“కన్నమ్మా, రోజులుదగ్గర పడిపోతున్నాయిరా తల్లీ. ఈ లాదిని తొందరగా మర్చిపోతావు కదూ, ఎప్పుడూ నన్ను గుర్తు తెచ్చుకోకే! నా ఆయుష్షుకూడా పోసుకుని నూరేళ్ళు చల్లగా జీవించు.”
మంచి నిద్రలో ఒత్తిగిలిపడుకున్న పాప లేత చెక్కిళ్ళను ముద్దాడాను.చిన్న కన్నీటి చుక్క నా కంటికొస నుంచి పాప నుదుటిపైకి జారింది వీడుకోలుకు సమాయత్తమవుతూ.
రెండేళ్ళు ఎలా గిర్రున తిరిగిపోయాయో తెలీనే లేదు. నిన్నగాక మొన్న వచ్చినట్టుంది, అంతలోనే పంపించే సమయం వచ్చేసింది. వచ్చిన మొదట్లో ఊపిరికూడా పీల్చుకోవటానికి ఓపికలేనట్టు ఉండేది పాప, ఇప్పుడు కాస్త కోలుకుని ఒళ్ళు చేసింది.
ఇంకొక్క వారం, అంతే!
వీడ్కోలు వేదనకు, స్వాగతించే సంతోషానికి నడుమన ఒక సన్నటి గీతను చెరపలేనంతగా గీసేసాను. ఆ గీత నన్ను తూట్లు పొడుస్తున్నా, తీగై నన్ను చుట్టేసి నలిపేస్తున్నా అక్కడే మిగిలిపోతాను. ఓ పెంపకాన్ని ఒదులుకోవటమంటే, మనసును ముక్కలుగా కోసి ఒక్కో ముక్కను ఒదులుకోవటమే. నా ఆయువులోని ఓ భాగాన్ని కోల్పోవటమే.
నాలో రేగుతున్న అలజడి పాపకుతాకిందో ఏమో, ఉలిక్కి పడిలేచి మంచం మధ్యన కూర్చుని లాధీ లాధీఅంటూ కేకలేస్తో౦ది.
పాపను ఎత్తుకుని గుండెలకు దగ్గరగా హత్తుకున్నాను. కాసేపటికే నిద్రలోకి జారుకుంది. పాప వీపును సుతారంగానిమురుతూ మెడపై చిన్నగా ముద్దుపెట్టుకున్నాను. ఈ స్పర్శలోని స్వచ్ఛత కోసమే ఈ జీవితమంతా తాపత్రయపడింది.
***
ఆ రాత్రి నా చెంపలపై తేలిన ఆ వేళ్ళ ముద్రలు, నా అభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని నట్టేట ముంచేసాయి. కనీస౦ ఒక్క మాటన్నా చెప్పకుండా హటాత్తుగా మాయమయి పోయిన మనిషి పది రోజుల తర్వాత ఓ అర్థ రాత్రి తిరిగొస్తే, ఎక్కడికెళ్ళారని నిలదీసినందుకు,పాతికేళ్ళ నెపం నిన్నకాక మొన్న వచ్చిన నాపై సునాయాసంగా నెట్టివెయ్య బడింది. పెళ్లినాటి గోరింటాకు ఇంకా నా అరచేతులలో వెలవనేలేదు, నాలాంటి పెళ్ళాలు ఉండబట్టే మొగుళ్ళు ఇళ్ళు పట్టనట్టు తిరుగుతారనే నెపం.
ఇంటి గుట్టు అర్థం చేసుకోవటానికి ఎంతో కాలం పట్టలేదు. ఒక్కడే కొడుకని అతి గారాబంగా పెంచారు. విలాసాలకు అలవాటై ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతారాయన. వ్యవసాయం అంతా మావగారే చూసుకుంటారు. పెళ్లి చేస్తే కుదురొస్తుందని ఆయనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసిన పెళ్లి మాది. ఇదంతా నాకు తెలియకూడదని ఎప్పటి కప్పుడు కొడుకును వెనకేసుకొచ్చేది అత్తగారు. కుదిరినప్పుడల్లా కొడుకు మంచితనాన్ని నాకు చెపుతూ ఉంటుంది. ఆ మంచితనమంతా కొడుకు తల్లిని ఎంతలా ప్రేమిస్తున్నాడో, తల్లి ఎంత కష్టపడి కొడుకుని పెంచిందో అనే విషయాల చుట్టూ తిరుగుతూ ఉండేవి.
