ప్రవాసీ బంధం

అప్పుడు ఇప్పుడు

ఫిబ్రవరి 2013

ఈ రోజు కుసుమ, సూర్యల పెళ్లి రోజు. పదిహేను సంవత్సరాల సహవాసం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మలుపులు, ఎత్తుపల్లాలు. మరెన్నో అర్థాలు, అపార్థాలు. నేటితో కుసుమ ఈదేశానికి వచ్చి నిండా పన్నెండేళ్ళు. సూర్య కుసుమ కన్నా ఓ సంవత్సరం ముందోచ్చాడు. పరాయితనాన్ని స్వంతం చేసుకుని, అందులో ఇమిడిపోవటం భారతీయులకు పుట్టుకతోనో లేక పెంపకంలోనో అలవడిపోతుంది. అందునా భారతీయ స్త్రీలు ఇరవై ఏళ్ళు పుట్టి పెరిగిన ఇంటిని వదిలి అత్తారింటికి అడుగిడిన క్షణానే ఇది నా ఇల్లు, వీరు నావారు అనుకుంటారు.

కుసుమ డిగ్రీ చదువు అవ్వగానే పెళ్ళయిపోయింది. ఇరవై ఏళ్ళ వయసు. ఎదిగీ ఎదగని మనసు. సినిమా ప్రేమ కధలు, నవలా నాయకుల ప్రభావంలో కలలు కంటూ, వివాహాన్ని అందమైన ఊహల్లో అధ్బుతంగా చిత్రించుకునే వయసు. పెళ్లి చూపుల్లో అబ్బాయిని సూటిగా చూసిందే లేదు. పెళ్లి కుదిరాక జరిగిన ఫోను సంభాషణల్లో ఒకరికి ఒకరు పూర్తిగా అర్థం అయిపోయినట్టు, మేడ్ ఫర్ ఈచ్ ఆథర్ కు అంటే మేమే అని మురిసిపోయే అమాయకత్వంలోనే కుసుమకు మూడు ముళ్ళు పడిపోయాయి.

కుసుమ కాపురం ముగ్గురితో మొదలయింది. కుసుమ, సూర్య, సూర్య తమ్ముడు భాను. పెళ్లినాటికే సూర్య, భాను కలిసి హైదరాబాద్ లో ఒకే రూంలో వుంటున్నారు, భాను ఉద్యోగ ప్రయత్నాలలో వున్నాడు. పెళ్ళయ్యాక ఫ్లాట్ రెంట్ తీసుకుని, కుసుమ నాన్న కొనిచ్చిన కొత్త ఫర్నిచర్ తో కొత్తింట్లోకి మారారు.

సూర్యకు ఉన్న విపరీతమైన మొహమాటం. సినిమాకో షికారుకో మనిద్దరం వెళ్దాం అని కుసుమ అడిగిన ప్రతిసారీ, తమ్ముడే మనుకుంటాడో అనే సందేహంతో ముగ్గురమూ వెళ్దాం అనేవాడు.

దీనికి తోడూ “వదిన సరిగ్గా వండి పెడుతుందా?”, అంటూ అత్తగారి ఆరా కుసుమని తన ఇంట్లో తనను పరాయిగా నిలిపింది.

ఆదివారాలు అన్నదమ్ములిద్దరూ ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ గడిపేవారు. ఆ సినిమాలు కుసుమకు అర్థమయ్యేవి కావు.

ఎనెన్నో ఊహలతో కాపురానికి వచ్చిన కుసుమ, ప్రైవసీ లేక చిన్న చిన్న సరదాలకు నోచుకోలేకపోయింది. భర్త భుజాన తల వాల్చి కబుర్లు చెప్పటం, చెయ్యి చెయ్యి పట్టుకుని నడవటం,ఇద్దరు కలిసి వంట చేసుకోవటం లాంటి ఎన్నో కోరికలు కోరికల్లాగానే మిగిలిపోయాయి.

