లక్ష గ్రంథాలు
మూల కథ రచయిత : సుజాత
అరవ కథ పేరు : ఒరు లట్చం నూల్గళ్
రాయబడిన కాలం: 1982
సిలోన్ దీవికి వంతెన వేద్దాం!
– మహాకవి సుబ్రహ్మణ్య భారతి
“Welcome to delegates of Bharathi International”
తెల్లటి కేన్వాస్ మీద నీలిరంగు అక్షరాలు ఫైవ్ స్టార్ హోటల్ వాకిట గాలికి ఊగుతున్నాయి. దాని కింద తలపాగా చుట్టుకున్న మీసాల కవి సుబ్రహ్మణ్య భారతి పటం చిత్రించబడి ఉంది. పక్కనే పలు రంగుల జెండాలు రెపరెపలాడుతున్నాయి. డాక్టర్ నల్లుసామి గాజుతలుపు తాకబోయేలోపే కావలివాడు తలుపు తీసి చిరునవ్వు చిందించాడు. ఏసీ హాలు. తివాచీ పరచిన సభాభవనం తమిళపండితులతో కిక్కిరిసివుంది. వృద్ధ వచనకవి కేక్ తింటున్నాడు. సాహిత్య అకాడెమీ సిగరెట్ కాలుస్తున్నాడు. ఛందస్సు పండితుడు సోఫాలో కూర్చుని తొడమీద కాగితం పెట్టుకుని జాబు రాస్తున్నాడు. అక్కడి సంభాషణల్లో అచ్చతమిళం సమృద్ధిగా తొణకిసలాడుతోంది.’నేడు తమిళదేశంలో శాస్త్రాల్లేవు. నిజమైన శాస్త్రాలను పోషించకుండ, ఉన్నవాటినీ పక్కనపడేసి, మూఢనమ్మకాల్ని పెంచే కట్టుకథలతో పొట్టపోసుకుంటున్నారు తమిళదేశపు బాపనోళ్ళు…’
“ఇదెవరు చెప్పారో చెప్పుకోండి చూద్దాం?”
“అణ్ణాదొరా?”
“కాదండి. అచ్చం బ్రాహ్మణుడైన సుబ్రహ్మణ్య భారతి. గాలి అన్న వచన కవిత చదివి చూడండి”
“ఆయన అన్ని విధాలా విప్లవాది అండీ. పందొమ్మిది వందల పదీ, ఇరవైలలో ఒక బ్రాహ్మడు ఇలా అనాలంటే ఎంత ధైర్యం ఉండాలి?”
డాక్టర్ నల్లుసామి అక్కడికి సమీపించగానే “రండి, రండి! అభినందనలు” అన్నారు అందరూ.
“ఎందుకు?” అన్నాడు డాక్టర్.
“ఆఁ. తెలియనట్టు అడుగుతున్నారూ!”
“నిజంగానే తెలియదండి”
“కొత్తగా స్థాపించబోయే మహాకవి సుబ్రహ్మణ్య భారతి విశ్వవిద్యాలయానికి మిమ్ముల్నే ఉపకులపతిగా నియమించబోతున్నారట.”
“ఓ అదా? ఎందరో పేర్లలో నా పేరు కూడా ఉంది”
“లేదు. మిమ్ముల్నే అని చెప్పుకుంటున్నారు. మంత్రిగారు మీ గురించి సమీక్షించడం కోసమే ఈ సభకి వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు”
“మీరు మరీనూ.. మంత్రిగారికి మహాకవి మీద ఆసక్తండి”
“ఆ పదవికి మీరు తప్పితే అన్ని యోగ్యతలు కలిగినవాడు ఎవడున్నాడ్లెండి!”
“ఏమో చూద్దామండీ. అదేమైనా అంత సులువా? ఇందులో ఎన్నో రాయకీయాలుకూడా ఉంటాయిగా?” అంటూ డాక్టర్ నల్లుసామి అక్కడ్నుండి తప్పుకున్నాడు.
హోటల్ రిసెప్షన్ లో తన గది తాళంచెవి తీసుకుంటుండగా రిసెప్షనిస్ట్, “సార్, యూ హేవ్ ఎ మెసేజ్” అని ఒక చిన్న స్లిప్ చేతికిచ్చింది. అందులో “సెల్వరత్నం మూడుసార్లు మీ కోసం ఫోన్ చేశారు” అని వుంది. నల్లుసామి ఎవరీ సెల్వరత్నం అనే ఆలోచనలో పడ్డాడు. గుర్తు రావట్లేదు. ఆమెకేసి చూసి “థేంక్స్” చెప్పాడు. “యూ ఆర్ వెల్కమ్” అని చిరునవ్వు చిందించినపుడు ఆమె పలుచని చీరసొగసు నల్లుసామిని ఉక్కిరిబిక్కిరి చేసింది.
మొట్టమొదటిసారి భార్య (డాక్టర్ మణిమేఖల) లేకుండ ఒంటరిగా వచ్చాడు. కచ్చితంగా ఈమె చిరునవ్వులో ఒక కవ్వింపుంది.
“కలసి విడివడక – తెల్లవార్లు రమించి రతిగూడి సుఖించి – నీ మేను వేయిమార్లు కౌగిలించి…” మదిలో భారతి కవిత మెదిలింది.
“డాక్టర్, నమస్కారం”
“అరే, పెరుమాళ్! రండి. ఎక్కడుంటున్నారిప్పుడు?”
“ఉత్కల్లో. కొత్తగా టమిల్ సెషన్ ప్రారంభించారు…”
“ఉత్కల్ ఎక్కడుంది?”
పక్కన ఆకుపచ్చని కళ్ళతో ఒకామె వీళ్ళను చూసి ‘హలో’ చెప్పగా, పెరుమాళ్ పరిచయం చేశాడు.
