సావిత్రమ్మ గత కొద్ది రోజులుగా క్షణం తీరిక లేకుండా ఉంది. సర్దిందే సర్దుతూ, పిండివంటలు వండుతూ హడావుడి పడిపోతుంది. మోకాళ్ళ నొప్పులు బాధిస్తున్నా పని మాత్రం ఆపట్లేదు సరి కదా, మధ్య మధ్యన భర్తను విసుక్కుంటూ ఆపసోపాలు పడిపోతుంది.
“పొద్దస్తమాను ఆ వార్తల్లో కూరుకుపోకపోతే, కాస్త ఇటో చెయ్యి వెయ్యోచ్చుగా?”
“వస్తున్నానోయ్”, చదువుతున్న వార్తా పత్రికను పక్కన పెట్టి కారప్పూసను స్టీలు డబ్బాల్లోకి సర్దే పనిలో పడ్డారు రామారావు.
“ఇంకా రెండు రోజులుంది కదండీ ! రోజులు తరగట్లేదు”
“ఎదురు చూసిననంత సేపు ఉండదు నీ సంబరం, వచ్చాక ఇట్టే గడిచిపోతాయి రోజులు”, అన్నారు రామారావు.
“పండు గాడిని ఎప్పుడెప్పుడు చూడాలా అని మనసు కొట్టుకుపోతుందండి. అసలు కంటే వడ్డీ ముద్దని ఊరికే అనరుగా. అవిగో ఆ అరిసెలు ఆ డబ్బాలో సర్దేయ్యండి”, మరో పనిని పురమాయించింది సావిత్రమ్మ.
ఇంతకూ విశేషం ఏమిటంటే, కూతురు అల్లుడు మనవడ్ని తీసుకుని సెలవులకు వస్తున్నారు. సావిత్రమ్మకు కూతురు సులోచనంటే పంచ ప్రాణాలు. సులోచనకు పెళ్లి చేసి అమెరికా పంపించిన ఏడాదికే కూతురు ప్రసవానికని సావిత్రమ్మ అమెరికా ప్రయాణం కట్టింది. కూతురు ఉద్యోగానికి వెళ్తూ మనవడిని డే కేర్ లో వదలాలనే ఊహే మహా పాపంగా తోచింది ఆవిడకు. “నేనున్నానుగా , బడికి వెళ్ళే వయసు వచ్చే వరకు పెంచుతాను, మీరు నిశ్చింతగా ఉండండి” అని అభయహస్తం ఇచ్చి, ఆరునెలలు తరువాత మనవడ్ని చంకనేసుకుని స్వదేశానికి వచ్చేసింది. ఇంక అప్పటినుంచి ఆవిడ పంచ ప్రాణాలు మనవడిపైనే.
పండు గాడు నాలుగేళ్ళు వచ్చేదాకా అమ్మమ్మ దగ్గర రాజ్యమేలాడు. వాడు ఆడింది ఆట, పాడింది పాట. తాతయ్య రామారావు కూడా వాడిని బాగా గారాబం చేసేవారు.
“మీకు గుర్తుందా, పండు గాడు నడక నేర్చిన దగ్గర నుంచీ బాగా అల్లరి చేసేవాడు. బల్లలు, కుర్చీలు ఎక్కి దూకే వాడు. ఇదిగో ఇక్కడే ఆ బల్లపై నుంచీ మంచంపై దూకుతూ కింద పడ్డాడు. పెదవి చిట్లి ఎంత రక్తం పోయిందో. ఈ బల్లలన్ని పక్కకు జరిపేద్దురూ. వాడికి అడ్డం లేకుండా ఉంటాయి”
“నిజమే సావిత్రీ, ఆ రోజు ఎంత కంగారు పడ్డామో కదూ! ఒక రోజేమో గదిలోకి వెళ్లి గడియ పెట్టేసుకున్నాడు. వాడికా గొళ్ళెం తియ్యటం రాదు, ఏడుపు లంకించుకున్నాడు. తలుపు బద్దలు కొట్టినంత పనయ్యింది ఆ గడియ తీసేసరికి. దాంతో ఇంట్లో తలుపుల కొక్కాలన్ని వాడికి అందకుండా వుండాలని పైకి పెట్టించాము. ఇప్పటికి అవి అలాగే ఉన్నాయి”
ఇద్దరు నవ్వుకున్నారు.