ఒక ఆదివారం, “రవీంద్ర భారతిలో సంగిత విభావరి ఉందంట. నా స్నేహితురాలు రెండు పాస్ లు ఇచ్చింది. వెళ్దామా?”, అడిగింది కుసుమ.

“సంగీతమా? నాకంత ఇంట్రెస్ట్ వుండదు. పోనీ నీ స్నేహితురాలితో కలిసి వెళ్ళరాదూ? నేను భాను కొత్తగా రిలీజ్ అయిన ఇంగ్లిష్ సినిమాకు వెళ్తాం, ఎలాగు నీకు ఇంగ్లీష్ సినిమాలంటే ఇష్టం ఉండదుగా “, కుసుమ మోహంలో మారుతున్న భావాలను గమనించకుండా సూర్య తేలికగా చెప్పేసాడు.

“నేనొక్కదాన్నే వెళ్ళటం కోసం కాదు, చెప్పినా అర్థం కాదులే”, నిట్టూర్చింది.

భానుకు ఉద్యోగం వచ్చి రెండు నెలలు గడిచాక ఒక రోజు ఏదో విసుగులో, “మీ తమ్ముడు మనతోనే వుండిపోతాడా?”, అడిగింది కుసుమ.

“అదేం అలా అడుగుతున్నావ్? నీకు చాలా ఇబ్బందిగా వున్నట్టుందే. చిన్నప్పుడు మా ఇంట్లో ఎప్పుడు చుట్టాలు వుండే వారు. అమ్మ ఎప్పుడూ విసుక్కునేది కూడా కాదు. నువ్వేమో నా సొంత తమ్ముడినే పరాయిగా చూస్తున్నావ్”

“నా ఉద్దేశ్యం అది కాదండి…..”, కుసుమ మాట పుర్తవ్వనే లేదు…

“నీదంతా స్వార్ధం. అమ్మ ముందే చెప్పింది”, సూర్య గొంతు పెంచాడు.

“అరవకండి ,భానుకు వినిపిస్తే బాధ పడతాడు. ప్లీజ్”, అర్థించింది. తలుపు గట్టిగా విసిరేసి బయటకు వెళ్ళిపోయాడు సూర్య.

“ఇప్పుడు నేనేం అన్నానని తనకంత కోపం? అవును, నేను స్వార్ధపరురాలినే. నా భర్తతో నేను సన్నిహితంగా ఉండాలనుకోవటమే నా స్వార్ధం. భార్యతో ప్రేమగా మాట్లాడటమే నామోషి తనకు. ఈ నాలుగు గోడల మధ్య తనువులు కలుస్తున్నాయి, మరి మనసులు కలుస్తున్నాయా? ఆ అవకాశం మాకు దొరికిందేక్కడ?

అమ్మ చెప్పిందంట? ఏమని చెప్పారు అత్తయ్య? నన్నెందుకు అర్థం చేసుకోరు? “, మనసులోని మాటలతో కళ్ళు తుడుచుకుంది కుసుమ.

కుసుమ అత్త గారు స్వతహాగా మంచి వారే. చుట్టుపక్కల అమ్మలక్కలు, “కోడలు మిమ్మల్ని బాగా చూసుకుంటుందా?” అని ఒకటికి పదిసార్లు అడిగేసరికి ఆవిడకు అనుమానం వచ్చి కుదిరినప్పుడల్లా కాస్త పెత్తనం తెచ్చిపెట్టుకునేది. చుట్టపు చూపుగా వచ్చినప్పుడు పెత్తనం చేసే అవకాశాన్ని వదిలేది కాదు. పోపు పెట్టటం దగ్గర నుంచి కూరగాయలు తరగటం వరకు అన్నీ ఆక్షేపించేది.”అబ్బాయిలిద్దరికీ పూరీ ఆలు కూరంటే చాలా ఇష్టం. ప్రతి ఆదివారం వండేదాన్ని. నువ్వు వండుతున్నవా?”, అడిగింది కుసుమ అత్తగారు.

