కబుర్లు

నేను పోగొట్టుకున్న కొన్ని సంబరాలు…!

ఫిబ్రవరి 2013

పూర్తిగా ఆవహించిన చీకట్లో వెలుగుతున్న ముసలి దీపం ముందు పెట్టుకొని మట్టి నేలపై సంచి పరుచుకొని పుస్తకాలను ముందేసుకొని, ఇక అన్నయకి తెలియకుండా తన తెల్ల నోటు బుక్కులోనుండి చింపుకున్న ఓ మూడు జంట కమ్మలు నెమ్మదిగా మడతలు పెడుతూ అరచేయి సైజు లో కత్తిరించుకొని పెన్సిల్ తో తోచిన బొమ్మలు గీయడం మొదలుపెట్టా.  ఓ ముప్పై వరకు తయారయ్యాక ఒక్కో బొమ్మకి పక్కన వదిలిన ఖాళీస్థలం లో నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు మీ నేస్తం రఘు అని రాసి రేపటికి సిద్ధంగా ఉంచుకోనేవాన్ని.

ఎంత ఇంగ్లీష్ పండగైన మా బోటి పిలగాండ్లందరికి చిన్నపాటి పెద్ద పండగే.. అప్పటికి ఇంట్లో కరెంటు లేదు. మా అన్న చేతికుండే నంబర్ల గడియారంలో పన్నెండు పడగానే తెలిసేది హ్యాపీ న్యూ ఇయర్ వచ్చిందని. నాకు ఊహ వచ్చేవరకు గ్రీటింగ్ కార్డులు కొన్న దాఖలాలు ఎంతకి లేవు. ఎప్పుడు నేను చేతితో గీసిన బొమ్మలే పంచేవాన్ని.
ఈ నూతన సంవత్సరం మనందరి జీవితాల్లో వెలుగుని ప్రసాదించాలని కోరుతూ అనే వాక్యం మా ప్రిన్సిపాల్ మేడమ్ గారు ప్రతి ఏడు మాకందించేవారు. ఎన్నో ఏళ్ళకి గాని మా ఇంట్లోకి కరెంటు వెలుగు రాలేదు. చిత్రం ఏంటో గాని మా అమ్మ తయారు చేసే ఒత్తి దీపాలు గొప్ప నేస్తాలు. ఎప్పుడైనా గాజు దీపం కొనడానికి చౌరస్తా కెల్తే నా సంబరం అంబరాన్ని తాకేది. కొత్త సంవత్సరం వస్తే ఇంట్లోకి చిన్న పాటి కిరోసిన్ గాజు దీపాలు కొనేది. అందులో ఒక దీపం తప్పనిసరిగా నాదే. వెలుతురిని ఎక్కువ తక్కువ చేసే వీలు గల చిన్న చక్రం కడ్డితో తెగ ఆటలాడే వాణ్ని. గాజు గోడల గదిలో బంది అయిన ఆ చిన్ని దీపం చమ్కీల ముసుగులో ముస్తాబైన పెళ్లి కూతురులా సిగ్గు పడుతున్నట్టుగా ఉండేది. పాపం ఆ సిగ్గులు నా కంట పడకుండా గాజు గోడలు ఆపలేకపోయేవి ఎలా ఆపుతాయి వాటికి మా అమ్మ మసి పట్టనిస్తేగా….
అప్పట్లో మా దోస్తుల్లో కొందరికి చీకటంటే భయం. చీకట్లో దయ్యాలు ఉంటాయని, పీడ కలలోస్తాయని, నాకూ చీకటంటే భయమే బాపు తాగోస్తాడని. కాని నిద్ర పుచ్చే అమ్మ ఒడిలో ఆ భయం కూడ బలాదూర్. నాకు తెలిసి మనిషిని మించిన దయ్యం కాని, దేవుడు కాని లేడని నా నమ్మకం. అందుకేనేమో ఏ దయ్యం కథలు నన్ను భయపెట్టలేక పోయేవి.
అన్ని రోజులకన్న ఆరోజెందుకో ఎవరు లేపకుండానే మెలకువ వచ్చేది. లేచి చూసే సరికి అమ్మ అక్కయ్య రంగు రంగుల ముగ్గులేస్తూ దర్శనం ఇచ్చేవారు. యదావిధిగా స్నానాలు కానిచ్చి చక్కని పోడి బట్టలు తొడుక్కొని పుస్తకాల బ్యాగును భుజాన వేసుకొనే టైం కి చిన్న గిన్నెలో రాత్రి బాపు తెచ్చిన బాదుష మిటాయి కొద్ది కొద్దిగా తింటుంటే ఇది అసలు న్యూ ఇయర్ అంటే అనిపించేది అంత తీయగుండేది. ఇక చక చక స్కూలుకి బయల్దేరడమే ఆలస్యం ఎదురుపడే నా బోటి పిల్లలంతా ఒకటే చెప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని. దానికి థాంక్యూ విష్ యూ ద సేమ్  అని నేను… స్కూల్ కి చేరుకోగానే ఆ రోజు స్కూల్ లో యే  టీచర్ బెత్తం పట్టుకోదు. దానికి తోడు ఆరోజు ఒక్క పూటే ఇంకేం ఇక మాదే లోకం అన్నట్టు ఒకటే అల్లరి.  