కబుర్లు

శివరాత్రి, ఆరిఫ్ గాడూ, నేనూ..!

ఏప్రిల్ 2013

ఇంగ రేప్పొద్దున పండగని తెల్వంగనే మా ఇస్కూలు దోస్తులవందరం కట్ట గట్టుగొని సైన్సు టీచర్ రాకపోయేసరికి కితాబులను సంచిలోకి ఎట్టి కిలాసు గలాసు లేదన్నట్టు కూసోని ప్లాన్ల మీద ప్లాన్లు ఏసుకొని గుండం వాడ అఫ్జలు, అర్షద్, డబ్బకాడి అమ్జదు దుదేకుల అఫ్సరు, కాకతీయ కాలని రవిగాడు, ఆరిఫ్ గాడు, ముడ్డబ్బాల కాడి హరి గాడు, ఇంకా నలుగురవైదుగురం ఒక్క ముచ్చటకొచ్చినం రేపు మాత్రం ఫుల్లుగా శివరాత్రి పండుగను పండగ జేసుకొవాల్నని. ఇంకేవుంది రవి గానికి ఆరిఫ్ గానికి సైకిల్ ఉండనే ఉండే ఇంగ నాకేం రంది ఊరంతా తిప్పి ఆల్లే ఇంట్ల పడగొడ్తారు అనుకొని ఇగ నేను గూడ సై అన్న.

ఆ రోజుకూడా రోజులెక్కనే తెల్లారింది. లెక్క ప్రకారం అయితే ఇస్కూల్ లేదు ఇంకో గంటైన పడుకునే హక్కుంది. ఆ హక్కును లాక్కుంటూ మా అమ్మ ఒకటే లేపుడు పండగ పూట ఇంత సేపు పడుకుంటే ఎట్లా అని. ఇంగ సరేనని లేచే సరికి అప్పటికే ఇంటి ముందు ఇంటెనకాల పండగ కళ కొట్టోచ్చింది. మా ఇళ్ళు పేరుకు పేదిళ్ళే అయినా మా అమ్మ సూసుకునే తీరుతో అదోక కళాకండం. భద్రకాళి చెరువు గట్టు కానుంచి చిన్న బకీటు నిండా మా అన్న ఆవు పేడ పట్టుకొచ్చేటోడు.

మా ఇంటెనకాల ఆ మూల నుండి ఈ మూల వరకు ఎంత పెద్ద అడుగులేసిన పదడుగులు తగ్గక పోయేటిది దగ్గర దగ్గరగా పరవాలేదనిపించే విశాలం. ఇంటెనకాల బావి, దానికి ఆనుకొని వేప చెట్టు దాన్ని అల్లుకొని చిక్కుడు చెట్టు మిగిలిన విశాలమైన వాకిలినంత ఊడ్చి పేడతో అలుకు చల్లి అవసరమైన చోట ఎర్ర మన్నుతో నెలలో నుండి పుట్టుకొచ్చిన గోడ మొదల్లో జానెడు మందంతో చక్కగా అలికేది. తెల్లని గోడకు ఆ ఎర్ర మన్ను పట్టితో జరి అంచుచీర కట్టుకున్న కేరళ అమ్మాయిలా అనిపించేటిది. ఇక అలకడంతోనే పని ఐపోయింది అనుకుంటే ఎట్లా గడపలను పసుపుతో పుదించి, అప్పటికి మా గడపలకి రంగు పేంటింగ్ వెయ్యలేదు నా మూరేడుతో రెండింతలుండే గడపే సాక్ష్యం మా అమ్మ సృజనాత్మక కథకి.