చేదు జ్ఞాపకాలతో మనసంతా బరువెక్కింది.
“నీకెంత పొగరే, మగాడిలా రెచ్చిపోతావ్. మొదటి రాత్రి నీ ఎచ్చు చూసి దడుచుకున్నాను, నీపై అనుమానం కుడా వచ్చింది. నిఘా పెట్టి విచారించాను. ఎవరు నీ గురించి చెడుగా చెప్పలేదు కాబట్టి నువ్వింకా ఇక్కడున్నావ్. అయినా ఆడదానివి మంచంపై ముడుచుకు నుండాలి కానీ…”
నా గుండెలపై గునపాలతో పొడిచారాయన. పెళ్ళయిన కొత్తలో ఆయనెందుకు ముభావంగా ఉన్నారో అర్థమయి ఖంగుతిన్నాను. ప్రకృతి సహజమైన శరీరపు ఉద్రేకానికి స్పందిస్తూ, తనువుల కలయికకు సహకారంగా కాక సమానంగా ఆస్వాదించటం నేను చేసిన పాపం.నా శరీరం ఆయన అహాన్ని తృప్తి పరచలేదు.
నేనింకా ఇక్కడ ఎందుకుంటున్నాను? ఉండక ఎక్కడికి పోగలను? నా జీవితంలో ఆ రాత్రి కాళ రాత్రి. భూమి బద్దలయ్యి నన్ను తీసుకుపోదేమని ఎక్కి ఎక్కి ఏడ్చిన రాత్రి.
ఆనాటి నుంచీ మరే రాత్రి నా శరీరం స్పందించలేదు. స్పందన లేమి మొదట్లో ఆయన అహంకారాన్ని తృప్తి పరిచినా నాలో ఉధృతమయిన జడత్వం ఆయనలో అంతే తొందరగా అసంతృప్తినీ రాజేసింది. ప్రతీ రాత్రి నా శరీరం యుద్దభూమయ్యింది, నా మనసు క్షతగాత్రమయ్యింది. కొన్ని గాయాలు గది గుమ్మం దాటి రావు.
***
గతాల లోతుల్లోకి జారుతూ ఏ జామున నిద్రలోకి జారుకున్ననో, నిద్రలో ఏ గత జ్ఞాపకం పీడకలలా వచ్చిందో ఉలిక్కిపడి లేచే సరికి పక్కలో పాప లేదు.
“తల్లీ తల్లీ బంగారు..ఎక్కడున్నావ్…ఎక్కడకు వెళ్లిపోయావ్…..అమ్మలూ” కుచ్చిళ్ళు కాళ్ళకు అడ్డంపడి పడబోతుంటే నూకాలువచ్చి తమాయించింది.
“ఎందుకా కంగారు, నీకు కునుకుపట్టిందని పాపను నా పక్కలో వేసుకున్నా”, అంది నూకాలు.
“నిద్రపోతో౦దా పాప”
“ఏమ్మా,మనసు బాగోలేదా?” తిరుగు ప్రశ్న వేసింది నూకాలు.
“అవునే, కాస్త టీపెడతావా”
“ఇప్పుడు టీ ఏందమ్మా, టయిము మూడవుతాంది, పోయి పండుకో రాదూ”
“అందుకే నిన్ను ఇంటికి పొమ్మన్నాను. నాతో పాటూ నీకు నిద్ర ఉండదు. పొద్దున్న లేస్తే ఇళ్ళల్లో పనికి పోవాలయ్యే”
“నీకే౦ అట్టాగే సెపుతావ్, నాకు మనసొప్పదు”
“నేను బాగానే ఉన్నాను. నువ్వు పోయి పడుకో”, అంటూ సోఫాలో జారబడ్డాను.
***
బిగ్గరగా నవ్వకూడదు, నడకలో నడతలో ఒద్దికగా ఉండాలి, ప్రశ్నించకూడదు, నోరెత్తకూడదు, సర్దుకుపోవాలి. నాకేం కావాలో, జీవితంలో నేనేం ఆశించాలో ఆలోచించుకునే వ్యవధే ఇవ్వకుండా చిన్నప్పటి నుంచీ నేనెలా ఉండాలో నూరిపోసిన వాతావరణంలో ఒదుగుతూ ఒదుగుతూ అలిసిపోయాను.
