అది కాటికాపరి విజిల్‌లా లేదు, శ్మశానంలో నక్కల ఊళలా ఉంది.
‘విశాల గదులు- సకల సదుపాయాల’ ప్రకటనల్ని వెక్కిరిస్తూ డార్మిటరీలన్నీ మంచాలతో కిక్కిరిసి ఉన్నాయి. సుడిగాలికి సురసురా లేచిన బూడిదమేఘాల్లా దుప్పట్లు లేచి అవతల పడ్డాయి.
మంచాల మీంచి అస్థిపంజరాలు నిటారుగా లేచి నిలబడ్డాయి. తెల్లటి ఎముకలతో కూడిన కాళ్లను నేల మీద తాటించి, బిలబిలమంటూ ఆ ఫ్లోర్‌లో ఒక మూలనున్న అతిపెద్ద ఫ్రీజర్ దగ్గరకు పరిగెత్తాయి.
క్యూలో నిలబడి, తమ వంతు రాగానే బార్‌కోడ్ ఆధారంగా తమ తలల్ని తగిలించుకుని, మళ్లీ గదుల వైపు పరిగెత్తాయి.
గోడకు తగిలించిన అద్దం ముందు నిలబడి, తేరిపార చూసుకుంది ఓ అస్థిపంజరం.
సందేహం లేదు, తన మొహమే! ఆరోజుకి నిర్ధారించుకున్నాడు విశ్లేష్.
తను అక్కడికొచ్చిన కొత్తలో బాగానే ఉండేవాడు. తల, చర్మం, సకల అవయవాలు, రక్తమాంసాలు… అన్నీ నిశ్చయంగా ఉండేవి. తనేమిటి? అందరూ అలాగే ఉండేవారు.
రెండుమూడు రోజులు గడిచాయో లేదో, కాటికాపరి తన భాషలో ఏదో చెప్పాడు. తను వినలేదు.
ప్రేతాలు చెప్పాయి; వినలేదు. భూతాలు చెప్పాయి; పట్టించుకోలేదు.
కానీ, ఒక్కో రాత్రి గడిచేకొద్దీ తలలో తుపాన్లు ఎక్కువయ్యేవి. మెదడులో అగ్నిపర్వతాలు బద్దలయ్యేవి. పిచ్చిపిచ్చి ఆలోచనలేవో చితిమంటల్లా ఎగసిపడేవి. నిద్ర పట్టేది కాదు. గబుక్కున లేచి కూచునేవాడు. చుట్టూ మంచాలు నిద్రాసనాల్లో మునకలై కనిపించేవి.
ఓ భయంకర పగటివేళ తన ఘోషను సీనియర్ ప్రేతేష్‌తో మొర పెట్టుకున్నాడు.
”ఒరే డింగరీ! ‘తల’నాత్మక పరిశీలనను ఈ శ్మశానాధీశులెవ్వరూ క్షమించరుగాక క్షమించరు”.
”ఒక్క ముక్క అర్థంగాలా…” బిక్కమొహం వేశాడు విశ్లేష్.
”తలలు తీసి మంచుపెట్టెలో పెట్టి పడుకుంటుంటే, మమ్మల్నందరినీ పిచ్చనాయాళ్లనుకుంటున్నావు కదూ” నవ్వు, కోపం కనిపించని కళాత్మక సౌందర్యంతో చెప్పాడు ప్రేతేష్.
అప్పట్నుంచీ తను కూడా రాత్రి పడుకోబోయే ముందు తల తీసి ఫ్రీజర్‌లో పెట్టడం అలవాటు చేసుకున్నాడు. పంచేంద్రియాల పనితనం మంచులో కప్పబడిపోవటంతో తుపాన్లు, అగ్నిపర్వతాల బెడదలేని విచిత్ర లోకంలో నిద్రపోయే అదృష్టానికి నోచుకున్నాడు.
విశ్లేష్ మెల్లగా మునివేళ్లపై కాళ్లు పైకి లేపాడు. అద్దంలో గొంతు కింది భాగం నుంచి తెల్లని ఎముకలు కనిపిస్తున్నాయి. చర్మపుతొడుగు లేని తల కింది భాగాన్ని చూసుకునే ధైర్యం లేక గభాల్న కాళ్లు దించేశాడు.