“ఈమె కేత్రినా. రష్యానుండి భారతి మీద పరిశోధనలు చెయ్యడానికి వచ్చింది. దిస్ ఈజ్ డాక్టర్ నల్లుసామి”
“ఓ! ఐ సీ” అంటూ ఆ మగువ అతని చేయందుకుని కరచాలనం చేసింది. కొంచం నొప్పి కలిగింది. ట్రాక్టర్ నడిపేదేమో వాళ్ళూర్లో. భారీ ఆకారం. పలుచని నడుము కాదు. భారపు గుబ్బలను కప్పడం అలివికానట్టు అగుపించింది.
“యూ ఆర్ రీడింగ్ పేపర్, ఆరెంట్ యూ?”
“నో… ఐయాం ప్రిసైడింగ్. మధ్యాహ్నం… ఆఫ్టర్నూన్. యూ నో టామిల్?”
“ఎస్. బట్ ఐ కాంట్ స్పీక్.”
“భారతిని తమిళులు పేదరికంలో ఎందుకు వదిలేశారు అని అడుగుతోంది సార్ ఈమె”
“ఉన్నప్పుడు అతని విలువ తెలియక గుర్తించలేదండీ!”
“డాక్టర్. మీకు ఉపకులపతి ఋజువైందటగా?”
“ప్చ్. ఇంకా ఏదీ నిర్ణయించలేదబ్బా”
“మీరే అని చెప్పుకుంటున్నారు అందరూ. మిమ్ముల్నే నమ్ముకునున్నాను. నన్ను ఉత్కల్ నుండి ఎలాగైన రీడర్ గా ఇక్కడికి తీసుకొచ్చేయండి. చపాతీల భోజనం. వేడి చేస్తుంది… నా పైల్స్ కి పడట్లేదు.”
“ముందు నిర్ణయించనియ్యండి. తర్వాత చూద్దాం.” సెల్వరత్నం… ఎక్కడో విన్నట్టే ఉంది ఈ పేరు. రష్యా మగువని చూసి చిరునవ్వొకటి విసిరి డాక్టర్ మెత్తటి తివాచీ మెట్లను ఉత్సాహంగా ఎక్కి వెళ్ళాడు.
మణిమేఖలకి చెప్పాలి. ఆమే ఎక్కువ సంబరపడుతుంది. చీ… ఇంతలో ఎన్నేసి గాలి మేడలు!
మెజనైన్ ఫ్లోర్ దాటగానే మహాసభల మొదటి హాల్ కనిపించింది. ఎయిర్ కండిషన్డ్ కావడంతో తలుపులు బిగించారు. లోపలి మాటలు వినబడటం లేదు. అప్పుడప్పుడు డెలిగేట్లు ఎవరో ఒకరు టాయ్లెట్ కోసమో, జీడిపప్పు కేక్ సహితం తయారుగా ఉన్న కాఫీ కోసమో తలుపు తీసినప్పుడు “అతను అంతర్జాతీయ కవి. ఫిజీ దీవి ప్రజలకొరకు కళ్ళుచెమర్చుతూ కవితలు రాసినాడు. మహాకాళి రష్యాదేశాన్ని కరుణించింది… అని రష్యా విప్లవాన్ని పాడినాడు” ఒక వక్త ఆవేశ ప్రసంగంతో మహాసభ దద్దరిల్లుతోంది.
అటూ ఇటూ వెళ్ళే పలువురు నల్లుసామికి నమస్కారాలు చేశారు. పరిచయం లేని మనుషులు. అందరికీ తెలిసుండవచ్చు. మరి ఉపకులపతి అంటే మాటలా? మంత్రి మధ్యాహ్నం ఈ మహాసభలకి విచ్చేస్తాడు. నన్ను సమీక్షించడానికే. నల్లుసామికి లోలోపల పులకింతలు.
పాండిత్యాన్నిబట్టి నియమించాలంటే ఇతనికే ఇవ్వాలి మరి. తమిళ్నాడులో ఇతనికంటే భారతి కవిత్వంతో ఎక్కువ పరిచయం ఉన్నవాళ్ళెవరూ లేరు. ‘భారతి కవిత్వంలో సర్వసమతాదృష్టి’ అని ఈయన చేసిన పరిశోధనను భారతి సాహిత్య పరామర్శలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. అయితే పాండిత్యం మాత్రమే సరిపోతుందా? మధ్యాహ్నసభ ప్రారంభం కావడానికి ఇంకా రెండుగంటల సమయం ఉంది. రూముకెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుని వద్దాం. వీలైతే మణిమేఖలకి ఫోన్ ద్వారా విషయం చెప్పొచ్చు – అనుకున్నాడు.
డాక్టర్ సన్నని గొంతుతో,
‘ప్రేమవల్ల లభించేను పరమ సుఖం
ఇంపైన కళలో సుఖం; రమించు రతికేళిలో సుఖం
కల్లులోనూ కలదు సుఖం; భూమిపాలనలోనున్నదొక సుఖం…’
పాడుకుంటూ వెళ్ళి తాళంచెవి తలుపుకానించగా తలుపుపక్కన నిల్చున్న మనిషిని చూశాడు.
“నమస్కారమండి”
“నమస్కారం. మీరు?”
పాతికేళ్ళుంటాయి. బక్కగా ఉన్నాడు. లోతైన కళ్ళకింద వాడి వయసుకి చాయలు. భుజానికి సంచీ తగిలించుకున్నాడు. మహాసభల ఆహ్వాన స్మారకసంచిక కనిపిస్తుంది అందులోంచి.
“మనం కలుసుకుని కొంత కాలం అయింది” అన్నాడు. డాక్టర్ తన జ్ఞాపకాలలో వెతుక్కున్నాడు.
ఎక్కడో చూసినట్టు గుర్తు. ఎందుకైనా మంచిదని, “రండి. ఎప్పుడొచ్చారు?” అన్నాడు.
“ఇక్కడికా?”
ఇప్పుడు గుర్తొచ్చింది. సిలోన్. ఇతణ్ణి శ్రీలంకలో చూశాను.
“మీరేనా సెల్వరత్నం?”
