ప్రవాసీ బంధం

మట్టి వాసన

మార్చి 2013

1
వాల్ క్లాక్ సెకను ముళ్ళు  కదలిక సవ్వడి ఏసి శబ్దంతో పోటి పడుతుంది.  అసహనంగా కదులుతూ కంఫర్టర్ పైకి లాక్కున్నాను. కార్నర్ లో ఉన్న మనీ ప్లాంట్ కు ఏసి గాలి సూటిగా తగులుతున్నట్టుంది, ఆకులకు కదులుతున్నాయి. ఆ ఆకులనే చూస్తున్నాను. లత ఇంటిని ఎంతో శ్రద్ధగా అలకరిస్తుంది. వాల్ హగింగ్స్,ఫ్యామిలీ ఫొటోస్, డెకరేటివ్  ఐటమ్స్ ఎక్కడ పెట్టాలో తనకు తెలిసినంత బాగా మరెవరికి తెలీదేమో!

పక్కకు తిరిగి చూసాను,లత  మంచి నిద్రలో ఉంది. నా టెన్షన్ చెప్పి తనను కూడా టెన్షన్ పెట్టడం ఎందుకు. మరో రెండు వారాలలో ఏ సంగతి తేలిపోతుంది. అప్పుడే చెప్పోచ్చులే.

శబ్దం చెయ్యకుండా మంచం దిగి బయటకు వచ్చాను. పిల్లల గది తలుపు వారగా తెరిచి చూసాను. ఆదమరిచి నిద్రపోతున్నారు. ఉదయాన్నే నిద్ర లెగుస్తారు. ఆదరాబాదరా తయారయ్యి ఏడు గంటలకల్లా స్కూల్ బస్సు ఎక్కుతారు. స్కూల్ అయ్యాక ఏక్టివిటీస్ ఆ తర్వాత హోం వర్క్స్ తో రోజంతా బిజీగా గడుపుతారు.

ఈ సేడ్యుల్ అంతా డిస్టర్బ్ అయిపోతుందా? భారంగా నిట్టుర్చాను.

లత ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడుతున్నానే  కానీ, అన్నింటికన్నా ముఖ్యంగా పిల్లలు ఎలా తీసుకుంటారో?

2

హాల్లోకి వచ్చాను. ఏసి ఆన్ చేసే వుంది. చిన్నగా నిట్టూర్చి ఆఫ్ చేసాను. కర్టెన్ పక్కకు జరిపి,  గ్లాస్ డోర్ స్లయిడ్ చేసి  బాల్కనిలోకి   వచ్చాను. వెచ్చటి సెగ మొహానికి కొట్టింది. వాతావరణపు వేడి కొంత, ఏసీల సెగ మరికొంత. టైం అర్థరాత్రి ఒంటి గంట అయినా సుమారు ముప్పై ఐదు డిగ్రీల వేడి, ఉక్క బోత  బయట. అంత వేడిలోను సిగరెట్టు తాగాలన్న కోరిక.

పొగను గుండెల నిండా పీలుస్తూ రోడ్డు వైపు దృష్టి సారించాను.రోడ్డుకు ఇరువైపులా పచ్చటి లాన్, డిసిప్లినడ్ గా బారులు తీరిన వేప, ఈత చెట్లు. స్ట్రీట్ లైట్స్ వెలుగులో మెరుస్తున్న వాటర్ ఫౌంటెన్. దేనిని పట్టించుకునే తీరిక లేనట్టు అర్థరాత్రి సైతం పరుగులు తీస్తున్న కార్లు. నిప్పులు చెరిగే వేసవిలో  ఈ పచ్చదనాన్ని ఎలా కాపాడతారో నాకెప్పుడూ ఆశ్చర్యమే.

టిస్యూతో చెమటను తుడుచుకుంటూలోపలకు వచ్చేసి హాల్లో ఏసీని ఆన్ చేసాను. ఏబై డిగ్రీల వేడిలో జీవించగలుగుతున్నాం అంటే ఈ సౌఖర్యాల పుణ్యమే.

బాబు ఎప్పటి నుంచో ఐస్ స్కేట్టింగ్ కు తీసుకెళ్ళమని, స్కి దుబాయ్ కు వెళ్దామని గొడవ. ఈ వీకెండ్ తప్పకుండా తీసుకెళ్తానని ప్రామిస్ చేసాను. ఇప్పుడు హటాత్తుగా పైసా పైసా లెక్క చూసుకోవాలి కాబోలు!

