కవిత్వం

ఒక సోలడు నూకలిప్పించు

02-ఆగస్ట్-2013

ఒక సోలడు నూకలిప్పించు
చెరువు గట్టుపై
ఎండుటాకుల గలగలల మధ్య
రావిచెట్టుకి జారబడి
పక్షులను నా వద్దకు రప్పించుకుంటాను!

పరిష్కారం లేని సమస్యలతో
నా దగ్గరకు రాకు
కిట్టప్ప ఉరిపోసుకున్న రావి కొమ్మింకా
రక్తమోడుతోంది
ఒక్క మరణంతో
విరిగిపోయిన చిన్ని బాల్యమింకా
కన్నీరు కార్చుతోంది

చెదిరింది బొట్టో….జీవితమో తెలియక…
మతి మాత్రం చెదిరిన భద్రమ్మింకా బ్రతుకుతోంది

కూలిపోయిన గూటి శిధిలాలింకా
ఊరి వైఫల్యానికి సాక్ష్యాలిస్తున్నాయి

ఒక గుప్పెడు గింజలిప్పించు
ఇంటి వాకిట్లో
నడుం వంగిన నులక మంచానికి ఆనుకుని
కోళ్ళను నా చుట్టే తిప్పుకుంటాను!