“అరే! అయ్యగారికి భలే గుర్తున్నానే! యాళ్పాణంలో కలిశాము” ఇప్పుడు స్పష్టంగా గుర్తొచ్చింది డాక్టర్ గారికి. శ్రీలంకలో తమిళ మహాసభలు జరిగినప్పుడు వీళ్ళ ఇంట్లో రెండు రోజులు బసచేశాడు డాక్టర్.
“ఇలా వచ్చారేం?”
“ఊరికినేనండి. మిమ్ముల్ని పలకరించి వెళ్దామని వచ్చాను.”
“లోపలికి రండి”
గదిలో యాష్ ట్రే కోసం చూశాడు. డాక్టర్ కుర్చీ చూపించగానే కూలబడ్డాడు.
“నేటి సభలో నా ప్రసంగం కూడా ఉంది” అన్నాడు.
“అవునా. చాలా సంతోషం. మహాసభల్లో పాల్గొందామని వచ్చారా సిలోన్ నుండి?”
“అవును”
“మీరు ఈ మహాసభల్లో పాల్గొనడం ఎంత సముచితంగా ఉందో. సిలోన్ దీవికి వంతెన వేద్దాం అని మహాకవి భారతి పాడాడు కదా?”
ఇప్పుడు ఇతని కుటుంబసభ్యులు కూడా గుర్తొచ్చారు. యాళ్పాణం మహాసభల్లో వీళ్ళ ఇంటిల్లిపాదికి ఉన్న భాషాభిమానం, సాహిత్య అభిరుచి కనులారా చూశాడు.
ఇతని చెల్లెలు తియ్యని గొంతులో అతి రమ్యంగా పాడిన “నెంజిల్ ఉరముమిండ్రి…” మహాకవి భారతి పాట గుర్తొచ్చింది. ఆ అమ్మాయి పేరేంటి?
“ఇంట్లో అందరూ కులాసాయేనా?”
“ఇంట్లో ఎవరూ లేరండి”
“అవునా? వాళ్ళూ వచ్చారా ఇక్కడికి? మీ చెల్లెలూ వచ్చిందా?”
“చెల్లెలు లేదండి” వాడి కళ్ళల్లో జలజలా నీళ్ళు.
“ఏం చెప్తున్నారు?”
“మా చెల్లెలు, అమ్మ, నాన్న అందరూ చనిపోయారు”
“దేవుడా! ఎప్పుడు? ఎలా?”
“ఆగస్ట్ కలహంలో”
“అయ్యయ్యో, ఎలా జరిగింది ఇంత ఘోరం?”
“నడివీధిలో… వద్దండి. వివరాలేవీ వద్దు. నేనొక్కణ్ణి మిగిలాను. అదీ అదృష్టవశాత్తు”
డాక్టర్ కి మాటలు కరువయ్యాయి. ఎలా ఓదార్చాలో తోచడంలేదు. అతను కష్టపడి కన్నీళ్ళాపుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్పినా అతని కన్నీళ్ళు ఉప్పెనవుతాయనిపించింది. అయినా ఏదీ మాట్లాడకుండ ఉండలేక
“ఏమైనా తాగుతారా?” అనడిగాడు.
“కాఫీ“ అన్నాడు.
“ఇన్ని జరుగుంటాయని అనుకోలేదు. అదీ మనకి తెలిసినవాళ్ళకి, మనతో పరిచయం ఉన్నవాళ్ళకి ఇలా జరిగిందంటే రక్తం మరిగిపోతుంది”
“దాని గురించి ఇప్పుడు వద్దులెండి. నేనొచ్చింది వేరే విషయం గురించి మట్లాడుదాం అని”
“చెప్పండి. ఏం మాట్లాడాలనుకున్నారు? మీకు ఏ రకంగానైనా నేను సాయపడగలనా?”
“అక్కడ జరిగినవన్నీ తమిళనాడులో ఉన్నవాళ్ళకి తెలిసుండవనే అనుకుంటానండి. యాళ్పాణం పబ్లిక్ లైబ్రరీలో లక్షకిపైబడిన తమిళ గ్రంథాలను పోలీసులే తగలబెట్టేశారండి. అది ఇక్కడవాళ్ళెవరికీ తెలీదు”
“అవునా?”
“ఎంత అరుదైన పుస్తకాలో. మహాకవి భారతి స్వయాన ప్రచురించిన ‘స్వదేశి గీతాలు’ 1908లోనో ఎప్పుడో వచ్చింది. వెల రెండణాలు అనుండేది. ఆఱుముగనావలర్ ప్రచురించిన ప్రాచీన కావ్యాలు కూడా ఉండేవి. 1899లో ప్రచురితమైన అభిధాన చింతామణి తొలి పుస్తకం అక్కడే ఉండేది. లక్షకి పైబడిన పుస్తకాలంటే ఎన్నిపదాలుండేవో ఆలోచించండి. అన్నిట్నీ వీధిలో రాశిబోసి తగలబెట్టారు”
“అరెరే!”
“అది చెప్పాలనుకుంటున్నాను. ఇండియాకొచ్చిన ఈ పదిహేనురోజుల్లో నేను తమిళనాడులో చూసిన కొన్ని విషయాల గురించి చెప్పాలనుకుంటున్నాను”
“ఎక్కడ చెప్పాలనుకుంటున్నారు?”
“ఈ రోజు ప్రసంగంలో”
“ఈ మహాసభ భారతి గూర్చినది కదండీ?”
“భారతి బెల్జియం దేశ దౌర్భాగ్యానికీ, ఫిజీ దీవిలోని బానిసత్వానికీ జాలిపడి గుండె కరిగి కవితలు రాసిన అంతర్జాతీయ కవండి. రష్యావిప్లవాన్ని అభినందించినవాడు. నేడు తను ఉండుంటే శ్రీలంకలోని తమిళులకోసం గొంతుక విప్పి ఉండేడేవాడు కాదా?”
“కచ్చితంగా”
“అదే ప్రస్తావించబోతున్నానండి.”
