కవిత్వం

నిన్నటి వెన్నెల

ఫిబ్రవరి 2018

సరిగ్గా గుర్తులేదు
తారీఖూ, కనీసం దాని చేలాంచలాన్ని పట్టుకు వ్రేలాడిన గుర్తేదీ కూడా
ఎంత ఆలోచించినా గుర్తురాదు

అయినా సంవత్సరాంతపు చలిగాలిలో
ఆ పురాతన పరిచయమ్ వాసనేదో గాఢంగా తెలుస్తునే ఉంది

మనిద్దరికి తప్ప ఎవరికీ ఈ రహస్యం తెలియదు కదా
కనీసమ్ అప్పటిలా నువ్వైనా దగ్గరుండి ఉంటే
ఈ చిక్కుముడి త్వరగా విడిపోతుందనిపిస్తుంది

చుట్టూ చూస్తాను
ఈ చీకటిదారిలో
ఆ నల్లని నదుల్లాంటి తోటల్నీ
సగం మెరిసే దారుల్నీ దాటి
నువ్ ఎలా వొస్తావనే అనుమానం కలుగుతుంది
చదువుతున్న కవిత మధ్యలో ఆపేసి ఆలోచిస్తూ అలాగే డాబా దిగి వెళ్లిపోతాను

“రాత్రి చందమామ చాలా పెద్దదిగా కనిపించింది కదా”
అని అందరూ అడుగుతుంటే నేను ఇంట్లో నిద్రపోయానని చెప్పలేక,
అవునంటూ కథలు చెప్పడం మొదలెడతాను.