“కళాకారుడు ఎప్పుడూ విప్లవం వైపే ఉండాలి, కానీ విప్లవకారుడిలా కాదు. వాళ్లలా రాజకీయ భాష మాట్లాడలేడూ,రాజకీయ వాతావరణంలో జీవించనూ లేడు” – అంటాడు ప్రముఖ అరబ్ కవి అదోనీస్ . “కవిత్వం జీవితాన్ని మారుస్తుందని నాకు పెద్ద ఆశలు లేవు. జీవితాన్ని మార్చాలంటే దాని నిర్మాణాలు మార్చాలి – కుటుంబం, విద్య,రాజకీయాలు వగైరాలు – అది కళ తనంత తానుగా చేయలేదు. కానీ కళ ముఖ్యంగా కవిత్వం ,వస్తువులకూ, పదాలకూ మధ్య సంబంధాన్ని మార్చి ప్రపంచానికి కొత్త ప్రతిబింబాన్ని సృష్టించగలదు. కవిత్వం గురించి తాత్వీకరించడమంటే ప్రేమ గురించి మాట్లాడ్డం లాంటిది. కొన్నింటిని మనం వివరించలేము. ఈ ప్రపంచం అర్థం చేసుకోవడానికి సృష్టించబడలేదు. ఆలోచించడానికీ, ప్రశ్నించడానికీ ఉన్నదిది. “ అంటాడాయన. 83యేండ్ల అదోనీస్ తన 17 యేండ్ల వయసు నుండీ కవిత్వం రాస్తునారు. సిరియా లో జన్మించిన అదోనీస్ బలమైన సెకులర్ భావాలు కలవాడు. తనను తాను ‘pagan prophet’ గా అభివర్ణించుకునే అదోనీస్ అరబ్ కవిత్వం లో ఆధునిక విప్లవానికి నాయకత్వం వహించాడు. దివంగతుడైన పాలస్తీనా కవి దార్వీష్ తో కలిసి ఆధునిక అరబ్ కవిత్వంలో అనేక ప్రత్యేక అధ్యాయాలు లిఖించాడు. వలస గురించీ,ప్రవాసం గురించి – కేవలం వ్యక్తుల వలసో, ప్రవాసాల గురించో కాదు – మొత్తంగా భాషే తన దేశంలో తానే ప్రవాసం పొందిన ఒక అనూహ్య అరబ్ జీవితాల గురించి అదోనీస్ చాలా శక్తివంతమైన కవిత్వం రాసాడు. కళ్ళు జిగేల్మనే పద చిత్రాలతో, ఉత్ప్రేక్షలతో అదోనీస్ కవిత్వం మధ్యధరా సముద్ర జీవిత కెరటాలని అనేకానేక విభిన్న స్వరాలతో పాడుతుంది –మనల్ని మైమరిపిస్తుంది. ప్రదానంగా కొన్ని దేశాలవారినీ, కొన్ని వ్యవస్థానుకూల భావజాలాలు కల వాళ్ళనీ అనుగ్రహించే నోబెల్ బహుమానానికి దగ్గరగా దాదాపు ఐదు సార్లు వెళ్ళిన కవి, విమర్శకుడూ, భావ విప్లవకారుడూ, కోల్పోతున్న మధ్యధరా అరబ్ అస్తిత్వాలకోసం బలవంతపు ప్రవాసాలకు బలవన్మరణాలకూ గురౌతున్న అరబ్ జీవితాలకోసమూ కలం పట్టిన యోధుడు అదోనీస్ . ఆయన రాసిన న్యూయార్క్ అనే పద్యం చాలా పెద్ద దుమారాన్నే సృష్టించింది. అది అతి త్వరలో వాకిలి పాఠకులకు అందజేస్తాం. ఈ పద్యం లో అదోనీస్ అద్భుత ఉత్ప్రేక్షలనీ, తాత్వికతనీ అత్యంత ప్రతిభావంతంగా కలిపి మనకీ ప్రపంచపు కొత్త ప్రతిబింబాలని అందిస్తున్నాడు.
వాడి వెంట నేను
————-
గాలి కూడా,
సీతాకోకచిలుకలు లాగే బండి కావాలనుకుంటుంది.
ఒక వెర్రి తనం నాకు గుర్తుంది.
మొదటి సారి,
మనసు దిండుకు తల ఆన్చినపుడు నేను నా శరీరంతో మాట్లాడుతున్నాను.