”మొహానికేం ఢోకా లేదు. బానే ఉందిలే. నడువ్ వాష్‌రూములోకి” కాటికాపరి గట్టిగా అరిచాడు.
గబగబా అక్కణ్నుంచి వాష్‌రూముల వైపు పరుగు తీశాడు విశ్లేష్.
వచ్చిన కొత్తలో ఓ రాత్రి గభాల్న మెలకువ వచ్చింది. బెడ్‌లైటు వెలుతుర్లో కళ్లు చిట్లించి చూశాడు. ఓ దెయ్యం తన మంచం పక్కనే నిలబడి ఉంది. కంపు కొడుతోంది. కడుపులో దేవుతోంది. ఘ్రాణనాడులు ఏ క్షణమైనా తుత్తునియలయ్యే ప్రమాదాన్ని పసిగట్టి పక్క మంచం మీద పడుకున్న ప్రేతేష్‌ను తట్టి లేపాడు.
”బడుద్ధాయ్! మనల్ని సెంటు వాడనివ్వరు. దీంతోనే సరిపెట్టుకోవాలి. అది దెయ్యం కాదు, వాష్‌రూముల్లోంచి వస్తున్న కంపు. పెద్ద టైమ్ పట్టదులే. త్వరగానే అలవాటు పడతావ్” తాపీగా చెప్పి, జాలీగా మళ్లీ ముసుగు తన్నాడు ప్రేతేష్.
మొహం తప్ప, ఎముకలేవీ రుద్దుకునే పనిలేదు కాబట్టి రెండు నిమిషాల్లో స్నానం కానిచ్చి, గదిలో తన షెల్ఫ్ దగ్గరకొచ్చాడు. కంకాళాన్ని ప్యాంటు, చొక్కాలతో ప్యాక్ చేశాడు.
నున్నగా తల దువ్వుకున్నాడు. మళ్లీ అద్దం ముందు నిలబడ్డాడు. ఇంకా మనిషి ఆనవాళ్లు మిగిలున్నందుకు మెదడులో ఏ మూలనో సంతోషం తాలూకు రసాయనిక చర్య పురుడు పోసుకుంది.
గదిలోని మరో ఏడు సహ అస్థిపంజరాలు కూడా తనలాగే తయారై అయిదు గంటలకంతా అధ్యయన శిబిరానికి చేరుకున్నాయి.
తలలన్నీ తన్మయత్వంతో తాళపత్రగ్రంథాల్లోకి దూరిపోయాయి.
ఓ యమభటుడు చేతిలో మారణాయుధంతో ఆ చివర్నుంచి ఈ చివరకు తిరుగుతున్నాడు.
‘తన్మయత్వం’ ఎక్కువై రెండు తలలు బొప్పి కట్టాయి. దిగ్గున పైకిలేచి, మాటలు పంచుకున్నాయి.
ఆ శబ్ద తరంగాలు త్వరితగతిన ప్రయాణించి, యమభటుడి కర్ణభేరీల్ని ఢీకొట్టాయి.
మారణాయుధం మహోగ్రరూపం దాల్చింది. రెండు తలలూ పచ్చడి కింద మిగిలాయి.
దాంతో మిగతా తలలన్నీ తన్మయత్వాన్ని తారస్థాయిలో సొంతం చేసుకుని, అధ్యయన బొరియలో మునిగిపోయాయి.
ఉదయం ఏడున్నర గంటలకు పళ్లేల మోతతో ఫలహారశాల దద్దరిల్లింది. కంకాళాలు కనీసం అక్కడైనా స్వేచ్ఛాగీతాన్ని ఆలపించాలని తరచూ పోరాటానికి దిగుతాయి. బుల్లి రాక్షసులు కొందరు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ పర్యవేక్షణలో నిమగ్నమవుతారు.
పళ్లేల జోరూ, పోరాట హోరూ కాసేపటికే చప్పున చల్లారిపోతాయి. రెండొందల నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఇడ్లీలుగా మారిన ఇనపముద్దల్ని నమల్లేక, రాత్రి మిగిలిపోయిన అన్నంలో దిక్కుమాలిన దినుసులు కలిపి తయారు చేసిన కిచిడీ మింగలేక, ఉప్పు గుప్పించి వండిన ఫెవికాల్లాంటి ఉప్మా తినలేక… స్వాతంత్య్ర నినాదాలు మౌనం పాటిస్తాయి.