“ప్లగుల్లో వేలు పెట్టడాలు, స్విచ్చులతో ఆడడాలు…..అమ్మో ఒకటనా వాడి అల్లరి!”
“మరో నాడు రబ్బరు ముక్క ముక్కులో దూర్చేసుకున్నాడు. మనకు ఊపిరి ఆగిననంత పనయ్యింది కదూ!”
“మీకు గుర్తుందా? కృష్టాష్టమికి ముచ్చటపడి వాడిని కృష్టునిడిలా తయారు చేసాను. తలకి నెమలి పించెం, మెడలో ముత్యాల హారాలతో అలకరించి, ఫోటోలు తీసి వాడి అమ్మానాన్నకు పంపించాలనుకున్నాను. పక్కింటి కుర్రాడు కెమెరాను సిద్దం చేసే వరకు మెడలో వేసిన దండలతో ఆడుకుంటూ బాగానే ఉన్నాడు. నాలుగు ఫోటోలన్నా తియ్యలేదు, తిక్కొచ్చింది వాడికి. ఎంతో నేర్పుగా కట్టిన పంచెను విప్పేదాకా పేచి పెట్టి ఏడ్చి నిద్రపోయాడు.”
“హాహాహా…తిక్క శంకరయ్య అంటే వాడే సావిత్రి. ఎక్కడి నుంచీ వచ్చిందో వాడికా తిక్క! మన సులోచన చిన్నప్పుడు అంత అల్లరి చేసేది కాదు”.
“ఏమోనండి? నాకా చిన్నప్పుడే పెళ్లి చేసేసారు. పెళ్లవ్వగానే పిల్లలు పుట్టుకొచ్చేసారు. ఆ వయసులో వారిని ఎలా పెంచానో ఏమిటో గుర్తన్నా లేదు. పిల్లలను పెంచటంలోని మాధుర్యాన్ని పండు గాడితోనే అనుభవించాను అనిపిస్తుంది నాకు”
“నిజమే సావిత్రి, అప్పుడు బాధ్యతల్లో తలమునకలయ్యేవాళ్ళం . నేను పొద్దున వెళ్లితే ఏ రాత్రికో కాని తిరిగి వచ్చేవాడిని కాదు. మన పిల్లల పసితనం చూసిందే లేదు.”
“వాడికి ఇష్టమని సున్నుండలు చేస్తున్నాను. పంచదార సరిపోయిందో లేదో రుచి చూసి చెప్పండి”, రామారావు చేతిలో సున్నుండ పెడుతూ అంది సావిత్రమ్మ.
“మీకు గుర్తుందా….ఒక్కోసారి అన్నం తిననని భీష్మించుకునే వాడు. ఎన్ని రకాలుగా మాయ చేసినా అస్సలు తినేవాడే కాదు. “ఓ పూట తినకపోతే ఏం కాదులే అమ్మా, ఆకలేస్తే వాడే తింటాడు, నువ్వు కంగారు పడకు” అని సులోచన ఫోన్ లో వారిస్తున్నా మనసు ఊరుకునేది కాదు”, మినప సున్నిలో నెయ్యి కలుపుతూ అంది.
“ఇంకొంచెం పంచదార వెయ్యి. అవునోయ్…వాడిని భుజానేసుకుని వీధి గుమ్మంలో వచ్చే వారిని, వెళ్ళే వారిని చూపిస్తూ నాలుగు ముద్దలన్నా వాడి నోట్లో కుక్కేదానివి. ఆ సమయంలో నేనేమన్నా అంటే నాపై ఇంతెత్తున అరిచేదానివి”, నవ్వుతూ అన్నారు రామారావు.
“అడగటమే మర్చిపోయాను, మీ స్కూటర్ కండిషన్ లో ఉందా?” నవ్వుతూ అడిగింది సావిత్రమ్మ.