“మీ అబ్బాయే వద్దంటున్నారు అత్తయ్య, ఆయిలీ ఫుడ్ అని”"ఈ వయసులో డైటింగా? ఇది మరీ బాగుంది, ఆరోగ్యాలు ఏమైపోతాయి. ….నువ్వు వండట్లేదని నేనేమి అనుకోనులే”, పుల్ల విరపు మాట విసిరింది.

“మీరేమన్నా అనుకుంటారని నేను వండను అత్తయ్య. మేము తినటానికి వండుకుంటాం”, కాస్త కటువుగానే సమాధానం చెప్పింది కుసుమ.

ఈ సంభాషణంతా అత్తగారు తన కోణంలో కొడుకు చెవిలో ఊదుతారని, ఆ విషయంపై తామిద్దరూ మాట మాట అనుకోవాల్సి వస్తుందని కుసుమకు తెలుసు.

కుసుమ కాపురాన్ని నాలుగు ముక్కల్లో చెప్పాలంటే….

కోడలి పాత్రను బుతద్దంలో పరీక్షించే సమాజం. ఆ సమాజానికి అక్షరాలా కట్టుబడి వుండే కుటుంబం. ఎక్కడ భార్యను సమర్ధిస్తే తల్లి నోచ్చుకుంటుందో అని భార్యను తల్లి కోణంలో చూసే భర్త .ఎన్నెన్నో అనుమానాలు, సంశయాలతో నలిగిపోతున్న భర్త. భర్తను సాధిస్తూ దుఃఖిస్తున్న భార్య. మొత్తానికి సమాజపు దిశానిర్దేశాలలో నడుస్తున్న ఎన్నో కాపురాలలో కుసుమ కాపురం కుడా ఒకటి.నిజానికి కుసుమ తన కష్టాలను నలుగురికి చెప్పుకుంటూ సానుభూతినన్నా పొందుతోంది. సూర్య తన క్షోభ బయటపడితే ఎక్కడ చులకన అయిపోతాడోనని గంభీరంగా ఉండి పోతున్నాడు.

కుసుమ కష్టాలు పెద్దవా అంటే అవును, కాదు అని తేల్చి చెప్పలేము. అసంతృప్తి, నిట్టుర్పు దినచర్యలో భాగాలైపోయాయి.

***

సూర్య ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్ళే అవకాశం వచ్చింది. అప్పటికే కుసుమ ఆరో నెల గర్భిని. గర్భవతైన భార్యను వదిలి వెళ్ళటానికి మనసొప్పలేదు అతనికి. వెళ్ళాలా వద్దా అని తటపటాయిస్తున్నాడు.

“అవకాశాలు అన్నిసార్లు రావు. మీరు ధైర్యంగా వెళ్ళండి”, నిబ్బరంగా చెప్పింది కుసుమ.

 

” కుసుమ గురించి బెంగ పెట్టుకోకు. మేమందరమూ లేమూ. ఇక్కడ తనని చూసుకోవటానికి”, భరోసా ఇచ్చింది సూర్య తల్లి.

 

వెళ్తూ వెళ్తూ సూర్య కళ్ళలో కదలాడిన తడి కుసుమలో పెరిగిన కొన్ని అపార్థాలను దూరం చేసింది. కొడుకుకు వీడ్కోలు చెపుతూ కోడలి భుజం తట్టిన అత్తగారు మనసును హత్తుకున్నారు.

 

అమ్మ, అత్తా దగ్గరున్నా తొలిచూలు బిడ్డను అక్కున చేర్చుకునే అమూల్యమైన క్షణాన ఆనందాన్ని పంచుకోవాల్సిన భర్త దగ్గర లేకపోవటం వెలితిగా అనిపించింది కుసుమకు.

