కవిత్వం

పత్లా పత్లా ప్యార్

12-ఏప్రిల్-2013

నిన్నటి మానసిక జ్వరాన్ని మోసుకొని
ఊరేగు

 

ఎందుకు దాని వెంట పడతావో
అది కొరకరాని కోయ్యని తెలిసీ
కన్నీళ్ళని కాల్చేసిందని తెలిసీ

 

అదీ మనుషుల చెప్పు చేతల్లో
ఉండేదే కదా….!
హ… హ… హ… హ… హ …

 

అంత శక్తని,ఇంత శక్తని
తరతరాల తరలి వచ్చే దివ్య శక్తని
శకశకాల నుంచి సాగుతున్న
బుకాయింపు
ఇక ఈ జన్మకు ఏం తెలుసు కుంటావు లే …

 

ఎన్ని రంగుల్లో రంగులు కలిపి
అనేక రకాల పూలని తెంపి
వెన్నెల నక్షత్రాలను కోసి
పత్రహరిత కాలాన్ని ముగ్గులు నింపి
చెమ్కీ రాత్రుల్లని
మీగడ పగల్లని మురిపించి

 

అన్ని అవయవాలని పక్కకు నెట్టి
గుండెని మాత్రమే గుభాళింప చేసి
ఎన్నిసార్లు
ఎన్నిసార్లు

నీ రక్తపు కాంతి మీద
మసినీళ్ళు చల్లి
మళ్ళీ మళ్ళీ కొత్త మొగ్గల
పునరుత్పత్తి బీజాల కోర్కెల్ని నిమరటం కోసం
ఎన్నిసార్లు
ఎన్నిసార్లు

 

పుండు పుండై కలవరిస్తావు …

 

సవాలక్ష పులకింతల్లో అదీ ఒకటి.