కథ

ఎన్నెన్నో వర్ణాలు!!

ఆగస్ట్ 2013

“ఇవాళ లక్ష్మివారం…హమ్మయ్య ఇవాళ, ఇంకొక్కరోజు. అంతే, తరువాత వీక్ ఎండ్. బోల్డు పనులున్నాయి చేసుకోవడానికి” అనుకున్నాను ఆఫీసులో అడుగుపెడుతూనే. “సుహేబ్ అప్పుడే వచ్చేసాడే!”

“హాయ్ సుహేబ్!”

ఎందుకో కొంచం దిగులుగా ఉన్నట్టు అనిపించాడు. ముభావంగా “హాయ్” అన్నాడు. ఈమధ్య సుహేబ్ పనితనం మెరుగవ్వడం, డైరెక్టరుకి ప్రీతిపాత్రుడవ్వడం మా ఆఫీసులో కొందరికి మింగుడుపడట్లేదు. ఆ అబ్బాయికి ఏదో విధంగా తలనొప్పులు తేవాలని కొందరు సీనియర్స్ తెగ ప్రయత్నిస్తున్నారు. ఆ విషయమై తను కొంచం బాధపడుతున్నాడు. ఆ ప్రస్తావన నాదగ్గర తెచ్చినప్పుడల్లా “నీ పని నువ్వు సవ్యంగా చేస్తున్నంతకాలం నిన్నెవరూ ఏం చెయ్యలేరు లేవోయ్” అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సుహేబ్ నాకన్నా జూనియర్. నాలుగేళ్ళుగా ఒకే ఆఫీసులో కలిసి పనిచేస్తున్నాం. మా ఇద్దరివి ఎదురెదురు డెస్కులు కావటంతో టైము దొరికినప్పుడల్లా మంచి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. తను కాస్త నెమ్మదస్తుడు, కానీ మంచి సరదా మనిషి.

టీ బ్రేక్ లో సుహేబ్ ని పిలిచి ఏమయ్యిందని అడిగాను. ఒక సీనియర్ పొద్దున్నే తనని పిలిచి ఏదో వాగిందిట. తనకి కోపమొచ్చి పరుషం గా ఏదో సమాధానం చెప్పాడట. ఆ మాట విని నాకు ఒకింత ఆశ్చర్యమూ, ఆనందమూ కలిగాయి. సుహేబ్ ఎదురు చెప్పాడంటే సంతోషించాల్సిన విషయమే. గత కొద్ది కాలంగా తనపై వస్తున్న విసుర్లన్నిటికీ మౌనం గా ఉండిపోతున్నాడు. అప్పుడప్పుడు నాతో చెప్తున్నాడు. అంతే! “నిన్ను అనవసరం గా ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోకు సుహేబ్” అని ఎన్నిసార్లు చెప్పినా, “ఎందుకులే గొడవ, వాళ్ళ పాపాన వాళ్లే పోతారు” అంటాడు. అలాంటిది ఇవాళ తను ఎదురు తిరిగి ఒక మాట అన్నాడంటే నాకు ఆశ్చర్యమే. “గుడ్! చెప్పేసావుగా, ఇంక మర్చిపో” అన్నాను. అయినా తను కొంచం డల్ గానే ఉన్నాడు. ఇవాళ జరిగిన సంఘటనొక్కటే కాదేమో కారణం!!
తనని కాస్త హుషారు చేద్దామని, ఇంకో ఇద్దరు కలీగ్స్ తో కలిసి లంచ్ కి బయటకి బయలుదేరదీసాం. భోజనం చేస్తూ ఆ మాట, ఈ మాట, జోకులు, వెక్కిరించుకోవడాలు…..హమ్మయ్య సుహేబ్ నవ్వాడు.

లంచ్ అయ్యి ఆఫీసుకి రాగానే మెయిల్…నాలుగు గంటలకి సీనియర్స్ అందరికీ మీటింగ్, జరుగుతున్న ప్రోజెక్టుల గురించి చర్చించుకోవడానికి. ఇదో తలకాయనొప్పి వ్యవహారం. చర్చించేది తక్కువ, సొంతడబ్బాలెక్కువ.