“హహ్హహ…..పెట్రోల్ కూడా కొట్టించి సిద్దంగా ఉంచాను. స్కూటర్ పై షికారుకెళ్ళడం వాడికి ఎంత ఇష్టమో. వెధవ కదిలితే దింపేస్తా అని ఒకసారి బయపెట్టా, అంతే అప్పటినుంచి హేండిల్ పట్టుకుని కదలకుండా ముందు నుంచునే వాడు.”
“హా హా హా”
“ఎంత అల్లరి చేసినా బరించగలిగే వాళ్ళం. వాడికి జలుబో జ్వరమో వస్తే మాత్రం నాకు ప్రాణం పోయేదండి. ఎంత సొంత మనవడైనా మరొకరి బిడ్డే, మనం జవాబుదారులమే. మన పిల్లకు నలత చేసినప్పుడెప్పుడు అంత కంగారుపడే దాన్ని కాదు. వీడికి చిన్న నలతైనా నాకు కాళ్ళు చేతులు ఆడేవి కావు” ఆవునన్నట్టు తలూపారు రామారావు.
పండును తీసుకెళ్తాననీ సులోచన అన్నప్పుడు సావితరమ్మ చాలా దిగులు పెట్టుకుంది. “ఎవరి పిల్లలు వారి దగ్గరకు వెళ్ళిపోవాల్సిందే సావిత్రి. సులోచన వచ్చినపుడు పండు తన దగ్గరకు రావట్లేదని బాధ పడలేదూ? తల్లి మనసు కదా! వాడూ పెద్దవాడవుతున్నాడు, పూర్తిగా ఊహ తెలిసాక వెళ్ళనని గొడవ చెయ్యొచ్చు. ఇప్పుడు పంపించటమే మంచిది” అని సర్ది చెప్పారు రామారావు.
పండు వెళ్ళాక ఇల్లంతా బోసిపోయింది. ఏ మూల చూసినా వాడి బొమ్మలే, వాడి జ్ఞాపకాలే. సావిత్రమ్మకు రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు. అమ్మమ్మా అంటూ వాడు పిలుస్తున్నట్టు, నాకు అమ్మమ్మ కావాలి అని వాడు ఏడుస్తున్నట్టు కలలు వచ్చేవి. ఉలిక్కిపడి లేచేది. వెంటనే కూతురికి ఫోన్ చేసి, “ఎలా ఉన్నాడు కన్నయ్య, అలవాటయ్యాడా? డే కేర్ కు ఏడవకుండా వెళ్తున్నడా? సరిగ్గా తింటున్నడా?” అంటూ అడిగేది.
“అమ్మా, నువ్వేమీ కంగారు పడకు. మొదట్లో నిన్ను నాన్నను అడిగేవాడు. పది రోజుల్లో అడ్జెస్ట్ అయిపోయాడు. ఇప్పుడు మిమ్మల్ని తలవట్లేదు”,” అని చెప్పేది సులోచన.
పోన్లే, వాడక్కడ అలవాటైతే అంతే చాలు అని సావిత్రమ్మ తృప్తి పడుతున్నా, మరో వైపు మమ్ముల్ని మరిచిపోయాడా అని ఆవిడ మనసు మూగగా బాధిస్తుండేది.
పండు గాడు వాడి సామ్రాజ్యాన్ని ఖాళీ చేసి వెళ్తూ అమ్మమ్మ తాతయ్య వద్ద బంగారు జ్ఞాపకాలను వదిలి వెళ్ళాడు. వాడిని తలుచుకున్న ప్రతీసారి మా బంగారు కొండ అని మురిసిపోయేవారు ఆ దంపతులిద్దరూ.
ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.
“ఫ్లైట్ టైం అవుతుంది. డ్రైవర్ వచ్చాడో లేదో చూడండి” , కంగారుగా అంది సావిత్రమ్మ.
“నీ కంగారు పాడుగాను. పొద్దునుంచీ చూస్తున్నా, నువ్వొక్క క్షణం కుర్చోవు, నన్ను కూర్చోనివ్వవు. ఇంకా చాల టైం ఉంది ఫ్లైట్ రావటానికి”, భార్య ఆత్రాన్ని అర్థం చేసుకుంటూనే విసుక్కున్నారు రామారావు.