ఇక మధ్యాహ్నం… తుప్పు వాసన కొట్టే నీళ్లపప్పు, బొగ్గుముక్కల్లాంటి బెండకాయ వేపుడు, దుబాయ్ ఆయిల్లాంటి సాంబారు, పులిసిన మజ్జిగ! రాత్రి గురించి మాట్లాడుకునే ఓపిక, తీరిక ఒక్కరికీ ఉండవు.
క్రికెట్ బంతి లాంటి మైసూర్ బోండాని పరధ్యానంగా తింటూన్న విశ్లేష్ మెదడులో ఏవో సంభాషణలు రివైండ్ అవుతున్నాయి.
”భోజనం అస్సలు బాగోటం లేదు నాన్నా”
”నేనిప్పటికి నాలుగుసార్లు తిన్నా. చాలా బాగుందే”
”పేరెంట్స్ వచ్చేరోజు మనుషుల కోసం వండిస్తారు…” తను చెబుదామనుకునేలోపే ”అయినా, నువ్వు తింటానికొచ్చావా? చదువుకోటానికొచ్చావా?” తండ్రి ఆగ్రహజ్వాల.
”అరే విస్సూగా… నాకో పేద్ద డౌటురా. మనకిప్పుడు పొట్టలూ పేగులూ లేవుగదా! మరి మనం తిన్నది ఎక్కడికి పోతుందంటావ్?” పక్కనే కూచుని తింటున్న క్లాస్‌మేట్ భూతేష్ ప్రశ్న.
విశ్లేష్ ఏదో చెప్పబోయేలోపే అవతలి పక్క కూచున్న ప్రేతేష్ అందుకున్నాడు-
”పొట్ట విప్పిచూడ పురుగులుండు! అందుకే పొట్టలు తీసేశారు. పదార్థాల్ని ఎముకలు గ్రహించి, కాల్షియం ఫ్యాక్టరీల్ని స్థాపిస్తాయి”
వాడంతే. అద్భుతంగా మాట్లాడినట్లే ఉంటుంది; ఒక్క ముక్క అర్థమైచావదు.
ఉపాహార ఉదారవాదంతో లేని శక్తిని పుంజుకుని కంకాళాలన్నీ బయటికి నడుస్తున్నాయి.
”అరే, ఇవాళ ఎన్ని వికెట్లు డౌన్?” గుంపులోంచి ఎవరో అడిగారు.
”నాలుగు”
”ఎక్కడెక్కడ?”
”నారాయణగూడ బ్రాంచ్ రెండు, వైజాగ్ ఒకటి, కర్నూలు ఒకటి”
ఆ మాటలు వింటున్న విశ్లేష్‌కు విపరీతమైన ఆశ్చర్యం కలిగింది.
తామంతా చర్మమాత్రులుగా ఉన్నప్పుడు ఇలాంటి సంభాషణ నిత్యకృత్యం. తెల్లవారేపాటికి ఏయే బ్రాంచిలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో ఈ శాఖ విద్యార్థులకు సమాచారమందేది. టీవీ చూడనివ్వరు. ఫోన్లు వాడనివ్వరు. పేపర్లూ అంతంతమాత్రమే. అయినా పక్కా లెక్కలందేవి.
ఆత్మహత్యల కారణంగా తమకు అన్యాయంగా చెడ్డపేరు వస్తోందని యాజమాన్య దేవుళ్లు తెగ బాధపడిపోయి, చివరికి కోట్లు వెచ్చించి విదేశాల నుంచి అత్యాధునిక పరిజ్ఞానాన్ని కొనుగోలు చేశారు. దాని సాయంతో పిల్లలందరినీ అస్థిపంజరాలుగా మార్చేశారు.
”అరే, నాకో డౌటు! స్కెలిటన్లు సూసైడ్ చేసుకోవటమేమిటి?” గుంపులోంచే ఎవరో అడిగారు.
”వెర్రి నాగన్నలూ… ప్రతి దానికీ ప్రత్యామ్నాయం ఉంటుంది. న్యూటనుడి మూడో సూత్రాన్ని అధ్యాపకుల కన్నా విద్యార్థులే ఎక్కువగా వంటబట్టించుకున్నారు. అప్పుడవి ఆత్మహత్యలూ… ఇప్పుడివి ప్రాయోపవేశాలూ…” ప్రేతేష్ మళ్లీ ప్రహేళికా భాషలో చెప్పాడు.
