ఒక్కడుగు ఉసిరి మొలక
ఇప్పుడు నీకు నీడనిచ్చేంతయ్యింది
రెండాకుల మారేడు చెట్టుకప్పుడే
మారేడు పళ్ళు పడ్డాయి
తెలియదు కానీ నువ్వెక్కడనుంచో తెచ్చి నాటిన మల్లెలు మందారాలు
గులాబీ గన్నేరు
పూల రెక్కలు కొన్ని ఈ రోజు నీ
వంటి మీద పడున్నాయి
నిత్యం ఆకొకటి గిల్లే తులసి చెట్టుకి
సరిగ్గా పక్కనే
నువ్వు నిద్రపోయావ్
రెప్పకొట్టేంతలోనే ఈ ప్రదేశం
ఖాళీ అయి
కేవలం ఒక దీపమే మిగిలింది.
తెలుగు అనువాదం: గరికపాటి పవన్ కుమార్
మూలం: గరికపాటి సంగీత (అహోమియా కవిత)
పవన్ కుమార్ గారూ,
ఈ ఎలిజీ చాలా అందంగా, ఆర్ద్రంగా ఉంది. మూల భాష తెలియపరిస్తే బాగుండేది. సంగీతగారికీ, మీకూ నా అభివాదములు.
మూల భాష సంగీత రాసిన అసోమియా కవిత. వాకిలి బృందం చాలా వేగంగా మారుస్తున్నారు. నేను మీ వ్యాఖ్య చూసేప్పట్టికే మూల భాష అప్డేట్ చేసారు.
గరికపాటి పవన్ కుమార్
పవన్ గారూ – అభినందనలు. చాలా చక్కటి కవితను చదివిన అనుభూతి మిగిలింది. మూల భాషలోని కవితలోని గాఢతను అర్థం చేసుకోలేకపోయినా, అనువాదం మాత్రం హృదిని తాకేలానే ఉంది. పూరేకులు రాలిపడుతున్నంత సున్నితంగా మొదలయ్యీ, వేళ్ళతో సహా పెకిలించుకు విరుచుకుపడ్డ మహావృక్షపు దృశ్యాన్ని మనోఫలకం మీద మిగిల్చింది. “రెప్ప కొట్టేంతలో..” పద ప్రయోగం సరిగ్గా పడ్డట్టు అనిపించింది. ధన్యవాదాలు.
మానస గారూ,
సరిగ్గా ఈ కవితను అర్థం చేసుకున్నారు. నేను ఇంట్లో మాట్లాడే భాష సగానికి పైగా అస్సామీసే అయినా కవిత్వానువాదం అనే సరికి కత్తి మీద సామే. చాలా వరకు నుడికారాన్ని పట్టుకొచ్చే ప్రయత్నం చేశాను. మంచిది. ఉంటాను
గరికపాటి పవన్ కుమార్