ఆవిడ ఊరుకుంటేగా?! గంట ముందే ఎయిర్పోర్ట్ కు చేరారు. వచ్చేవారందరినీ చూస్తూ, ఇంకా రారేమిటండి? కాస్త కనుక్కుందురూ అని పదే పదే అంటూ రెండు గంటలపైనే గడిపారు.
ట్రాలీ బాగ్ లాగుతూ వస్తున్న మనవడిని చూడగానే సావిత్రమ్మ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
“ఎంత పెద్దాడయిపోయాడో నా కన్నయ్య”, అంటూ పండును ఎత్తుకోబోయింది.
“ఆమ్మమ్మా, ప్లీజ్….. I ఐయాం అ గ్రోన్ అప్ బాయ్”, పక్కకు జరిగాడు పండు.
“ఓరి భడవా”, ముద్దుగా నవుకున్నారు అమ్మమ్మ తాతయ్యలు.
ప్రయాణ బడలిక, జెట్ లాగ్ లతో రెండు రోజులు గడిచిపోయాయి.
“నీకు ఇష్టమని సున్నుండలు, వెన్నుండలు చేసాను. తినరా కన్నా”
“పండు మీ అమెరికా కబుర్లు చెప్పయ్య”
“పండు ఇటొచ్చి నా పక్కన కుర్చుని కబుర్లు చెప్పు తండ్రి” పండు చెపుతున్నాడు. వాడి భాష సావిత్రమ్మకు అర్థం కావట్లేదు .
అన్నం తినిపిస్తూ, “మీ బళ్ళో తెలుగు వాళ్ళున్నారా? నీ స్నేహితుల పేర్లు చెప్పు? స్కూల్ లో ఏమేమి నేర్చుకున్నావ్?”, పండుతో మాట్లాడాలని తోచిన ప్రశ్నలు అడుగుతోంది సావిత్రమ్మ.
వాళ్ళ అమ్మమ్మకు అర్థం కావని నిదానంగా ఒక్కో పదం విడమర్చి మరీ మాట్లాడుతున్నాడు.
“ఏమిటో నీ ఇంగ్లీష్ గోల, ఒక్క ముక్కన్నా తెలుగు మాట్లాడవు”, చిన్నబుచ్చుకుంది. సావిత్రమ్మకు అసహనం, అసంతృప్తి మొదలయ్యాయి.
“మీ ఇద్దరి మధ్యన నాకూ చోటివ్వండోయ్. అమ్మమ్మ మనవడు ఏం రహస్యాలు మాట్లాడుకుంటున్నారో నేనూ వింటాను”, మనవడి మాటలు తెలుగులో భార్యకు చెప్పటానికి వారిద్దరి నడుమన దూరారు రామారావు.
“ఏమిటోనండి! నేను పెంచిన బిడ్డేనా వీడు అనిపిస్తోంది. క్షణం ఒదలకుండా కొంగు పట్టుకుని తిరిగే వాడు. ఇప్పుడేమో, పలుకే లేకుండా ఉంది”, రామారావు ఎంత సర్ది చెప్పాలని ప్రయత్నించినా సావిత్రమ్మ సమాధాన పడలేదు.
”పండుకి అస్సలు తెలుగు రాకుండా చేసేసారే?”, కూతురి దగ్గర బాధ పడింది సావిత్రమ్మ.
“అక్కడకు వచ్చాక బాష రాక కొన్నాళ్ళు ఇబ్బది పడ్డాడు. ఇంట్లో తెలుగు, బయట ఇంగ్లీష్ తో తికమకపడుతున్నాడని మేమే ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడటం మొదలుపెట్టాము. అలా ఇంగ్లీష్ అలవాటైపోయి, వాడికి వచ్చిన కొన్ని తెలుగు పదాలు కూడా మర్చిపోయాడు. తెలుగు అర్థం అవుతుంది, కాని మాట్లాడలేడు. వాడి ఆలోచన సైతం ఇంగ్లీష్ లోనే ఉంటుంది. వాడికి తెలుగు నేర్పించాలని నాకు ఉన్నా, బలవంతం చెయ్యటం ఎందుకులే అని కొంత నిర్లక్షం చేసాను. దానికి తోడూ ఓపిక, సమయమూ లేవమ్మా”, తల్లికి సంజాయిషీ ఇచ్చింది సులోచన.
