కవిత్వం

పులకింత కోసం

జనవరి 2013

వరండాలో గాలిని పలకరిస్తూనే
కుడి ఎడమల వీధి వెంట గాలిస్తుంటా …
ఎవరైనా మిత్రుడు
నాకోసం వస్తాడని
కొంత జీవితాన్ని కానుకగా తెస్తాడని …

వేపపండును చప్పరిస్తూ
చెట్టు మీది తొండ నిశ్చింతను గమనిస్తూనే
గేటు దగ్గర కంటి శకలాన్ని
నిలపటం మాత్రం వదలను

నా బాల్యాన్ని పిల్లిగుంత లేయించే
మిత్రుడో…
నా చిలిపి హార్మోనుల కాలేజీ తెగింపును
మరో సారి తెరమీదికి తీసుకోచ్చే
సహవాసి ఎవరైనా వస్తుండవ చ్చని …

ద్వారం దగ్గర చూపులు
అనుకోకుండానే దిక్కుల్ని
జల్లెడ పడుతుంది .

ఒంటరితనం ఒకటే గుస గుస
నిశ్శబ్దం చిటపటలు

కొన్ని అసాధ్య సందర్భాల్ని
ఊహలు పూరించినట్టు
ఎండిపోయిన మనసు మూలల
మిత్రులు మాత్రమే తడపగలరు

ఎవరైనా వస్తూ వస్తూ
నవ్వుల ద్రావకంతో
నా కళ్ళనిండా భవిష్యత్తు ను
నింపి పోతాడనుకుంటా .

మనసు కు కూడా
కొంత ఆత్మ స్పర్శ కావాలి
మంచుతో తడిసిన పలుకురాయిలా
ఒళ్లంతా జిళ్ళు మనాలి .

…ఎవరొస్తారు?…
అందరూ ప్రపంచ చక్రాల కింద
నలిగినా ఆత్మీయతను శుభ్రం చేసుకుంటూ
కుట్టుకోవడంలో నిమగ్నమైనారేమో ..!

…ఎవరొస్తారు?…
మినుకు మినుకు మంటున్న
నక్షత్రాలు రాలతాయని
దోసిలి పట్టుకుని నిల్చున్నట్టున్నారు.