1.
ఏ కాలానికి
ఆ ముందుమాటే రాస్తది
బహురూపులమారి.
ముక్కిరిపించి
మెడవంపున మెరిసి
ఒదిగినట్టే వొదిగి
కరిగినట్టే కరిగి
అస్తిత్వపునగ్నత్వాన్ని పరిచినట్టే పరిచి
గాఢాలింగనపు వలతో రహస్యాల్ని పట్టేసుకుని
గగనపు గుట్టునంతా బట్టబయలు చేసి
అక్కడికక్కడే మాయమైంది.
2.
తడి అడుగుల తప్పట్లు
వాకిలి పరిచిన నీటి అద్దాల కొంగు దాటి
తట్టకుండానే తలుపుతోస్తూ
అలలలలుగా తల్లోకొస్తూ…
లేకుండానే ఉన్నట్టు నువ్వు.
ఉండీ లేనట్టు నేను.
3.
అదొచ్చి పోయే రహస్యపుదార్లన్నీ
నీకొక్కదానికే తెలుసు
ఎలా రావాలో
ఎప్పుడు పోవాలో
ఆ మాయదాని దగ్గరే కదూ
నువ్వు నేర్చుకుంది?!
Painting: A DATE WITH A RAIN By Leonid Afremov
అయ్యుం టుంది. అందుకే అంత పోకడ. అభినందనలు.