కబుర్లు

పోయిన ఉగాదికి…

మే 2013

నేను పుట్టక ముందే మా పాలోల్లాయన కొత్త కుండని సైకిల్ మీద పట్టుకొస్తుంటే దేనికో తగిలి పగిలిందంట. కుండ పగలటంలో సోధ్యం ఏముంది. అని ఎవ్వలైన అనుకుంటారు కాని గక్కడ్నే మొదలయింది ముచ్చటంత. ఆ కుండ పగలడం సంగతి జూషినోల్లు చెవులు కోరుక్కోవడంతో నిమిషంలో గల్లి గల్లంత పాకింది.

ఒక్కో ముసలోడు ఒక్కో మాట అన్నాడు. అమ్మమ్మలు, అమ్మలక్కలంత అయ్యో అయ్యో అన్నారు. గిదంత కాదు గాని పంతులు దగ్గరికి పోతేనే ఏం జేయాల్నో ఎర్కైతది అనుకొని కుల పెద్దలంత కలిసి పంతులు గార్ని కలిసి జరిగిన ముచ్చటంత అప్పజెప్పిండ్లు. నొసలు చిట్లించి ఏవో బొక్కులు ముందేసుకొని తిరిగేసి తిరిగేసి ఒక్క ఇషయం తెగేసి సెప్పిండు. ఇంగ మీ మందాటోల్లు ఉగాది పచ్చడి చేసుకునేడిదే లేదు. ఎవ్వలైన సేసుకుంటే అందరికి అరిష్టం అని చెప్పిండు. ఇది జరిగిన శాన ఏండ్లకి నేను బుట్టిన కాబట్టి ఇది నా చేతిల లేని సంగతైంది. నాకు అర్ధం కాదు గాని కుండ అనక పగలదా? పగలగొట్టినోడు అందరికి తెలిసేలా ఎందుకు పగలగొట్టిండు? పగిలితే పగిలింది గాని గీ పచ్చడ బంధు వెట్టడం ఏందో నాకైతే అస్సలు సమజ్ గాలే… అందరింట్లో ఏందో గాని ఉగాది పండగొస్తుందంటే గీ పచ్చడి గురించి కనీసం ఒక్క సారైనా మా అమ్మతో లొల్లి బెట్టుకునేటోన్ని.

తెల్లారగట్లల్ల లేచినవెంటనే గదే గా రాఘవేంద్ర రావు సినిమాలో లాగ పడుకున్న మా పక్కల నిండ, ఇంక నా మీద వేప పువ్వు రాలేది. ఎంతగా రాలేదంటే నేనే వేప పువ్వు పరుపులో పడుకున్నట్టుగా అనిపించేటిది. ఎంతైనా ఎండా కాలం, ఇంట్లో కరెంటే లేంది పంక యాడికెల్లివొస్తది? గందుకే ఎండాకాలం అంత ఇంటెనకాల వేపసెట్టు కిందే మా పక్కలు. వేప పువ్వు రాలుతుందంటే పండగ దగ్గర పడ్డట్టే..

గింతంత గాలి తగుల్తే సాలు గుప్పెడు పువ్వు రాలేది. రంబులో, గోలెంలో, బకిట్లో ఆడ ఈడ అని తేడా లేకుండా యాడ బడ్తే ఆడ ఒకటే పడుడు. మా అమ్మకి వాకిలి ఊడ్వలేక యాష్టకోచ్చేది గాని నాకు మాత్రం మస్తు సంబరంమయ్యేది. రేడియోలో మౌనమేలనోయి అనే పాట వస్తుంటే చెట్టు కేసి మౌనంగా సూస్తుండేవాన్ని. చెట్టు నుండి పువ్వు విడిపోవడమే ఆలిస్యం నేల మీద పడకుండా అందుకోవా ల్నని ఎంత ఆరాట పడేవాన్నో..

