కథ

గజల్

జూలై 2013

‘అప్పటికే ముగ్గురొచ్చారు. దాని ఒళ్ళంతా నీరసంగా ఉంది బాబు. అది చిన్న పొల్ల ఏదో పొట్ట కూటికే మా తిప్పలు గాని, దాని ఒళ్లమ్మి మిద్దెలు కట్టాలని నాకు లేదు నాయన. ఈ పొద్దుకు దాన్ని వొదిలెయ్..’
‘లేదండి నేను తనని ఇబ్బంది పెట్టను. కాసేపు తనతో మాట్లాడి వెళ్తాను.’
‘సరే అది పడుకుంది. అదో ఆ గదిలో..’
మక్కా పావురాలు ఇక్కడదాక వస్తాయి కాబోలు. గోడలు మొత్తం రెట్టలమయం. పాతికపైనే గురుకు గురుకుం అంటూ గూన పెంకుల చివర కొనలను, బట్టలారేసే దండాలను తాపీగా ఆక్రమించేసుకొని, నైజం ఆనవాలని కొద్దో గొప్పో చాటి చెప్తూ, శిధిలానికి చేరువలో, నవీనానికి దూరంలో, రెండంతస్తుల మేడలో, రెండో అంతస్తు చివరన కుడి వైపున ఉన్న చిన్నగదిని, ఆ గదికి వచ్చి పోయే వాళ్ళను చూస్తూ, వాటిలో అవి చెవులు కొరుక్కుంటూ తెల్లని నల్లని బూడిద రంగు కపోతాలు…

ఆ గదికి ఇరుకు కారిడార్ గుండా నడుచుకుంటూ చేరుకున్నాను. లొకు లొకు మనుకుంటున్న రెండు రిక్కల తలుపును నెమ్మదిగా తెరిచా. గుప్పు మంటూ మగత వాసనకు ఘాటుగా మత్తు గొలిపే అత్తరుతో పాటు అగరొత్తుల రోత. అప్పుడే ఒక యుద్ధం సద్దుమణిగినట్టు నిశ్శబ్దం. నాలుగు మూలల గదికి రెండు కిటికీలు, తాతల నాటి బల్లను పాన్పు సిద్దం చేసి దాని మీద రెండో మూడో ఒకదాని మీద ఒకటి పరిచిన దూది పరుపులతో ఆ పాన్పు మరింత మెత్తగా ఉంటుందని చూడగానే అర్ధమైయ్యింది. ఆ గదిలోని మగత వాసన తన ప్రతాపం ఇంకా చూపుతూనే ఉంది. మంచం చుట్టూ సన్నని దోమ తెర, పరుపు మీద మఖ్మల్ చద్దరు, ఒక గలీబు, రెండు ఎర్రని కుచ్చుల దిండ్లు, గదిలో ఒక మూల బట్టలు పెట్టుకునే రెక్క ఊడిన పాత అల్మారా..

ఇరుకిరుకు గల్లీలల్ల ఉన్న ఇళ్ళలోకి కిటికీల గుండా ఎంత ప్రయత్నించిన మిట్ట మధ్యానం కూడా వెలుతురు తక్కువే.. రెండు కిటికీల గుండా సన్నగా వీస్తున్న గాలికి చమ్కీలతో అల్లుకున్న పల్చని తెరలు సుతారంగా ఊగుతున్నాయి. ఒక కిటికీ వైపుకు నడిచా ఆ కిటికీ ఊచల గుండా కొంచెం దూరంలో నా వైపే ప్రశ్నగా చూస్తూ నిల్చున్న చార్మినార్. దానిచుట్టు విస్తరించుకున్న ప్రపంచం. సూర్యాస్తమయం వెలుగులో చక్కగా కుంచెతో గీసిన పెయింటింగ్ లాగ తోస్తుంది. ఎవరిదో ఘజల్ నెమ్మదిగా ఈ గాలి మోసుకొస్తున్నట్టుంది.
తెర మాటున పరుపుపై సేదతీరుతున్న పాలవర్ణ రాజహంస. పాపం అలసట నిండిన మత్తుతో ప్రపంచాన్ని మరిచి సేద తీరుతోంది. ఎప్పుడూ నిండైన బుర్కాలోనే చూసిన నాకు కేవలం ఓ పలుచని తెర మాత్రమే అడ్డుగా కప్పుకొని ఇలా తన దర్శనభాగ్యం కలుగుతుంధనుకోలేదు. వివస్త్రై ఎదురుగా పరుచుకున్న శిల్పం కన్నా అమాయకత్వంతో కూడిన తన రూపమే నన్ను కట్టి పడేసింది. ఇంకా చెప్పాలంటే తన కళ్ళే నన్నింత దూరం లాక్కొచ్చాయి.

బుర్కా మాటున మెరిసిన ఆ కళ్ళే ప్రతి రోజు కలవరపెట్టాయి. తర్వాత గాని తెలిసింది. ఆ కళ్ళను కలిగిన తాను ఇప్పుడు గల్లీలో అవసరాన్ని తీర్చే తెల్లని మాంసపు ముద్ద. నిజమే ఇప్పుడు తన మనసుకు శరీరానికి సంబంధం లేని ఓ అచేతన స్థితికి చేరుకున్న ఒక యోగిని. తన అనుకున్న ఈ సమాజం కావలిసినంత క్షోభ కొన్నేళ్ళుగా మనసుకు వడ్డిస్తూనే ఉంది. కన్నీళ్ళు కూడా కరువై ఇంకా తళతళ మెరుస్తూనే తన అమాయక రూపం. ఆ రూపం తనదేనన్న స్పృహ కూడా తనకు లేకుండా పోయింది కాబోలు లేక దాచుకోడానికి తనకంటూ ఇంకా ఏమి మిగలలేధనుకుంటూ ఒంటి మీద నూలు పోగైన లేకుండా తనను నిండా ముంచేసిన కాలంలో సేద తీరుతోంది.
చాల సేపు తననే చూస్తుండగా నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అవే నయనాలు. ఒక్క క్షణం నాలో ఆనందం. అదే క్షణంలో తను నన్ను చూసి, చూడనట్టుగా మొహం చిట్లించి నిట్టూర్చింది.