అస్థిపంజరాలన్నీ బుద్ధిగా తరగతి గదుల్లోకి నడిచాయి.
కొమ్ములూ కోరలూ పొడుచుకొచ్చిన వింత మానవులు బోధన మొదలెట్టారు.
***
ఆరోజు ఆదివారం. రెండు వారాల తర్వాత మరోసారి మనుషుల్ని చూడబోయే రోజు! అందరికీ తల నిండా సంతోషం. ఉదయపు అధ్యయన శిబిరం ముగియగానే, ఓ యమభటుడు మైకులో గొంతు చించుకున్నాడు.
”జాగ్రత్తగా వినండి. గ్రౌండ్‌ఫ్లోర్‌లోకి వెళ్లేముందు విధిగా ‘డిజిటల్ డిటెక్టర్’ లోంచే నడవాలి. మీ శరీరం మీకు వచ్చేస్తుంది. ఈ బాడీ డిజప్పియర్ టెక్నాలజీ (బీడీటీ) గురించి పేరెంట్స్‌కు చెప్పకండి”
అస్థిపంజరాలన్నీ అంతర్థానమై, విద్యార్థులంతా మనుషుల రూపంలో కిందికి చేరుకున్నారు.
తిరిగొచ్చిన తన రూపాన్ని మురిపెంగా చూసుకుని, పరుగున తన కోసం నిరీక్షిస్తున్న తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు విశ్లేష్. తల్లి గుండెలకు హత్తుకుని, నుదుటి మీద ముద్దు పెట్టింది. తండ్రి నవ్వాడో లేదో కనిపెట్టడం కష్టమైంది.
కుశలప్రశ్నలు క్లుప్తంగా ముగిశాయి. మార్కుల గురించి పోస్ట్‌మార్టం మొదలైంది.
విశ్లేష్ జేబులోంచి ఓ కాగితం తీసి తండ్రికందించాడు. దాని మీద గజిబిజిగా అల్లుకుపోయిన అంకెల్ని తండ్రి గాభరాగా విశ్లేషించుకుంటున్నాడు.
తల్లి తన వెంట తెచ్చిన స్వీట్లు అందించింది.
”పాయసమో పాలతాలికలో చేసి తీసుకురావచ్చు కదమ్మా!” అందామనుకున్నాడుగానీ, తల్లి బాధ పడుతుందని ఊరుకున్నాడు.
”హాయ్ విస్సూ” అంటూ వెనక నుంచి వచ్చాడు శశి. వాడికో స్వీటు అందించాడు విశ్లేష్. శశికి తల్లిదండ్రుల్లేరు. బోల్డంత ఆస్తి ఉంది. మేనమామ చదివిస్తున్నాడు. తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలన్న ప్రేమ తప్ప అతనికి ఇంకెలాంటి మానవీయ లక్షణాలూ ఉండవని శశి తేల్చి చెబుతుంటాడు.
”వీడెవడు? లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు మనీష్ అనేవాడు నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పావుగా?”
”వాణ్ని ఏ1 సెక్షన్‌కు ప్రమోట్ చేశారు నాన్నా” విశ్లేష్ చెప్పాడు.
”అంటే ఐఐటీ గ్యారెంటీ అన్నమాట. మనం మాత్రం ఈ సెక్షన్‌కే అంకితమైపోయి, ఐపీఈని మమ అనిపించి, ఎమ్‌సెట్లో ఏదో అఘోరించి, ఆఖరికి అధ్వానపు కాలేజీలో అమాంబాపతు ఇంజినీరింగ్ కోర్సులో చతికిలబడతావ్. అంతేగా…” మండిపడ్డాడు తండ్రి.
”అదేం కాదు అంకుల్” శశి ఏదో చెప్పబోతుండగా విశ్లేష్ కళ్లతోనే వారించాడు.
ఇద్దరికీ పులిహోర వడ్డించింది తల్లి.
తింటున్నాడన్న మాటేగానీ, విశ్లేష్ మనసు గతంలో గిరికీలు కొడుతోంది.