“ఆ ప్రస్తావనకి ఈ సభ సరైనది కాదేమోనండి” అని అనుమానం వ్యక్తం చేశాడు డాక్టర్.
“ఇంతకంటే అనువైన సభమరొకటుండదండి. తమిళ భాషని అభిమానించే పలుదేశస్తులు ఉన్నారు. తమిళనాడు మంత్రి వస్తున్నారు. అంతర్జాతీయ పరిశోధకులున్నారు. భారతదేశవ్యాప్తంగా తమిళ పండితులెందరో ఉన్న ఈ సభలోకాకుండ మరెక్కడ చెప్పాలండి? ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే నాకున్న అన్నిబాధల్ని పక్కనపెట్టి ఇంతదూరం వచ్చాను”
డాక్టర్ కాస్త కంగారుగా, “ప్రధానంగా ఏ అంశంగూర్చి చెప్పదలచుకున్నారు?” అని అడిగాడు.
“శ్రీలంక తమిళుల్ని తమిళనాడులో ట్రీట్ చేసే విధానం చూశాను. అదీ ప్రస్తావించబోతున్నాను.”
“అర్థం కాలేదండి”
“అయ్యా! నేను వచ్చి పదిహేను రోజులైంది. మొట్టమొదట రామేశ్వరం శరణార్థుల ట్రాన్సిట్ కేంప్ కి వెళ్ళాను. శ్రీలంకనొదిలి ఇక్కడికొచ్చిన తమిళులు ఏం చేస్తున్నారు, వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారని చూడటానికి. సిలోన్ నుండి ఇక్కడకు చేరుకున్న తమిళుల్ని ఏమని పలకరిస్తున్నారో తెలుసా? ట్రాన్సిస్టర్ ఉందా? టేప్‌రికార్డర్ తెచ్చావా?
తమిళదేశానికొచ్చేశాము అని సంతోషంగా కళ్ళలో కలలను మోసుకొచ్చేవాళ్ళ ఆశలన్నీ రెండుగంటల్లో చెల్లాచెదరైపోతున్నాయి. ఆ కేంప్ ని చూస్తుంటే జెయిల్ ఖైదీల పరిస్థితే నయమనిపిస్తుంది . కిటికీల్లేని పెంకుటింటి గదులు. బ్రిటిష్ కాలంలో క్వారంటైన్ కేంప్ గా ఉన్నదాన్ని ఇంకా అలానే కొనసాగిస్తున్నారు. ఒక గదిని పదిమందికి కేటాయిస్తున్నారు. పదిహేను రోజులగ్గాను వాళ్ళకి తలా ఎనిమిది రూపాయలు సహాయనిధిగా ఇవ్వాలి. మనిషికి ఆరువేల రూపాయలు అప్పు ఇస్తున్నామని ప్రభుత్వం అంటుంది. అదంతా కాగితాల్లో మాత్రమే. అప్లికేషన్ పెట్టుకుని ఆరునెల్లు కాచుకున్నా లంచం లేందే అప్పు రాదు. వాళ్ళు తెచ్చుకున్న బట్టలను, వస్తువులను కబళించుకోడానికి ఎంతమందో. శ్రీలంక రూపాయికి డెబ్బైమూడు పైసలు ఈ దేశం డబ్బు ఇవ్వాలి. మరి దొరికేదేమో నలబైయైదు పైసలే. అందరూ వెనుతిరిగి శ్రీలంకకే వెళ్ళిపోవచ్చు. దీనికంటే ఆ నరకమే మేలు. అయితే లంకలోపలికి రానివ్వరు.
1964 దాక తమిళులు శ్రీలంకే స్వదేశము అనుకుంటూ ఉండేవాళ్ళు. హఠాత్తుగా ఇది మీ దేశం కాదు. తమిళ నాడుకెళ్ళు అని బలవంతంగా పేపర్లిచ్చి ఓడలెక్కించేశారు. ఏదండీ వీళ్ళ స్వదేశం? అక్కడ పుట్టి, పెరిగి, పెద్దయ్యి ఒకే రోజున అంతా తల్లకిందులైపోయి, అక్కడికీ చెందకా ఇక్కడికీ చెందక… మనుషుల్ని బంతుల్లా తిప్పికొడుతున్నారు. ఇది అంతర్జాతీయ సమస్య కాదా?”
“అంతా నిజమేనండి. అయితే మీరు దాన్ని చెప్పదలచుకున్న వేదిక సరికాదు అన్నదే నా భావన…”
“మరెక్కడ చెప్పమంటారు? రాజకీయ నాయకుల దగ్గరా? రెండు పార్టీల వాళ్ళూ వోట్లకోసం మా సమస్యగూర్చి మాట్లాడుతారుగానీ చేతలకొచ్చేసరికి ఎవరూ పట్టించుకోవట్లేదు”
“లేదు.. ఏదైనా పత్రికలో వ్యాసంలా మీరే రాయచ్చు కదా?”
“అదీ ప్రయత్నించానండి. అన్ని పత్రికల ఆఫీసులకీ వెళ్ళాను. ఒకళ్ళన్నారు – దీనిమీద మేమొక కవర్ స్టోరీ రాశాం కదా అని. మరొకర్ని కలవడమే వీలు కాలేదు. ఇంకో పత్రిక వాళ్ళు దీని గురించి మరో పత్రికలో వచ్చింది కదా మేం ఏం రాయాలిక అని తప్పించుకుంటున్నారు. ఒకళ్ళు దీని మీద మేమే శీర్షికలు రాస్తున్నాం కదా? అని అన్నారు”
“మీరు ఏం రాస్తానని అడిగారు?”