అప్పుడప్పుడు నేనేమైన అందంగా వంకర్లు తిరిగిన పూల గుత్తులను పేపర్ పై పరిస్తే దాన్ని ఎవ్వలైన పొగిడితే మాత్రం అదంతా మా అమ్మ చలువే. ఇక అందంగా గడపను బియ్యంపిండి పసుపు కుంకుమలతో చక్కగా పూర్తి చేసి ఇక కన్ను వాకిలి మీద పడేది. వాకిలి తనకో క్యాన్వాస్ మునివేళ్ళు కుంచెలయ్యెవి. సుద్దతో వేళ్ళు సుతారంగా తిప్పుతుంటే సుద్ద నేలను ముద్దాడుతున్నట్టు మా అమ్మ వేళ్ళు నేలకు చెక్కిలిగింత పెడుతున్నట్టు ఆ చేక్కిలిగింతేదో నాకు కలుగుతున్నట్టుండేడిది. మా అమ్మకి రక రకాల రంగులంటే ఇష్టం కచ్చిగా చెప్పాల్నంటే రంగులంటే పిచ్చి. తెల్లగా అల్లుకొని వాకిలి నిండా పరుచుకున్న ముగ్గులో కనకాంబరం, చిలకపచ్చ, ఆకు పచ్చ, నెమలి కంటపు నీలి, లేత పచ్చి పసుపు పచ్చ, నాలికపై మంత్రంవేసినట్టుండే అల్లనేరేడు పండు రంగు, పారాణి, ఇలాంటి రంగులంటే తనకి పిచ్చి ఇష్టం. అవ్వన్నీ కూడా ఆ ముగ్గులో అందంగా ఆకులో ఆకుల ముగ్గునిండా అలుముకుంటే అది నన్ను అదుముకునేది. మా దోస్తులెవరైనా పండగ పూట ఇంటికొస్తే మా ఇళ్ళు చూసి మస్తు పరిషాన్ ఐతుండే ‘పరిషాన్ లో పతంగులు ఎగిరేస్తుండే (తీవ్ర సంభ్రమాశ్చర్యం కలిగినప్పుడు మా దోస్తులమనుకునే ఊత సామెత)’ ఏ పండగైన మా ఇంట్లో రెండు పండగలు ఒకేసారి జరుగుతున్నట్టు ఉండెడిది ఆ ముగ్గుతో.

రేడియోలో శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరశ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః అనుకుంటూ వినిపించే శివాష్టకం తో మొదలయ్యేది నా స్నానం. పండగలోచ్చినప్పుడు గోరువెచ్చని నీళ్ళలో పచ్చని వేపాకు పరుచుకోవాల్సిందే. స్నానం పూర్తి కాంగనే తడి కలిపిన ఊబిది తీసుకొచ్చి నుదుట అడ్డంగా బొట్టు పెట్టేది. అప్పుడు మొదలయ్యేది బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్ జన్మజ దుఃఖ వినాశక లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ శుద్దంగా లీలగా వినిపిస్తున్నా గాత్రానికి అప్పుడే పాపాలని కడిగేసుకొని పునీతుడని అవుతున్నట్టు మది తేలికవుతుండే.. మా అమ్మ ఖచ్చితంగా ఆ రోజు ఒక్క పొద్దు ఉంటుండే.

మేము ఆకలికి ఓర్సుకోలేమని మా కోసం సేమియా పాయసం సగ్గుబియ్యంతో పరమాన్నం అన్నం ఆక్కూర చక్కగా వండిపెడితే పొట్ట నిండుగా తృప్తిగా తినేటోన్ని. మేమెందుకు ఉపవాసం ఉండకూడదనే ప్రశ్నకి మీ అందరి తరుపున నేనొక్కదాన్ని ఉంటున్న ఆ శివయ్య ఏమనుకోడు అనేది. నెమ్మదిగా బయటికొస్తుంటే జంగాయన జోలె పట్టుకొని వచ్చేటోడు పాట పాడుకుంటూ ఏమి సేతురా లింగా ఏమి సేతురా. గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు సేద్దామంటే.. అని కమ్మగా సాగేది. ఆయనతో నాకు మంచి స్నేహం ఆ స్నేహం గురించి పెద్ద కథే అవుతుంది. శివుడి ప్రస్తావన రాగానే ఎప్పుడు నాకు ఈ పాట మెదిలేది ఊహ వచ్చాక శివుడ్ని కూడా లీనం చేయగల శక్తి ఆ గొంతుకలో ఉందని గట్టిగ నమ్మి ఆ గొంతుక ఎవరిదో అని పరిశోధించి ఆ గాత్రానికి దాసుడనయ్య ఆ గాత్రం మరెవరిదో కాదు డాక్టర్ బాలమురళి కృష్ణ గారు. ఈ మధ్య కాలంలో నన్ను వెంటాడే శివ గీతం భరణి గారి ఆట గదరా శివ ఆట గధ కేశవా.. సంగీతం నిజమైన భక్తి తత్వాన్ని మేలుకొల్పుతుందని గట్టిగ నమ్మే వాళ్ళలో నేను ఒకడ్ని.