కాలేజీలో చేరడానికి వచ్చిన రోజు రోహిత్ పరిచయమయ్యాడు. వారం తిరక్కుండానే ప్రాణ సమానమయ్యాడు. కలిసి తినేవారు. కలిసి తిరిగేవారు. కలిసి చదువుకునేవారు. వారాంతపు పరీక్షల్లో మార్కుల సగటు ఎక్కువ ఉందని తనను ఏ1 సెక్షన్‌కు మార్చారు. రెండు నెలలు తిరక్కుండానే స్నేహం ముక్కలైంది. మెస్‌లోనో, క్యాంపస్‌లోనో ఎప్పుడో ఓసారి కలిసేవాడు. హలో అంటే హలో.
మరో నెల తిరక్కుండానే రోహిత్‌ను మరింత కింది సెక్షన్‌కు డిమోట్ చేశారు. లెక్చరర్లు వాణ్ని ఓ పశువులా చూసేవారు. ఈ అవమానభారమే మోయలేక సతమతమవుతుంటే, దసరా సెలవులకు ఇంటికెళ్లినప్పుడు అమ్మానాన్నలు మరింత హీనంగా చూశారు. అంతే, వాడిక మళ్లీ కాలేజీకి రాలేదు. బెడ్ రూములోనే ఊపిరి తీసుకున్నాడు.
సెకండియర్‌లో మనీష్ మంచి మిత్రుడయ్యాడు. ఇంటలిజెంట్ స్టూడెంట్. తన కన్నా మంచి మార్కులు తెచ్చుకుని, ఏ1 కు ఎగిరిపోయాడు. తన సెక్షన్‌లోని శశి స్నేహితుడయ్యాడు.
”సరెసరే, అయిందేదో అయింది. ఇకనుంచైనా బాగా చదువు. ప్రిన్సిపల్‌తో మాట్లాడాను. ఈసారి మంత్లీ టెస్ట్‌లో మంచి మార్కులు తెచ్చుకుంటే, ఏ1కు మారుస్తానని హామీ ఇచ్చాడు” మర్యాదతో కూడిన బెదిరింపులాంటి వార్నింగ్ ఇచ్చాడు తండ్రి.
ఆటవిడుపు సమయం ఆవిరైంది.
తల్లిదండ్రులు ఎప్పుడు వస్తారా అని ఆవురావురంటూ ఎదురు చూసిన చాలా మొహాల్లో ఇప్పుడు ఎందుకొచ్చారా అన్న భావన కొట్టొచ్చినట్టు కనబడుతోంది.
డిజిటల్ డిటెక్టర్ దాటి అస్థిపంజరాలు కాళ్లీడ్చుకుంటూ మళ్లీ శ్మశానంలో అడుగు పెట్టాయి.
***
ఓరోజు దైనందిన శిక్షలన్నీ ముగిసిన అనంతరం, ఆ రాత్రి తన తల తీసేందుకు కారిడార్‌లోకి వచ్చాడు విశ్లేష్. కాకతాళీయంగా ఆకాశంలోకి చూశాడు. ఓ కాంతివలయం తమ కళాశాల భవనం మీద ఛత్రంలా విస్తరించి ఉంది. మనసేదో మేలు శంకించింది. తనవితీరా చూసి, తల తీసేసి ఫ్రీజర్‌లో పెట్టి, నిద్ర పోయాడు.
నిజంగానే ఆ కాంతివలయం కొత్త ప్రిన్సిపల్ శ్రీకాంత్ రూపంలో కిందికి దిగివచ్చింది.
ఆయన వస్తూనే విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. బీడీటీపై బ్యాన్ విధించాడు. దూదుల్లాంటి ఇడ్లీలు, ఊరించే ఉల్లిదోసెలు, పూరేకుల్లాంటి పూరీలు; పసందైన కూరలు, కమ్మటి చారు, గడ్డ పెరుగులతో మెస్ కళకళలాడింది. రెండురోజులు తిరక్కుండానే కళాశాల కళకళలాడింది. రెక్కలొచ్చిన పక్షుల్లా విద్యార్థులు ఉత్సాహంతో ఉరకలు వేశారు.
ఉదయం అసెంబ్లీ పెట్టేవారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. మీటింగ్ హాల్లో ఓ సాయంత్రం పూట విశ్లేష్ పాడిన పాటకు ఆగకుండా చప్పట్లు మోగాయి.