‘పొత్తి కడుపులో నెప్పి ప్లీజ్ ఇప్పుడు నా వల్ల కాదు’ అని దీనంగా అంది.

‘ఛ! ఛ! నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఐ యాం సారీ నేను వెళ్ళిపోతాను మీరు హాయిగా పడుకోవచ్చు.’

ఏంటో నా భాష కొత్తగా ఉందనిపించిందో లేక అంత దూరం వచ్చి విషయానికి పనికిరాని వాడిలా మాట్లాడుతున్నట్టు అనిపించిందో ఏమో ఒక సెకను నన్ను చూసి మళ్లీ కళ్ళు మూసుకొని నిద్ర లోకి జారుకుంది. పక్కనున్న చెద్దరిని తన మీదకు పరిచి తన జుట్టు నిమిరి వెనక్కి తిరుగుతుంటే నా చేయి పట్టుకొని

‘థాంక్యు అర్ధం చేసుకున్నందుకు’ అని చెప్పి చెద్దరి నిండా కప్పుకుంది.
ఒక్క నిమిషం ఏమి అర్ధం కాలేదు. ఎన్నో ఏళ్లుగా నేనెదురు చూస్తున్న స్పర్శ ఇదేనేమో. తన మనసును పరుచుకున్న దేహానికన్నా మరేదో నన్ను ఆకర్షిస్తోంది.

తన దేహాన్నే కోరే వాన్నతే. ఈ రోజు కాకపోయినా ఏదో ఓ రోజైన
నా చెంతకు చేర్చుకోడానికైన, తన చెంతలోకి చేరడానికైనా, సమాజం కాని, కట్టు బాట్లు కాని మా ఇరువురి మతం కాని ఏవి అడ్డుగా లేవనే చెప్పాలి.

తాను ఇప్పుడొక సర్వం తెలిసిన జ్ఞాని, తత్వం ఎరిగిన సాధువు, సమాజాన్ని సొంత బిడ్డలా క్షమిస్తూ తనకు తానుగా క్షీణిస్తూ అమృతాన్ని పంచుతున్న దేవత. అవును దేవతే..

ఎన్ని నిఖాలు చేసుకున్నా.. నిఖాలతో, డబ్బుతో ఎందరికో సొంతమైన వారెవ్వరికి అర్ధమవ్వని దైవత్వం ఒక్క స్పర్శలోనే నాకు తెలిసొచ్చింది. బహుశ తనపై నేను ఏర్పరుచుకున్న ఊహొ, భ్రమో, లేక మితిమీరిన నా ఆలోచనో ఏమో..
నెమ్మదిగా అడుగులు బయటికి వేస్తూ, రెండు తలుపుల్ని మూసేస్తూ, మెట్లు దిగి చీకటిని ఆహ్వానం పలుకుతూ, గల్లీలన్ని దాటుతూ, మిరుమిట్లు గొల్పుతున్న చుడి బజార్ వీధులగుండా చార్మినార్ చుట్టూ నాలుగు చెక్కర్లు కొట్టి మక్కాలోకి అడుగు పెట్టా..
పావురాలు గుంపులు గుంపులుగా పోటా పోటిగా నేల వాలుతూ ఆకాశానికెగురుతూ ప్రపంచంతో పనిలేనట్టుగా ప్రశాంతంగా తమ ప్రవక్తల సూక్తులతో ఆనందంగా కాలం గడుపుతున్నాయి.

నా ఆలోచనలు మాత్రం ఇవేమీ పట్టనట్టు వదిలి వచ్చిన నా మనసు చుట్టే తిరుగుతున్నాయి.
చీకట్లకు పోటిగా మిరుమిట్లు గొలిపే విద్ధ్యుత్ కాంతిలో మెరిసిపోతున్న చార్మినార్. బాషతో సంబంధం లేకున్నా మతాలకతీతంగా నేను గడిపిన ఇన్నేళ్ళలో ఈ చోటు నాదేనన్న చిన్న గర్వం. సమాజానికి దూరంగా వెలివేసుకున్నానని కాస్త భ్రమలో ఉన్నా, నా భ్రమ భ్రమేనంటూ నా చుట్టూ చేరే రద్దీ.

ఆ మరుసటి రోజు ఉదయం తనే అవును నిజంగా తనే నిండైన బుర్ఖాలొ నెమ్మదిగా నడిచి వెళ్తోంది.
ఎందుకో తాను నాకిప్పుడు పరిచియమున్న అపరిచితురాలు. పరిచయానికి నోచుకోకుండా వెనుదిరిగిన అభాగ్యున్ని. తనకి నేనుగా ఎదురుపడేందుకు ఈ క్షణంలో నేను పడుతున్న ఆరాటం అంత ఇంత కాదు. తనని అంటిపెట్టుకునే నాయనమ్మ తప్ప తనకంటూ ఎవరు లేరు. అందుకే ఎప్పుడు కనిపించినా ఒంటరిగానే కనిపిస్తుంది.