బిడ్డకు ఆరు నెలలు దాటాక అమెరికా వెళ్ళింది. సూర్య తన కూతుర్ని చూసుకున్నది అప్పుడే. మొట్టమొదటిసారి కూతుర్ని ఎత్తుకున్న సూర్య కళ్ళలో ప్రపంచాన్ని జయించిన ఆనందం. ఆ ఆందాన్ని చూస్తూ మురిసిపోయింది కుసుమ.

చేతిలో ఉన్న కొద్దిపాటి సేవింగ్స్ తో పొదుపుగా ఇంటికి కావాల్సిన సామానులు కొనుక్కున్నారు.

“ఆర్ధికంగా నిలదొక్కుకోవటానికి కొంత కాలం పడుతుంది. కాస్త సర్దుకోవాలి కుసుమ”, అనునయంగా చెప్పాడు.

“భలే వారే! ఇప్పుడు మనకేం తక్కివైందని?”, నవ్వుతూ అనేసింది.

పెళ్ళయ్యాక కాపురం పెట్టినప్పుడు తన పుట్టింటి వారు కొనిచ్చిన సామాను బాగోలేదని, పెట్టిపోతలు సరిపోలేదని జరిగిన హంగామా అప్రయత్నంగా కుసుమ మనసులో కదలాడింది. పెళ్లి పేరిట రెండు కుటుంబాల మధ్య ఏర్పడాల్సిన బంధం ఈ కట్న కానుకలు, పెట్టి పోతల నడుమ ఎంతగా నలిగి పోతుందో! మొదట్లో ఏర్పడిన ఆ వ్యత్యాసాల మధ్య కొత్త కోడలి మనసు ఎంత చిన్నబోతుందో ఎవరూ ఆలోచించరు.

“మనిద్దరికీ ఏవి అత్యవసరం అనిపిస్తే అవే కొందాం. luxury సామాను లేకపోతే పోనీ”, మనస్పూర్తిగా అనుకున్నారు ఇద్దరు.

ఆనాడు పుట్టింటి వారు సమకూర్చే సామనుకు ఇప్పుడు వారిద్దరూ పొదుపుగా కొనుక్కునే వస్తువులకు ఎంత తేడా కదూ! ఈ సర్దుబాటులో తృప్తే వేరు.

కుసుమ అమెరికా జీవితానికి తొందరగానే అలవాటు పడింది .

 

సుర్యలోనూ కొద్ది మార్పులు. ఇంటిపని, వంట పనిలో సాయం అందిస్తున్నాడు. పాపకు స్నానం చేపించటం, అన్నం తినిపించటం ఎంతో సరదాగా చేస్తున్నాడు.”అక్కడున్నప్పుడు అన్నం తిన్న ప్లేట్ కూడా తీసేవారు కాదు”, అప్పుడపుడు ఎత్తిపోడుస్తూ వుంటుంది భర్తను.

***

అమెరికా వచ్చిన రెండు నెలలకు పాపకు జలుబు, దగ్గు, జ్వరం. వారం రోజులుగా సరిగ్గా అన్నం తినట్లేదు, నిద్రా పోవట్లేదు. క్రాంకీగా ఏడుస్తున్న పాపతో కుసుమ సతమతమయిపోతుంది.

“నువ్వు అమ్మతో మాట్లాడి చాలా రోజులైందంట కద?”, విసుగ్గా అడిగాడు సూర్య.

“నేను కునుకు తీసి నాలుగు రోజులైంది, చూస్తూనే ఉన్నావుగా సూర్య? ఆమాత్రం అర్థం చేసుకోలేవా?”, కటువుగానే అడిగింది.

“అమ్మ బాధ పడుతుంటేనూ…..”"ఇప్పుడు నేను అత్తయ్యకు ఫోన్ చెయ్యకపోవటం పెద్ద ఇష్యూనా? సూర్య….నన్ను కోడలిగా కాకుండా నీ భార్యగా, ఒక మనిషిగా నువ్వెప్పటికీ చూడలేవా?”