కాలేజీకి వంద మీటర్ల దూరంలో ఖాళీగా ఉన్న ప్రైవేటు స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ఆరోజు మధ్యాహ్నం నుంచి క్లాసులు క్యాన్సిల్ చేసి, క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఎనిమిది పరుగులిచ్చి అయిదు వికెట్లు తీసిన శశి అందరి ముందూ హీరోలా వెలిగిపోయాడు. కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్… పిల్లలంతా ఎవరిష్టం వచ్చిన క్రీడలో వాళ్లు చెమట్లతో తడిసి పునీతమయ్యారు.
”ఈయనెక్కువ కాలం ఉండడు” ఓ లెక్చరర్ అలా ఎందుకన్నాడో విశ్లేష్‌కు అర్థం కాలేదు.
అదే నిజమైంది. మేనేజ్‌మెంటుకు నమ్మినబంటు అయిన ఓ అధ్యాపకుడు అందించిన రహస్య సమాచారంతో రీజినల్ హెడ్ అమాంతం ఊడిపడ్డాడు. పిల్లలందరి ముందే ప్రిన్సిపల్‌పై మండిపడ్డాడు.
”అసలు ఎవడ్రా నిన్ను సెలక్ట్ చేసింది? ఇదేమన్నా రిహాబిలిటేషన్ సెంటర్ అనుకున్నావా? ఎగ్జామ్స్ పట్టుమని నాలుగు నెలలు కూడా లేవు. ర్యాంకులు రాకపోతే నష్టపోయేదెవుడు? రెప్యుటేషన్ దెబ్బతిని, అడ్మిషన్స్ అడుగంటితే అడుక్కు తినేదెవుడు?”
‘శ్రీకాంత్’వలయం అర్ధాంతరంగా అదృశ్యమైంది.
యముడి కజిన్ కొత్త ప్రిన్సిపల్‌గా వచ్చాడు. బీడీటీ మళ్లీ మొదలు. చిత్రవిచిత్ర శిక్షలు. హింస రెట్టింపు. అత్యాధునిక మారణాయుధాల కొనుగోలు.
అస్థిపంజరాల ఎముకల్లోని సున్నం వెలికితీసేందుకు సరికొత్త సాఫ్ట్‌వేర్ ఆవిష్కరణ!
***
”అరే, నాకు బతకాలని లేదు” నీరసంగా అన్నాడు శశి.
వీక్లీ టెస్టులో అతితక్కువ మార్కులు వచ్చినందుకు ఆరోజు మధ్యాహ్నం శశినీ, విశ్లేష్‌నీ లెక్చరర్ బండబూతులు తిట్టాడు. క్లాసులో పిల్లలందరి ఎదుటే తలలు పగలగొట్టాడు. ఆనక ప్రిన్సిపల్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆయన ఇద్దరికీ నరకం చూపెట్టాడు.
”నాగ్గూడా అంతేరా” చెప్పాడు విశ్లేష్.
”ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామా?” శశి కళ్లల్లో చిత్రమైన వెలుగు.
”ఆత్మహత్య కాదురా, ప్రాయోపవేశం అనాలి” సరిచేశాడు విశ్లేష్.
”ఏదో ఒకటిలేరా, మట్టిలో కలిసేదానికి ఏ పేరయితేనేం?”
”అదీ నిజమే. ఇంతకీ ఎలా పోదాం?”
శశి దీర్ఘంగా ఆలోచించి ”వద్దులేరా. బతికే సాధించాలి” అంటూ గదివైపు నడిచాడు.
***
తెల్లారక ముందే ఫ్లోరంతా కేకలతో ప్రతిధ్వనించింది. విశ్లేష్ ఉలిక్కిపడి లేచాడు.
తన పక్క మంచం మీద శశి విగతజీవిగా పడి ఉన్నాడు.
”అర్ధరాత్రి లేచి, ఫ్రీజర్‌లోంచి తల తెచ్చి తగిలించుకుని, బండరాయితో దాన్ని బద్దలు కొట్టుకున్నాడంట” మరణరహస్యాన్ని ఎవడో వర్ణిస్తున్నాడు.
”వీడు గ్రేట్ రా. సూసైడ్‌లో కొత్త టెక్నిక్ కనిపెట్టాడు” వేరెవరో మరణమృదంగాన్ని కీర్తిస్తున్నారు.
”ఫ్రీజర్‌కు డిజిటల్ లాక్ వెయ్యడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని మన బుల్లి రాక్షసుడికి మరణ దండన తప్పదనుకుంటా” ఇంకెవరో శిక్షాస్మృతిని పరామర్శిస్తున్నారు.