“అంతేలే! ఎక్కడ ఎలా బతకాలో అలాగే బతకాలి. ఎదో నా ఆపేక్ష అలా అనిపిస్తుంది అంతే”, పైకి అలా అనేసినా లోలోపల చెప్పలేనంత దిగులుగా ఉంది సావిత్రమ్మకు.
పండుని ఒళ్లో కుర్చోపెట్టుకుని వాడి ముద్దు ముద్దు మాటలు వినాలన్నా కోరిక తిరకుండానే రోజులు ఇట్టె గడిచిపోయాయి. ఓ పది రోజులు సులోచన అత్తారింటికి వెళ్ళొచ్చింది. వచ్చేపోయే చుట్టాలు, స్నేహితుల పలకరింపులు, భోజనాల ఆహ్వానాలు, షాపింగ్ లతో రోజులు ఇట్టే తిరిగిపోయాయి.
“అమ్మ నీకో చీర తీసుకుంటాను. ఏ షాప్ కు వెళ్దాం?”, ఆన్న కూతురితో, “నాకేం చీరలు వద్దు, నువ్వు కుదురుగా కూర్చుని నాతో కబుర్లు చెప్పు……అంతే చాలు”, అంది సావిత్రమ్మ.
“మీ అమ్మ అలాగే అంటుంది, నువ్వు వినకు సులోచనా. ఇప్పుడు నువ్వు కొనిచ్చే చీరను మళ్ళీ నువ్వొచ్చేదాకా చూసుకుంటూ మురిసిపోతుంది”, నవ్వుతూ అన్నారు రామారావు.
“సులోచనా దూరాభారాలు, సమయాభావాలు ఎన్నున్నా కొన్ని విషయాలకు ప్రాముఖ్యం ఇవ్వాలమ్మా. భౌగోళిక దూరం తెచ్చిపెట్టే అంతరాలను ప్రయత్నపూర్వకంగా అధికమించగలం. లేకపొతే ఆ అంతరం అలా పెరిగిపోతుంది”. తండ్రి చెపుతున్న విషయాన్ని అర్థం చేసుకున్నట్టు తలూపింది సులోచన.
“అమ్మమ్మ, ఐ విల్ బై అ డ్రెస్. నీకు…… డ్రెస్…. బై… చేస్తా”, తెలుగు పదాలు కూడబలుక్కుని మాట్లాడాడు పండు.
“నా బంగారే, నాచిన్ని తండ్రే, నా వరాల మూటే……నాకు డ్రెస్ కొంటాడంట”, మురిసిపోయింది సావిత్రమ్మ.
తిరుగు ప్రయాణమయ్యే రోజు రానే వచ్చింది.
సావిత్రమ్మ వంటిట్లో మసాల పొడులు సర్దుతూ ఎవరికీ కనిపించకుండా పమిట చెంగుతో కళ్ళద్దుకుంటుంది. కూతురు వెళ్తుంది అనే బాధ కన్నా మరేదో వ్యధ అవిడను నిలువనీయట్లేదు. వేల మైళ్ళ ఖండాల దూరాలను మించి పెరగబోతున్న మానసిక దూరం ఆవిడను భయపెడుతుంది.
“పాస్పోర్ట్ లు, టికెట్లు జాగ్రత్తగా పెట్టుకున్నావా? ఎందుకైనా మంచింది ఒకసారి చూసుకో”, కాబ్ ఎక్కుతున్న సులోచనతో అన్నారు రామారావు.
“అన్ని పెట్టుకున్నా నాన్న. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఈసారి మీరే రావాలి మా దగ్గరకు”
“అలాగే, వీలు చూసుకుని ప్లాన్ చేద్దాం”, కూతురి భుజం తడుతూ అన్నారు.
“అమ్మ నువ్వొచ్చి నీ మనవడికి తెలుగు మాట్లాడటం నేర్పించాలి….వస్తావు కదూ!” లోలోపల దాచుకున్న దిగులు ఒక్కసారిగా కళ్ళలో కదలాడింది తళ్ళీ కూతుర్లిద్దరికీ.
“అమ్మమ్మ, ఐ విల్ టీచ్ యు ఇంగ్లీష్”, మనవడికి ముద్దిచ్చి వీడ్కోలు చెప్పారు సావిత్రమ్మ, రామారావు.