విసుగ్గా నోట్స్, పెన్ను పట్టుకుని వెళ్ళాను మీటింగ్‌కి. ఓ పదిమందిమి కూర్చుని మొదలెట్టాము చర్చ. ఎవరి ప్రోజెక్టుల గొప్పలు వాళ్ళు చెప్పుకున్నాక మిగతా వ్యవహారాలవైపు మళ్ళింది దృష్టి. పొద్దున్న జరిగిన సంఘటన గురించి ‘ఆ’ సీనియర్ తన వెర్షన్ చెప్పుకొచ్చింది. ఆవిడగారి సానుభూతిపరులు “ఆ, అంతమాటన్నాడా” అని సాగదీస్తున్నారు. నేను, మా ఫ్రెండ్స్ “ఎవరికి తెలియవులే ‘ఈ’ ఇంతుల సంగతి” అన్నట్టు కళ్ళతో సైగలు చేసుకుని మనసులో నవ్వుకుంటున్నాం. అప్పుడు…సరిగ్గా అప్పుడే వినబడింది నాకామాట!
“సుహేబ్ ముస్లిం కదా, తన లక్షణం లోనే ఉంది ఆ దుందుడుకుతనం. రోషం గా, పరుషం గా మాట్లాడడం, ప్రవర్తించడం వాళ్ళకి కొత్తేం కాదుగా!”

What?????

ఏం మాట్లాడుతోంది ఈవిడ !! ఒక్క క్షణం ఏమర్థం కాలేదు. నేనేం విన్నాను!! మనుషులు మాట్లాడవలసిన మాటలేనా అవి!!
ఇంకో కలీగ్ అంటోంది “అదేంటండీ అలా అంటారు. ఏదైనా ఉంటే ఆ అబ్బాయి తో తేల్చుకోండి. మత ప్రస్తావన తెస్తారెందుకు?”

“ఆహా నా ఉద్దేశం అది కాదు…నేను అలా ఎందుకన్నానంటే….”

మరొకాయన “తప్పేంటండీ, వాళ్ళందరూ ఇంతేగా…”

వస్తున్న కోపాన్ని అదుపు చేసుకోవడం కష్టమయ్యి “ఎక్స్ క్యూజ్ మీ” అని చెప్పి విసురుగా బయటికొచ్చేసాను.
నా డెస్క్ దగ్గరకొచ్చి కూలబడిపోయాను. సుహేబ్ వైపు చూసాను…సీరియస్‌గా పనిచేసుకుంటున్నాడు. జాలేసింది నాకు. ఈ మాట సుహేబ్ కి తెలిస్తే!! ఏమైపోతాడు ! బాధనిపించింది. ఆవిడతో మాట్లాడి లాభం లేదు. ఈ విషయం డైరెక్టర్ కి చెప్పాలి. తప్పదు. నేను తలదూర్చక తప్పదు. ఇంక అక్కడ కూర్చోలేక ఇంటికి బయలుదేరాను.

ఆ మాట పదే పదే చెవుల్లో గింగిర్లాడుతోంది. ఎదురుగా స్కూటర్ మీద రాంగ్ రూట్ లో ఇద్దరొస్తున్నారు. సడన్ బ్రేకు పడింది నా కారుకి, నా ఆలోచనలకి. మాకు ఢిల్లీ లో ఇవన్నీ మామూలే. రూల్స్ పాటించడం లాంటివేమీ ఉండవు. ఇలాంటి సడన్ బ్రేకులు వెయ్యడం మాకు ఎడంచేత్తో పని.

పక్కకారతను అద్దాలు దించి అరుస్తున్నాడు వాళ్ళపైన…”బిహారీ హో క్యా??”

తలతిప్పి చూసాను ఆ మాట అర్థం కాక.