ఒక్కసారిగా పునాదులు కదులుతున్న భావన. ఆ వేటు నాకే పడితే?? చాప కింద నీరులా ఆక్రమించే అభద్రత. అంతా బాగానే ఉన్నంత కాలం తడి కుడా తెలీదు వింతగా!

టీవీ రిమోట్ అందుకుని చానెల్స్ మార్చటం మొదలుపెట్టాను.
ఢిల్లీ గ్యాంగ్ రేప్, వివాహితపై అత్యాచారం ఆ పై హత్య, పెరుగుతున్న ఈవ్ టీజింగ్ కేసులు….
ఛానల్ మార్చాను….. ఏదో ఐటెం సాంగ్, విచ్చలవిడిగా అవయవాలను బహిర్గతం చేస్తూ సాగుతున్న స్టెప్పులు.
మరో చానెల్……రైతుల ఆత్మహత్యలపై  చర్చా వేదిక.
మరో చానెల్……ఎర్రటి లిప్ స్టిక్, పెద్ద బొట్టు, కళ్ళకు ఇంట మందాన కాటుక, క్లోజ్ అప్ లో వికారంగా నవ్వుతోంది. డైలీ సీరియల్ లో విలనీ అనుకుంట.
మరో చానెల్….పులి లేడిని వెంటాడుతుంది.
రిమోట్ విసిరి కొట్టాలన్న కోపాన్నో, విసుగునో బలవంతాన కంట్రోల్ చేసుకుంటూ టీవీ ఆఫ్ చేసాను.

కళ్ళు మండుతున్నాయే కాని నిద్ర పట్టే లక్షణాలే కనిపించట్లేదు.

3

 

మేము ఈ దేశానికి వచ్చి పదేళ్ళ పై మాటే.  ఇప్పుడు హటాత్తుగా పెట్టె బేడా సర్దుకుని వెళ్లిపోవాలంటే సాధ్యమేనా? సాధ్యమా అని ప్రశ్నించే హక్కు కానీ ఆస్కారం కానీ  లేవు.   రెండు నెలల వీసా వాలిడిటీ  ఇచ్చినా దాని వలన ఉపయోగం శూన్యమే.

లాప్టాప్ ఆన్ చేసాను. ఆఫీసు మెయిలలో లాగిన్ అవుతుంటే చేతులు వణుకుతున్నాయి. ఈ సమయంలో నేను బయపడుతున్న మెయిల్స్  ఉండవని నాకు తెలుసు. అయినా ఏదో కంగారు. కస్టమర్ సపోర్ట్ ఇష్యూస్ కు సంబందించిన మెయిల్స్ వున్నాయి. లాగౌట్ చేసి, జాబు మార్కెట్ కీవర్డ్ పట్టుకుని వేలాడుతూ వేలాడుతూ సాలీడు గూడులో (వెబ్) చిక్కుకుపోయిన నన్ను అల్లాహు అక్బర్ పిలుపు ఈ లోకంలోకి తెచ్చి పడేసింది. ఉలిక్కిపడి టైం చూసాను, నాలుగున్నర. కాసేపట్లో లత నిద్ర లేచి పని మొదలుపెడుతుంది. లాప్టాప్ షట్ డౌన్ చేసి వెళ్లి మంచంపై వాలాను.

” ఆఫీసుకు వెళ్ళరా”, లత మాటలకు ఉలిక్కిపడి లేచాను.

“టైం ఎంత?”

“పావు తక్కువ ఏడు”

“ఛ…ఇప్పుడా లేపటం”, మంచం దిగుతూ విసుక్కున్నాను.

“రోజూ మీరే లెగుస్తారుగా. ఆరోగ్యం బాగోలేదేమో అని డిస్టర్బ్ చెయ్యలేదు”, సంజాయిషీ ఇస్తూ, “బయల్దేరటానికి ఇంకో అరగంట టైం ఉందిగా. అన్నీ సిద్దం చేసాను, గబాగబా  రెడీ అయిపోండి”, అంది లత.