శివుడి గురించి కథలు కథలుగ ఎన్నో చదివిన మనసుకు ఏ భావన కలగక పోయేటిది ఎందుకో వెయ్యి స్థంబాల గుళ్ళో మాత్రం నాకు తెలీకుండానే ఏవో అంతర్గత ప్రకంపనలు ఉప్పొంగేవి ఆ ప్రశాంత వాతావరణమో లేక ప్రతిధ్వనించే ఓంకార నాధమో లేక కమ్మగా వినిపించే గీతమో ఏమో ఏదో రకంగా మనసు త్రుప్తి పడుతుండే.

ఇంకేముంది చూస్తుండగానే ఆ ముచ్చట ఈ ముచ్చట పెట్టుకొంగానే సాయంత్రం అయ్యేటిది చీకటి బడేటిది. నేనైతే ఆ రోజు ఎదురు చూసేది ఆ ‘సాయింత్రం’ కోసమే. అప్పుడు నెమ్మదిగా నిన్న సైకల్ మీద బుట్టలో పెట్టుకోని అమ్మేటాయన దగ్గర కొన్న కందగడ్డలు సంచిలో నుండి తీసి శుబ్రంగా కడిగి రాతెండి గిన్నలో నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసి గిన్నె నిండుగా కందగడ్డల్ని వేసి మూత పెట్టి కట్టెల పొయ్యి మీద ఉడికించేది. నేను మాత్రం పొయ్యి మొఖం, గిన్నె మొఖం సూసుకుంటూ ఎప్పుడెప్పుడు గిన్నె మీద మూత పొంగుతో గణ గణ మంటదో అని. ఇగ ఉడికిందని తెల్వంగనే నెమ్మదిగా నీళ్ళు వంపి ఇష్టీలు బెషన్లోకి దింపేది.

సుతారమైన పొగలు కక్కుతుంటే దేవునికి దణ్ణం పెట్టి మా అమ్మ ఒకటి రుచి చూసి పొద్దు ఇడ్శేధీ. ఒక్కొక్కరికి చిన్న కటోర(గిన్నె)లో రెండేసి ఇస్తే నేను మా అన్న మా అక్క వరుసగా సంచులు పరుచుకొని సకిలం ముకిలం పెట్టుకొని కూసోని ఓ సరికొత్త రుచిని సంతరించుకున్న మెత్తగా ఉడికిన కంద గూగం నెమ్మదిగా తింటుంటే మనసుని ఎక్కడికో తీసుకెళ్ళేది. కందగడ్డలు తినడం కోసమైనా శివరాత్రంటే నాకు మస్తు ఇష్టం. మా చిన్నమ్మ మాత్రం నూనెలో వేంపి చేసేది అది మరో అధ్బుతమైన రుచి. కాలక్రమేణా ప్రపంచానికి దూరంగా పరిస్థితులని కాలదన్ని తీసుకున్న రెండు నిర్ణయాల్లో ఒకటి ఆత్మహత్య రెండు ఇంట్లో నుండి పారిపోవడం మొదటిది ఎన్నో సార్లు ప్రయత్నించిన ధైర్యం చాలలేదు మనిషికి బతకడానికన్న చావడానికే ధైర్యం ఎక్కువ కావాలని అర్ధమయ్యింది.

ఇంట్లో నుండి పారిపోయి మా పరిస్థితులను చక్కదిద్దేంతటి ధనం మూట గట్టుకొని రావాల్నని ఇంట్లో నుండి పారిపోయి తెలీకుండా బైరాగులతో కలిసి పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు కంద మూలతో, పచ్చి దుంపల్ని ఉడికించుకొని కడుపు నింపుకున్నాం. ఆ తర్వాత మరో సారి ఇక ఎప్పుడు తిరిగి రాకుడదని పారిపోయినప్పుడు వైష్ణవ సాదుగణం తో రాష్ట్రాలు ఊళ్లు పల్లెలు తిరిగినపుడు కూడా ఇలాంటి దుంపలతో చేసిన వంటలతో కడుపు నింపుకున్నాం. తిండికి మించిన నీఘూడ సత్యాలే నను నిలబెట్టాయి ఒక రకంగా చెప్పాలంటే తత్వం తెలియకపోయినా శివ తత్వం కృష్ణ తత్వం నను ఉరి కొర నుండి తప్పించాయి. ఆ ప్రయాణం మిగిల్చిన ఆత్మీయులు ఒక రకంగా ఇప్పటికి నాకు బలం. మనిషిలా నన్ను మిగిల్చింది వారే. జీవితంలో నేను ప్రభావితమైన ప్రయాణంలో ఈ రెండు తత్వాలతో కూడుకున్న తత్వ ప్రయాణం. అదో తెగని పెద్ద కథ ఆ పారిపోవడం ఆ ప్రయాణాలు ఇంట్లో తెలీకుండా చెప్పిన సాకులు. ఇక ఆ కథని కంద గడ్డల్ని అలా ఉంచితే. నెమ్మదిగా జిహ్వను త్రుప్తి పరుచుకుని కంధల్ని పూర్తి చేసుకున్న టైం కి ఇంటి ముందు ఆరిఫ్ గాని చిన్న సైకిల్ బెల్లు మోగేది. అమ్మ నేను గుడికి బోయ్యోస్తా మా దోస్తులందరు వస్తాండ్లు మల్ల మధ్య రాత్రికోస్తా అనిచెప్పి బయటపడేటోన్ని.