“యె బిహరీ లోగ్ ఐసా హి హై మేడం. కహా కహా సె ఆతెహై పతా నహీ. దిమాగ్ నహీ హోతా హై, కామ్‌చోర్ హై, నమక్ హరాం హై….” ఆపకుండా తిట్టేస్తున్నాడు.

అంటే తప్పులు చేసినవాళ్ళందరూ బీహారీలేనా?? బీహార్ నుండి ఢిల్లీకి చాలామంది పనికోసం వలస వస్తారు. వాళ్ళపై ఉన్న చిన్నచూపు మా పనావిడ మాటల్లో చాలాసార్లు బయటపడింది. అది గుర్తొచ్చింది నాకు. ఎవరి మీదైనా చాడీలు చెబుతున్నప్పుడు చివర్న ఓ మాటంటుంది…”బిహారీ లోగ్ హైనా భాభీ ఇసీలియే”!

ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాను. నల్లరంగు….లోకంలో రంగులు ఏమైపోయాయి !! ఒక్క నలుపే కనిపిస్తోందెందుకు !!!
ఇంటికొచ్చి స్నానం చేసి అలా మంచం పై కూలబడ్డాను. చుట్టూ చీకటి, కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనిపించట్లేదు. పరిగెడుతున్నాను…పరిగెడుతూనే ఉన్నాను. అడవి దారి…ఒళ్ళు చీరుకుపోతోంది, కాళ్ళల్లో ముళ్ళు దిగుతున్నాయి. దాహం. ఒళ్ళంతా మంట. అడవి దాటి బయటికి రాగానే వెలుగు, ఎదురుగా సెలయేరు. నీళ్ళు తాగుదామని అటువైపు పరిగెడుతుంటే వెలుగు… విపరీతమైన వెలుగు. ఏమీ కనిపించట్లేదు తెల్లటి చిక్కటి వెలుగు తప్ప. కళ్ళు తెరవలేకపోతున్నాను….అబ్బ మంట. కళ్ళు మండుతున్నాయి. వేడి గాలి ఎక్కడినుండో!! అదిగో శబ్దం…ఏదో సన్నగా, చిన్నగా వినబడుతోంది. ఏంటది !! ఏంటది!!
ఫోను…ఫోను మోగుతోంది. దిగ్గున లేచి కూర్చున్నాను. ఎప్పుడు పట్టిందో నిద్ర! అసలెలా పట్టిందో!!

గాబరాగా ఫోన్ ఎత్తాను… హలో….

“నేను గోపిమావయ్యని.”

“మావయ్యా, బాగున్నావా? అత్త కులాసాయేనా ! హర్ష, బున్ని బావున్నారా?”

“ఆ, అంతా బావున్నారు. ఇప్పటికి రెండుసార్లు ఫోన్ చేసానే!!”

“అదీ….నిద్రపోయాను. చెప్పు మావయ్య.”

“అదేనే, మా హర్ష కి ఒక సంబంధం వచ్చింది అని చెప్పాను కదా. అది కేన్సిలయ్యింది.”

“ఎందుకు మావయ్య! హర్ష, ఆ అమ్మాయి ఒకరికొకరు నచ్చుకున్నారు అన్నావుగా.”

“అవుననుకో, కానీ తరువాత తెలిసింది వాళ్ళక్క ఇంటర్‌క్యాస్ట్ మేరేజి చేసుకుందిట. అది విన్నాక ఈ సంబంధం వదిలేసుకున్నాము.

పెళ్ళి చూపులప్పుడు మాకీ సంగతి తెలీదులే. ఎంతైనా వాళ్ళతో సంబంధం కలుపుకుంటే ఆ కుర్రాడు కూడా మన కుటుంబంతో కలుస్తాడు కదా. అలా ఎలా కలుపుకుంటామే మనవాళ్ళల్లో!! మనమెక్కడ! వాళ్ళెక్కడ! అందుకని వదిలేసుకున్నాం.”

“హర్ష ఒప్పుకున్నాడా మావయ్యా??”