నేను ఎర్రగా రాసిన ఒక ఊహ
నా శరీరం.
ఎరుపు
అందమైన సూర్యుని సింహాసనం.
మిగతా అన్ని రంగులూ
ఎర్ర తివాచీలపై ప్రార్థిస్తాయి.
రాత్రి ఇంకో కొవ్వొత్తి!
ప్రతి కొమ్మలో ఒక బుజం, శూన్యంలో వ్యాపించిన సందేశం,
గాలి శరీరంలో ప్ర్సతిధ్వనిస్తుంది.
నన్ను కలిసినప్పుడల్లా
తనను తాను
పొగమంచులో కప్పుకోవాలని
సూర్యుని మొండితనం.
నన్ను కాంతి కోప్పడుతోందా?
నా గడచిన రోజులు నిద్రలో నడిచేవి,
నేను వాటి బుజానికి తలానించేవాడిని.
ప్రేమా కలలూ – రెండు బ్రాకెట్లు
వాటి మధ్య నా శరీరాన్ని ఉంచి
ఈ లోకాన్ని కనుక్కొంటాను.
అనేక సార్లు గాలి రెండు గడ్ది పాదాలతో ఎగరడం చూసాను.
తొవ్వ గాలి పాదాలతో నాట్యం చెయ్యడం చూసాను.
నా కోర్కెల పువ్వులు, నా శరీరమ్మీద మరకలు చేస్తున్నాయి.
యెప్పుడో,గాయపడ్డాను, గాయాలే నన్ను మలిచాయని అంతకు ముందే తెల్సుకున్నాను.
ఇప్పటికీ నాలో నడిచే
ఇప్పటికీ నాలో నడిచే పసివాడి వెంటనే నేను నడుస్తున్నాను.
వాడు
ఇప్పుడు
వెలుతురు మెట్ల కింద నిలబడి
విశ్రమించడానికి ఒక మూలను వెదుకుతూ,
రాత్రి ముఖాన్ని చదువుతున్నాడు.
చంద్రుడు ఒక ఇల్లైతే నా పాదాలు దాని
గడప కూడా తొక్కేందుకు నిరాకరిస్తాయి.
ఇప్పుడవి,
దుమ్ముతో నిండీ ఆరుకాలాల గాలికి నన్ను మోసుకెల్తాయి
ఒక చెయ్యి గాల్లో, ఇంకోటి కలల్లో – నేను నడుస్తాను.
శూన్య క్షేత్రాల్లో నక్షత్రం కూడా ఒక గులకరాయి!
దిగంతాలకు కలిసిన వాడు మాత్రమే
కొత్త తొవ్వలు వెయ్యగలడు.
నేను పుట్టిన ఇంటి శిథిలాల్లో
వదిలేసిన నా శరీరానికేమని చెప్పను? తన పైన మినుకు మినుకుమంటూ,
సాయంత్రపు తొవ్వలవెంట
అడుగుజాడలు వదిలే
చుక్కలు మాత్రమే నా బాల్యాన్ని చెప్పగలవు.
నాకు తెలవని, నాకు పేరు పెట్టిన దోసిట్లోని కాంతిలో జన్మిస్తోంది
నా బాల్యం ఇప్పటికీ…
ఆ నదిలోంచి వాడో అద్దాన్ని చేసి
తన విషాదం గురించి అడిగాడు.
తన దిగులులోంచి వానని కురిపించి మబ్బుల్ని అనుకరించాడు.
నీ బాల్యం ఒక ఊరు.
ఎంత దూరం వెళ్ళినా
నువ్వు దాని
పొలిమేర కూడా దాటలేవు!
వాడి రోజులు చెరువులు.
వాడి జ్ఞాపకాలు తేలుతున్న శరీరాలు.
గతం కొండలమీద నుండి
దిగుతున్న వాడివి
నువ్వు మళ్ళా వాటినే ఎట్లా ఎక్కగలవు?
ఎందుకు ఎక్కుతావు ఐనా?
కాలం నేను తెరవలేవి తలుపు.
నా కనికట్టు ఐపోయింది.
నా మంత్రాలు నిద్రపొయ్యాయి.
చిన్న రహస్య గర్భం లాంటి
వూళ్ళొ పుట్టాన్నేను -
దాన్నెప్పుడూ వదలలేదు.
తీరాలంటే కాదు, నాకు సముద్రమంటేనే ప్రేమ.
a good attempt sir. wishing to read some more poems of Adonis. thank you