“ఆ గ్రంథాలయాన్ని తగలబెట్టిన సంఘటన గూర్చి. లక్ష పుస్తకాలండి. ఎన్ని అక్షరాలు, ఎన్ని పదాలు? అగ్గికి ఆహుతైపోయాయి. ఒక రాత్రంతా మండుతూనే ఉంది. ఒక పత్రికవాళ్ళు మాత్రం ‘రాయండి.. అలాగే మీ చెల్లెలు మానభంగం గూర్చి కూడా రాయండి.. బొమ్మగీసి ప్రచురిస్తే బాగుంటుంది. కొంచం హ్యూమన్ ఇంట్రస్ట్ కూడా ఉంటుంది అన్నారు. పత్రిక పేరొద్దులెండి. నా సొంత శోకం రాయడం ఇష్టం లేదండి. నా చెల్లెల్ని నా కళ్ళముందే వస్త్రాపహరణం చేశారు. అంతకుముందు ఒక సింహళ కుటుంబంవాళ్ళు ఆసరా ఇచ్చారు. ఒకరోజంతా మరుగుదొడ్లో దాక్కుంది. ఆ పైన వాళ్ళ ప్రాణాలమీదకొస్తుందనగా బైటకొచ్చేసింది. నడివీధిలో.. నా కళ్ళ ముందే.. కళ్ళ ముందే..” దుఃఖం ఆపుకోలేక ఏడ్చాడు.
“అయ్యో ఎంత బాధాకరమండి”
కాసేపు ఏడ్చాక, “ఇలా ఏడ్చి పశ్చాత్తాపం పొందాలనుకోవట్లేదండి. ఇలాంటి ఘోరాలు మీ దేశంలో కూడా చాలానే జరుగుతున్నాయి. ఇక్కడ రేప్ లకి కొదవలేదు. అయితే ఆ గ్రంథాలని తగలబెట్టడం మాత్రం చరిత్రపరంగా ఒక ఘోర సంఘటనండి. ఆ జ్వాలలో ఒక జాతి సాహిత్య సంపద కాలిపోయింది. ఇది అంతర్జాతీయంగా అందరూ ఖండించదగ్గ విషయం” చొక్కా ముంజేతులతో కళ్ళూ ముఖమూ తుడుచుకుంటూ, “దేశ పౌరుడంటే ఎవడు? దానికి ఆధారం ఏంటని సందేహం కలుగుతుంది. సింహళులు, తమిళులూ ఇద్దరు ఇండియానుండి అక్కడికి వెళ్ళినవాళ్ళే. వాళ్ళు వంగదేశం, ఒరిస్సానుండి వచ్చిన ఆర్యులట. మేము ప్రవాసులమట. తక్కువజాతివాళ్ళమట.. ఇదంతా చెప్పక్కర్లేదా? ఆరులక్షల పైన ప్రజలు. ఉన్నపళాన ఇది మీదేశం కాదు వెళ్ళండి అంటే ఎక్కడికెళ్ళగలరని? ఏం చెయ్యగలరని? ఇదంతా ఇక్కడవాళ్ళకి చెప్పొద్దూ?”
డాక్టర్ ముక్కు గోక్కున్నాడు. “ఇంత విపులంగా చెప్పకండి. ఎందుకంటే ఇది సాహిత్య సభ. ఇందులో రాజకీయాన్ని ప్రస్తాపవించడం బాగుండదు. ఇలా చెయ్యండి..”
“రాజకీయం కాదండి. ఇది మానవహక్కుల ఉల్లంఘన సమస్య కాదా?
సోదరులు ఆప్తులు సహమానవులచట
హింసలకి లోనగుట చూసి ఎటులోర్తుము?
-అని భారతి పాడాడు కదండి? శ్రీలంక తమిళుల్ని మీరందరూ సోదరులనే కదా అంటారు?
“వాస్తవమే అనుకోండి. అయినా..”
“ఈ అవకాశం వదులుకుంటే మా బాధలు చెప్పుకోడానికి నాకు మరొక్క సభ దొరకదండి. రత్నాపురిలో జరిగిన ఘోరాలన్ని చెప్తే వినేవాళ్ళ కళ్ళల్లోకి రక్తం వస్తుంది. అదంతా చెప్పట్లేదు నేను. కేవలం గ్రంథాలయం తగలబెట్టిన ఘోరం మాత్రం చెప్పబోతున్నాను. దానిని ప్రతిపాదిస్తూ ఒకే ఒక్క పుస్తకాన్ని మాత్రం వేదికపైన తగలబెట్టబోతున్నాను.”
“ఏం పుస్తకం?” అనడిగాడు కంగారుగా.
“ఈ మహాసభల ఆహ్వాన స్మారక సంచికను”
“ఎందుకండి అదంతా..?”
“భారతి చెప్పినవేవీ చెయ్యకుండా ఏర్కండిషన్ హోటల్లో చాక్లేట్ కేక్ తిని మహాసభలు నిర్వహించి కాదండి భారతిని గౌరవించాల్సింది. ఈ ఆహ్వాన పత్రికని వేదికమీద తగలబెట్టేసి ఆయన రచనల్లో చెప్పింది ఆచరణలో పెట్టడమండీ మనం చెయ్యాల్సింది. ‘సిలోన్ దీవికి వంతెన వేద్దాం’ అన్నాడు ఆ మహాకవి. వంతెన అంటే కాంక్రీట్ తో నిర్మించే వంతెన కాదు. మనసుల్ని విస్తరించడం. మరో మనిషికై చేయూతనివ్వాలన్న భావనకి వంతెన వేయడం. మనసువంతెన. ఇది అందరి మనసుల్లో రిజిస్టర్ అవ్వాలి. సమయం అయిందండి. రెండింటికి సభ మళ్ళీ ప్రారంభమవుతుంది” అని చేతులు జోడించి సెల్వరత్నం సెలవు తీసుకున్నాడు.
అతను వెళ్ళిన దిక్కుకేసి చూస్తూ ఉండిపోయాడు డాక్టర్. కాసేపు ఆలోచించాడు. కార్యక్రమపట్టిక చుశాడు. రెండో వక్త ‘సెల్వరత్నం, శ్రీలంక’ అనుంది. ఆలోచించాడు. కుక్కపిల్ల ఆకారంలో ఉన్న ఫోన్ తీసుకున్నాడు. మదురైకి ట్రంకాల్ చేశాడు. ”కీకీ కాల్… డాక్టర్ మణిమేఖల”
పది నిమిషాల్లో కాల్ వచ్చింది.