లౌక్యపు పాలు ఎక్కువయిన అత్తగారు, జాలిగా చూసే మావగారి చూపులు, నేనో అడ్డం అనుకునే భర్త.
వంటగదిలో తప్ప ఇంకెక్కడా మెసిలే స్వతంత్రత లేని నా పరాయితనం నన్ను ప్రశ్నలతో వేధించేది. ఈ ఇంటికి నేనెవరు? వంటింటినా?
ఈ ఇల్లు నేను నిర్మించలేదు. ఎన్నో ఏళ్లుగా ఇందులో నివాసముంటున్న వ్యక్తులు నన్ను సాదరంగా ఆహ్వానించి, అక్కున చేర్చుకుని, తమలో నన్ను కలుపుకోకుండా నన్నొక పరాయి వ్యక్తిగా చూస్తుంటే ఈ ఇల్లు నాదెలా అవుతుంది? నేనెవరిని ప్రేమించాలి? నా వాళ్ళు ఎవరు? నేను ఎవరిని ప్రేమించాలో నేను పుట్టక ముందే ఈ సమాజం నిర్ణయించేసింది కాబట్టి మూడుముళ్ళు పడ్డాయని నేను వీళ్ళను ప్రేమిస్తున్నానా? నన్ను ఎవరూ ప్రేమించరా?
ఊపిరాడని ఉక్కపోత నా చుట్టూ… నీ ఇల్లు ఇది, ఇదే నీ ఇల్లని వేన వేల గొంతుకలు నా చుట్టూ అరుస్తుండేవి. ఈ ఇంట్లో నేనెవరిననే నా గొంతుక పీలగా నాలో ధ్వనించేది.
ఒకసారేప్పుడో అమ్మతో పంచుకోబోతే అదంతేనమ్మా అంటూ నీతుల సంకెళ్ళను బిగించింది.
వదలని జ్ఞాపకాలతో మనసును ఎవరో పిండేస్తున్న వ్యధ. గొంతు తడారిపోయిన బాధ, ఎన్ని గుక్కల నీళ్ళు తాగినా దాహం తీరని భావన. తప్పించు కోవటానికో లేక పారిపోవటానికి నాకో సాయం కావాలిప్పుడు. నా పాటల సీడీ లోకం లోకి తొంగిచూసాను — మూగ మనసులు, ఆత్మ బంధువు, మరో చరిత్ర. ఇంకేదో సంగీతం కావాలి. మాటల్లేని సంగీతం, వాయిద్యాల కచేరీ కావాలి. మొన్నీ మధ్యన రావు గారు ఇచ్చిన బీతోవిన్ సిడి దగ్గర నా చేయి ఆగింది. మంద్ర స్వరంలో తొమ్మిదో సింఫనీ నాలో పరుచుకుంది. బీతోవిన్ భావోద్వేకాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్ళి అక్కడనుంచి తోసేస్తాడు, ఆ జారిపోవటంలో లోయల్లోని లోతు తియ్యగా బాధిస్తుంది. ఎవరో తమ చేతులతో నొప్పిని తీసి పడేసినట్టే ఉంటుంది. సింఫనీలో నుంచీ మెల్లగా నిద్రలోకి జారుకున్నాను.
***
“లాదీ లాదీ, పాలు తాగేచా”, పాప మాటలకుమెలుకువ వచ్చింది.
“నాచిన్ని తల్లివే, ఎప్పుడు లేచావ్…అబ్బో అప్పుడే స్నానం కూడా చేసేసావా. ఏది బుగ్గపై దిష్టి చుక్క ఏది”
“నూకాలు పెత్తలా”
“ఆయ్ నుకాలు. ..దెబ్బ పడాలా.”, కిలకిలా నవ్వేసింది పాప.
“నీ బొమ్మలు తీసుకురా, ఆడుకుందాం”, పరిగెత్తుకుంటూ వెళ్లి బొమ్మల బుట్టను లాక్కొచ్చింది.