బ్రేక్ ఫాస్ట్ చేస్తుంటే ఐలయ్య వచ్చాడు. ఐలయ్య గత నాలుగేళ్ళుగా మా ఇంట్లో పనిచేస్తున్నాడు. మనిషి నిదానంగా, నమ్మకంగా ఉంటాడు. ఇన్నేళ్ళుగా ఒక్క నాడు  కూడా పనికి రావటం మానలేదు. మేముండే అపార్ట్ మెంట్ లోనే మరో నాలుగిళ్ళలో పని చేస్తాడు.

“సలామాలేకుం సాబ్”

“నమస్తే అని చెప్పు ఐలయ్య”, నవ్వుతూ అన్నాను.

“అలవాటై పోయింది  సాబ్”, నవ్వేసాడు.

“ఇంట్లో అందరూ బాగున్నారా”, అడిగాను.

“మంచిగానే వున్నారు సాబ్”

“నీ  కొడుకు స్కూల్ కు వెళ్తున్నాడా ఐలయ్య”

“పోతున్నాడు సాబ్. మస్తు పెద్దగయ్యిండు. మొన్ననే తెలిసినోల్లు వస్తుంటే ఫోటో పంపిండ్రు. నాయంత ఎత్తెదిగిండు”, పర్సులో నుంచి ఫోటో తీసి నా చేతి కందిస్తూ అన్నాడు. ఐలయ్య కళ్ళలో మెరుపు.

“దేశం ఎప్పుడెళ్తావు?” , ఫోటో చూస్తూ అడిగాను.

ఐలయ్య కళ్ళల్లో మెరుపు యిట్టె మాయమయిపోయి కొండంత దిగులు కనిపించింది. నేను ఆ ప్రశ్న అడగకుండా  వుండాల్సింది. కొడుకు గురించి సంతోషంగా చెపుతున్న అతని ఆనందాన్ని పాడు చేసాను. అనాలోచితంగా మాట్లాడేసాను.

“నా జిందగీలా  నా బిడ్డ కాకూడదనే పెండ్లాం  పిల్లలను యాద్ జేసుకుంటూ ఈడ పడివున్నా దొర. ఆడకేల్లి ఏం జేయ్యాలి?”

“పోనీలే ఐలయ్య. నీ కష్టంతో నీ కొడుకు చదువుకుని పైకొస్తే అంతే చాలు”, టిఫిన్ తిన్న ప్లేట్ అందుకుని కిచెన్ లోకి వెళ్ళిపోయాడు.

“ఇంకో నెలలో పిల్లల స్కూల్ హాలిడేస్ మొదలైపోతాయి. ఇంత  వరకు   టికెట్స్ మాటే ఎత్తలేదు. ఆ తర్వాత కాస్ట్ పెరిగిపోతాయి. ఈ రోజన్న మీ లీవ్ సంగతి తేల్చండి.”, లంచ్ బాగ్ ఇస్తూ అంది లత.

నిర్లిప్తంగా ఓ నవ్వు నవ్వి ఆఫీసుకు బయల్దేరాను.

ఐలయ్య ఈ దేశానికి వచ్చి పదేళ్ళ  పైమాటే. ఆ రోజుల్లోనే లక్ష రూపాయిలు అప్పు చేసి ఏజెంట్ చేతిలో పోసాడు. కన్స్ట్రక్షన్ కంపనీలో ఉద్యోగం అని నమ్మించాడు. తీరా ఇక్కడకు వచ్చాక కంపనీ లేదూ, ఉద్యోగమూ లేదు. పాస్పోర్ట్ తో సహా ఏజంట్ కంటికి కూడా కనిపించలేదు.  తనలా మోసపోయిన నిర్భాగ్యులను చూసి మనసు దివుటు చేసుకున్నాడు. తిరిగి వెళ్ళలేని పరిస్థితి. అప్పు, వడ్డీ, బాధ్యతల నడుమ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇల్లీగల్ గా ఉండిపోయాడు. దొరికిన ఆడ్ జాబ్స్ చేస్తూ, ఇళ్ళలో పార్ట్ టైం వర్కర్ గా పని చేస్తూ బతికేస్తున్నాడు. అప్పు తీరింది, చెల్లి పెళ్లి చేసాడు, తండ్రి కాలం చేసాడు…అయినా తిరిగి వెళ్ళిపోలేదు.