“మణి.. నేనే”
“ఏంటి, కనుక్కున్నారా? మీకే వస్తుందటా?”
“ఇంచుమించు వచ్చినట్టే. సెక్రెటేరియట్లో విచారించాను. మంత్రి సంతకం ఒకటే బాకీయట”
“అయితే పాయసం వండాల్సిందే. ఈ క్షణం మీతో ఉండలేనందుకే దిగులు..”
“మణీ. ఒక చిన్న సమస్యుంది అందులో..”
“ఏంటి? రానీకుండ అరుణాచలం ఏమైనా అడ్డుపడుతున్నాడా?”
“అదికాదు మణి. ఈ రోజు సభకి మంత్రి వస్తున్నారు. నా ప్రసంగానికి ముందు ఒక శ్రీలంక అతని ప్రసంగం. ప్రపంచ తమిళ మహాసభలో కలిశాను. అతను మాట్లాడుతున్నాడు.”
“మాట్లాడనివ్వండి. మీకేంటి?”
“అదికాదు మణిమేఖల. అతను ఈ మధ్య లంకలో జరిగిన కలహాల్లో అన్నీ కోల్పోయి విరక్తిగా ఉన్నాడు. ఇంచుమించు ఒక విప్లవకారుడిలా, పిచ్చిబట్టినవాడిలా ఉన్నాడు.”
“ఏం చేస్తాడట?”
“యాళ్పాణంలో లక్ష తమిళ గ్రంథాలను తగలబెట్టేశారట. ఆ విషయాన్ని నొక్కి చెప్తూ ఈ వేదికపైన సువెనీర్ ని తగలబెడతాను అంటున్నాడు. వినడానికే చిరాగ్గా ఉంది. ఇలా చేస్తే సభలో గలాటలు జరిగి నా ప్రసంగానికి ముందే సభ అర్ధాంతంగా ఆగిపోతే మంత్రిగారు వచ్చీ…”
“త్రీ మినిట్స్ ప్లీస్”
“ఎక్స్‌టెండ్ చెయ్యండి”
“ఏం. వినబడుతోందా?”
“వినబడుతోంది చెప్పండి… చూడండీ, ఈ రోజు మంత్రి మీ ప్రసంగం వినడం చాలా కీలకం. అతనికంటే ముందు మీరే మాట్లాడేస్తే?”
“అదెలా కుదురుతుంది? కార్యక్రమ ప్రణాళిక ఎలా మార్చగలం? సభాధ్యక్షత వహించేవాణ్ణిగనుక, ముగింపు ప్రసంగం కదా నాది?”
మదురై కాసేపు ఆలోచించింది.
“ఏం చెయ్యమంటారు?”
“అర్జంటుగా ఫోన్ చేసి ఎలాగైనా మీ అన్నయ్యకి విషయం చెప్పేయ్”
“నేనూ అదే అనుకుంటూ ఉన్నాను. పెట్టేయండి ఫోన్”
“ఎలాగైనా…”
“పెట్టేయండని చెప్పానా? ఎక్కువ సమయంలేదు. ఒక ట్రంకాల్ చేస్తాను.”
“సరే మణిమేఖల”
“ఎక్కువ ఆలోచించకండి. మీకే వస్తుందన్నట్టే అన్నయ్యకూడ చెప్పారు. మంత్రిని ఆకట్టుకునేలా మాట్లాడండి చాలు.”
టెలిఫోన్ పెట్టేశాడు. కాస్త ఊరట కలిగింది డాక్టర్ కి.
మణిమేఖల కార్యసాధకురాలు. ఎలాగైనా సాధించేస్తుంది. ఆమె శక్తి ఏంటో తెలుసు. ఇప్పటికే ఆమె పొడవాటి వేళ్ళు టెలిఫోన్ బటన్ లను నొక్కుతూ ఉంటాయి.
సరిగా రెండింటికి సమావేశం ప్రారంభం అయింది. సభ కిక్కిరిసింది.
విదేశీయుల ముఖాలు తొలివరుసలో మెరిశాయి. పట్టుచీర పడతి ఒకావిడ మైక్ అందుకుని “తలచినది నెరవేర్చుట ధర్మం. మంచి మాత్రమే తలచుట ధర్మం…” అన్న భారతి గీతాన్ని లలితంగా పాడింది. వేదికపైన మాట్లాడాల్సినవారి వరుసలో ఒక చివర సెల్వరత్నం ఆసీనుడై వున్నాడు. డాక్టర్ అతన్ని చూసినప్పుడు పుస్తకాన్ని పైకెత్తి చూపించాడు. డాక్టర్ మనసులో భయం మొదలైంది. ఏంటి? ఏమీ చెయ్యలేకపోయారా? చూద్దాం. ఇంకా మంత్రి రాలేదు.
ఆహ్వాన ప్రసంగకర్త “ప్రపంచపు నలుమూలల నుండి విచ్చేసిన తమిళ పండిత ప్రజానికానికి…” అని మొదలు పెట్టగానే అందరి దృష్టి గుమ్మంవైపుకి మళ్ళింది. సభలో చిన్న హడావిడి. మంత్రివర్యులు జోడించిన చేతులతో అటు ఇటు చూస్తూ అందరికీ వందనాలు పెట్టుకుంటూ వచ్చారు. డాక్టర్ నల్లుసామిని చూసి చిరునవ్వొకటి చిందిస్తూ తన పక్కనే కూర్చున్నారు. చొక్కాచేతిని వెనక్కి లాక్కుని టైం చూసుకున్నారు.
ఇప్పుడు అడుగుదామా? ఇది సరైన సమయం కాదు. చూద్దాం. ఆయనే అడుగుతారేమో అనుకుని ఊరుకున్నాడు నల్లుసామి. అవతల వైపుకి ఓమారు చూశాడు. సెల్వరత్నం ఇంకా అక్కడే కూర్చున్నాడు. డాక్టర్ కి కంగారు కాస్త పెరిగింది.