విశ్లేష్‌కు ఆ రోజంతా ఎలా గడిచిందో తెలియదు.
రాత్రిపూట తల తీయకుండా పడుకున్నాడు. బుల్లి రాక్షసుడు-2 హెచ్చరించినా లక్ష్యపెట్టలేదు.
రాత్రి భారంగా కరుగుతోంది. విశ్లేష్ మెదడులో సముద్రాల ఘోష. అలల హోరు.
అర్ధరాత్రి దాటుతుండగా లేచాడు. మెల్లగా ఒక్కో అంతస్తూ దిగాడు.
గ్రౌండ్‌ఫ్లోర్‌లో వెనక భాగానికి చేరుకున్నాడు. అస్థిపంజర దేహంతోనే అంతపెద్ద గోడను ఎక్కాడు. అవతలి వైపుకు దూకడానికి మాత్రం చాలాసేపు ఆలోచించాడు. చివరికి ఓ మూలన నీటితో నిండిన తొట్టి కనిపించింది. దబ్బున అందులోకి దూకాడు.
మెల్లగా లేచి, కాళ్ల ఎముకలపై జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టాడు.
వెనక భయంకర భూతాలేవో వెంబడిస్తున్నాయి.
ఫార్ములాలు, క్వశ్చన్ బ్యాంకులు, సింప్లికేషన్లు, ప్రతిభాత్మక మారుపేర్లు, కంపేరిజన్ క్యాంపెయిన్లు, వాష్‌రూమ్ దయ్యాలు, విద్యార్థి ముఠాలు, అధ్యాపకుల వర్గాలు, లేడీస్టాఫ్ ఆరోపణలు, గెస్ట్‌హౌస్ లొసుగులు, డబ్బుకట్టల తరలింపులూ…
అరగంట గడిచేసరికి నగరం దాటాడు. చల్లటిగాలి వీచింది.
మరో గంట నడిచాక, దట్టమైన అడవి ప్రత్యక్షమైంది.
ఎముకల కాళ్లతోనే అందులో అడుగు పెట్టాడు.
చిత్రం! కాళ్లకు చర్మం మొలిచింది.
పరుగందుకున్నాడు. నిండు వెన్నెల్లో దట్టమైన చెట్ల నడుమ పరిగెత్తుతున్నాడు.
చేతులకు చర్మమూ అందులోకి రక్తమాంసాలూ వచ్చిచేరాయి.
పిల్లకాలువలు, చెరువులు దాటి… కుందేళ్ల గుంపు మధ్యలోంచి పరిగెత్తుతున్నాడు.
నడుం నుంచి గొంతు దాకా అవయవాలన్నీ సమకూరాయి. నిగనిగలాడే చర్మం తిరిగొచ్చింది.
గుడిసెలు దాటి… గూడేలు దాటి… మైదానాలు దాటి… కొండకోనలు దాటి… వాగువంకలు దాటి… చెట్టుచేమలు దాటి…
పరిగెత్తుతూనే ఉన్నాడు… స్వేచ్ఛా ప్రపంచంలోకి!
**** (*) ****
రెడ్డి గారు — కథ bhagundhi సర్
========
BUCHIREDDY gangula
Live story in our education system
కృతఙ్ఞతలు
ధన్యవాదాలు సార్.
మంచి కథ రాసారండి. అభినందనలు.
చాలా బావుంది సర్ . ప్రస్తుత విద్య వ్యవస్థలో విద్యార్థుల బాధల్ని బాగా వివరించారు.
Dear Sir
As expected you have presented the current senario regarding culture in coporate colleges.
This is very good message which will bring transformation in presents. A eye open to all the parents who are not able to understand their children mentality and kneen on results.
D. Sumathi
కార్పొరేట్ కళాశాలల చదువులపై పదునైన వ్యంగ్యాస్త్రం. కథనం ఆసక్తికరంగా, విభిన్నంగా ఉంది. ‘కంకాళ శాల’ అనే శీర్షిక ను అదే స్థాయిలో ఉంది. ముగింపులో… స్వేచ్ఛా ప్రపంచంలోకి పరుగుపెట్టే సన్నివేశం కదిలించేలా, కళాత్మకంగా రాశారు!