పొద్దున్నే లేచి వేపాకు కలిపిన గోరెచ్చని నీళ్ళు తల మీద నుండి పడుతుంటే ఆ హాయి మాటలకు అస్సలు అందదు. రెండు నిండు బకీట్లు ఐపోయినంక కూడా కోరిక తీరక పోయేటిది. అమ్మ చూసిందంటే ఇక అంతే జ్వరం వస్తదని బలవంతంగా ఆపేసి తల తుడిచేది. పండగ గద తెల్లారగట్లే లేచి మా అమ్మ, అక్కయ ఇంటి పనుల్లో పడేటోల్లు. మా బాపు పొద్దున్నే వరంగల్ కి పోయేటోడు కొత్త సంవత్సరం కదా ఆల్లు పనిచేసే దుకానాలకి వెళ్లి మావిడాకు పెట్టి పూజలు చేసుకొని పొద్దునే మళ్ళీ ఏడెనిమిది గంట్లకి వచ్చేటోడు. వస్తు వస్తు తెల్లని సంచినిండా మావిడాకు కుక్కుకొని తెచ్చేటోడు.

ఇగ నేను, మా అన్న ఆగకుండా మా అన్న నా కన్నా కొంచెం పొడుగు కాబట్టి నిల్చొని దర్వాజకు ఆ మూలనుండి ఈ మూల వరకు చిక్కగా మావిడాకు పెడ్తుంటే. నేనేమో ఇంకో ధర్వాజకి కుర్చేసుకొని పెట్టెటోన్ని. మా బాపు గోడెక్కి వేప కొమ్మ మీద నిల్చొని లేత మండల్ని పువ్వు రాలకుండా జాగర్తగా సుంచి కిందకు వేస్తుంటే మా ఇంటి సుట్టు పక్కనున్నోల్లందరు మా ఇంటెనకాల లైను కట్టేటోల్లు. దగ్గర దగ్గర పది పదిహేనిండ్లోల్లందరు వేప పువ్వు వేపాకు మండలు పట్టుకుపోయేటోల్లు. మావిడాకు పెట్టడం పూర్తయ్యాక ప్రతి ధర్వాజకు రెండు దిక్కుల వేప మండలను చక్కగా చిక్కియ్యడం తో ఇగ మా పని అయిపోయేడిది.

మాకెట్లాగో పచ్చడి బాగ్యం లేదు. ఆ సంగతి నా కన్నా ఎక్కువ మా ఇంటి సుట్టు పక్క ఉన్నోల్లందరికీ ఏర్కైన సంగతే. ఇగ ఆల్లందరు చెంబుల కొద్ది పచ్చడి తెచ్చి ఇచ్చేటోల్లు. మా హన్మకొండలో ఉగాది పచ్చడి పచ్చి పులుసు లాగ, చారు లాగ చేసేటోల్లు. ఒక్కో ఇంటిది ఒక్కో రుచి మా ఇంట్లో పచ్చడికి ఇక లోటే లేనంతగా అందరు తెచ్చిన పచ్చడి సగం అడ్డ నిండేడిది. మనమసలె జిహ్వ ప్రియులం. పెద్ద గిలాస నిండుగా దగ్గర దగ్గరగా ఓ పది గిలాసులు పైనే తాగేటోన్ని. ఏంటో తాగినప్పుడల్లా ఆరు రుచుల్లో ఏదో ఓ రుచి జివ్వుమనిపించేది.

అమ్మ అక్కయ ఉడికించిన శనగ పప్పు, బెల్లం రోట్లో కచ్చ పచ్చిగా దంచి సన్నటి రొట్టెలు చేసి ఒక రొట్టె మధ్యలో రోట్లో దంచిన పప్పు బెల్లం ముద్దని పెట్టి దానిపై ఇంకో రొట్టెతో అతికించి సన్నటి బచ్చప్పాలు చేసి డాల్డా తో పెనం మీద కాల్చుతుంటే ఎక్కడో కూసున్న మా బాపు మా అన్న నేను దిగ్గ దిగ్గ అడుగులేసుకుంటు పొయ్యి దగ్గరకొచ్చి కూచొని ఎప్పుడెప్పుడు రికాబులో వేసి ఇస్తుందా అని అవురావురని చూస్తూ కూసునే వాళ్ళం.

