కథ

ఆ ఒక్క మనిషి

జనవరి 2018

‘‘అర్జున్‌.. అర్జున్‌.. అర్జున్‌..’’ అని ఎవరో పిలిచినట్టనిపిస్తుంది. అర్జున్‌ లేచి కూర్చుంటాడు. తెల్లారినట్లు అనిపిస్తుంది. చుట్టూ చూస్తాడు. ఎవ్వరూ ఉండరక్కడ. ఎవరు పిలిచారో అర్థం కాదతడికి. ఆరోజుకి తన జీవితంలో ఉన్న మనుషుల గొంతులన్నీ ఆ పిలిచిన గొంతుకి మ్యాచ్‌ చేస్తూ పోతాడు. ఏదీ మ్యాచ్‌ అవ్వన్నట్టు అర్థమవుతూ ఉంటుంది. ఎవరిదై ఉంటుంది ఆ గొంతు? గతంలోకి వెళతాడు. ఆ గొంతును మ్యాచ్‌ అయ్యే గొంతును వెతుకుతూనే ఉంటాడు. దొరుకుతుంది. ఒక్కసారిగా ఏడుస్తాడు. వెంటనే ఏదో లాగినట్టనిపిస్తుంది. చుట్టూ చూస్తాడు. ఎవ్వరూ ఉండరు. మళ్లీ ఏడుస్తాడు. వెంటనే ఎవరో లాగినట్టనిపిస్తుంది. వచ్చి మళ్లీ ఇక్కడే పడిపోతాడు.

***

ఈరోజుకి సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం..

అర్జున్‌ గట్టిగా ఏడ్చాడు. ఎంత గట్టిగా అంటే ఏడ్వడం తనకు అప్పటికే అలవాటైపోయిందన్న విషయం కూడా మర్చిపోయేంతలా!

‘‘మనం ఇప్పట్లో మళ్లీ కలవం.’’ ఆ అమ్మాయి చెప్పిన మాటనే మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నాడు.

తలెత్తి చూశాడు. ఆ అమ్మాయీ ఏడ్చింది. ‘వెళ్లొస్తా’నన్న చూపు చూసింది. అర్జున్‌ లేచి నిలబడ్డాడు. ‘వెళ్లొద్ద’న్నట్టు చూశాడు. కొన్ని సెకండ్లలో ఇద్దరూ ఆ ప్రదేశంలో లేరు.

అక్కణ్నుంచి నడుస్తూ నడుస్తూ చాలా దూరం వెళ్లిపోయాడు అర్జున్‌. వెనక్కి తిరిగిరావడానికి భయపడేంత దూరం అది.

కానీ భయపడలేదు. తిరిగొచ్చాడు. అర్జున్‌కు నడవమంటే బాగా ఇష్టం. నడిస్తే ఏదో బాధంతా వెళ్లిపోయినట్లు ఉంటుందంటాడు. ఇంటికెళ్లాక అమ్మ ముందు మళ్లీ మామూలుగా కనిపించొచ్చు అంటాడు. అమ్మ ముందు అలా అబద్ధంగా నిలబడ్డానికి చాలాసార్లు మైళ్లకు మైళ్లు నడిచాడు. ఈసారది ఇంకెక్కువ.

అలిసిపోయి వచ్చిన అర్జున్‌ను చూసి ‘‘ఏమైంది? అలా ఉన్నావ్‌?’’ అని అడిగింది అమ్మ. ఎప్పుడూ అలాగే అడుగుతుంది కూడా. దానికి అతని దగ్గర ఒక సమాధానం ఉంది. ఎప్పుడూ ఉంటుంది. చెప్తాడు. అదే చెప్పాడు.

ఒకటి, రెండు, మూడు.. నాలుగు.. అర్జున్‌కి ఏదీ అర్థం కావడం లేదు. రోజులు గడవడం ఒక్కటి స్పష్టంగా తెలుస్తోంది.