నా ఎదురు పడబోతోంది. ఇంకాసెపట్లో… అవునూ చూసిందా?.. చూసే ఉంటుంది.!
యస్ చూసింది. నా కళ్ళు కూడా తన కళ్ళని డీ కొన్నాయి. ఇవేమీ తెలినట్టుగా, ఏమి జరగనట్టుగా ఆ కళ్ళతోనే చిన్నగా నవ్వింది. నవ్వుతూ నా పక్కనుండే వెళ్తోంది. తన వైపుకు జరుగుతూ నెమ్మదిగా చెవిలోకి తొంగి
‘మీ తోడు రానా మీకు అభ్యంతరం లేక పోతే..’
‘తోడు రాగలవనే నమ్మకం ఉందా..? అంత ధైర్యముందా..?’
సూటిగా నేను ఊహించని సమాధానం తన నోటి వెంట. తను తెలుగు ఇంత బాగా మాట్లడగలదని నేననుకోలేదు. నేనింక తనని అలానే చూస్తూన్న, మళ్ళీ తానే..
‘తోడొచ్చి ఏం చేస్తావ్? మహ అయితే ఓ పూట గడుపుతావ్ అంతేగా..’ అనుకుంటూ హుందాగా ధైర్యంగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళింది..
ఏంటో నిజమే నేనలా అడగడంలో తను అలా అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కాని, కాని ఏదో ఓ చిన్న ఆనందం. ఇది కల కాదుగా నేను కోరిన సుందరాంగి నాతో మాట్లాడింది. నేను భావించినట్టు తానేమి చిన్న అమ్మాయేమి కాదని, తన మాటల్లోని తాత్వికత, ధైర్యం తన పరిపక్వతను తెలుపుతున్నాయి.

యధావిధిగానే ఆ రోజు సాయంత్రం కూడా తనని మళ్ళీ చూడాలనిపించి వెళ్ళాను. ముసలావిడ చేతిలో కావలసినన్ని డబ్బులు పెట్టి లోపలికి వెళ్ళా.. మొదటి రాత్రికి సిద్దమయ్యినట్టు, గదిని అలంకరించి పరుపు మధ్యలో నైజం పరిపాలనలో రాజ నర్తకిలాగ నృత్యానికి సిద్దమైనట్టు మొహం కనపడకుండా చున్నీ కప్పుకొని పచ్చని ముత్యాలు పొదిగిన గాగ్రా దుస్తుల్లో పొందిగ్గా కూచుంది. గది బయట నుండే తెరిచిన తలుపుని నా వేళ్ళతో రెండు సార్లు కొట్టి శబ్దం చేసాను. తన మేలి ముసుగు నుండే
‘తెరిచిన తలుపు ఆపడానికి కాదు ఆహ్వానించడానికే’ అంటూ ఉర్దూలో మాటలు.

లోపలికి అడుగుపెట్టా మేలి ముసుగును తీస్తూ..
‘మీరా.. రండి’ అంటూ తెలుగులో ఆహ్వానించింది.
నను చూడగానే పరిచయమున్న వ్యక్తిలా
‘ఏంటి నిన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా.’
‘లేదండి నేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించాలి.’
‘సరే అలా కూచోండి.’ అనుకుంటూ వెళ్లి ఒక్కొక్కటిగా తన ఒంటి మీద దుస్తులను విప్పేస్తోంది.
‘ఒక్క నిమిషం ఆగండి. కాసేపు ఇలా వచ్చి కూచోండి.’
ఉక్కులు విప్పడం ఆపేసి చున్ని కప్పుకొని వచ్చి పక్కన కూచుంది.
‘ఏంటండి విషయం? మీలో విషయం లేదా? ఈ పనికి మీరు కొత్తా? లేక ఖంగారు పడుతున్నారా?’
‘అలా కాదు. ఈ పని చేయడానికి రాలేదు. మీతో మాట్లాడాలని వచ్చా.’
‘మాట్లాడడానికి డబ్బులెందుకిచ్చారైతే?’
‘ఇప్పుడు కాకపోతే.. ఇక్కడ కాకపోతే నేనేక్కడా మీతో ఇంత ఫ్రీగా మాట్లాడలేను కదండి.’
‘నాతో మాటలేం ఉంటాయి?’
‘చాలా ఉన్నాయి.’
‘ఏంటో చెప్పండి.’
‘ఈ రోజంతా నాతో గడపండి చాలు.’
‘నీ ఒక్కడితో గడిపితే పాపం మిగతా వాళ్ళంతా అభాగ్యులైపోతారేమో..’
‘నాతో ఈ ఒక్క రోజు గడిపితే వారినంతా ఎప్పటికి అభాగ్యులను చేస్తాను.’
ఫక్కు మని నవ్వి.. `మీరేమన్న కవులా కవిత్వం వల్లిస్తున్నారు.’
‘నేను కవిని కాను నీతో గడపాలనుకునే సాధారణ అభాగ్యుణ్ణ.’
‘ఏంటి నన్ను ప్రేమిస్తున్నారా..? ప్రేమిస్తే గనక విరమించుకోండి నాకు నాలుగేళ్ళనుండి ఎంత మంది ప్రేమికులో నాకే తెలీదు.’
‘అదే నాలుగేళ్ల క్రితం నిన్ను కలిసుంటే నేనొక్కన్నే నీ శాశ్వత ప్రేమికున్ని అయ్యేవాణ్ణేమో..’
‘మాటలకేం ఎన్నైనా బావుంటాయి.’
‘మీరు మనిద్ధరిని కలవని ఆ నింగి నేల తో పోల్చుతున్నారు.
నేనేమో తీరం సాగరంతో పోల్చుకుంటున్నాను.
నన్ను నమ్మక పోవడానికి మీకుండే కారణాలు బోలెడు.
మిమ్మల్నే తల్చుకోడానికి నాకున్న ఆశలు కూడా ఎక్కువే..
అయినా పర్వాలేదు తలుపులు తెరిచారుగా ఎలా గడిపితేనేమి మీతో గడవడమే నాక్కావలసింది.’
‘సరే బాబు నన్ను ఇప్పుడేం చెయ్యమంటావ్?’
‘కాసేపు మీ ఒళ్లో తల వాల్చుకుంటాను.’