ఇక నా కోసం రికాబులో రెండు బచ్చాలు పెట్టి, గ్లాసు నిండా పచ్చడి పోసి ఇస్తే నెమ్మదిగా ఇంటెనక వేప చెట్టు కింద సంచి పరుచుకొని కూసోని ఒక ముక్క బచ్చప్ప ఒక గుటిక పచ్చడి అలా కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తుంటే అబ్బ ఆ మాజా అనుభవించినోడికే తెలుస్తది. ఆ మజా నుండి బయటపడనీకి ఆ ఉగాది ఒక్కరోజు అస్సలు సాలదు.

పొట్ట ఫుల్లుగా నిండిన తరువాత కాయిదంలో ఓ పది బచ్చాలు దాక చక్కగా పొట్లం కట్టిస్తే. అది పట్టుకొని నెమ్మదిగా కొత్త అంగి కొత్త ప్యాంటు వేసుకొని నున్నగా దువ్వుకొని కొత్త ప్యారగాన్ చెప్పులు వేసుకొని టప్పు టప్పు అని శబ్దం చేసుకుంటూ.. టప్పు టప్పు అని శబ్దం చెయడానికి వెనక ఓ రహస్యం ఉంది. ఎందుకంటే ఆ సౌండుకు అందరి చూపు నా కాళ్ళ మీదే పడి నేను కొత్త చెప్పులేసుకున్నానని తెలుస్తుందని. గప్పట్ల మా దోస్తానలో ఆళ్ళ అడుగులు సౌండు విని ఎవరోస్తున్నారో గుర్తు పట్టేటోల్లం.

అడుగులో అడుగేసుకుంటు గల్లీకి అటు పక్కన ఇటు పక్కన అందరిండ్ల ధర్వాజలను మావిడాకు తోరణాలను ముగ్గులను చూసుకుంటూ చూసుకుంటూ ఆరిఫ్ గానింటికి చేరుకుంటోన్ని. ఆల్లమ్మ చేతిలో బచ్చాలు పెట్టి ఆడు నేను ఫిలిప్స్ టూ ఇన్ వన్ టేప్ రికార్డర్ లో సజ్జద్ అలీ, అత్తవుల్లః ఖాన్ పాటలు ఆస్వాదిస్తూ ఆళ్ళ తెల్ల నవారు మంచం లో వెల్లికల పడుకొని కాలుమీద కాలేసుకొని ముచ్చట పెట్టుకుంటు గడిపేటోల్లం.

ఏ పండగకైన మా చిన్నమ్మ వాళ్ళింటికి పోతే మాత్రం మా చిన్నమ్మ మమ్మల్ని సూసుకునే తీరు పండగ జరుపుకునే విధానం నాకు మస్తు ఇష్టం. ముల్కనూరు నుండి కొత్తకొండ చేరుకొని, అక్కడినుండి ధర్మారం. గ్రామం లోపలికి చేరుకోవాల్నంటే మూడు కిలోమీటర్ల నడక ప్రయాణం.

ఆ గ్రామం మొత్తం కూడా చాల పద్దతిగా ఒక వైపును పూర్తిగా కొండలు ఆక్రమించుకొని, ఆ కొండలపై బారులు తీరిన ఊడలతో కూడిన పెద్ద పెద్ద వృక్షాలు కమ్ముకొని చిక్కటి అడవిలా తోస్తే. ఆ ఆడవి మొత్తం మాదే అన్నట్టు రక రకాల జంతు పశు పక్ష్యాదుల రాజ్యం. మరో వైపంత పచ్చని పంట పొలాలు, అక్కడక్కడ నీటి తూములు, చిన్న చెరువు, ఇవన్ని కాదన్నట్టు పెద్ద పెద్ద బోరు బావులు. ప్రతి పొలం గట్టుకు ఆనుకొని చిన్న పాక. పాక పక్కన దూలంకు కట్టేసి పెట్టిన ఆవులు, ఎడ్లు, గేదెలు, పొలం గట్లకు కొండకు మధ్యన చిన్న మట్టి బాట. బాటకు ఇరువైపులా జామాయిల్, మామిడి, వేప, తుమ్మ, తాడి, మర్రి, శివశింతకాయ, చెప్పుకుంటూ పోతే తెగలేనన్ని పేర్లతో ఉన్న చెట్లు.