“ఆడకు పోయి ఏం చెయ్యల్సార్? ఈడ ఉండబట్టే పిల్లోడిని మంచిగా చదివిస్తాన్నా, ఇంగ్లీషు మీడియం బడిలోకి పంపిస్తున్నా”, అంటాడు. పోలీసులు పట్టుకుంటే జైల్లో పెడతారని తెలిసినా, ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్దంగా వున్నాడు.

కారు పార్క్ చేసి ఐలయ్య ఆలోచనల వదిలించుకుంటూ ఆఫీసులోనికి వచ్చాను.

సబా హల్కేర్, సలామేలుకుం, గుడ్ మార్నింగ్ పలకరింపుల్లో తెచ్చి పెట్టుకున్న గాంభిర్యాన్ని దాటుకుంటూ నా రూంలోకి వచ్చి పడ్డాను.

కాస్ట్ కటింగ్ ..గత కొంత కాలంగా ఎటు చూసినా వినిపించిన ఈ మాట అర్థం ఎంప్లాయిస్ ఫైరింగ్ అని, కస్తరత్తు మొదలయిందని  రెండు రోజుల క్రితమే బహిర్గతం చేసారు.  ఆఫీసులో అందరి మొహాల్లో అదే దిగులు. ఈ ఉద్యోగం కాకపొతే మరోటి అనుకునే రోజులు ఎన్నడో పోయాయి.  ఉద్యోగంలో నుంచి తీసేస్తే రెండు నెలల వీసా వాలిడిటీ ఇస్తారు. ఆ రెండు నెలలలో మరో ఉద్యోగం దొరకటం జాక్ పాట్ కొట్టటం లాంటిది.

నాకు రిపోర్ట్ చేసే ఇరవైమందిలో  కనీసం ముగ్గురిని తొలిగించాలని, పేర్లు సజెస్ట్ చెయ్యమని HR నుంచి ఈమెయిలు.  వెన్నులో చిన్న జలదరింపు. నా మేనేజర్ ఫాతిమాను తలుచుకున్నాను. ఆవిడకు ఇలాంటి మెయిల్ వచ్చే ఉంటుంది. నాకు ఫాతిమాకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు, ఒకటి రెండు సార్లు పనిలో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఫాతిమా పనిలో చాలా  సిన్సియర్.

కస్టమర్ ఇష్యూస్ ని ఫాలో అప్ చేస్తూ HR మెయిల్ గురించే ఆలోచిస్తున్నాను.  అందరి ముఖాలు కళ్ళ ముందు  కదిలాడుతున్నాయి. ప్రాజెక్ట్ మానేజ్మెంట్,క్వాలిటీ మానేజ్మెంట్ ,క్రైసిస్  మానేజ్మెంట పై ఎంత అవగాహన పెంచుకున్నా…ఏదో సున్నితమైన భావన మనసుని మానేజ్మెంట్ కొలతల్లో ఇరుక్కుపోనివ్వదు.

“లంచ్ చేద్దామా”, జోసఫ్ వచ్చాడు. పనిని, ఆలోచనలను కట్టిపెట్టి జోసఫ్ తో పాంట్రీ రూంకు వెళ్లాను.

“సో వాట్స్ అప్?”, లంచ్  బాగ్ ఓపెన్ చేస్తూ అడిగాను.

“ఏముంది బాస్. తుమ్మితే ఊడిపోయే ముక్కులు. తెల్లారితే ఉంటుందో ఊడుతుందో తెలీని ఉద్యోగం. చూద్దాం ఏమవుతుందో “.

” నాకు పిల్లల గురించే దిగులు. గోయింగ్ బ్యాక్ టూ ఇండియా అంటే వాళ్ళెలా రియాక్ట్ అవుతారో తెలిదు. పరిస్తితులు అర్థం చేసుకునే వయసూ కాదు”

“నాట్ జస్ట్ కిడ్స్,   I am even worried about surroundings.  జస్ట్ ఇమాజిన్, ఉద్యోగం పోయిందని వెనక్కి వెళితే ఎలా రిసీవ్ చేసుకుంటారో”, జోసఫ్ మాటల్లో నిరాశ ధ్వనిస్తుంది.