“వాడే అన్నాడమ్మా, అక్క అలా ఉంటే చెల్లి ఇంకెంత రెబిలియస్ గా ఉంటుందో అని ! అది పక్కనపెడితే మరో సంబంధం వచ్చింది. ఢిల్లీ లో ఉద్యోగం చేస్తోంది ఆ పిల్ల. సెంట్రల్ ఎక్సైజ్ లో గ్రూపు వన్ ఆఫీసరు ట. అది గెజిటడో కాదో తెలీదు. కాస్త నువ్వు కనుక్కుని చెప్తావామ్మా?? అలాగే ఆ పిల్ల ఎలాంటిదో కాస్త చుట్టుపక్కలవారిని విచారించి వీలైతే….ఢిల్లీలో తెలుగువాళ్ళ సంఘం ఉంది కదుటే. అక్కడేమైనా సమాచారం దొరుకుతుందేమో….”

“సరే మావయ్యా, నాకు వేరే ఫోనొస్తోంది”….పెట్టేసాను ఇంక ఆ మాటలు వినే ఓపిక లేక.
హర్ష అలా అన్నాడా!! ఈమధ్యనే కదూ ఫోన్ చేసి ఢిల్లి పరిస్థితి, నిర్భయ కేసు గురించి మాట్లాడుతూ నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పి, “ఆడవాళ్ళు ధైర్యంగా ఉండాలొదినా, ఎదురు నిలిచి పోరాడాలి, మనుషులుగా వాళ్ళకీ హక్కుంది. రెబిలియస్ గా ఉండాలి… .” అవును ఇదే మాట “రెబిలియస్ గా ఉండాలి” అన్నాడు కదూ!!

తల భారంగా ఉంది. ఆలోచనలు ఎటూ తెగట్లేదు. పొద్దున్నుండీ జరిగినవన్నీ తలుచుకుంటే……హ్మ్! ఎక్కడలేని నిస్సత్తువ వచ్చేస్తోంది.

***

ఆదివారం…బద్దకంగా పొద్దున్న 9.00 కి నిద్ర లేచాను. బయట వాతావరణం…కాసేపు ఎండ, కాసేపు మబ్బు. నా మనసులాగే స్థిమితంగా లేదు. సుహేబ్ సంఘటన జరిగినరోజు నుండీ కొంచం అశాంతి. ఏదో బాధ! ఏ పని చెయ్యబుద్ధి కావట్లేదు.
టీ తాగుతూ మెయిల్స్ ఓపెన్ చేసేసరికి రాధిక మెయిల్. రాధిక నాకు చిన్ననాటి స్నేహితురాలు. తన మైల్ కోసం నేను కొన్నిరోజులుగా ఎదురుచూస్తున్నాను. “కాయా, పండా?” అనుకుంటూ మైల్ చదవడం మొదలెట్టాను.