ప్రేమగా తన నడుం చుట్టూ నా చేతులను పెనవేస్తూ తన ఒళ్ళో తల వాల్చుకున్నాను. ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్న లాలనలో నాకు నేనుగా పునీతున్నయ్యానేమో.. ఏదో తెలియని ఆప్యాయతను అమాంతం అల్లుకున్న భావన.
క్షణ కాలం తరువాత విచ్చుకున్న పుష్పంలా, కరిగిన మంచులా, మగాడిపై కరడుగట్టిన తన మనసు వెన్నలా కరుగుతున్నట్టనిపించింది తన చేతిని నా జుట్టు పై ఉంచి నెమ్మదిగా నిమురుతుంటే…
‘మరీ ఉత్త అమాయకులుగా ఉన్నారే.. నేనేమి నీ తల్లిని కాదు.
నువ్విలా పొదుముకొంటే ఆప్యాయతని లాలనని అందించడానికి.
నేనొక జీవమున్న బొమ్మని, మనసు చలించడం మరిచి చాల కాలమయ్యింది.
అప్పుడప్పుడు నాకు మనసనేది ఉందా అని కూడా డౌట్ వస్తుంటుంది.’
‘ఏమో నండి నాకు మీ మీద ఉంది కామం కాదు. నేను కోరుకుంటోంది మీ దేహం కాదు.
కామం తీర్చడానికి మీలాంటి దేహాలు నేను తిరుగుతున్న గల్లీల్లో కోకొల్లలు.’
‘మరి ఆ కోకోల్లల్లో ఆప్యాయతను పంచె వాళ్ళని వెతుక్కోలేక పోయారా..!’
‘మనసు మిమ్మలనెందుకు కోరుకుందో సరైన నిర్వచనం నాకే చెప్పలేదు.
ఇక మీ ప్రశ్నకు నేను ఏం చెప్పగలను.
ఒకటి మాత్రం నిజం మీరు నాతో జీవితాన్ని పంచుకోలేక పోయినా
నేను మాత్రం జీవితాంతం నీ సాంగత్యాన్ని కోరుకుంటున్నాను.
నేను చెప్పే విషయం మీకు అర్ధమైన కాకపోయినా
నేను బతికున్నంత కాలం తెరిచిన గది తలుపుల్ని, తెరుచుకోని మది తలుపుల్ని తడుతూనే ఉంటా..’
ఆ మాటతో జుట్టు నిమరడం ఆపేసింది.

‘అందరు నన్ను మోసం చేసినట్టు మిమ్మల్ని నేను మోసం చెయ్యలేను. కాలం చెదిర్చిన ఈ మోడును వదిలెయ్యండి. అల్లా నాకిలా రాసిపెట్టాడు. ఇదిలా జరగనివ్వండి నన్నొదిలెయ్యండి. నా కన్నా అందగత్తెని, అమాయకురాలిని, మంచి పిల్లని చూసుకొని పెళ్లి చేసుకోండి. తన ప్రేమలో లీనమయి నన్ను ఎప్పుడు మరిచిపోతావో నీక్కూడా తెలీదు.’
‘కావచ్చు కాని నేను పంచుకోవాలనుకున్న జీవితం నీతో.. ‘ అంటూ ఈ సారి తనని మరింత దగ్గరగా తీసుకున్నా.
‘ఇలా వాటేసుకున్న ప్రతి ఒక్కడు జీవితం గురించి వేదాంతం వల్లించే వాడే.’
‘ఏమో నువ్వు చెప్పేది నిజమే కావచ్చు. ఇంతకు ముందే అన్నానుగా నన్ను నమ్మక పోడానికి నీకు బోలెడు కారణాలు. నీ ప్రవర్తన, నీ మాటలు, నీ సంజాయిషీలు, నీ సలహాలు అన్ని నేను ఊహించినవే. కాని వీటన్నిటికి అతీతం నేను ఎంచుకున్న నిర్ణయం.’
‘ఏమో బాబు నీతో ఇక ఏమి మాట్లాడను. నాకు తెలిసినంత వరకు మగాళ్ళందరికీ నా దేహంతోనే పని. ఏది నటనో, ఏది నిజమో లెక్కలేసుకునే రోజుల నుండి ఎప్పుడో దాటి పోయాను. ఒక్కసారి నాతో పడుకున్నాక అందరికి తమ తమ సొంత జీవితాలు, సమాజం, కట్టుబాట్లు, కుటుంబం, గౌరవం, బాధ్యతలు.. అన్నీ.. గుర్తొస్తాయి. తప్పు చేసానని ఎవరికి వారు అల్లా ముందు మోకరిల్లి క్షమాపణ కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కాకపోయినా మీక్కూడా నాతో గడిపాక ఏదో ఓ రోజు వీటిలో ఏదో ఒకటి తప్పక గుర్తొస్తుంది.’