‘‘నాకు ఈ లైఫ్‌ ఏం అర్థం కావట్లేదు.’’ అన్నాడొకరోజు, ఫ్రెండ్‌తో.

‘‘అర్థం కాకపోవడమంటే?’’ ఫ్రెండ్‌ నుంచి తిరుగుప్రశ్న.

‘‘ఏం అర్థం కావట్లేదు. ఐ ఫీల్‌ లైక్‌ ఐ డోంట్‌ ఎక్సిస్ట్‌’’

‘‘నోబడీ ఎక్సిస్ట్స్ హియర్‌. లైఫ్‌ ఇంతే!’’

‘‘కానీ.. ఏమో.. రోజూ ట్రై చేస్తున్నా. యాక్టింగ్‌ కూడా నావల్ల కావట్లేదు.’’

‘‘ఏడుస్తున్నావా?’’

‘‘రోజూ! ఏ?’’

‘‘ఏడుస్తూనే ఉండు. హోప్‌ యూ విల్‌ ఫైండ్‌ ఎ వే’’

‘‘చనిపోవాలనిపిస్తోంది!’’

‘‘అమ్మ గుర్తుకురావట్లేదా?’’

‘‘వస్తుంది. అక్కడే ఆగిపోతున్నా’’

‘‘అది. అక్కడే ఆగిపో! ఏదన్నా ఉంటే నాతో చెప్పుకో. నేనిక్కడే ఉన్నా. నీకోసం ఇక్కడే ఉంటాగా!’’

‘‘థ్యాంక్స్‌..’’ అన్నాడు అర్జున్‌.. నవ్వీ నవ్వనట్టు నవ్వుతూ.

‘‘థ్యాంక్స్‌ అవసరం లేదు. తిన్నావా ఇంతకీ?’’

అర్జున్‌ సమాధానం ఇచ్చాడు. ఆరోజు ఏడ్చాడు. ఆ తర్వాత రోజు.. ఆ తర్వాత రోజూ..

ఎప్పుడేడ్చినా ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాడు. బాగున్నట్టు అనిపించింది. రోజులు గడుస్తున్నాయి. జీవితం మళ్లీ అలవాటు అయిపోయింది అతడికి. ఎక్కువ ఆలోచించడం మానేశాడు. ముఖం మీద మళ్లీ చిరునవ్వు కనిపించింది. ‘‘ఏమైంది? ఇలా ఉన్నావ్‌?’’ లాంటి ప్రశ్నలు మళ్లీ అమ్మ నోటినుంచి రాలేదు. ఒకరోజు ఎందుకో మాత్రం అమ్మ ముందు గట్టిగా ఏడ్చాడు. ఆ రోజు ఆవిడా ఏమీ అడగలేదు.

***

ఈరోజుకి సరిగ్గా ఆరు నెలల క్రితం..

ఎప్పుడో, ఎందుకో అడగాలనుకొని అడగలేకపోయిన విషయం అడిగింది అర్జున్‌ తల్లి.

‘‘నువ్వు బానే ఉంటున్నావ్‌గా?’’ అని.

అర్జున్‌ గట్టిగా నవ్వాడు. ‘‘నువ్వున్నావ్‌! నేనెందుకు బాగుండనమ్మా!!’’ అన్నాడు, ఆ నవ్వునలా కొనసాగిస్తూనే.

‘‘నాకది చాల్రా!’’ అందావిడ.

అర్జున్‌కి అమ్మ ఇలా సడెన్‌గా ఎందుకడిగిందో అర్థం కాలేదు. అడగాలనుకున్నాడు. అడగలేదు.

‘‘నువ్వు బాగున్నావ్‌ కదమ్మా!?’’ అని మాత్రం అడిగాడు.

అమ్మ నవ్వింది.

ఆ నవ్వు మళ్లీ సరిగ్గా ఏడు రోజులకు.. మధ్యాహ్నం పూట గుర్తొచ్చింది అర్జున్‌కు. భయపడ్డాడు.