“జోసఫ్ మీ ఆవిడ వర్కింగ్ కదా. తన వీసా పై డిపెండెంట్ గా మారిపో. మరోటి వెతుక్కోవటానికి సమయం వుంటుంది.”, సలహా ఇస్తూ,  “anyhow we have to face it, Let’s be strong and bold “, ధైర్యం చెప్పటానికి ప్రయత్నించాను.

లంచ్ అయిందనిపించి ఎవరి పనుల్లో వారు పడిపోయాం.

సాయంత్రం ఏడైనా చీకటి పడలేదు. లాప్టాప్ భుజాన తగిలించుకుని ఇంటికి బయల్దేరాను. ఆఫీసు బిల్డింగ్  ఎదురుగా విశాలమైన పార్క్ వుంది. అప్పుడే ఫౌంటెన్ వేసినట్టున్నారు. పావురాలు  గుమిగుడాయి. పావురాలను చూస్తూ ఆ పక్కనే ఉన్న చెక్క బల్లపై కూర్చున్నాను, కాస్త మనసు పక్కకు మళ్ళుతుందేమోనన్న  ఆశతో.

“హాయ్”, బెంచికి అటు చివరన కూర్చుంటూ పలకరించాడు జుబైర్. జుబైర్ మా టీంలోనే పనిచేస్తాడు.

ఎలా వున్నావ్ అంటే ఎలా వున్నావ్ అన్న మాటలు అయ్యాక, “so what’s the status in office?” అని అడిగాడు.

“ఏ రోజు ఎవరిదో మరి”, భుజాలెగరేసాను.

“whatever at least you are lucky”, అన్నాడు.

“లక్కి??”, ఎగతాళి అంటున్నాడా అన్న అనుమానం కలిగింది.

“మీకొక దేశం ఉంది. ఏ సమయంలోనైనా ఎక్కడైనా మీకు  ఇబ్బంది కలిగితే మీరు మీ దేశం తిరిగి వెళ్లిపోగలవు.  You have a place to live. If that happens to me, where can I go? I have no land to stand.” , ప్రశ్నార్ధకంగా  అతని వైపు చూసాను.

“అర్థం కాలేదా? అదే మా దురదృష్టం. కష్టమొచ్చినా నష్టమోచ్చినా నిలబడటానికి మీకో స్థలం ఉంది. నన్ను చూడు…నేను ఏ దేశానికి చెందినవాడిని కాదు. బతకటం కోసం బతుకుతెరువు వెతుక్కుంటూ ఇక్కడకు వచ్చి పడ్డాను. వీళ్ళు పొమ్మంటే ఎక్కడికి వెళ్ళాలో, ఎవరు రానిస్తారో కుడా తెలీదు నాకు”

“I understand “, అతను చెప్పేది కొంచెం అర్థమవుతుంది.

“మా నాన్నగారి చిన్నతనంలో   ఇరాక్ నుంచి వలస వచ్చేశారు. మా నాన్నకు ఇరాక్ ఎలా ఉంటుందో కుడా గుర్తులేదంట. నేను సౌదీలో పుట్టాను. కొంత సౌదీలో, మరి కొంత జోర్డాన్, సిరియాలలో చదువుకున్నాను. వింతైన విషయం ఏమిటంటే ఈనాటికీ నేను, నా పిల్లలు ఇరాకీ పాస్పోర్ట్ నే కలిగి ఉన్నాము.మూడు తరాల క్రితం మేము ఆ నేలను వదిలేసి వచ్చినా, ఇప్పటికి మా తల రాతలు  ఆ నేలతోనే ముడిపడి వున్నాయి”

“నిజమే కదూ! పోయినేడాది ప్రాజెక్ట్ పనిపై నిన్ను లండన్ పంపిద్దమనుకున్నాం. నీకు విసా రిజెక్ట్ అయింది. మీ పాస్పోర్ట్ పెద్ద డ్రాబ్యాక్ అయిపొయింది”

“అవును, నా పాస్పోర్ట్ కు ఎక్కడ స్వాగత సత్కారాలు వుండవు. మమ్మల్ని దోషుల్లా చూస్తారు. కనీసం నా పిల్లలకు ఈ స్తితి రాకుడదని, పాస్పోర్ట్ మారాలని కెనడాకు ఇమ్మిగ్రేషన్ అప్లై చేసాను. నాలుగేళ్ళు ఎదురు చూసాక, రేజేక్టేడ్ అని వచ్చింది.”