అంటూ వడి వడిగా అన్నీ విప్పేసుకొని నా మీదకు చేరి తన బిగి కౌగిల్లో మెత్తగా వాటేసుకుంది. తెల్లని పాలపుంతలో చల్లని కొలనులో కమ్మగా సేద తీరుతున్నట్టు నన్ను నేను మరిచిపోయా. ఒకరినొకరం పెనవేసుకుంటూ ఎక్కడికెక్కడికి ప్రయాణం కట్టామో గుర్తే లేదు. మా ఇరువురి నడుమ దాగిన యుగాల దూరం క్షణాల్లా కరుగుతున్నది. తనది నటనే కావచ్చు, తనకిది సహజమే కావచ్చు, కాని తెలియని ఈ ఆనందం ఆప్యాయత నా కళ్ళని చెమర్చాయి. ఎందుకో గట్టిగా ఏడవాలనుంది. నా ఏడుపు బాష తనకు అర్ధం కాకపోతే నేనొక వెర్రిబాగులోడ్ని.
గడుస్తున్న గడియారపు గంటలు కాలాన్ని వెనక్కి నెడుతుంటే నేను మరింతగా తనలోకి నెట్టుకున్నాను. ఈ క్షణంలో నేననే అస్తిత్వం అంతమయ్యి తన అణువణువుతో లీనమయ్య.. ఓహ్.. నిజంగా తాను దేవతే!
సుధీర్ఘ ప్రయాణం తరువాత అలిసిన నా దేహంపై వెచ్చగా తాను సేద తీరుతోంది. తానిప్పుడు నా కంటికి కామం తీర్చిన కన్యలా కాదు. నా లాలనకై, నా ప్రేమకై, నా రక్షణకై అలమటిస్తున్న పసిపాపలా ఉంది. నా ఈ పసిపాపకు నేనున్నానని ఎన్నడు అర్ధమవుతుందో..

***

చల్లనిగాలి కిటికీ తెరలను, దోమ తెరను ఊపుతోంది. తెల్లగా తెలవారినట్టుంది. వెలుతుర్ల తాకిడితో నెమ్మదిగా గది చీకట్లు తొలిగాయి.. చల్లగాలి ఏమి కప్పుకోని దేహాన్ని జివ్వుమనిపిస్తోంది. నెమ్మదిగా కళ్ళు తెరుచుకుంది.
‘అనుకున్నట్టుగానే మాయమైపోయాడే..’ అనుకుంటూ వెకిలి నవ్వుతో బట్టలు తొడుక్కొని అద్దం ముందు తన రూపం చూసుకుంది. చాల రోజుల తరువాత ఓ అమాయకుడు దొరికాడు. వాడు అమాయకుడేంటి ఇంకాసేపు మాట్లాడితే మాటలతోనే నన్ను తన వశపరుచుకునే వాడేమో.. అయినా ఎందుకో క్షణ కాలం అతను నా పై చూపించే ఆరాధనకు మాటలు కరువయ్యాయి. రోజు ప్రతొక్కడితో అనుభవించిన నరకంతో పోలిస్తే ఇతన్ని కాస్త మెచ్చుకోవచ్చు. ఏ నెప్పీ తెలీకుండా ఎంత సుకుమారంగా ఓ పువ్వులా చూసుకున్నాడు. పాపం అమాయకుడే.. నా గురించి అన్నీ తెలిసినా నా చుట్టూ ఏమి జరగనట్టు ఎంత ప్రేమగా అల్లుకున్నాడు. ఇలాంటి అమాయకుణ్ణి మోసం చేస్తే అల్లా నన్ను క్షమించడు..

కిటికీ వద్దకు చేరుకొని వీస్తున్న చల్లగాలిని ఎదురుకుంటు దానిలో లీనమవుతోంది. తన సొగసైన కురులు గాలికి రెప రెప లాడుతున్నాయి. ఎవరో వెనక నుండి వచ్చి ప్రేమగా లోతుగా వాటేసుకున్న ఊహకు తను చెదిరిపోయింది. ఏంటి? ఏమైంది నాకు? మగ పిశాచులకు అర్పించుకున్న నా ఈ దేహానికి ఇన్నేళ్ళలో ఎన్నడు కలగని స్పందనలు ఇప్పుడేంటి కొత్తగా..! నా భ్రమ? లేక మరేంటి? ఇంత కాలం చెరిపించుకున్నధి చాలు. ఇంకా చెరుపుకోడానికి మిగులున్నది ఏముంది.?

అల్లా… ఇప్పటి వరకు నువ్వు చూపించిన, నువ్వు గీసిన జీవితాన్ని నవ్వుతూ సహించడం నేర్చుకున్నాను. మనసనేదే లేకుండా మొద్దుబారించుకున్నాను. దాంట్లో మళ్ళీ స్పందనలు రేపకు..

వీస్తున్న చల్లగాలికి అడ్డుపడుతున్నట్టు కిటికీని బలంగా మూసింది. ఎప్పటిలాగే రెండో కిటికీకి అనుకోని ఉన్న తాను రాసుకుంటూ కూచునే బల్ల వద్దకి వెళ్లి కూర్చుంది. అక్కడి పుస్తకాల్లో, వస్తువుల్లో మార్పు వచ్చింది. అటు ఇటు వెతికి చూసింది. తాను రాసుకునే నోట్సు లు అక్కడ లేవు తాను చదివే కితాబులు కూడా లేవు. కిందేమైన పడ్డయా అనుకుంటూ అటు ఇటు వెతుకుతోంది. ఆ వెతుకులాటలో చిన్న రాయి బరువుని మోస్తూ గాలికి రెప రెప లాడుతూ ఒక కాగితం కనిపిస్తోంది. నెమ్మదిగా చేతిలోకి తీసుకొని చదవడం మొదలు పెట్టింది.

