కవిత్వం

ఒకానొక ప్రాతఃసమయాన

15-మార్చి-2013

చీకటి తిరుగు ప్రయాణమవుతున్నప్పుడు
ప్రాణం పై పేపరు వెయిట్ లా
అప్పటి దాకా అదిమి పెట్టిన
దేహపు ద్రవ్యరాశి మూలకణాలు
పక్కకు దొర్లిపోగానే
పడుకొన్న మంచమే
వంచన చేసి
వరండాలోకి విసిరికొడుతుంది.

ఆపై
కన్నీళ్ళెన్నో కురుస్తుంటాయక్కడ

కానీ
ఏవోకొన్ని
దుఃఖప్రవాహాలకు మాత్రమే
హృదయాన్ని కోతవేసే
ఉరవడి వుంటుంది

ఎందరి బుగ్గలపైనో
చారికలు మొలుస్తాయి
కొందరి హృదయాలపైనే
చారికలు వెలుస్తాయి

ఆ కాసేపు
శతృవు సైతం
మనిషి మంచోడే
మాటే కఠిన మని కితాబులిస్తుంటాడు

జీవం కాలుష్యమేమో
విడిచిన వెంటనే
దేహం పవిత్ర పదార్ధమవుతుంది
వయసుతో నిమిత్తం లేకుండా
వందనాలర్పిస్తుంటారందరు

జీవుడు దేవుడు
ఒకటే అంటాం కానీ
జీవుడు తొలగిన
దేహ దేవాలయానికే
కొబ్బరులు హారతులూ
సమర్పిస్తుంటామెందుకో

చిక్కుబడి తెగి పోగులు పడ్డ
మనిషితనం
మళ్ళీ తీగలుగా మొలకెత్తి
అల్లుకొనే రోజు కోసం

మనిషిని
దేహం చిరునామాగా వున్నప్పుడే
గుర్తించే రోజు కోసం

అందరం ఆశపడుతూనే వుంటాం కాని

మన లోపలికి తొంగిచూసేందుకు మాత్రం
బద్దకిస్తూనే వుంటాం