ఖాలీ సమయాలలో దేశం, రాజకీయాలు, నేతలు, అవినీతి  గురించి ఆవేశంగా మాట్లాడుకుని వాటి గురించి తీరిగ్గా మర్చిపోయే నాలాంటి ఎందరికో తెలీని విషయాన్ని చెపుతున్నాడు జుబైర్. మాతృదేశం అంటూ ఒకటి ఉండటం కూడా అదృష్టమే అని, అది కూడా లేని వాళ్ళు ఉంటారని, వాళ్ళు అత్యంత దురదృష్టవంతులని  జుబైర్ మాటల్లో నాకు అర్ధమైయింది.Now I can feel his pain.

“You know, I don’t belong to any place”  ,   ఎంతో దిగులు, అస్తిరత జుబైర్  జీవితంలో.

“ఇన్షా అల్లా…అల్లా ఇప్పటిదాకా ఏదో దారి చూపిస్తూనే ఉన్నాడు. నాకోసం ఏదో మార్గం సిద్దం చేసే ఉంటాడు. ఎందరో అభాగ్యులకన్నా నేనెంతో అదృష్టవంతుడ్ని. ఈరోజు ఈ మాత్రం ఉన్నానంటే అదంతా అల్లా దయే.”

గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళిపోయాడు. హుమిడిటి, చెమటతో తడిసి ముద్దైపోయాను. అయినా అక్కడ నుంచి కదలబుద్దవ్వలేదు.

జుబైర్ తో మాట్లాడాక నా మనసు తేలికైంది. తన కష్టం ముందు నా కష్టం ఎంత చిన్నదో తెలిసి వచ్చింది. ఇప్పుడు జాబ్  పొతే ఏమవుతుంది? ఆర్ధికంగా కొంత ఇబ్బంది పడతాను. నేను, లత  మానసికంగా నలుగుతాము. పిల్లలూ కొంత ఇబ్బంది పడొచ్చు. మార్పు ఎప్పుడూ కొంత సంఘర్షణను కలిగిస్తుంది. ఆ ఘర్షణ తట్టుకునే శక్తి ఇవ్వటానికి నాకు నా వాళ్ళు ఉన్నారు, మరీ ముఖ్యంగా నా నేల నాకుంది. At least I have a land to stand . ఎంత నిబ్బరం, భరోసా నాకు.

ఇప్పటిదాకా నేలంటే ఇళ్ళు నిర్మించుకునే స్థలమనుకున్నాను. నేలంటే తల్లని, ఆ తల్లినే మాతృ దేశమంటారని ఇప్పుడే తెలిసింది.

లత ఫోన్, “వచ్చేస్తున్నా, ఏమన్నా కొనుక్కురావాలా?”, ఉదయపు నిరాశ  మాయమయింది, గొంతు హుషారుగానే పలికింది.

ఆ రాత్రి లతకు జుబైర్ గురించి చెపుతూ ఆఫీస్ సంగతులు కూడా చెప్పేసాను.

“మీ ఆఫీస్ గాథరింగ్ లో చూసాను అతన్ని. ముగ్గురు పిల్లలలనుకుంట కదా”, గుర్తు చేసుకుంటూ అంది.

“ఎంత అనిశ్చతమైన జీవితాలో కదూ”, అన్నాను.

“మీరు ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోకండి. ఏదైతే అదే అవుతుంది. మన ఉద్యోగాల సంగతి తెలిసే బ్యాంకు లో కొంత కాష్ ఉంచుకున్నాం. ఆదాయం లేకపోయినా ఆరు నెలలు గడిపెయ్యగలము. ఈలోపు ఏదో ఒకటి దొరకకపోదు. పోనీ, ఉద్యోగమే రాలేదనుకోండి, మన దేశం మనల్ని పొమ్మనదుగా. ఉన్నంతలో చిన్న వ్యాపారం చేసుకుందాం”,కృతజ్ఞతగా లతను చూస్తూ నిద్రలోకి జారుకున్నాను.

కలలో మట్టి వాసన మనసుని జోకొట్టింది…..