నాన్న చనిపోయిన రోజు నుంచీ అర్జున్‌ను ఒక భయం ఎప్పుడూ వెంటాడుతూ వచ్చింది.

ఏ రోజైనా, ఏ క్షణమైనా.. ఓ ఫోన్‌ వస్తుంది. అమ్మకు బాలేదనో, ఏదో అయిందనో, లేదా వెళ్లాక తనే చూస్తాడు, అమ్మ అలా పడిపోయి ఉండటమో, ఇంకోటో!! ఈ ఆలోచన ఎప్పుడొచ్చినా అర్జున్‌కు చెమటలు పట్టేస్తాయి. చాలామందిని అడిగాడు.. ‘ఇలా ఎవరికైనా కూడా అనిపిస్తుందా?’ అని. ఆ చాలామందిలో చాలామంది తమకూ ఇలాంటి భయాలున్నాయని చెప్పారు. ఈరోజు ఆ భయం ఇంకా భయపెట్టింది అర్జున్‌ను. ముఖ్యంగా ఆ నవ్వు. ఆ నవ్వు గుర్తొచ్చి ఎక్కువ భయపడ్డాడు.

ఫోన్‌ అందుకొని, కాల్‌ లిస్ట్‌ లో ఉన్న ఫస్ట్‌ నెంబర్‌కు డయల్‌ చేశాడు. రింగ్‌ అవుతూనే ఉంది కానీ, ఎవ్వరూ ఎత్తట్లేదు. అర్జున్‌కి భయం మరింత పెరిగింది. మళ్లీ చేశాడు ఫోన్‌. అదే రెస్పాన్స్‌. మళ్లీ చేశాడు. అదే రెస్పాన్స్‌.

ఇరవై నిమిషాల్లో ఇంట్లో ఉన్నాడు. అతణ్ని బాగా భయపెట్టిన విషయమే.. అలా పడిపోయి ఉన్న అమ్మను చూశాడు. ఏడ్చాడు. ఏడ్చాడు. కొన్ని రోజులపాటు ఏడుస్తూనే ఉన్నాడు.

‘‘నేనింకా బతకడం వేస్ట్‌ ఏమో!’’ అన్నాడొక రోజు ఫ్రెండ్‌తో.

ఆ ఫ్రెండ్‌ నవ్వాడు. ఒక తెలిసిన సమాధానమే మళ్లీ చెప్పాలన్నప్పుడు మనిషి నవ్వే నవ్వది. ఆ సమాధానమే ఇచ్చేశాడు ఆ ఫ్రెండ్‌. అర్జున్‌ చిన్నగా నవ్వీ నవ్వనట్టు నవ్వాడు.

కొన్ని రోజుల్లో అర్జున్‌ మళ్లీ బతకడం అలవాటు చేసుకున్నాడు. ఏడ్చినప్పుడల్లా ఫ్రెండ్‌ని కలవడం, ఎవ్వరిముందూ ఏడ్వలేనిదైతే ఎంత దూరం అనిపిస్తే అంత దూరం నడవడం. ఇదే పని.

ఫ్రెండ్‌ వేరే ఊరికి వెళ్లిపోతానన్నరోజు అర్జున్‌ ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడలేడని అతడికి తెలుసు.

ఫ్రెండ్‌ వెళ్లిపోయాక బాధొస్తే నడవడం ఒక్కటే తెలిసేది. ఆ కొద్దిరోజుల్లో చాలాదూరం నడిచాడు. ఒక్కోసారి ఏ నడకా ఆపలేని బాధ తన్నుకొచ్చేది. అన్నీ ఒక్కసారే గుర్తొచ్చేవి.

