ప్రత్యేకం

భాషాపరమైన ఆదర్శాలు సాధ్యమా?

జూలై 2013

మార్పు అనేది నిత్యం జరిగే ప్రక్రియ! అదొక్కటే కాంన్స్టెంట్ (నిత్యమైనది) అనే మంచి పదం కూడా ఉంది. మార్పు జరుగుతూనే ఉంటుంది. భాష ఒక ఉత్తమ సామాజికాంశం. సమాజ భాషా విధానాలు, వాడకం అభివృద్ధి ఈ సూచికను పరిపూర్ణం చేస్తుంది. ఆరోగ్యకరమైన భాష మనుగడకు, సమాజ వ్యక్తీకరణ మార్గాలకు ఇది ఒక సూచిక.

అంతర్జాతీయ భాష మన వాడుకు భాషను, విద్యనూ, అధికారిక కార్యాచరణను సైతం ఆక్రమించుకున్న నేపథ్యంలో భాషాపరమైన ఆదర్శాలు అంటూ మాట్లాడితే, ఖచ్చితంగా మాతృభాషలోనే సంభాషించాలి అని అనుకోవాల్సి వస్తుంది. మాతృభాషను నిర్లక్ష్యం చేయడం, ఇతర భాషను నెత్తికెక్కించుకోవడం లాంటి మాటలను వదిలేద్దాం. నిష్కర్షగా నిజాన్ని మాట్లాడుకుంటూ, భాషా ఆదర్శాలను ఎలా పాటించవచ్చో తెలుసుకుని ఆచరిద్దాం.

మాతృభాషా దినోత్సవం అంటూ ఒక రోజును నిర్ణయించి, ఆ రోజు మన మాతృ భాషకు పట్టం కట్టి, ఆ రోజంతా మాతృభాషలోనే మాట్లాడాలని నిర్ణయించుకుని, పర భాషను మాట్లాడరాదని తీర్మానించుకుని, ఆ రోజు మాట్లాడే ప్రతి వాక్యాన్నీ వెయ్యి సార్లు మనసులో మననం చేసుకుని, అందులో పరభాష లేదని నిర్ధారించుకుని, ఏదో రకంగా సంభాషణల్ని ముగించడం, పరభాషను వదిలించుకోలేకపోతున్నామన్న నగ్న సత్యాన్ని ప్రతి ఐదు నిముషాలకూ ఒకసారి కనుగొని, మాతృభాషకు ఆ రోజుకు ప్రతి సారీ “సారీ (క్షమాపణ)” చెప్పుకోవడం….ప్రతి సంవత్సరం మాతృభాషా దినోత్సవం నాడు నేను గమనిస్తున్న విషయాలు. ఇది ఎంతవరకూ సమంజసం?

ప్రతి దేశానికీ లేదా ప్రాంతానికీ ఒక సంస్కృతి ఉంటుంది. అది అలానే ఉండిపోవాలని లేదు కదా! క్రొత్త నీరు వచ్చినపుడు నదిలో మార్పులు సహజమే! నదిలో మాత్రమే కాదు….నది నీటిని వాడే ప్రాంతలన్నీ మార్పుకు లోనౌతాయి.

“ఆధునికత” ప్రతి కాలంలోనూ, ప్రతి సాంఘిక అధ్యాయంలోనూ, ఆయా కాలాలకు సరితూగే పదమే! పూర్వ పద్ధతులను ప్రశ్నించి, తన మార్గాలను బయల్పరచి, క్రొత్త దారులను ఏర్పరచేదే! సమాజం ప్రతి సందర్భంలోనూ (ఫేజ్) ఆధునికతను నాగరికత పేరిట సంతరించుకుంటూనే ఉంటుంది. ఆధునికత రెండు రకాలు. (౧) మార్పుని అప్పటికప్పుడు సమాజంలో ప్రతిబింబించేది. (౨) ఒక అడుగుగా మొదలైనా, కాలక్రమేణా ఇంకా వర్ణాలను సంతరించుకుని, రెక్కలను తొడుక్కుని కొన్నాళ్ళకు అనామకంగా ఉన్న దశ నుండి సీతాకోకచిలుకగా మార్పు చెందేది. ఆధునికతకు మార్పుకూ అవినాభావ సంబంధం ఉందని చెప్పవచ్చు.