ప్రియమైన రిజ్వాన గారికి
మీతో గడిపిన ఇన్ని వేల క్షణాల్లో ఒక్కో క్షణానికి ఒక్కో జీవితకాలం రుణపడి ఉంటాను.
మీ కారణాలు మీవి నా కోరికలు నావి.
నేను మీకు కామాంధుడిగా కనిపిస్తే అది సమాజం చేసుకున్న దురదృష్టకరం.
దోసిళ్ళ కొద్ది మీరు చేసుకుంటున్న దువాలతో నా కోరికని కూడా జత చెయ్యండి.
ఏమో అల్లా నా కోరికను మీతో చెప్పించుకోవాలనుకుంటున్నాడేమో..
అన్నీ తెలిసిన నువ్వు నీ ఆడతనాన్ని ఎందుకు చంపుతున్నావు.
నిన్ను నువ్వు చంపుకునే హక్కు నీకు కాని ఆ అల్లాకి కాని లేదు.
అందరు నటిస్తున్నరనుకుంటున్నావ్. చిత్రం ఏంటంటే నిన్ను నువ్వు చంపుకుని నీ ఒంటితో నీకు సంబంధం లేనట్టు నటిస్తూ బతుకుతున్నావు.
నా కంటితో చూడు.. కప్పుకున్న కొద్దీ పెరిగే ఆడతనం నీ సొంతం. అందుకే నువ్వు విప్పుతున్నా నిన్ను కట్టుకోమన్నాను. అందరు నీ దేహానికి దాసులవుతారు అన్నావు. నేను నీ ఆడతనానికి దాసుడ్నయ్యా..
నీ మనసు గొంతు పిసికి అనుక్షణం దాన్ని చిత్రవధ చేస్తున్నావు. ఇక నేను దాసుడని అవడానికి ఇంకా మిగిలింది కేవలం నీ ఆడతనమే.
ఇలా నలుగురితో పడుకొని డబ్బు కోసం చేస్తున్నాననే భ్రమలో ఉన్నావు. కాని నీదో అర్ధంకాని స్వార్ధం. నువ్వు చేస్తున్న పని నువ్వు ప్రేమించే అల్లా కూడా మెచ్చడని తెలిసినా నువ్వు చేస్తున్నావంటే పాపం అల్లాకే కాదు. నాక్కూడా నీ మీద జాలితో పాటు నవ్వు తెప్పిస్తోంది.
నిజం చెప్పనా..
నీ కోసం పరితపిస్తుంటే నీ కళ్ళకి నేనొక వెర్రిబాగులోన్ని.
నిన్ను ఆరాధిస్తున్ననంటే అది నా ఖర్మ అని వదిలేస్తావు.
అందుకేనేమో వేడుకోడానికి మాటలు, ఎదురు చూడడానికి కన్నులు సరిపోవు.
జీవితానికి సరిపడా జ్ఞాపకంతో మదిని నీ మందిరం చేసుకున్నానంటే నాలో నీకో ఓ అమాయకుడే కనిపిస్తాడే తప్ప నేను కనిపించను.
నీవు రావని, నాతోడు ఉండలేవని, అర్ధం చేసుకోడానికి నా మనసెంత కలత చెందిందో తెలపడానికి పాపం నువ్వు రాసుకునే ఘజల్ లో కూడా పదాలు లేవేమో..
అవును నేనో పిచ్చి వాణ్ని.
సమాజం నన్ను వెలివేసినా నీ తోడు కోరుకునే పిచ్చివాణ్ని.
సమాధాన పరుచుకోలేని వెర్రివాణ్ని.
నీకు అర్ధం కాని నీ వాణ్ని..
మనసులో నీ జ్ఞాపకం.
చేతిలో నీ పుస్తకం.
రెండు జడలతో దిగిన నీ ఫోటోతో సెలవు..

ఇట్లు
గౌతమ్.

చేతిలో కాగితం ఇంక రెప రెపలాడుతూనే ఉంది. ఇంత కాలం నిశబ్ధంలోనే గడిపిన తనకి అదే నిశ్శబ్దం ఈ క్షణం ముల్లులా గుచ్చుతోంది.. ఏకాంతం అర్ధం కాకుండా ఉంది. తనకు తానుగా ఎందుకిలా మారిందో ఆలోచించుకోలేని దీనస్థితిలోకి చేరుకుందని తెలుస్తోంది..
ఏంటో చిత్రంగా మనసులో చిన్నగ ఒక బాధ మొదలయ్యింది.
కనీసం అది కన్నీరవడానికి కూడా ఆ బాధకి భయం వేస్తోంది.
అతను పలికిన ఆడతనపు మాటలు నిలువునా కాల్చుతున్నాయి.
కారణాలు అనేకమే ఏ కారణానికి కూడా సరైన నిర్వచనం లేదు.
ఎందుకిలా ఇంత మొండిదాన్నయ్యాను?
కోపం నా మీదా? లేక నన్ను మోసం చేసిన వారి మీద?