“ముందుగా ఫిజీ దీవినుండి విచ్చేసిన జార్జ్ మార్తాండం గారు ప్రసంగిస్తారు” అని అనౌన్స్ చేశారు.
“రెస్పెక్టెడ్ అండ్ హానరబుల్ మినిస్టర్ అండ్ ఫెల్లో డిలిగేట్స్. ఐయామ్ ఎ తేర్డ్ జెనరేషన్ టమిలియన్ అండ్ ఐయామ్ సారి ఐయాం నాట్ ఏబుల్ టూ స్పీక్ ఇన్ టామిల్. బట్ ది గ్రేట్ సుబ్రమణ్య భారతి…”
డాక్టర్ అప్రయత్నంగానే అటువైపుకి చూశాడు. ఒక పోలీస్ ఇన్స్ పెక్టర్ వక్తల వరుసలో ఉన్న ఒకాయనదగ్గరకెళ్ళి ఒక కాగితం చూపించి ఏదో అడిగాడు. అతను సెల్వరత్నంకేసి చేయి చూపించాడు. ఇన్స్‌పెక్టర్ నేరుగా సెల్వరత్నం దగ్గరకెళ్ళి ఏదో గుసగుసలాడాడు. సెల్వరత్నం కలత నిండిన ముఖంతో ఇన్స్ పెక్టర్ వెంట నడవడం గమనించాడు డాక్టర్.
తృప్తిగా ఊపిరిపీల్చుకున్నాడు. మణిమేఖల కార్యసాధకురాలే. అనుకున్నది గంటలో సాధించిపెట్టేసింది. తనలో తనే సంతోషంగా నవ్వుకున్నాడు.
“తరువాయి ప్రసంగించాల్సిన శ్రీలంకకి చెందిన సెల్వరత్నం ఇచట లేడుగనుక సోవియట్ దేశంనుండి వచ్చిన కేత్రినా ఐవనోవాని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము”
***
మరుసటిరోజు వార్తా పత్రికల్లో ఈ కింది వార్త ప్రముఖంగా కనపడింది -
“డాక్టర్ నల్లుసామి తన అధ్యక్ష ప్రసంగంలో ఇలా అన్నారు- సిలోన్ దీవికి వంతెన వేద్దాం అని పాడాడు మహాకవి. వంతెన అంటే కాంక్రీట్ వంతెన అని కాదు. మనసుల్ని విస్తరించడం. మరో మనిషికై చేయూతనివ్వాలన్న భావనకి వంతెన వేయడం. అది మనసువంతెన. మన తమిళ సోదరులెక్కడున్నా, ఏ కష్టమొచ్చినా మేమున్నాము అన్న నమ్మకాన్ని కలిగించే మానసిక వంతెన. అని నొక్కి చెప్పారు. ప్రభుత్వం కొత్తగా స్థాపించిన మహాకవి సుబ్రహ్మణ్య భారతి విశ్వవిద్యాలయానికి డాక్టర్ నల్లుసామిని ఉపకులపతిగా ఎంపిక చేసినట్టు మంత్రివర్యులు సభలో పేర్కొన్నారు.“
సెల్వరత్నం వీసాను రద్దు చేసి ఇరవైనాలుగు గంటల్లో శ్రీలంకకి వెనుతిరగాలన్న ఆదేశాలు వచ్చిన వార్త మాత్రం ఏ దినపత్రికలోనూ రాలేదు.
**** (*) ****
1982 న సుబ్రమణ్య భారతి శతజయంతి ఉత్సవాలలో భాగంగా ‘ఆనంద వికడన్’ పత్రికవారు సుబ్రహ్మణ్య భారతి కవితల్లోని కొన్ని వాక్యాలను ఎంచుకుని ఒక్కొక్క వాక్యానికి సంబంధించి ఒక్కొక్క కథ రాయమని అప్పటి రచయితలకి పిలుపునిచ్చారు. రచయిత సుజాత, ‘సింగళత్తీవినిక్కోర్ పాలం అమైప్పోం’ అన్నది ఎన్నుకున్నారు.
1981 వ సంవత్సరం శ్రీలంకలో జరిగిన కలహాల్లో, ప్రభుత్వ సహకారంతో పోలీసులే యాల్పాణం పబ్లిక్ లైబ్రరీలోని లక్షకు పైచిలుకు తమిళ గ్రంథాలను తగలబెట్టారు. తూర్పు ఆసియాలోని అతిపెద్ద గ్రంథాలయం ఇది. ఆ దుర్ఘటన నేపథ్యాన్నీ, భారతి వాక్యాన్నీ తీసుకుని కథగా రాశారు.
మరువలేని సిలోన్ సెల్వరత్నం పాత్రని పరిచయం చేసిన … తమిళ్ తెనుంగు సాహితీ వారధిగా నిలుస్తున్న
అవినేని భాస్కర్ కి హ్రదయపూర్వక అభినందనలు.
ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో తమ పదవీ కాలంలో
ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల (ఇవియంల) రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించిన
సుజాత కలం పేరుతొ ప్రసిద్ధులైన శ్రీ ఎస్ రంగరాజన్ గారి కధ “లక్ష గ్రంథాలు” ను అద్భుతంగా
అనుసృజించిన అవినేని భాస్కర్ కి హ్రదయపూర్వక అభినందనలు.
అద్భుతం!
కథా, మీ అనువాదమూ కూడా.
ధన్యవాదాలు శారద గారూ!