“వెన్ని…
అలా ఉడుక్కోకోయ్! సరే సరే, ప్రియాతి ప్రియమైన వెన్నెల…ఓ హలా…

మంచి మూడ్ లో ఉన్నానోయ్. నీకో శుభవార్త. అలెక్స్ గురించి అమ్మావాళ్ళతో చెప్పేసాను. అమ్మ, నాన్న మొదట ఏమీ చెప్పలేదు. మౌనంగా ఊరుకుని ‘సరే, అలెక్స్ వాళ్ళింట్లో ఏమంటారో చూద్దాం’ అన్నారు. అలెక్స్ వాళింట్లో నా గురించి చెప్పగానే ‘రైటో’ అనేసారుట. అది విన్నాక అమ్మకి, నాన్నకి నమ్మకం కుదిరింది. అలెక్స్ తో మాట్లాడారు. అమ్మ గురించే భయపడ్డానోయ్. నాన్న ఒప్పుకుంటారని తెలిసినా అమ్మ ఇష్టపడదేమో అని చాలా బెంగపడ్డాననుకో. అలెక్స్ ని చూసి మాట్లాడాక అమ్మ మనస్పూర్తిగా ఒప్పుకుంది. చాలా సంతోషంగా ఉంది తెలుసా!! ఇంకో మాట చెప్పానా? అలెక్స్ వాళ్ళ నాన్నగారి గురించి నీకు చెప్పానుగా. కొంచం మతపిచ్చి. ఆయన గురించే ఎక్కువ బెంగాగా ఉండేది మా ఇద్దరికీ. నా గురించి చెప్పగానే ‘రాధిక అయితే బ్రహ్మాండం. ఇంకెవరైనా అయితే ఆలోచిస్తానుగానీ రాధిక అయితే నాకు ఇష్టమే’ అన్నారుట. కాలం ఇలా కలిసొస్తుందని అస్సలు ఊహించలేదు! ముహూర్తాలు అవీ ఏమీ చూసుకోవట్లేదు. నీకు తెలుసుగా, మా ఇద్దరికీ ఆ నమ్మకాలు లేవు. అందరికీ వీలయ్యే రోజు రిజిస్టర్ మేరేజి చేసుకుందామనుకుంటున్నాం. నువ్వు ప్రయాణానికి సిద్ధంగా ఉండు. మిగతా విషయాలు మళ్ళీ రాస్తాను. ఉంటాను. బై.”
ఎగిరి గెంతేసాను. అబ్బ, ఎంత మంచి వార్త! రాధిక ఈ విషయంలో ఎంత బెంగపడుతోందో నాకు తెలుసు. ఇద్దరి ఇళ్ళల్లోనూ అంత సులువుగా ఒప్పుకున్నారంటే ఆశ్చర్యమే! ఓహ్, ఎంత అందంగా మొదలయ్యింది ఈ ఉదయం! రాధిక పెళ్ళికి తప్పకుండా వెళ్ళాలి. ఇంతటి ఆనంద క్షణాలలో తన పక్కనుండాలి నేను.

టీవిలో శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమా వస్తోంది.
రెండు మిస్సుడు కాల్స్. అర్పిత ఫోను చేసింది!! అర్పిత బెంగాలి. ఓర్పిత అని పిలవమంటుంది. మేమంతా ఔర్ పిత అని పిలుస్తూ ఏడిపిస్తుంటాం. తను ఏడాది క్రితం వరకూ మా ఆఫీసులో పనిచేసింది. కలిసి పని చేసిన రెండేళ్లల్లో మంచి స్నేహం కుదిరింది మా మధ్య. తను వేరే ఉద్యోగానికెళ్ళిపోయాక కలవడం తక్కువయినా ఫోనులో మాట్లాడుకుంటూనే ఉన్నాం.

“కుడి కన్నదిరే, కుడి భుజమదిరే…” పాటొస్తోంది. అన్ని మంచి శకునములే…హమ్ చేసుకుంటూ అర్పిత కి ఫోన్ చేసాను. తను కూడా శుభవార్త చెబుతుందా..మనసులో ఏదో మూల ఆశ!
“హాయ్ ఔర్ పితా”
“హాయ్ బెన్నెల”
“హేయ్ హేయ్…వద్దు వద్దు ఇద్దరం సరిగ్గా పిల్చుకుందా, సరేనా”
“హహహ అద్ది అలా రా దారికి. సరే కానీ, ముందు విషయం విను. దత్తత దొరికింది.”
“రియల్లీ? ఎప్పుడు?” దాదాపు పెద్ద కేక వేసాను.

అర్పిత వాళ్ళకి ఒక బాబు. రెండో పిల్లను కనకుండా దత్తత చేసుకుందామనుకుంటున్నారు. ఒక అనాథ పిల్లకైనా పూర్తి ప్రేమని, జీవితాన్ని ఇవ్వగలిగితే అంతకన్నా మనిషి జన్మకి సార్థకత ఏముంది అన్నది వాళ్ల ఆలోచన. మొదటిసారి ఈ మాట అర్పిత నాకు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. అది ఆశ్చర్యమో, ఆనందమో కూడా చెప్పలేను…ఒక అద్భుతమైన భావన! ఎంత మంచి ఆలోచన…ఇలాంటిది వినడం అదే మొదటిసారి! అప్పటినుండీ నాకు అర్పిత అంటే ఒక ఆరాధన.