“స్పర్శ, భాష లోపిస్తే బంధాలు దూరమవుతాయి కదండీ?”
“దగ్గరో, దూరమో? మార్పుతో పాటూ మనమూ నడవాలి సావిత్రీ,. చేతికందే దూరంలో లేకపోయినా చేతనయినంత దగ్గరతనాన్ని కాపాడుకోవాలి.
“వచ్చే సంవత్సరం మనమే వెళ్ళి, వాళ్ళతో కొంతకాలం గడిపి వద్దాం.”
*స్పర్శ, భాష లోపిస్తే బంధాలు దూరమవుతాయి*
యీ ఒక్క మాటలో.. ఎంతో వుంది..
అమ్మమ్మా తాతయ్యల హడావిడి కళ్ళకు కట్టినట్టు చూపించావు ప్రవీణా
జయశ్రీ గారు …. ధన్యవాదాలు
సున్నితంగా మంధలిస్తునే సూటిగా వడ్డించారు.
ఆలోచనాత్మకంగా ఉంది. బావుంది.
Thank you Raghu.
స్పర్శ, భాష లోపిస్తే బంధాలు దూరమవుతాయి కదండీ? హుమ్మ్…అవును
రాధిక గారు @ దగ్గరో, దూరమో? మార్పుతో పాటూ మనమూ నడవాలి, ప్రయత్నపూర్వవకంగా కొంత దగ్గరితనాన్ని కాపాడుకోవాలిసిందే! థంక్యు రాధిక గారు.
మధ్యతరగతి గ్రాండ్ పేరెంట్స్ ల ప్రవాసీబంధాన్ని ఎప్పటి లాగానే మీ సునిశిత పరిశీలనలతో, “కోటబుల్” వాక్యాలతో చక్కగా చిత్రీకరించారు.నిడివి క్రొద్దిగా గమనించుకోండి. ఇంకొంచెం క్లుప్తతతో విషయాన్ని చెప్తే ఇంకా బాగుంటుంది.
యాజీ @ నిడివి ఎక్కువ అయినదంటారా? I will keep that in my mind. Thanks a lot…
ఆ మాటలూ, ఆ హడావిడీ.. దిగులూ, అంతలోనే ఉత్సాహం.. అన్నీ కళ్ళకి కట్టినట్టు ఉన్నాయండీ!
కృతఙ్ఞతలు నిషిగంధ గారు.
ప్రవీణ గారు, మీ కధలన్నీ చాల relate అయ్యేట్టు ఉంటాయి నా లాంటి ప్రవాసీయులందరికి. నా పర్సనల్ అనుభవం మా అమ్మాయిని మా అమ్మ దగ్గర కొన్ని ఏళ్ళు వదిలేయడం.దానితో నేను పడిన వ్యధ, మళ్లి నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా adjust అవుతోమో అని పడిన టెన్షన్ కూడా గుర్తుకు వచ్చింది. నేను భయపడినంత గా ఏమి జరగలేదు కానీ ఈ సారి మీరు ఆ angle లో రాస్తే చదవాలని ఉంది
సుభద్ర గారు @ నాకు ఆ అనుభవం వుంది. అదో గిల్టీ ఫీలింగ్, భయం…. మీరన్నట్టు మనం భయపడినట్టు వుండదు , పిల్లలు యిట్టె అలవాటు పడిపోతారు. ఈ కోణంలో తప్పక రాయటానికి ప్రయత్నిస్తాను. కృతఙ్ఞతలు.
ఆలోచనాత్మకంగా …. బావుంది
ఆలోచనాత్మకంగా …. బావుంది..మీకు అభినందనలు.
చాల బావుంది మీ కధ @
“దూరాభారాలు, సమయాభావాలు ఎన్నున్నా కొన్ని విషయాలకు ప్రాముఖ్యం ఇవ్వాలమ్మా. భౌగోళిక దూరం తెచ్చిపెట్టే అంతరాలను ప్రయత్నపూర్వకంగా అధికమించగలం. లేకపొతే ఆ అంతరం అలా పెరిగిపోతుంది” #VeeraReddyKesari