వాడుకుని వదిలేస్తున్న ఈ దేహం మీద? లేక నా చుట్టూ నా జాతకాన్ని గురి చూసి గిరి గీసిన ఆ అల్లా మీదనా..?
ఆలోచిస్తుంటే మెదడంతా మొద్దు బారుతోంది. నెప్పి, నెప్పి భరించలేని నెప్పి. కొన్ని కాలాలుగా అణిచిపెట్టుకున్న నెప్పి. ఎవరో బలంగా గునపం గుండెలో గుచ్చిన నెప్పి. గాయాలతో రాయిలా మారిన మనసుని ఉలితో చెక్కిన నెప్పి. ఆ నెప్పిని భరించడం నా వల్ల కాదు.
నెమ్మదిగా బాత్రూంలోకి అడుగుపెట్టి లోటాల కొద్దీ నీళ్ళు కుమ్మరించుకుంది. తన నుండి జాలువారుతున్న నీటిలో కన్నీరేక్కడో కలిసింది. ఎండిన ఆకు నుండి ఏంటి ఈ పచ్చి వాసన. ఎండిన ఆ మనసునుండి పులిపిరిలా కొద్ది కొద్దిగా పచ్చదనం పైకి పొడుచుకు వస్తోంది. నెమ్మదిగా అది చిగురుగా మారుతోంది. చూస్తుండగానే చిన్న చిన్న ఆకులతో తీగలతో మనసుని పూర్తిగా చుట్టేసుకుంటోంది. చిత్రంగా మళ్ళీ గుండె కొట్టుకోవడం మొదలయ్యింది. ఆ గుండె ఇప్పుడు అతగాడి లాలనను శ్వాసిస్తోంది. మిగిలిన నీళ్ళని నిండా కుమ్మరించుకొని బయటికొచ్చింది. చల్లని గాలులు అమాంతం తనలా వాటేసుకున్నాయి. ఇంకా అతగాని శ్వాసలు తన మనసుని ఈ గదిని వీడి పోలేదు. తను తడిమిన చోటల్లా ఇప్పుడు కొత్త మెరుపులను సంతరించుకున్నాయి. తన దేహం కొత్తగా, మరింత అందంగా చిత్రంగా కనిపిస్తోంది. తన చుట్టూ చేరిన అతని శ్వాసలు ఓరగా చూస్తున్నట్టు తలపు. ఇప్పటి వరకు తానెరగని సిగ్గులు కొత్తగా చేరుకున్నాయి. ఒంటినంతా సన్నని చీరతో కప్పేసుకుంది..

అద్దంలో జాలు వారుతున్న కురుల అందాలతో తన రూపం తనకే పరిచయంలేనంత చిత్రంగా కనిపిస్తోంది. నున్నగా తల దువ్వుకుని అందంగా సింగారించుకుంది.

రోజు రోజుకి ఒక్కో మార్పు మొదటి మార్పు తన గది తలపులని మూసేసింది. తాను బయటికి రావడం మానేసింది. లోపలికి వచ్చే వారిని వారించింది. జరుగుతున్న మార్పుకి నాయనమ్మకి ఏమి అర్ధం కాలేదు. ఏమైందోనని ఎన్నిసార్లడిగినా మాట లేదు.
‘ఇలా అయితే ఇల్లు గడవడం కష్టం మనం చావడమే..’
‘చద్దాం బతికుండి ఇలా చావడం కన్నా ఒకేసారి చద్దాం.’
బిత్తిరి మొహం వేసుకొని అర్ధం కాకుండా చూస్తూ నిల్చున్న ముసలావిడ చేతిలో వంద నోటు పెట్టి
‘డబ్బుఎందుకే నీకు… మూలకు కూర్చో నేను వండి పెడతాను నువ్వు తిని పెట్టు. ఇగో ఈ వంద పట్టుకు పొయ్యి సరుకులు తేపో. నేను బయటికి వెళ్ళను ఎవ్వడ్ని లోపలికి రానియ్యకు.’
‘మరి ఎవరన్నా ఏమైనా అడిగితే ఏమని చెప్పనే. ‘
విసుగ్గా కోపంతో ఊగిపోతూ
‘నాకు ఎయిడ్స్ వచ్చిందని చెప్పు ఎవ్వడు ఇంటిమొహం చూడడు. ఇక వెళ్ళవే వెళ్ళు .’
రోజులు నమాజు చేసుకుంటూ, ఖురాను చదువుకుంటూ, ఘజల్లు రాసుకుంటూ, వంట చేస్తూ, అతనితో గడిపిన జ్ఞాపకంతో అతగాడి కోసం ఎదురు చూస్తూ గడుస్తున్నాయి.
అల్లా నను నన్నుగా గుర్తు చేయడానికి నువ్వే తనలా వచ్చావని అనిపిస్తోంది అనుకుంటూ ఖురాన్ను గుండెకు అదుముకుంది. అతనితో గడిపిన క్షణాలు ఆనందాశ్రువులై చల్లగా జారిపోతున్నాయి.
తనను కోరుకున్న గల్లీ వాసులకు ఇప్పుడు తానొక అందం పూసుకున్న చావు.. ఇప్పుడు తనని తాకడానికే భయపడుతున్నారు.
ఎన్నో రోజులతరువాత తన ఇంటి తలుపుతడుతూ ఒక ఉత్తరం. ఊహించినట్టుగానే అతగాడినుండి. ఉత్తరం తెరుస్తుంటే వెనకనుండి తన మెడమీద తల వాల్చి నెమ్మదిగా తన చేతుల్లో బంది అయిపోయి తనను తాను మరిచిపోతోంది.

ప్రియమైన రిజ్వాన గారికి
మీ నుండి ఎంత దూరమవుదామనుకున్నా మీ రూపం, ఆ కళ్ళు నన్ను నా ఆలోచనలను ఓడిస్తున్నాయి.
నాకు నేను ప్రశ్నల సాగరంలో ముంచేసుకున్నా తీరం మాత్రం నీవేనన్న సత్యం నుండి ఎందుకు బయట పడలేకపోతున్నానో అర్ధం కావడం లేదు.
నేను చూసిన అందం, నేను గడిపిన సాంగత్యం, మీ ఆడతనమే కాదు మీ రాతల మాటల వెనక దాగిన ఆ సున్నిత మనసుకి నేనిప్పుడు దాసుణ్ణి.
నువ్వు చెప్పిన ఆ సమాజానికి, కట్టు బాట్లకి, కుటుంబానికి, మతానికి, కులానికి, నేను అతీతం. ఇప్పుడు ఎప్పుడు నువ్వే నా మతం అభిమతం.
ఇప్పటికి నేను మీకు గుర్తుంటే మిమ్మల్ని నా లోకంలోకి తీసుకెళ్ళేందుకు నేను ఎదురు చూస్తుంటాను.
ట్రైన్ రిజర్వేషన్ టికెట్ని పంపించాను. వస్తే మీతో రైలు ప్రయాణం రాకుంటే మీ జ్ఞాపకాలతో ఈ జీవితయానం.