“కూ ఛుక్ ఛుక్ చూ…ఈ రైలు భలే బాగుందే. నీకు కావాలా”
“ఊ నాది”, నా చేతుల్లోని బొమ్మను లాక్కుంది.
“మరి ఈ డాల్?”
“లాదీ నా డాల్ కి కొత్త గౌను కుడతానన్నావ్ ?”
“అరే మర్చేపోయాను, ఇప్పుడు కుడదామా”, అడిగాను.
చిన్న చిన్న గుడ్డ ముక్కలు, లేస్, బటన్స్ ము౦దేసుకుని కూర్చున్నాం. లాధీ ఈ బటన్ ఇక్కడ కుట్టు, లాధీ ఈ లంగు బాగుంది.బొమ్మకో గౌను కుట్టాను.
“ఈ బొమ్మ నువ్వు తీసుకెళ్తావా? నిన్న నీ కధల పుస్తకాలు పక్కన పెట్టుకున్నవుగా, ఏవి అవి తీసుకురా, నీ బ్యాగులో సర్దుకో, బువ్వ తినేసాక సిస్టర్ అభిగేల్ దగ్గరకు వెళదామా?”, తలూపింది పాప.
“పప్పేసి, నెయ్యేసి… ఈ ముద్ద ఎవరికి పెట్టను? అదిగదిగో పిచ్చుక వచ్చేస్తుంది… పెట్టేసున్నా పెట్టేస్తున్నా రామ చిలుకకు ముద్ద పెట్టేస్తున్నా”, టక్కున నోరు తెరిచింది, “ఈ ముద్ద నా బంగారు తల్లిది”.
“ఆక్కడకు వెళ్ళాక చక్కగా అన్నం తినేయ్యాలి, సరేనా”
“ఓ తినేస్తా, లతా నేను జట్టు. లత పక్కన కుర్చుని తినేస్తా”
“నా బంగారే”, సుళ్ళు తిరిగిన కన్నీటిని పంటి గాటుతో ఆపేసాను.
మా ఇద్దర్నే చూస్తూ సోఫాకు ఆనుకుని కూర్చుంది నూకాలు.
“మరోమారు ఆలోచించమ్మా.పిల్ల కోలుకున్నాది. రేయనక పగలనకా ఆసుపత్రి చుట్టూ తిరుగుతానే ఉన్నావు. ఇప్పుడన్నా పిల్లతో సుఖపడతావ్, పంపమాకమ్మా”,
“అట్టా ఎంత మందిని సాకుతావ్? నీ ఆరోగ్యమూ చూసుకోవొద్దూ? పరాయి బిడ్డలతో బతికేస్తన్నావ్”, అర్ధిస్తోంది నన్ను.
నూకాలు ఎప్పుడు ఎలా పనిలో నుంచీ నా జీవితంలోకి ప్రవేశించిందో గమనించుకోనే లేదు నేను. పెద్ద పెద్ద చప్పుడు చేస్తూ అంట్లు తోమేసి, అక్కడో చీపురు ఇక్కడో చీపురు వేసేసి నా పక్కన కూర్చుంటుంది. నేనేం తిన్నానో, ఎంత తిన్నానో అని గిన్నెలు పట్టి పట్టి చూస్తుంది. దాని జీతం లెక్కకన్నా నా మందుల డబ్బాలో గోలీల లెక్క దానికి బాగా తెలుసు.
నూకాలుతో నా మాటల ప్రవాహం మెల్లగా మొదలయింది. ఉండుండి దొర్లుతున్న నా మాటలు, దొర్లి దొర్లి గతాల అగాధంలోకి జారిపోతున్నాయి. అగాధంలోని ప్రతిధ్వనులు పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రవాహం ఉప్పొంగి ఉప్పొంగి ఆనకట్టను దాటేసి ముంచేస్తుంది అప్పుడపుడు, అచ్చం బీతోవెన్ తొమ్మిదో సింఫనీలా. సోఫాలో నుంచీ దిగి ఎప్పుడు నూకాలు పక్కన కూర్చున్నానో నాకే తెలీదు.
నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని నిమురుతూ, “ ఎందుకమ్మా నీ కింత కష్టం?” అంది నూకాలు. అధాటున నూకాలు ఒడిలో ఒదిగిపోయి, “ నీకెలా చెప్పనే? ఎలా చెపితే అర్థం అవుతుంది? అది కష్టం కాదు, నాకు ఇష్టమ” ని చెప్పినా మళ్ళీ మళ్ళీ అలాగే అంటుంది. దానికి నాపై అంత ఆపేక్ష.
రెండేళ్ళకోసారి మాఇద్దరికీ అలవాటైన భావోత్కర్ష ఇది. అలవాటైనా కూడా ఆ ఉద్వేగం బద్దలయ్యే ప్రతిసారి ఒకరిని ఒకరు కొత్తగా తెలుసుకుంటూనే ఉంటాము.నన్ను చూస్తూ మౌనంగా ఉండిపోయింది నుకాలు. నూకాలు కళ్ళల్లో నుంచి రాలిపడుతున్న భావాలను మౌనంగా ఏరుకుంటున్నాను. మా ఇద్దరిదీ ఓ అద్వితీయ బంధం.
***
ప్రకృతిలో ఋతువులు మారినట్టు పిల్లల రాకతో నాలో కొత్త చిగురులు తొడిగాయి. వారి ఆలనా పాలనలో సమస్తం మర్చిపోయాను. వారి బోసినవ్వులు, నేను కనిపించగానే చేతులు చాపి ఎత్తుకోమని మారాం చెయ్యటం, ఎప్పుడన్నా విసుక్కున్నా కసురుకున్నా ఓ చిన్న పాటి ఏడుపుతో అంతా మర్చిపోవటం నాలో జీవించాలనే కోరికను కలిగించాయి.
కుదురు వస్తుందనే ఆశతో స్నేహితులను బతిమాలి ఆయనకు ఉద్యోగం ఇప్పించి, పిల్లల చదువులనే సాకుతో మమ్ముల్ని మరో ఊరు పంపించారు మావగారు.ఈ ప్రయత్నం సఫలమో విఫలమో పక్కన పెడితే, నా జీవితంలో అదో మలుపు. పంజరంలో రెక్కలు జాపుకునే కొద్దిపాటి స్వేఛ్చ, స్థలం దొరికాయి. పోపుల డబ్బాలోను, చీర మడతల్లోను ఐదో పదో దాచుకోవటం, పక్క పోర్షన్ వాళ్ళతో మధ్యాహ్నాలు కబుర్లు చెప్పుకోవటం.. కొంత ఊరట నాకు.
ఈయనలో పెద్ద మార్పేమీ రాలేదు. సాయంత్రపు సావాసాలు, ఆలస్యపు రాకలు వచ్చి చేరాయి.
ఎప్పటికైనా మారకపోతారా అనే ఆశను సమూలంగా నరికేస్తూ ఆయన లివర్ జబ్బుతో మరణించినప్పుడు గుండెలు పగిలేలా ఏడ్చాను. ఏడ్చి ఏడ్చి ఇంక ఏడ్చే ఓపిక పోయాక, ఏనాడూ మనసుని దగ్గరగా తీసుకోని ఆయన నన్ను వదిలేసి పోతే అంత దుఖంనాకెందుకు వచ్చిందని మెలమెల్లగా ప్రశ్నించుకున్నా. ఆ సమాధానం నన్ను నిలువుగా కాల్చేసింది.
ఇద్దరు పిల్లలు, ఇద్దరు ముసలాళ్ళ బాధ్యతలు భూతాల్లా బయపెట్టాయి. దుఃఖకారణాన్ని తెలుసుకున్నాక నన్ను చూసి నేను నిజంగా భయపడ్డాను.
జీవితం మళ్ళీ మొదటికి వచ్చింది.
ముసలాళ్ళ మలముత్రాలు ఎత్తిపోస్తూ కొడుకుని మింగేసిన రాక్షసి నన్న నిందనూ మోసాను. పిల్లల్ని పెంచటంలో వాళ్ళు చేసిన ఆర్ధిక సాయమూ మరువలేను, సాయం చేస్తూ నన్ను ఈసడించుకున్న క్షణాలు మరువలేను.