ఆ పల్లె మొత్తం మీద గట్టిగ లెక్క పెడితే యాబై ఇండ్లు ఉంటె ఎక్కువ. రేపు పండగ అనంగా మేము గియ్యాల్నే పోయేటోల్లం. తెల్లార గట్ల కోడి కూయక మునుపే మా చిన్నమ్మ లేచేది. ఇల్లు ఇంటి చుట్టూ పక్కన ఊడ్చి అలుకు చల్లల్నంటే రెండు మూడు గంటల పైమాటే ఇంకా ముగ్గుల సంగతి చెప్పేడిది ఏముంది.

నేను మా చిన్నమ్మ కొడుకులు ఇద్దరు తమ్ములని వేసుకొని పొలం గట్లని ఏలడానికి పోయేటోల్లం. చిన్నమ్మ వాళ్ళ ఇంటి ముందే రెండెకరాల శెలక అందులో ఒక్కోసారి ఒక్కో పంట. పత్తి, కంది, బబ్బెర, పొద్దు తిరుగుడు పోయినప్పుడల్లా ఏదో ఒక పంట గాలికి వయ్యారంగా ఊగేటిది. పొద్దు తిరుగుడు పంట గనక ఉంటె ఇగ సూసుకో పొద్దంతా ఆ పొలంలోనే.. ఆ గ్రామంలోని పంట పొలాల్లో, పండ్ల తోటల్లో మనసుకు అందని ఏదో వింత మర్మం దాగి ఉండేది. దానిని చేధించేందుకు యోగిలా సాగేది నా పరిశోధన. ఒక్కో సెకను ఒక్కో ఆకు మీద. లతలా పెనవేసుకున్న తీగల అందం ఓ లయలా నన్ను అల్లుకునేవి. విచ్చుకునే ప్రతిపువ్వు రంగులు నాపై చిలికిన భావం. వర్షం పడితే పాదాలు పరుగులు తీసేవి బంగారు రంగు బురద తూములోకి. పోటా పోటిగా అందరు కలిసి అమాంతం గాల్లోకి లేపి చాతి వరకు మునిగేటి ఆ బురద తూములోకి విసరడం. వీస్తున్న ఈదురు గాలులు విసురుతున్న వర్షం. అల్లరిగా సాగే బురద ఆటలు. ముక్కు పుటలను అదరగొట్టే పచ్చి వాసనకు బుక్కల కొద్ది మింగేయ్యాలన్నంత రుచి బురద మట్టికి చేరేది. ఎలాగో తినలేను కాబట్టే చీల్చుకుంటూ చీల్చుకుంటూ మునుగుతూ తేలుతూ బురదని ఆస్వాధించెవొన్ని.

తల పైకెత్తి పడుతున్న వర్షపు బాణాలు జివ్వు మని గుచ్చుతున్న కళ్ళు తెరిచి నీటితో మునిగిన ఆ నీలాకాశాన్ని తనివి తీర చూడాలని ఎంత తాపత్రయమో. ఒక్కోసారి తూఫాను వేగాన్ని సైతం చేతులు చాచి అక్కున వాటేసుకునే టోన్ని. ఆకాశం నేల నిండా మునిగి పచ్చని సముద్రపు అల నను అమాంతం ముంచేస్తున్న తలపు.
ఏంటో అనుభవిస్తున్నప్పుడు ఆ క్షణమే శాశ్వతం ఎందుకో ఎప్పటికి ఆ క్షణం లోనే ఉండిపోవాలని పిచ్చిగా కోరుకునేవాన్ని..