ఇట్లు
గౌతమ్..

మనసులో ఏదో తెలియని ఆనందం. ఇలాంటి ప్రేమలేఖలు ఇప్పటివరకు గడిచిన జీవితంలో ఎన్నో చదివినా, ఎందరి చేతిలో మోసపోయినా, ఎందుకో తన మాటలకు మనసెందుకిలా లొంగిపోతుంది. జరిగిన మోసాలతో పోల్చుకుంటే ఇతగాడి సాంగత్యంలో మోసపోయినా కూడా అదొక తీయని జ్ఞాపకమే.. ఒక్కరోజు మిగిల్చిన జ్ఞాపకంతోనే ఇన్ని నెలలు సంతోషంగా గడిపా..
ఇది అల్లా నాకిచ్చిన వరమనుకోనా లేక తన మీద నాకు కలిగిన ప్రేమా?
ఏదైతేనేమి నాక్కావాలి. అతనిప్పుడు నాకు కావాలి.
తన చేతుల్లో పువ్వులా సేద తీరడం నాక్కావాలి.
తన ఛాతీ మీద పసిపాపలా ఒదగడం నాక్కావాలి.

ఆ రోజు ఉదయమే నమాజు పూర్తిచేసుకొని ఖురాన్ను రంగు పరదాలో చుట్టుకొని గుండెకు అదుముకొని ఇంకో చేత్తో ట్రైన్ టికెట్తో రైల్వే స్టేషన్ కి చేరుకుంది.

అర్ధం కాని గందరగోళంలో పిచ్చిగా తిరిగింది. తనకోసం వెతికింది. ఎంక్వయిరీలో అడగ్గానే ట్రైన్ వెళ్ళిపోయిందని సమాధానం…
ఎవరో గుండెను బలంగా పిసికేస్తున్నట్టు శ్వాస ఆడట్లేదు. అక్కడే ఓ మూల గోడకి చతికిల పడింది. బయటికొచ్చి నడుస్తోంది.. ఏడుపొస్తోంది పిచ్చిగా ఏడుస్తోంది. సన్నగా వర్షం. చూస్తుండగానే జోరందుకుంది. రోడ్లన్నీ నిండుకున్నాయి. ఆ వర్షంలో తన ఏడుపు తో పాటు తాను కూడా కొట్టుకుపోతోంది. ఎప్పుడు స్పృహ తప్పిందో తెలీలేదు.
కళ్ళు తెరవగానే తన గదిలో.. పక్కన తన నాయనమ్మతో..
చిత్రంగా ఇంకా తన కౌగిల్లో తడిచి ముద్దైన ఖురాను.
బయట వర్షం ఇంకా కురుస్తూనే ఉంది.
తన మనసులో ఎర్రటి ఎండ తనని కాల్చుతూ..
ఆ ఎర్రటి ఎండలో.. కన్నీళ్లు సైతం ఆవిరయ్యాయి..
వీస్తున్న జోరు గాలిలో కూడా ముచ్చెమటలు..
కను రెప్పలు బరువెక్కుతున్నాయి..
కళ్ళు మూసుకుపోతున్నాయి..
ఆ ఎడారిలో దూరంగా అతగాడు అతనికోసం పరిగెడుతూ పరిగెడుతూ..
తాను మాయమవుతూ తిరిగి కనిపిస్తూ మళ్ళీ మాయమవుతూ..
కాలం వెర్రిగా ఆడుకుంటోంది. తన మనసు పువ్వై, ఎడారి ఇసుకలో సల సల మాడుతోంది. మాడుతున్న పువ్వుపై ఎండిన ముళ్ళ కంచె పూరెమ్మలను చీల్చుతోంది.. నెమ్మదిగా కళ్ళు తెరుచుకున్నాయి.. ఇంకా వర్షం అలాగే కురుస్తోంది వర్షంతో పాటు కన్నీరు కూడా ఇంకా ఆగట్లేదు..
టక్ టక్.. తలుపు రెక్కలు ఎవరో కొడుతున్నారు..
“రిజ్వాన..”
అదే గొంతు.. కలా? నిజమా? ఇది అతని గొంతే..
ఒక్కసారిగా వేలాది సారంగుల శ్రుతులు మదిలో మోగుతున్నాయి.
గీరుకున్న పూరెమ్మని ఇసుక తెమ్మ నుండి చల్లని చేతులోకి తీసుకున్నట్టు గుండె అతని శ్వాసలకోసం పరితపిస్తూ ఉలిక్కిపడి లేచి పరుగు పరుగున తలుపు తెరిచింది.
ఆశ్చర్యం ఆనందంతో మాటలు కరువై ఎదురుగున్న తనని చూసి చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏడుస్తూ అమాంతం వాటేసుకుంది.
“ఎందుకో నిన్నొదిలి ఈ పిచ్చి మనసు వెళ్ళలేకపోయింది.” ఇక జీవితాంతం నిన్ను చూస్తూ బతికేందుకు తిరిగి వచ్చేసానంటూ.. ఒకరిలోకి ఒకరు లీనమవుతూ…
ఒకరితో ఒకరు ఏకమవుతున్న తమని చూస్తూ వర్షపు బిందువుల్ని దులుపుకుంటూ కిటికీ వద్ద కపోతాల జంట. *