే దేవతార్చన ఎందుకు చేయాలో తెలుసుకున్నాను. పూలకు, ఆధ్యాత్మికతకూ గల సూక్ష్మసంబంధాన్ని యథామతిగా గ్రహించాను. కానీ ఈ పాండిత్యంకు అతీతంగా, చిన్ననాటి అమాయకమైన అజ్ఞానాన్ని ఆస్వాదించాలనిపించినపుడు:

జడమతుల మేము! జ్ఞానవంతుడవు నీవు!

బుద్ధి యున్నది! భావసమృద్ధి గలదు;

బండబారెనటోయి నీ గుండెకాయ?

శివునికై పూయదే నాల్గు చిన్నిపూలు?

అని వల్లెవేసుకొంటాను.

*****

’అక్షరాణాం అకారోస్మి’ అన్నాడు గీతాచార్యుడు. చావుపుట్టుకల్లేనివి గనుకనే ఉన్నవి యాభైయ్యే ఐనా అనంతభావసంపదల్ని అవలీలగా మోయగల్గుతున్నాయీ అక్షరాలు. సహస్రాబ్దులనుండీ గజిబిజి ఊహలకి గట్టిరూపునిస్తూ కవుల గుండెల్ని తేలికపరుస్తూ వస్తున్నాయి. ఐతే కడదాకా వెంటాడే వాక్యాల్ని బహుకొద్దిమంది కవులు మాత్రమే వ్రాస్తారు. పుష్పవిలాపము నా చివరిదాకా వెంటాడే పద్యసమూహం. బుద్ధితెలియని వయసునుండి విద్వాంసవేషం వేస్తున్న కాలంలో కూడా వాడని సాహిత్యపరిమళాన్ని పంచుతున్న పదగుచ్ఛం. ఈ ఖండకావ్యాన్ని నేను చదివానని చెప్పడం కంటే అదే నన్ను చదివిందని చెప్పడం సబబు. ఇవి నిజాయితీగా చెబుతున్న మాటలు…..’సత్యం వద’ అని కదా చెప్పారు!