ఆరిఫ్ గాని సైకిల్ ముందు హేండిల్ ని పట్టుకొని కూసుంటే ఆడు గాల్లో తీసుకెళ్ళేటోడు నెమ్మదిగా మా సైకిల్ భరత్ గాని మార్వాడి దుఖానం దగ్గర ఆగేది. ఇక నా జేబుల చిల్లర పైసలక్కుడా స్థానం లేదని తెలిసిన ఇషయమే. నన్ను మాత్రం సుసుకునేది ఆరిఫ్ గాడు రవి గాడే. ఇక భరత్ గాని దుకాణం లో రూపాయికి ఒక పొట్లం చొప్పున ఐదారు పెరుగు మూటలు కట్టించుకొని వర్కు సంచిలో ఏసుకొని ఇంకా కొన్ని వర్కు సంచుల్ని బతిలాడి అడుక్కొని బయల్దేరే వాళ్ళం.

వెయ్యి స్థంబాల గుడికి దగ్గరవుతుంటే అందమైన పట్టు చీరలు, కొత్త బట్టలు వేసుకున్న ఆడోల్లు పిల్లలు వాళ్ళను వరసగా నిలబెడుతూ జనం రద్దీని కంట్రోల్ చేస్తూ పోలిసోల్లు రోడ్డు మీద వాహనాలు ఆగకుండా కర్రలతో దబాయిస్తూ ముందుకు పంపించే ట్రాఫిక్ పోలిసోల్లతో కలిసి చుట్టూ విపరీతమైన రద్దీ ఆ సంబరపు అస్తిత్వాన్ని అరిచి మరిచి చెబుతున్నట్టు

మైకు గొట్టం నుండి వినిపించే భక్తి పాటలు ఒగ్గు కథలు బుర్ర కథలు నాటకాల శబ్దాలు. చీకట్లను చీల్చి చెండాడే రంగు రంగుల మిలుకు మిలుకుమనే యమ్ యమ్ ఖాన్ టెంట్ హౌస్ లైట్ లు తోరణాలుగా రోడ్డుకి వీదులకి ఇరుపక్కల. రోజు నా చోటులాగా నా సొంతం అన్నట్టు తెగ తిరిగి ఆడుకునే గుడి ఒక్కసారిగా ఎవరో అక్రమించేసుకొని ప్రశాంతంగా ధ్యాన ముద్రలో లీనమయి ఉండే దేవాలయాన్ని మూకుమ్మడిగా ఊపిరి తీసుకోలేనంత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు ఒక బికర దృశ్యం అక్కడ అలుముకునేది.

ఎట్లో గట్ల లైన్ ల నిలబడి లోపకి చేరుకున్నాం మేము కలుసుకోవల్నని అనుకున్న జాగాలోనే మా దోస్తుగాల్లందరు కూసోని ముచ్చట్లు పెట్టుకుంటాడ్లు. కాసేపు బుర్ర కథ, ఇంకాసేపు నాటకం, ఆ తర్వాత మా బాబాన్న (కొప్పుల రాజేందర్) మిమిక్రీ, ఆయన దోస్తులు పాడే పల్లె పాటలు తల్లి పాటలు ఇనెంత సేపు ఇని కిక్కిర్సిన జనాలను వాళ్ళు అప్పజేప్పుకునే మొక్కులను చూస్తూ గడిపి. అప్పుడు లైన్ లోకి దూరేవాళ్ళం అదే ఆ పులిహోర ప్రసాదం కోసం. నాకని ఒకసారి మా అమ్మకని ఓసారి మా అక్కకని మా చెల్లకని ఎవరెవరి పేరు చెప్పో ఒకటికి రెండు సార్లు లైన్ లో నిలబడి మా కాలి వరకు సంచులని పులిహోరాలతో నింపుకొని నెమ్మదిగా బయట పడేవాళ్ళం.