ప్రతి దశాబ్దానికీ ఒక కామా పెడ్తూ, మనం కాలాన్ని పరిశీలిస్తూ పోతే, ప్రజల జీవన శైలిలో భాష తీసుకొచ్చిన మార్పులు తెలుసుకోవచ్చు. ఒక కాలానికి సంబంధించిన భాష ఎలా ఉండేదో మనకు ఎలా తెలుస్తుంది? చరిత్రలో సమీకరించబడ్డ పత్రాలు, సాహిత్యం, భద్రపరచబడిన లేఖనాలు, సినిమాలు, నాటకాలు మొదలైన వాటి వలన తెలుస్తుంది. ఆయా కాలాలకు అనుగుణాంగా, ఆయా ఆధునికాంశాల ప్రభావాల ఫలితంగా ఒక ప్రాంతం యొక్క భాష పరిఢవిల్లుతుంది. అలాగే సమాజంలోని ఒక్కో సమూహానికీ ఒక్కో విధమైన వాడుక భాష ఉంటుంది. వేర్వేరు మాండలికాల సమాహారాన్ని ఒక రాష్ట్రం ప్రతిబింబిస్తుంది.

జీవనశైలి మారి, ప్రపంచమే కుగ్రామమైపోయినపుడు, సంస్కృతిలో మార్పు రాదా? ఖచ్చితంగా వస్తుంది. పరభాష మోజు, గొప్పదనం అంటూ ఎందరు అటూ, ఇటూ ఊగిసలాడినా, ఆ ప్రాంతం తాలూకా భాష ఎప్పటికీ కనుమరుగైపోవడం జరగదు.

సమకాలీన జీవన పరిస్థితులను బేరీజు వేద్దాం. భాష ఒక ఉపకరణం. వ్యక్తీకరణకు మార్గం. చదవడం, రాయడం, మాట్లాడ్డం, వినడం…ఇవన్నీ దాని కృత్య రూపాలు. పుట్టిన దగ్గర నుండి పిల్లలు భాషను వింటారు. మాట్లాడ్డం నేర్చుకుంటారు. తమ చుట్టుపట్ల ఉన్న వాతావరణానికి అనుగుణంగానే భాషను ఉత్పత్తి చేస్తారు.

ప్రకృతి, వికృతి అంటూ భాషాపరమైన అంశాలు మన తెలుగు భాషలో లేవా? ప్రకృతి ఒక పోష్ నెస్ ను ప్రతిబింబిస్తే, వికృతి? భాషా స్వతంత్ర్యాన్ని మనం ఎంత స్వచ్చంగా మన జీవితంలోకి ఆహ్వానించగలమో అంత సులభంగా ఆదర్శాలను పాటించగలం! మన భాష మనకు ముద్దు. భాషాపరమైన విస్తృతి మన నవ సంతతిలో ఎంతుంది? భాషాపరమైన ఆదర్శాల అలవాటును మనం అలవర్చుకోవడంలోనే ఉంది.

“అమ్మా!నేను ఈ వ్యాధి నయం ఐపోతుంది అనుకున్నాను. కనీసం ఈ వారమైనా నేను బడికి వెళ్ళగలనని ఆశపడ్డాను”
ఈ వాక్యాలు ఒక పదేళ్ళ క్రితం ఒక పాఠశాల విద్యార్థి మాట్లాడాడు అనుకుంటే తప్పే! ఈ వాక్యాలే కాదు, ఇలాంటి ఎన్నో వాక్యాలు ఇంగ్లీషు అవసరం లేకుండా నా బిడ్డ మాట్లాడుతాడు. వాడి వయసు ఎనిమిదేళ్ళు. చదివేది నాలుగో తరగతి. ఇంత బాగా నేను తెలుగు నేర్పాను అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే! ఇదంతా నేను ఎప్పుడూ తిట్టుకునే “ఈడియట్ బాక్స్” పుణ్యమేనంటే నమ్ముతారా? మా అబ్బాయి టి.వి చూస్తాడు. ఖుషీ, కార్టూన్ నెట్వర్క్, పోగో….ఇవే వాడి టి.వి లోకం. అవి చూస్తే పాడయిపోతాడేమో…చదువు మీద శ్రద్ధ ఉండదేమో లాంటి భయాలు నాకెపుడూ లేవు. ఒక నిర్ణీత సమయాన్ని మాత్రమే టి.వికి కేటాయించడం నేర్పాను. వాడికంత బాగా తెలుగు మాట్లాడ్డం రావడానికి కారణం ఈ చానల్స్ లో అన్ని కార్యక్రమాలు తెలుగులో రావడం. ఇందులో గొప్పేమీ లేదనుకోవద్దు. అవన్నీ ఇంగ్లీషు కార్యక్రమాలు. వాటికి తెలుగు డబ్బింగ్ తో వచ్చే కార్యక్రమాలు ఇవి. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో ఖచ్చింతంగా ట్రూ ట్రాన్స్ లేషన్ తోనే సంభాషణలు ఉంటాయి. మరీ ట్రూ ట్రాన్స్లేషన్స్ కనుక అప్పుడప్పుడూ మనకి కడుపుబ్బ నవ్వు కూడా వస్తుంది. నేను చేసిన పని ఏమిటంటే, టి.వి చూసినపుడు మా అబ్బాయితో కలిసి చూడడం, ఆ సంభాషణల గూర్చి ఆ సమయంలోనే వాడితో చర్చించడం, కొన్ని పదాలకు అర్థాలు చెప్పడం, వాటి వాడుకను గూర్చి ప్రాక్టికల్ గా వివరించడం. ఈ ప్రక్రియ చాలా మంచి ఫలితాన్నిచ్చింది.