ఒకరికొకరం గ్రీటింగులు ఇచ్చిపుచ్చుకున్నాక అప్పుడు తీసుకోచ్చేది మా ఆయా క్రీమ్ బిస్కెట్లు, స్కూల్ బెల్లు మోగడమే ఆలస్యం కట్ట గట్టుగొని పిల్లలమంతా వీదిలన్ని నడుచుకుంటూ స్కూల్ వొదిలేసిన మా పాత టీచర్ల ఇళ్ళకు పోయి కలిసేవాళ్ళం. తిరిగి తిరిగి మ్యూజికల్ గార్డెన్ కి గాని, సినిమాకి గాని, జూ పార్క్ కి గాని వెళ్ళే వాళ్ళం.
రాను రాను రంగు రంగు బొమ్మల గ్రీటింగ్ కార్డులు రాజ్యమేలడం మొదలవడంతో అసలీ నూతన సంవత్సరం ఎందుకోస్తుందా? అని బాధ పడిన సందర్బాలు కూడా ఉండేవి. అందరు నాకు తీసుకొచ్చేవారు గ్రీటింగ్ కార్డు లు. నాకు ఏం చేయాలో తోచక తెల్ల కాగీతం మీద అందంగా వారి పేరు గీసిచ్చేవాన్ని. అది నాకు చిన్న తనంగా అనిపించినా రాను రాను అవే పేర్లు టీచర్ల దగ్గర ప్రిన్సిపాల్ మేడమ్ దగ్గర మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ రకంగా చూస్తే ఏమి లేని బీదరికం కూడా ఎంతో ఆనందాన్ని మిగుల్చుతుందని అర్ధమయ్యింది. ఇంట్లో ఎప్పుడైనా బొమ్మలు గీసుకుంటూ కూర్చుంటే మా బాపమ్మ మా అమ్మ చూసిమురిసిపోతుండే. ఆ తరువాత తరువాత న్యూ ఇయర్ వస్తుందంటే చాలు నాకు స్కూల్ లో వీధిలో మస్తు గిరాకి దాదాపు ఒక యాబై పై చిలుకు పేర్లు రాసేవాన్ని ఊరికే మాత్రం కాదు అప్పటి నేను గీసిచ్చే బొమ్మల ఖరీదు రెండు రూపాయల నుండి ఐదు రూపాయలవరకు ఉండేది వచ్చిన మొత్తంతో గ్రంధాలయం రుసుము కొత్త కథల పుస్తకాలు, కొన్ని నెలలకు సరిపడా పోస్ట్ కార్డులు నా సంచిలో ములిగేవి..
కాలంతో పాటే సంబరాలు కూడా మారుతూ వచ్చాయి దానితో పాటే నేను కూడా..
పోస్ట్ కార్డుల కాలానికి తెర దింపుతూ ప్రత్యక్షమైన టెలిఫోన్ బూత్ లు, వాటి దాటుకుంటూ ఇంటర్నెట్ లు, జేబులో సెల్  ఫోనులు. మార్పు ఊహించిందే వెలుగు కూడా ఊహించిందే అయిన అర్ధం కానిదొక్కటే ఇతరులకి నేను దూరమవుతున్నానా, లేక నాకు నేనే దూరమవుతున్నానా ప్రతి ఏడు దేహాన్ని వెలుతుర్లోకి పంపిస్తూ నేను ఒంటరిననే చీకట్లోకి నెట్టుకుంటున్నాన ఏమో.. వేటికుండే అస్తిత్వం వాటిదే కాలంతో పాటు దేహాన్ని దొర్లించిన మనసు మాత్రం ఎప్పుడు గతం తాలుకు కొండచారికల్లో ఊగిసలాడుతూ ఉంటుంది. ఆనాడు దాచుకున్న గ్రీటింగ్ కార్డులు తడిమితే చాలు ఏదో తెలియని ఆలంబన, ఏదో తెలియని ఆప్యాయత ఒక్క సారిగా ఆ మనసుతో నా మనసు పెనవేసుకున్న ఆనందాల నావ కనులముందు ప్రత్యక్షమై గిలిగింత పెడుతుంది.
పిచ్చి మనసుకు ఎంత ఆరాటం గడిపినంత సేపు తెలీదు రాబోవు కాలాలకు అవొక అమృత గడియలని.
న్యూ ఇయర్ అంటే ఇప్పటికి నాకిష్టం.
ఇంట్లోకోచ్చే కొత్త చిమ్ని దీపాలు. బాపు తీసుకొచ్చే బాదుష మిటాయి. అమ్మ అక్కయ ఇంటి ముంగిట్లో, వెనక వాకిట్లో వేసే రంగు రంగుల ముగ్గులు. స్కూల్ లో పెట్టె క్రీమ్ బిస్కెట్లు. మా బాపమ్మ కొనిచ్చే నిమ్మ చాక్లేటు. ఎక్కడో దూరాన మిత్రులు పంపే జ్ఞాపకాల లేఖలు, కొత్త సినిమాలు. ఓహ్ నెమరు వేసుకున్న కొద్ది ఎన్నెన్ని జ్ఞాపకాలో..