కవిత్వం

వెళ్తూనే…

29-మార్చి-2013

సూర్యుడా,
విశ్వరహస్యపు ఉత్తరాలు
వెలుగు ఉండలుగా చుట్టి
విసిరివేస్తున్నావు

ఫోటాను పొట్లాలు
విడదీసే వివరాలు
మాకింకా తెలిసిరాలేదు

నీవు మాటల్లోనూ చెప్పేవుంటావు
ఉరుము మెరుపుల జన్మ
ఒక్కసారే అయినా
మెరుపులు వెలిసి పోయాకెపుడో
ఉరుమొచ్చినట్లు-

వినిపిస్తుందేమోనని
నీ మాటల నడకల చప్పుడుకోసం
చెవులు రిక్కించి వున్నాము
కానీ ఎందుకో
నీకూ మాకూ మధ్య
ధ్వని దూరలేని
శూన్యపు గోడలు .

సృష్టి రహస్యం తెలిసిపోకుండా
ఊహలకు కొలతలు వేసేలోపే
ఊపిరిపోతుంటే

లక్షల కాంతి సంవత్సరాల దూరాలు
లక్ష్యాలవుతుంటే

స్తలకాలాల మధ్య సమన్యయం కుదరక
శాస్త్రకారులంతా చేసేదేమీ లేక
భుజాలు మార్చుకొంటున్నారు

పోయున వాళ్ళూ పుడుతున్న వాళ్ళూ
లయబద్ద అలలుగా సాగుతూ

విశ్వరహస్య పరిశోధనల వైపు
పరమ సత్యాల జాడలవైపు
వెళ్తూనే వున్నారు