అలాగే నడుస్తూ నడుస్తూ ఒక బిల్డింగ్‌ దగ్గర ఆగాడు ఒకరోజు. ఒకటి, రెండు, మూడు.. నాలుగు.. ఒక్కో ఫ్లోర్‌ ఎక్కుతూ ఉంటే ఆయాసం వస్తున్నా పట్టించుకోలేదు. పై అంతస్తుకి  చేరాక, ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని దూకేందుకు రెడీ అయ్యాడు.

‘‘హేయ్‌ అర్జున్‌!’’ అని ఓ పిలుపు వినిపించింది.

తిరిగి చూశాడు అర్జున్‌. నరేశ్‌. మూడేళ్లయిందతడు నరేశ్‌ను చూసి. ఆగిపోయాడు.

నరేశ్‌.. అర్జున్‌కి దగ్గరగా వచ్చి, ‘‘ఏమైంది? ఏం చేస్తున్నావిక్కడ?’’ అనడిగాడు.

‘‘ఏం లేదు.. ఏం లేదు..’’ భయంగా సమాధానమిచ్చాడు అర్జున్‌.

కొన్ని నిమిషాల్లో ఇద్దరూ దగ్గర్లో ఉన్న ఇరానీ కేఫ్‌లో కూర్చున్నారు. అర్జున్‌కి నరేశ్‌తో అన్నీ చెప్పేయ్యాలనిపించింది.

నరేశ్‌కి అర్జున్‌ ప్రతీ లైఫ్‌ ఈవెంట్‌ తెలుసు. చనిపోవాలనుకున్నదీ చెప్పాక అర్జున్‌కు ఎందుకో తేలిగ్గా అనిపించింది. చుట్టూ చూసి నరేశ్‌ ఏదన్నా చెప్తాడా అన్నట్టు చూశాడు అర్జున్‌. నరేశ్‌ ఏం చెప్పేలా లేడు. ఇద్దరూ ఒకసారి ఒకరినొకరు తీక్షణంగా చూసుకున్నారు.

‘‘నువ్వు బాగుండాలి. నువ్వు బాగుంటే బాగుంటావ్‌’’ అన్నాడు నరేశ్‌.

‘‘నువ్వు హైద్రాబాద్‌ ఎప్పుడొచ్చావ్‌?’’ అర్జున్‌ అడిగాడు.

‘‘ఇప్పటికైతే చిన్న పని మీదే వచ్చా. నెక్స్ట్ మంత్‌ మొత్తం వచ్చేస్తా ఇక్కడికే!’’

‘‘నాతోనే ఉండొచ్చు!’’ అర్జున్‌ నవ్వాడు.

‘‘తప్పకుండా..!’’ అన్నాడు నరేశ్‌.

రోజులు గడుస్తున్నాయి. అర్జున్‌ ఒక్కోరోజు బాగుంటున్నాడు. ఒక్కోరోజు అస్సలు బాగుండటం లేదు.

ఎక్కువ నడవలేడని అర్థమైన ఒకరోజు ఇంట్లోనే కూర్చొని చాలాసేపు ఏడ్చాడు. ఏడుస్తూ ఏడుస్తూ తలను గోడకేసి బలంగా గుద్దుకున్నాడు.

బ్రెయిన్‌ స్ట్రోక్‌. చాలారోజులు లేవలేదు అర్జున్‌. స్పృహలోకి వచ్చిన రోజుకి నరేశ్‌ ఎదురుగా కనపడ్డం ఏదో ధైర్యాన్నిచ్చింది అతడికి.

‘‘ఎందుకిలా చేశావ్‌?’’ అని కోపంగానే అడిగాడు నరేశ్‌.

అర్జున్‌ అతణ్ని గట్టిగా హత్తుకొని ఏడ్చాడు. ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుస్తూనే ఉన్నాడు.