“వింటున్నావా?”
“చెప్పు, చెప్పు వింటున్నాను. పాపేనా?”
“కాదు. బాబు”.
“అదేంటి మీరు పాప ని కదా కావాలనుకున్నారు?”
“అవును, కానీ పాప దొరకలేదు. శిశిసంక్షేమశాఖలో పాపలకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది.”
“నిజమా? సంతోషించాల్సిన విషయమే కదా. భలే!”

“అదే, అదే! నీకు తెలుసుగా మేము దరఖాస్తు పెట్టుకుని దాదాపు ఏడాది కావొస్తోంది. ఇప్పటికి మాకు వరం లభించింది. బాబు అని చెప్పగానే మొదట్లో కాస్త నిరుత్సాహం అనిపించినా ఎవరైతే ఏముందిలే. జీవితం బాబుకైనా, పాపకైనా ఒకటేగా. మన బిడ్డ అయ్యాక ఎవరైనా ఒకటే మనకి. వెన్నెలా….నాకు ఇద్దరు బాబులు! ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఆ మాట అనుకోవడానికే! నా చిట్టితండ్రి ఇంటికి వచ్చే వేళ కోసం ఎదురుచూస్తున్నాను. బాబుని చూసాం. చాలా ముద్దుగా ఉన్నాడు.”

“అర్పిత, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. డ్రమటిక్ గా అనిపించినా ఒకమాట చెప్పాలనిపిస్తోంది….నిన్ను నేను చాలా ప్రేమతో ఆరాధిస్తున్నాను. నీ ఫ్రెండ్ ని అయినందుకు నిజంగా గర్విస్తున్నాను.”
“చాల్లే వెన్నెల. ఏమంత పెద్ద గొప్ప పని చేసేసామని!”
“నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా!”

“తెలుసు, ఈ వార్త చెప్పగానే సంతోషించేవాళ్ళల్లో నువ్వే మొదట ఉంటావని తెలిసే, నీకే మొట్టమొదటి ఫోన్ చేసాను. వచ్చే నెల బాబుకి ఒక వెల్కం పార్టీ చేద్దామనుకుంటున్నాం. నువ్వు వస్తావు, నాకు తెలుసులే.”
“నువ్వు పిలవకపోయినా వస్తాను డార్లింగ్.”

“ఐ నో , ఐ నో…సరే ఇంక ఉంటాను. చాలా పనులున్నాయి. మేము మళ్ళీ ఈరోజు అక్కడికి వెళుతున్నాం. బాబుకి కొన్ని టెస్ట్ లు చేయించాలి.”

“సరే సరే, మళ్ళీ మాట్లాడదాం. బై.”

ఏమిటీ డబుల్ ధమాకా!! ఈరోజు ఇన్ని శుభవార్తలు తెలుస్తున్నాయి!! భలే ఆనందంగా ఉంది. అర్పిత వాళ్ళు, పాపం, దాదాపు ఏడాదిబట్టి వెయిట్ చేస్తున్నారు ఈ క్షణాలకోసం. వాళ్ళకు ఎంత సంబరంగా ఉంటుందో కదా!!
మనసు చాలా తేలికపడింది. తెలియని ఆనందం, నాలో కలిగెను ఈ ఉదయం…పరవశమై పాడే నా హృదయం…నాకెంతో ఇష్టమైన పాట! పాడుకుంటూ బాల్కనీలో నిల్చుని మేఘాలని చూస్తున్నాను. భలే వర్షం మొదలయ్యింది! వానవిల్లు….ఎన్ని రంగులో!! నలుపేదీ?? ఉంది. ఇప్పుడు కనిపించట్లేదు, అంతే!! అన్నీ ఉన్నాయా?? ఉన్నాయి, పక్కపక్కనే పెనవేసుకుని. మారుతున్న సమాజాంలో పార్శ్వాలుగా!

నాకిష్టమైన రఫీ పాటలు పెట్టుకున్నాను…చౌదవీ కా చాంద్ హో…

అవును, నేనే!!