చిన్నమ్మ వాళ్ళింటి వెనకాల మధ్యలో పెద్ద చింత చెట్టు. దాని మొదట్లో కట్టెల పొయ్యి. ఆ చెట్టు చుట్టూ విశాలమైన వాకిలి. ఆ వాకిలికి ఆనుకొని లెక్క లేనన్ని ఆకు కూరలు కాయగూరలు పూల చెట్లు, పది పన్నెండు కోళ్ళు, ఒక కుక్క దాని పేరు మల్లేశం. దానికి తోడు రెండు పిల్లులు. ఇవ్వన్ని కుటుంబ సభ్యులు. ఇవేనా కాదు మెరిగలు వేసి పిలిస్తే లెక్కలేనన్ని పిచ్చుకలు పక్కకొచ్చి వాలి ముచ్చట పెట్టుకునేటివి.

ఆ గ్రామంలో ప్రతి ఇంటి ముందు రెండు లేక మూడు నీటి గోలాల్లో ఎప్పుడు నీళ్ళు నింపి పెట్టె వాళ్ళు. నాకు ఊహ తెలిసాక తెలిసిన విషయం ఏంటంటే ఆ గ్రామంలో లెక్కలేనన్ని ఎలుగుబంట్లు. ఒకటో రెండో చిరుతలుండేవి. ఎండాకాలంలో అవి నీళ్ళకోసం ఇళ్ళలోకి వచ్చేవని. కొండెంగ కోతులు మాత్రం నన్నెప్పుడు భయపెట్టేవి. ఇవేనా ఇప్పుడు జూ పార్కు లో చూస్తున్న రకరకాల జంతువలన్ని కూడా స్వేచ్చగా మా ముందే బారులు తీరి కేరింతలేసేవి.

బాబాయి కొత్త కుండ, పచ్చడి సామాను పట్టుకొస్తే చిన్నమ్మ పచ్చడి చేసే పనిలో పడితే అమ్మనేమో బచ్చప్పాల పనిలో పడేది. బాపు, బాబాయి ఓ పక్కన మంచం ఏసుకొని ముచ్చట పెట్టుకుంటుంటే, అమ్మ చిన్నమ్మ, నేను, అక్కయ్య, తమ్ముళ్ళు అందరం బచ్చప్పాలు తినుకుంటూ మస్తు బిజీగా ఉంటుండే. మా అన్న మా బాపమ్మ పక్కన కూసోని ఊరు కథలన్నీ మంచిగా ఇనేటోడు..

ఏంటో పాయలు పాయలుగా ఆలోచనలన్నీ సుదూర తీరాలన్నీ చుట్టేసింది.గతించిన అనుభూతుల జ్ఞాపకాల మూటను మరో సారి విప్పడానికైనా… కనీసం నెమరు వేసుకున్నకొద్ది తీగలా అల్లుకుపోయే తెగలేనన్ని ఆనందాల గుర్తులను గుర్తు తెచ్చుకోడానికైనా… ఇలాంటి పండగలు అవసరమే. పండగ చరిత్ర దేవుడెరుగు ఆ పండగ రోజుల్లో ముడిపడిన విషయాలే నాకు తెలిసిన చరిత్ర.

పట్నం ఏలడానికొచ్చిన ఇన్నాళ్ళకి, ఇప్పటికి కూడా నాకు ఉగాదంటే ఇష్టమే ప్రతి పండగకి ఏదో ఒక ఫేస్ బుక్ ఫ్రెండ్ ఇంట్లో హాజరు పడాల్సిందే.. కొత్త ఆనందాలకు నాంది పలకాల్సిందే.. గడిపిన రోజు మరో యుగానికి చరిత్రగా మిగాలాల్సిందే… ఇగో గిదే నేను అనుభవించి, అనుభవిస్తున్న పండగ ముచ్చట.