కవిత్వం

మనసుకో చిన్న మాట

జనవరి 2013

వెళ్ళిపోకే మనసా
అలా వెళ్ళిపోకే
ఆలోచనల శిఖరాల పైకి
భావ సముద్రాల లోతుల్లోకి
కవితారణ్య సీమల్లోకి
పక్షిలా
చేపలా
కుందేలులా
వెళ్ళిపోకే మనసా
అలా వెళ్ళిపోకే

మహాకవుల శైలిలోకి
మహా స్వాప్నికుల ఊహల్లోకి
కథన రథికుల పథం లోకి
అక్షరమై
ఉత్ప్రేక్షవై
ధూళియై
వెళ్ళిపోకే మనసా
అలా వెళ్ళిపోకే

సిద్ధాంత సౌధాల్లోకి
రాద్ధాంత వీధుల్లోకి
ముఠాలు కట్టిన మఠాల్లోకి
బందీవై
బాధితవై
మూర్ఖవై
వెళ్ళిపోకే మనసా
అలా వెళ్ళిపోకే

తనకు తాను సమధి కట్టుకుని
తనలోకి తాను ముడుచుకుని
తన్ను తాను వేలార్చుకుని
అంతర్ముఖరీ సుప్త మానస వికాసాన్ని
రంగులుగా ఆవిష్కరించే
సీతాకోకచిలుకలా
నేను నన్ను తీర్చుకునేవరకూ
వెళ్ళిపోకే మనసా
అలా వెళ్ళిపోకే