నా పెంపకపు లోపమో, చుట్టూ పరిస్తితుల ప్రభావమో, పిల్లలకు అమ్మంటే అలుసు, చులకన. అమ్మకో మనసుంటుందని, ఆ మనసుకు కష్టం సుఖం ఉంటాయని, అమ్మ మనసు గుర్తింపును కోరుతుందని వాళ్ళు గ్రహించుకోలేదు. నా పిల్లలని నేను వెనుకేసుకొస్తున్నానని కాదు కానీ సమాజం దగ్గర నుంచీ కుటుంబ సభ్యుల వరకూ అందరూ నాతో అలాగే ప్రవర్తిస్తుంటే పిల్లలు మాత్రం ఎక్కడ నుంచి నేర్చుకుంటారు?
ఇప్పడు పెద్దవాళ్ళు పోయారు, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి, బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు నేనొక స్వంతత్రురాలిని… నేనొక శ్రమను, వస్తువుని కాదు. ఇప్పుడన్నా నాకోసం నేను బతకాలనుకున్నాను.
ఆలోచించుకున్నాను..నాలోనికి లోలోనికి వెళ్లి శోధించుకున్నాను. నా జీవితకాలంలో నేను ఎప్పుడు సంతోషంగా ఉన్నానా అని కాలాన్ని జల్లెడ పట్టి వెతుక్కున్నాను . నా పిల్లల చిన్నప్పుడు నేనుఆనందంగా ఉన్నాను. పిల్లల ఆ దశ, ఆ పసితనం, ఆ స్వచ్ఛత, ఆ కల్మషం లేని ప్రేమ నాకు కావాలి. నేను మళ్ళీ ఆనందంగా ఉండాలి.
నా కోసం నేను అట్టేపెట్టుకున్న ఆ ఎకరం పొలం నన్ను ఆదుకుంది. కొడుకు కాలేజీ ఫీజు కట్టలేనప్పుడు, కూతురు కంప్యూటర్ కోర్స్ లో చేరినప్పుడు ఇలా ఎన్నోసార్లు అమ్మేద్దాం అనుకున్నా. కానీ ఏదో శక్తి నన్ను ఆపింది. ఈ పొలం నాది అనే మొండితనం చాలాసార్లే చూపించాను. కొడుకు అమెరికా వెళ్తున్నప్పుడు డబ్బు అవసరం వచ్చింది. వాడు అమ్మెయ్యమని పట్టు పట్టాడు. నేను ససేమిరా అన్నాను. నిన్ను నేను చూడనా, నీకేదన్నా అవసరం వస్తే నేను డబ్బు ఇవ్వనా అని నిష్టురమాడాడు. నేను కుదరదంటే కుదరదన్నాను.
ఆ పొలం అమ్మేసాను. రోడ్డు పక్క పొలం, ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బే వచ్చింది. పాత ఇల్లు అమ్మేసి ఈ చిన్న ఇల్లు కొనుక్కున్నాను. ఇల్లమ్మటం ఎందుకని పిల్లలు నిలదీశారు, వారికేం తెలుసు నా గాయాల నిలయం ఆ ఇల్లని.
అందరూ నన్ను తప్పుపట్టారు. . పూజలతో కాలక్షేపం చెయ్యమని సలహాలిచ్చారు. వారి పరువు తీస్తున్నానని నా పిల్లలు నన్ను దూషించారు. వారి పిల్లలను చూసుకుంటూ కృష్ణ రామ అంటూ ఉండమన్నారు, ఈ వయసులో నీకు అంతకన్నా కావల్సిందేముందన్నారు. మరి కొందరు నన్ను జాలిగా చూసారు.
జీవితమంతా ప్రేక్షకురాలిలానే బతికేసాను, ఎంత కష్టాన్నైనా ఓర్చుకోక తప్పింది కాదు, బయటకు నడవలేని నిస్సహాయత, ఆర్ధిక స్వతంత్రత లేదు, బాధ్యతలు వదిలెయ్యాలన్న ఉద్దేశ్యమూ లేదు. ఇంక ఇప్పుడు ఎవరికీ లొంగి ఉండాల్సింది లేదు, ఎవరి మెప్పు పొందాల్సింది లేదు. నాకోసం నా అడుగులను ఈదారిలో వేసాను.
