నీరెండ మెరుపు

ఒక అనుభూతి గీతం

05-ఏప్రిల్-2013

అనుభవాల్లో సారూప్యత లేని ఇద్దరు వ్యక్తుల మధ్య భాష నిరర్ధకమే. కవిత్వం కూడా ఒక విధమైన భాషే. అందుకే సంవత్సరాల తరబడి అర్ధం కాని కవితలు కూడా, ఏదో క్షణంలో చటుక్కున అర్ధమౌతాయి ఒక మెరుపు మెరిసినట్టు. ఆ క్షణంలో పాఠకుడు పొందే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అక్కడ కవిత మారలేదు. మారింది పాఠకుడు. పెరిగింది అతని అనుభవ విస్తృతి. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి అనుభూతి గీతాలు అంతకు ముందు ఎన్ని సార్లో చదివినా, ఈ కవిత చదివినట్టే గుర్తులేదు. కానీ తర్వాత 2005 లో మా నాన్న గారి మరణం తర్వాత మళ్ళీ ఏదో సందర్భంలో అనుభూతి గీతాలు చదవడం తటస్థించింది. అప్పుడు ఈ కవిత చదివినప్పటి అనుభూతిని మాటల్లో వర్ణించలేను.

నా స్వీయానుభవం వల్లనేమో నన్ను చాలా కాలం వెంటాడిన కవితల్లో ఈ కవిత కూడా ఒకటి. తెలుగులో ఇస్మాయిల్ , వేగుంట మోహన ప్రసాద్ గార్లతో పాటు అనుభూతి కవిత్వానికి ఆద్యుడుగా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారిని కుడా చెప్పుకుంటారు. శ్రీకాంత శర్మ గారి అనుభూతి గీతాల్లోని కవిత ఇది. కవి వైయక్తిక అనుభవం ఇక్కడ సార్వత్రికమవడం మనం గమనించవచ్చు. నీ దుఃఖం నీదే, నా దుఃఖం నాదే అంటే అక్కడ కవిత్వం ఏముంది? కవి వేదన మనలో కూడా పలకాలి. అప్పుడే అది కవిత్వమౌతుంది. సూర్యకాంతి, నది, పడవ, అలల మీద దర్భపుల్లలూ మొదలైన బలమైన పదచిత్రాల సాయంతో తండ్రి అస్థికలని నిమజ్జనం చేయడం అనే జీవితంలోని అనివార్యమైన ఒక అనుభవాన్ని కవి గొప్పగా చిత్రించగలిగాడు. ఇంతకంటే విశ్లేషించి ఈ కవిత పవిత్రతని భగ్నం చెయ్యదల్చుకోలేదు. ఇక కవితలోకి….

సూర్యకిరణాల జీవధార
నిద్రపోయే నది గుండెని తట్టి
పడవను మేలుకొలుప్తుంది-
ఇంత వెలుగు.. ఇంత గాలి..
పడవని ఊగించి లాలిస్తాయి-
లోతైన నది గుండెలోకి
స్తిమితంగా మునకవేసిన వెదురుగడ
పడవ చేతిలో తంబురా..
పడుకున్న పక్షిని
పాటలతో మేలుకొలుపుతుంది-
పక్షి పంజరం దాటుకుని
వెళ్ళిపోయిన శూన్య సమయం..
అలలమీద దర్భ పుల్లలూ, నందివర్ధనం పూలూ..
మంత్రాలు గొణిగే బ్రాహ్మడూ
నిర్గమన సాక్షులుగా
మనిషి పేరిట వేషం విప్పేసిన
నా తండ్రి సంస్కృతి నిమజ్జనమైన వేళ..
నది కాసేపు అరమోడ్పు కళ్ళతో నిలిచింది
ఒడ్డున ఒంటరిగా నన్ను వదిలేసి
తంబురా మీటుకుంటూ
పక్షుల్ని మేలుకొలుపుకుంటూ
పడవ మాత్రం
మరో తీరం వైపు –

ఆ పడవ మీటే తంబురా నాదంలో అలలు అలలుగా తేలి వచ్చే నా తండ్రి జ్ఞాపకాలు ఎప్పుడు ఈ కవిత చదివినా నన్ను తాకుతునే ఉంటాయి.