ఈ మాట సూర్య మనసుకి నిలదీసింది, ఏ సమాధానం చెప్పలేకపోయాడు.ఆ రాత్రి పాపకు ముక్కులు బిగదీసి ఊపిరాడక ఇబ్బంది పడుతోంది. పడుకోబెడితే ఒకటే ఏడుపు . కుసుమ పాపను ఎత్తుకుని జోకొడుతూ నడుస్తోంది.

“నువ్వెళ్ళి పడుకో, నేను పాపను చూసుకుంటాను”, తెల్లారేదాకా తండ్రి చేతుల్లోనే ఉంది చంటిది.

“నువ్వు కుడా అర్థం చేసుకోవాలమ్మా. పాపకు కొంచెం నలతగా ఉంది. ఏవేవో వుహించుకోకు. నాలుగు రోజుల తర్వాత ఈరోజే కుసుమ నిద్రపోయింది. తర్వాత మాట్లాడుతుందిలే”, సూర్య మాటలకు మెలుకువ వచ్చింది. తల్లికి నచ్చచేబుతున్నాడు. అలసటగా మేల్కొంటున్న కుసుమ కళ్ళలో ఓ వెలుగు రేఖ.

మరోమారు కుసుమ నాన్నకు అనారోగ్యం. ఆర్ధిక కారణాల చేత ఇండియా ప్రయాణం చెయ్యలేని పరిస్తితి. కన్నీళ్ళ పర్యంతరమయిన కుసమను ఓదారుస్తూ కౌగిలించుకున్నాడు సూర్య. బహుసా అవసరార్ధం కాకుండా ఆసరార్థం కౌగిలించికోవటం అదే మొదటిసారేమో.

* * *

వీళ్ళుటున్న కమ్యూనిటిలో ఎన్నో ఉదాహరణలు.

ప్రతీరోజూ కాఫీ కప్పులతో వాకిట్లో కూర్చుని నవ్వుతూ కబుర్లు చెప్పుకునే పక్కింటి అమెరికన్ వృద్ద దంపతుల అన్యోన్యతను చూసి అబ్బురపడేది కుసుమ.

శత్రువుల్లా పోట్లాడుకుంటూ, ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ, విడిపోవటం అనే ఆలోచనకే ఉలిక్కి పడుతూ కాపురం అనే కప్పుకింద బతుకు నరకం చేసుకుంటున్న ఒక భారతీయ జంట.

ఇద్దరు పెళ్ళాలకు మాజీ భర్త, ముగ్గురు పిల్లలకు తండ్రి అయినా, నేనింకా సోల్ మేట్ కోసం వెతుకుతూనే వున్నాను అనే జోసఫ్.

భారతీయ వివాహాలలో రెండు పార్శాలు . క్షణికావేశాలకు, బేధాభిప్రాయాలకే విడిపోని బంధాలు ఒక వైపైతే, విడిపోలేక మనసును చంపుకుంటూ బతుకును నరకం చేసుకుంటున్న కాపురాలు మరో వైపు.

బాధ్యతా లేని స్వేచ్చతో పట్టాలు తప్పుతున్న అమెరికా కుటుంబాలు ఒక వైపైతే , అదే అమెరికాలో స్వేచ్ఛను అర్థం చేసుకుని ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ సాగుతున్న జంటలు మరో వైపు.

భారతీయత, పాశ్చాత్యం….ఏదో తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. గ్రహించుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది రెండిట్లోనూ సమానంగానే వుంది.

***

కుసుమ MS చెయ్యటానికి యూనివర్సిటీలో జాయిన్ అయింది. పాప ఆలనాపాలనా కష్టమయిపోతుంది. పాపను మా దగ్గరకు పంపించండి, ఈ రెండు సంవత్సరాలు ఇక్కడ పెరుగుతుంది అని కుసుమ తల్లి సలహా ఇచ్చింది. భార్యభార్తలిద్దరికి మనసొప్పలేదు. పాప వెళ్ళిపోతే ఇల్లు బోసిపోతుంది, మేము ఉండలేం అనుకున్నారు.