***
వారం ఇట్టే తిరిగిపోయింది. వారం కిందటి బాధ అణువంతైనా లేదు ఇప్పుడు. లేలేత చిగురులు చిగురిస్తున్నట్టు, మరో ప్రస్థానానికి సన్నాహమవుతున్నట్టు మనసు ఉరకలేస్తోంది. కొత్త జుబ్బాలు కొని ఉతికి ఆరేసాను. కొత్త పాల డబ్బాలు, పీకలు వేడినీట్లో మరిగించి పెట్టుకున్నాను. మరో ఆహ్వానానికి ఇల్లంతా సర్వం సిద్ధమయింది. ఈరోజు వేకువ సరికొత్తగా ఉంది.
నేత చీర కుచ్చిళ్ళను తన్నుకుంటూ అనాధశ్రమంలోకి ప్రవేశించాను. నా చిటికిన వేలును పట్టుకుని చిన్ని చిన్ని అడుగులు వేస్తున్న చిన్నది అడుగడుగుకీ నా కాళ్ళకు అడ్డం పడుతూ నడుస్తుంది.
“లాదీ లాదీ…ఊగుతా”, ఉయ్యాలను చూపిస్తూ అలవాటైన ప్రాంగణం లోనికి పరుగులుపెట్టింది .కొన్ని జతల కళ్ళు నన్ను ఆశ్చర్యంగా, జాలిగా, వింతగా, కొంత అసహ్యంగా చూస్తున్నాయి. గత కొన్నేళ్లుగా అలవాటు పడ్డ ఆ చూపులను దాటుకుంటూ సిస్టర్ అభిగేల్ గదిలోనికి దారితీసాను.
“రాధ గారు, ఈసారి బాబు… చెత్తకుండీలో…”, ఇంక చెప్పవద్దన్నట్టు చూసాను.
“చాలా అనారోగ్యం మూటగట్టుకుని పుట్టినట్టున్నాడు. ఉబ్బసం తిరగబెడుతూ ఉంది”
“వయసుతో పాటూ పోతుందిలే. వెళుతూ వెళుతూ డాక్టర్ కు చూపించి మందులు తీసుకెళతాను”
“చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెపుతున్నాను అనుకోకండి . ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నాను. మిమ్మల్ని మీరు శిక్షించుకుంటున్నారేమో!”
“లేదు లేదు, ఇంకే శిక్షలు నన్ను బాధించలేని స్థితికి చేరాకే ఇక్కడకు వచ్చాను. మీకంతా తెలిసిందే కదా. ఈ పసి ప్రాణాలకు బాధించటం, శిక్షించటం రాదు. ఏ కల్మషము లేని స్వచ్చమైన ప్రేమను వీరు మాత్రమే ఇవ్వగలరు”
“నిద్ర కాచి, శ్రమను ఓర్చి పెంచిన బిడ్డను తిరిగి ఇచ్చెయ్యటం బాధగా ఉండదూ? పోనీ నచ్చిన బిడ్డను దత్తత తీసుకోండి”
“మనుష్యులపై, మనసులపై, మమతలపై నమ్మకం నాలో మిగలలేదు. ఊహ తెలియనంత వరకే ఆ స్వచ్ఛత. పిల్లలకు ఊహొచ్చి లోకాన్ని తెలుసుకోవటం మొదలుపెట్టగానే నాలో భయం మొదలవుతుంది. బంధాల పోట్లు పడి పడి రాటుతేలిన మనిషిని నేను. అందుకే రెండేళ్ళ పరిధిలో మిగిలిపోతాను. పైపెచ్చు రెండేళ్ళ పిల్లలు ఇట్టే మర్చిపోతారు.ఈ మార్పు వారిని ఇబ్బంది పెట్టకూడదు.”
“ స్పెషల్ కేర్ కావాల్సిన పిల్లలనే తీసుకెళ్తున్నారు, సుఖం కంటే ఆందోళన ఎక్కువ కదూ ఈ పిల్లలతో ”
“ఇదంతా నా స్వార్ధం .అందుకేనేమో అనారోగ్యంతో ఉన్న పిల్లలనే ఎంచుకుంటాను. ప్రేమించటానికి నాకో ప్రాణి కావాలి అనే స్వార్ధం నాది. బోసి నవ్వుల్లో, అపురూపమైన ఆ స్పర్శలో నన్ను నేను మర్చిపోతాను. నేనెంత ప్రేమిస్తానో వారు నన్ను అంతే ప్రేమిస్తారు, అదిగో ఆ ప్రేమ పొందాలనే స్వార్ధం నాది. ”
“మీ చేతుల్లో పెరిగిన పిల్లల్లో ఒక్కరికి కూడా మీరు గుర్తుండరు”
“అందుకే ఎవరితోనూ అమ్మ అనిపించుకోను సిస్టర్. వారికి నేను గుర్తుండాలని ఆశించను. చెప్పానుగా, నాకు ఎదిగిన మనుషులంటే భయం”.