అక్కడి నుండి సైకిళ్ళ మీద పద్మాక్షమ్మ గుట్ట కాడ రావణాసురుణ్ణి పేల్చే జాగకు చివరన శివాలయం ఉంది. అక్కడకూడా ఆ రోజే ఏ రోజు లేనంత ఎక్కడ లేనంత జనం. మా కన్ను మాత్రం కొబ్బరికాయలు కొట్టే నంది దగ్గరే తలో కొబ్బరి చిప్ప జెజిక్కిచ్చుకొని సంతోషంతో బయటికొచ్చి ఇక నెమ్మదిగా చల్లని గాలులతో పద్మాక్షి గుట్ట మీదకెక్కి చీకట్లు అలుముకున్న సిటీ మధ్యలో అక్కడక్కడ మిలుకు మిలుకు మంటూ వెలుగుతున్న వీధి దీపాలను చూస్తూ తల కొంచెం పులిహోర నెమ్మదిగా తింటూ కాసేపు సేద తీరేవాళ్ళం. చర్చి లో కేకు, మసీదు లో మిటాయి, గుళ్ళో పులిహోర ఇదే అప్పట్లో మాకు తెలిసిన మతం. పులిహోర ఒక్క దఫా పూర్తి చేసి అందరి జేబుల్ల పైసలు లెక్క బెట్టుకొని ఇక టాకీస్ మీదకు ఎగబడడం. మేము సూడకుండా మిస్సయిన సినిమాలని ఒక్క పెట్టున రాత్రంతా సోలుగుతూ కండ్లు నలుచుకుంటూ ఒకటే సూసుడు మధ్య మధ్యన పులిహోరలో పెరుగు ముద్దా వేసుకొని ఒక్క బుక్క పులిహోర అంచుకు కొబ్బరి ఇగ జూసుకో పండగే పండగ. సినిమా ఐపోడమే ఆలిస్యం వీధులన్నీ సైకిళ్ళ మీద బలాదురుగా తిరుగుతూ శివరాతిరికిన్యాయం జేశేటోళ్ళం..

మొన్న పొద్దున్నే అమ్మ ఫోన్ చేసింది లేచినవా? స్నానం జేసినవా అవ్వ ( మా అమ్మ నాలో వాళ్ళ అమ్మని చూసుకుంటుంది అందుకే ప్రేమగా నన్ను అవ్వ, కన్నా అని పిలుచుకుంటది) ఇయ్యాల అసలే శివరాత్రి. అని చెప్పేంత వరకు కూడా తెలిలేదు ఆ రోజు పండగని. మనిషిని పరిస్థితులు ఎంతగా చుట్టు ముట్టి మనల్ని మనలోనే తప్పిపోయేలా చేసాయో అర్ధమయ్యింది. ఒక ప్రశాంతమైన పరిస్థితినుండి అందమైన జ్ఞాపకాలనుండి ఆధ్యాత్మిక చింతన చేతన నుండి ఎంతో దూరం నెట్టుకున్నానని స్పష్టంగ తెలిసొస్తుంది. మా దోస్తు వైష్ణవ సాధువు చెప్పిన మాటోటి గుర్తొచ్చింది. పరిస్థితులు ఎప్పుడు మన మీద కన్నేసి ఉంచుతాయి.

మనకు తెలీకుండానే మనసును మాయ ప్రాపంచికంలోముంచేస్తుంది. ఎంతటి విపత్తు వచ్చిన మనసెప్పుడు బ్యాలెన్స్ గ ఉంచుకుంటూ ఎప్పుడు భగవత్ చింతనలో అతి సాధారణమైన జీవన విధానాన్ని అలవరుచుకొని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయాలని. అది నేను చేయట్లేనని చేయలేని బద్ధకంలో కూరుకు పోయానని కూడా ఇప్పుడు మరింత స్పష్టంగా తెలిసోస్తాంది.