సూర్య తన ఆఫీసు టైమింగ్స్ అడ్జుస్ట్ చేసుకుని, పాపను రోజుకు కొన్ని గంటలు డే కేర్ కు పంపిస్తూ కష్టమో సుఖమో వాళ్లిద్దరే తిప్పలు పడ్డారు.

సాయం కోసం ఆరు నెలలు కుసుమ అమ్మగారు, మరి ఆరు నెలలు అత్తగారు వచ్చారు.

ఒకనాడు సూర్య గిన్నెలు కడుగుతున్నాడు.

“అయ్యో..అదేమిటి నువ్వు అంట్లు తోముతున్నావ్! కుసుమ చేస్తుందిలేరా. పోనీ,నా చేతిలో పనయ్యాక నేను కడుగుతాను”,

“అమ్మ పని అవటం ముఖ్యం, ఎవరు చేసారు అని కాదు. ఇక్కడ అన్ని పనులు మనమే చేసుకోవాలి”, నవ్వుతు చెప్పాడు సూర్య.

“ఏమోరా బాబు, ఈ దేశాలు ఈ పద్దతులూనూ!”, ఆశ్చర్యం అతిశయం ఆవిడకు. ఏదైనా కానీ, కొడుకు ఇంటి పని చెయ్యటం జీర్ణించుకోలేక పోయింది.

***

కుసుమకు చదువు ఆవ్వగానే ఉద్యోగంలో చేరింది. పాప కూడా పెద్దదయింది.పరుగుల జీవితంలో వారికున్న ఆసరా ఒకరికి ఒకరు. పనేక్కువయినపుడు ఒకరిని ఒకరు విసుక్కున్నా, అవేవి మనసులో పెట్టుకోరు. భాదాభిప్రాయాలు, వాదులాటలు, ఒకటి రెండు రోజులు మాటామంతి లేకుండా బిగుసుకుపోవటాలు సర్వసాధారణం. పరుల జోక్యము లేకుండా అన్ని సమస్యలు అంతే సాధారణంగా సమసిపోతున్నాయి.

ఒకరికి ఒకరు దగ్గరయింది, ఒకరిని ఒకరు అర్థ చేసుకుంది అక్కడే.

భారతీయత బంధాన్ని నిలుపుకోవటం నేర్పితే, పాశ్చాత్యం బంధంలోని వ్యక్తికి విలువివ్వటం నేర్పింది.

***

కుసుమ పాపను స్కూల్ కు రెడీ చేస్తుంటే ఫోన్ రింగయ్యింది.ఆఫీసు పనిపై ఊరేల్లిన సూర్య ఫోన్ చేసాడు.

“హ్యాపీ వెడింగ్ డే. మిస్ యు కుసుమ”, గొంతు ప్రేమగా పలికింది.

“శ్రీవారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. సుటుకెస్ లో బట్టల అడుగున ఒక ప్యాకెట్ వుంది, have a look “, నవ్వుతూ చెప్పింది కుసుమ.

కొన్ని సంవత్సరాల క్రితం తన పుట్టిన రోజున సూర్య దగ్గర లేకుండా ఏదో పనిపై ఊరు వెళ్ళాడని నానా రభస చేసింది. ఇప్పుడు అలాంటి గొడవలేమీ లేవు.కాలింగ్ బెల్ రింగ్ అయింది.

“హ్యాపీ యనివర్సిరి మామ్”, డెలివరీ బాయ్ విష్ చేసి ఫ్లవర్ బోకే ఇచ్చాడు…..”ప్రేమతో నీ సూర్య”, కుసుమ కళ్ళలో అక్షరాలు తలుక్కున మెరిసాయి.

భారతీయత ప్రేమించటం నేర్పితే, పాశ్చాత్యం ప్రేమకు వ్యక్తికరించటం నేర్పింది.