నెలలు, సంవత్సరాలు అలా గడిచిపోతూంటే అర్జున్‌ ఒక్కో కారణంతో ఏడుస్తూనే ఉన్నాడు. దేనికోసం ఏడుస్తున్నాడో అవి మారిపోతున్నాయి. ఎవరి ముందు ఏడుస్తున్నాడో వాళ్లూ మారిపోతున్నారు. మనుషులు మారిపోతున్నారు. ప్రదేశాలు మారిపోతున్నాయి. అర్జున్‌ ఏడుస్తూనే ఉన్నాడు.

‘‘నేను చెన్నై వెళ్లిపోతా!’’ అన్నాడు అర్జున్‌.

‘‘ఇప్పుడు చెన్నై ఎందుకు?’’ నరేశ్‌.

‘‘ఏమో! ఇక్కడే ఉండలేను నేను.’’

‘‘నువ్వు అక్కడ కూడా ఉండలేవు.’’

‘‘నేనుంటా!’’

‘‘కూల్‌! నీకెక్కడ బాగుంటుందనిపిస్తే అక్కడికెళ్లు..’’

‘‘నేను చెన్నై వెళ్తా!’’

‘‘నీ ఇష్టం. నువ్వు బాగుండాలి. బాగుంటే బాగుంటావ్‌!’’ అన్నాడు నరేశ్‌.

అర్జున్‌ నవ్వాడు.

‘‘చెన్నైలో భరత్‌ ఉన్నాడు. వాడితో ఉండొచ్చు..’’ కొనసాగించాడు నరేశ్‌.

‘సరే’ అన్నట్టు తలూపాడు అర్జున్‌.

***

ఈరోజు.. చెన్నై..

ఫ్రెండ్‌ కోసం ఎదురుచూస్తున్నాడు అర్జున్‌. కేఫ్‌ అంతా గోలగోలగా ఉంది. అప్పటికే రెండు టీలు తాగి, భరత్‌ రావడానికి ఇంకో అరగంట పడుతుంది అంటే చుట్టూ చూశాడు. అక్కడ వినిపిస్తున్న రకరకాల అరుపుల్లో ‘‘అర్జున్‌.. అర్జున్‌..’’ అన్న అరుపొక్కటే అతడికి స్పష్టంగా వినిపిస్తోంది.

ఆ గొంతుని గతంలోకి వెళ్లి పోల్చుతూ పోతున్నాడు. అమ్మ గుర్తొచ్చింది. అమ్మాయి గుర్తొచ్చింది. మళ్లీ ఏవేవో శబ్దాలు. ‘‘అర్జున్‌..’’ అన్న పిలుపు మాత్రం ప్రతిసారీ స్పష్టంగా వినిపిస్తోంది.

ఒక్కసారే కళ్లు తిరుగుతున్నట్టు అనిపించింది అతడికి. ఆ శబ్దాలు అలా వినబడుతూనే ఉన్నాయి.

‘ఎక్కడున్నాను నేను!?’ అని చుట్టూ చూశాడు.

ఏడుస్తున్నాడెందుకు? ఏమైంది?

కాసేపు ఏడ్వకూడదు అన్నట్టు తల అడ్డంగా ఊపి నెమ్మదించాడు.

ఎదురుగా వస్తున్న మనిషిని చూస్తున్నాడు.

ఆ మనిషి ఒక్కో అడుగేస్తూంటే అర్జున్‌ కొంచెం కొంచెంగా కుర్చీలోంచి లేస్తున్నాడు.

ఆ మనిషి పూర్తిగా దగ్గరకు వచ్చేశాక, అర్జున్‌ మొత్తంగా లేచి నిలబడ్డాడు.

‘‘ఎలా ఉన్నావ్‌?’’ అంటూ ఆ మనిషి అర్జున్‌కు చెయ్యందించాడు.

అర్జున్‌ అతణ్ని హత్తుకొని, ‘‘థ్యాంక్స్‌ భరత్‌..’’ అన్నాడు.

నాకైతే అప్పుడు అర్జున్‌ ముఖం కనిపించలేదు కానీ, కచ్చితంగా ఏడ్చే ఉంటాడు.

****(*)****