నేను తెలుగు మాత్రమే మాట్లాడాలనో, ఇంగ్లీషు తక్కువ వాడాలనో వాడికి చెప్పలేదు. తెలుగు వార్తాపత్రిక చదవడం, తెలుగు కథలు చదవడం నేర్పాను. ఈ పనులన్నీ ఇంగ్లీషు నేర్పుతూనే సుమా! భాష పట్ల పట్టు వచ్చాక అది మన ఆస్తిగా మారిపోతుంది. వాడుకలో మన సత్తా తెలుస్తుంది. ప్రత్యామ్నాయ భాషా పదాలు అవసరమైతేనే కదా ఇతర భాషలు వాడాల్సిన స్థితి ఏర్పడేది! అలాగే వివిధ వృత్తుల్లో ఉన్నవాళ్ళు చాదస్తంగా తెలుగు భాషను నెత్తిన పెట్టుకుని “మోయాల్సిన” అవసరం లేదు. భాష అంటూ వస్తే, అది మన ఆస్తి అన్న విషయాన్ని గ్రహించగలిగితే, ఏ వృత్తిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, భాషా ఆదర్శాలను సులువుగా మన జీవనంలో “సహజ” భాగంగా చేసుకోవచ్చు.

మన దేశంలో ఉన్నత విద్యకు సంబంధించిన పుస్తకాలు మన మాతృభాషలో లేవు. వాటిని తెలుగులో తర్జుమా చేసేందుకు లేదా రాసేందుకు ఇప్పుడిప్పుడే కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నాయి. కొన్నాళ్ళకు విద్యా వ్యవస్థలోనో మార్పు వస్తుందని విశ్వసించొచ్చు. అలాగే ప్రభుత్వ జీవోలు చాలా వరకూ ఇంగ్లీషులో ఉన్నాయి. ప్రభుత్వ కార్యకలాపాల ఉత్తర్వులు చాలా వరకూ ఇంగ్లీషులోనే కొనసాగుతున్నాయి. వీటిలో కూడా మార్పుకు ఇప్పుడిప్పుడే శ్రీకారం చుట్టారు. ఇహ ఈ మధ్య సమకాలీన వస్తువులకు వాడే పేర్లు కూడా మన భాషలో వాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకు మొబైల్ ఫోనుకు బదులు చరవాణి అనీ, కంప్యూటరు కు బదులు శీఘ్ర గణయంత్రం అనీ…సాంకేతిక పదాలకు కూడా తెలుగు పదాలను కూర్చుతున్నారు. కొన్నాళ్ళు జోక్స్ గా అనిపించినా ఆనతి కాలంలో వీటిని మనం తప్పనిసరిగా వాడుతాం! భాషను సహజంగానే మన జీవితాల్లో ఉండనిద్దాం. నియంత్రణయుతమైన నిబంధనల మధ్య సహజత్వాన్ని నలగనివ్వవద్దు. మన పెరట్లో వేపచెట్టు పెరిగినంత సహజంగా మన మెదడులో మాతృభాషను ఎదగనిద్దాం! భాషాపరమైన ఆదర్శాలకు నిదర్శనాలుగా వెలుగొందుదాం!