ఇస్మత్ ఆపా కధలను అనుసృజించిన పి.సత్యవతి గారిలా, కొల్లూరు సోమశంకర్ గారిలా, తమిళ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేస్తున్న గౌరి కిరుబాకరాన్ గారిలా, ఆంగ్ల సాహిత్యం అనువాదాలు అద్భుతంగా చేస్తున్న పి.మోహన్ ( వోల్టేర్ కాండీడ్, వాంగో జీవిత చరిత్ర ‘జీవలాలస’ ), డా మైథిలి అబ్బరాజు గారిలా, బండ్లమూడి స్వాతికుమారి గారిలా, ఇంకా అనేకుల్లా … తమిళ్ కదా సాహిత్యాన్ని అద్భుతంగా అనుసృజిస్తున్న అవినేని భాస్కర్ గారి Silent Contributions చాలా శ్లాఘనీయం.
మీ పొగడ్తలకి మాటలు రావట్లేదు. అందుకే సైలెంట్ అయిపోయాను రామయ్య గారూ.
ధన్యవాదాలని చెప్పాలన్నా భయంగా ఉంది. దాన్ని మీరు అక్నాలెడ్జ్మెంట్ గా తీసుకుని ఇంకా ఎక్కువ పొగిడేస్తారేమోనని భయం. అంతే
తమిళనాట తెలుగు కోసం పోరుతున్న స.వెం.రమేష్ గారు తెలుగు భాషకు చేస్తున్నఅమూల్యమైన సేవలాగే …. మీ శక్తి కొద్దీ, వెసులుబాటులను బట్టి తమిళ సాహిత్య అనుసృజనాల ద్వారా తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న అవినేని భాస్కర్ గారూ! మిమ్మల్ని పొగిడే అవకాశం కాలానికి, ప్రముఖలు వదిలేస్తూ . . . . మీ అవిరళ కృషి ఇలాగే కొనసాగాలని ప్రార్థిస్తున్నా.
“దేశ పౌరుడంటే ఎవడు? ” అంటూ మౌలిక ప్రశ్నను లేవనెత్తిన సిలోన్ సెల్వరత్నం ను రక్తమాంసాలతో, కన్నీళ్లతో మాముందుంచిన భాస్కర్ గారూ, వొందనాలు.
క్రీస్తుశకం ఒకటో శతాబ్దంలో మహాకవి తిరువళ్లువార్ వెలయించిన ద్రవిడ వేదం ” తిరుక్కురళ్ ” ల టీకా తాత్పర్య సహిత అనువాదం లాంటి బృహత్ కార్యక్రమాలు కూడా మీ నుంచి ఆశిస్తున్నాము.
చాలా నిస్సహాయమైన ఫీలింగ్ కలిగింది అన్న కథ చదివాక. నిన్న విసారనై (Interrogation) చూసినప్పుడు కలిగిన దానికన్నా ఎక్కువ బాధగా ఉంది. వాళ్ళు పోలీసులు, లాయర్లు, bureacrats- రాతి మనుషులు అని నచ్చజెప్పుకున్న. కానీ సాహితీవేత్తలు, కవులు కూడా ఇంత తుఛ్ఛంగా ఆలోచిస్తారు అంటే అక్షరం మీదే నమ్మకం పోతోంది.
Nothing is sacred. మన విశృంఖల స్వార్థాన్ని మించిన responsibility లేదు. I know we live in a postmodern world with all its fragmentations and insulations అయినప్పటికీ మన callousnessకి, మన narcissismకి, మన cheap pleasure pursuitకి excuse లేదు. Nevertheless, I’m digressing.
“ఇలాంటి ఘోరాలు మీ దేశంలో కూడా చాలానే జరుగుతున్నాయి. ఇక్కడ రేప్ లకి కొదవలేదు. అయితే ఆ గ్రంథాలని తగలబెట్టడం మాత్రం చరిత్రపరంగా ఒక ఘోర సంఘటనండి. ” –ఇది చదివినప్పుడు చివుక్కుమంది. ఒక పక్క నా rational mind చెప్తూనే ఉంది, ప్రపంచంలో ప్రతి నియంత చేసిన పని ఒక ప్రజల సాంఘిక, సాంస్కృతిక చరిత్రను అంతం చేయటం. ఆ oblivion renders them anchorless. కానీ a more visceral part yells, రేప్ కన్నా torturous criminality ఏముంటుంది అని?
చాలా ఉద్వేగానికి గురిచేసిందన్నా కథ. ఒక రకంగా అది మంచిదేనేమో- surface-levelని మాత్రమే ఊరించే popular entertainment కన్నా deep-feeling కలిగించే కథ వెయ్యి రెట్లు మెరుగు. కానీ ఈ కోపం, బాథ నెమ్మదిగా evaporate అయిపోతాయి. కార్యరూపానికి దారి తీయని ఆలోచన వ్యరథమే కదా? యుద్ధం చేయటానికి మనం చేసేది కరెక్ట్ అనే నమ్మకం కలగాలి. And the genius of the post-truth world is that the system has demerited any form of honesty or righteousness.
ఇప్పుడు కనీసం ఈ నపున్సకత్వ ఆగ్రహం అయినా ఉంది. కొన్ని రోజుల్లో apathy మాత్రమే మిగులుతుందేమో అన్న భయం పట్టుకుంది.
శిరీష్ ఆదిత్య గారు, నా లాంటి ఎందరిలోనో ఉన్న భావోగ్వేదనకు అక్షర రూపం ఇచ్చారు.
శ్రీలంక శరణార్ధులకు ఏర్పరిచిన రామేశ్వరం ట్రాన్సిట్ కేంప్ లో లోపించిన హ్యూమన్ టచ్ గురించే కాదు,
పాతికేళ్లుగా శ్రీలంకలో జరిగిన మారణకాండ, లక్షలాది అమాయకుల నరబలిని ఆపలేకపొయిన
మన భారత దేశ పాత్రను ఎలా అర్ధం చేసుకోవాలి, ఎలా సమర్ధించుకోవాలి ?
భాస్కర్ గారు, గోవింద్ నిహలానీ గారి ‘పార్టీ’ సినిమా గుర్తుతెచ్చింది మీ ఈ కథ!
అద్భుతం .. భాస్కర్ గారూ ..నో more వర్డ్స్
ఈ కధ నన్నొక వ్యసనంలా పట్టుకుంది.