కిటికిలో నుంచి బయటకు చూసాను. ఉయ్యాలలో ఊగుతున్న చిన్నది లాదీ లాదీ అని పిలస్తూ నవ్వుతోంది. ఆరోగ్యంగా మెరుస్తున్న పాప చెక్కిళ్ళు నాకు ఎంతో తృప్తిని ఇచ్చాయి.
“పాపకు ర పలకట్లేదు”, మురిపెంగా అన్నాను.
“కొన్ని రోజులు నా కోసం వెతుక్కుంటుంది సిస్టర్. కొంచెం జాగ్రత్త”, ఆఖరి అప్పగింత చెప్పేసాను.
నా కళ్ళలో భావాలను వెతకాలని సిస్టర్ అభిగేల్ విశ్వప్రయత్నం చేస్తోంది.
నా పరిధిలో అణువణువునీ శోధించి, మలిసంధ్యలో ఈ ముంగిలిలో తేలాను. ఇక్కడ తేలడానికి ముందు ఎన్నెన్ని సంద్రాలు ఈదానో, ఎంత అలసటను నాలో దాచుకున్నానో నా మనసుకు మాత్రమే తెలుసు. తాత్కాలికమైనా సరే బృందావనాలు నాకు కావాలి, కల్మషంలేని ప్రేమ, స్వచ్ఛమైన నవ్వు నాకు కావాలి.
“ ఏం పేరు పెట్టారు”, అనడిగాను.
“కృష్ణ”
రోజుల బాబును చేతుల్లోకి తీసుకుంటుంటే ఇది అని చెప్పలేని ఓ అనిర్వచనీయ భావన. ప్రపంచంలో ప్రతీ బిడ్డ ప్రత్యేకమే,అపురూపమే.
కన్నయ్యతో అనాధాశ్రమమం గేటు దాటుతూ మరోసారి జన్మించాను… నూతనంగా, స్వచ్చంగా, ప్రేమముర్తిగా, తాత్కాలిక తల్లిగా.
**** (*) ****
కథా కథనం చాలా బావున్నాయి
చాలా బాగుంది కథ . ఓ గొప్ప అనుభూతిగా మనసులోకి ప్రవహించింది . అభినందనలు
ప్రవీణా గారు, తనని తాను మనం వొక భాద్యతగా సంతోషంగా ఆవిష్కరించుకొన్న దారి కొత్తగా వుంది.Congratulations.
Nice and very touching story Praveena
పరిష్కారం కొత్తగా ఉంది.. నచ్చింది చాలా!!
కథ చాలా బాగుందండీ..
ప్రవీణా !
కథ చాలా నచ్చింది ..అవును పిల్లలు ఎప్పుడూ పిల్ల లా గా ఉండి పోతే ఎంత బాగుండును అనుకునే క్షణాలు ఎన్నో తల్లి కి ..ఆ చిన్న అల లాంటి ఆలోచన కి రూపం కలిపిస్తూ ,మంచి అలోచన రేకెత్తించారు ..
ఇలాంటి ఆడ వారు ఎంత మందో ,కేవలం పెళ్ళీ చేసుకున్నందుకు ఎన్ని కష్టాలు భరిస్తారో …మలి సంధ్యలో పసి నవ్వుల తోడు అందుకోవడం ..
మంచి ఆలోచన ..చాలా బాగుంది ..
వసంత లక్ష్మి .
చక్కని కథ. చిన్న పిల్లల్ని రెండు మూడేళ్ళు పెంచి తిరిగి అనాధాశ్రమానికి ఇవ్వడం అనే ఆలోచన కొత్తగా ఉంది. మీరు కథ చెప్పిన విధానం నచ్చింది. Very touching and inspirational story!
మంచి కథని మాకు అందించారు ..:)